రాజా! మహాబలశాలీ! వివాహము జరుగునపుడు నీ కొడుకొక విప్రకన్యను బల్మి నపహరించెను. వారి సత్య వాక్కులు విని పరమధార్మికుడగు రాజు తన కొడుకుతో నిట్లనెను.
ఓరి దుష్టుడా! నీ పేరు వ్యర్థమైనదిరా. ఓరి మందమతీ! దురాచారీ! పాపీ! ఇక నీవు నాయింట క్షణమైన నిలువవద్దు. నా యిల్లు వదలివెళ్ళము. కోపించిన తన తండ్రితో నేనెక్కడి కేగుదునని సత్యవ్రతు డడుగగ నీవు చండాలురతోగూడి తిగురుమని యరుణు డనెను.
నీవు బ్రహ్మణ స్త్రీ నపహరించి చండాలుని పని చేసితివి. కనుక నీవు చండాలుర సహవాసముతో సుఖముగ నుండుము. ఓరి కులముచెడ పుట్టినవాడా! నీ వంటి కొడుకువలన నా కపకీర్తి గల్గినది. ఓరి దుష్టుడా ! నీ నచ్చినచోటి కేగుము. నా కీర్తి మంటగలిపితివి.
మహాత్ముడగు తన తండ్రి కోపముతో నిట్లు పలుకగ సత్యవ్రతుడు వెంటనే పురము వెడలి చండాలురను గలిసి తిరుగసాగెను. అట్లు సత్య వ్రతుడు చండాలురను గూడి విల్లమ్ములుదాల్చి కవచము తొడిగి దయగలవాడై యుండెను.
అరుణ మహారాజు తన కులగురు వగు వసిష్ఠుని ప్రేరణచేత నట్లు కోపించి తన కొడుకును వెడలగొట్టెను. ధర్మశాస్త్రజ్ఞుడైన వసిష్ఠుడు తన్నాపలేదని సత్యవ్రతు నకు వసిష్ఠునందు క్రోధము గల్గెను.
తర్వాత నేదో కారణమున నరుణుడు పుత్రార్థియై తపమొనరించుటకు నగరము వదిలి వనము జేరెను. ఈ యధర్మమువలన నింద్రుడా రాజ్యములో పండ్రెండేడులు వానలు కురియలేదు.
ఆ దినములలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను నా రాజ్యములో వదలి కౌశికీతీర్థమున గొప్ప తప మొనరించెను. విశ్వామిత్రుని భార్య దీనయునార్తయునై దుఃఖితురాలై తన కుటుంబమును పోషించుకొనజాలకుండెను.
ఆ దినములలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను నా రాజ్యములో వదలి కౌశికీతీర్థమున గొప్ప తప మొనరించెను. విశ్వామిత్రుని భార్య దీనయునార్తయునై దుఃఖితురాలై తన కుటుంబమును పోషించుకొనజాలకుండెను.
తన కొడుకు లాకటిమంటచే నేడ్చుచు నీ వారన్నము యాచించుచుంటగని యా పతివ్రత బాధ పడెను. అట్లు తన కొమర లాకలిమంటచే దుఃఖార్తులై యుంటగని యీ పురమున రాజు లేడు. ఎవని యాచింతునని యామె వెత జెందెను.
ఇపుడు నన్ను నా పుత్రు లను రక్షించువారు లేరు. నా భర్తయును నా చెంతలేడు. పిల్ల లేడ్చుచున్నారు. నా బ్రతుకెంత పనికిమాలినది. బీదరాలనగు నన్ను విడనాడి నా భర్త తపము చేసికొనవెళ్ళెను.
అతడు సమర్థుడయ్యును దుఃఖితురాలనగు నా బాధలు తెలిసికొనుటలేదు. మగడు లేనిచో పిల్లల నెవరు పోషింతురు? నా సుతు లాకలిమంటచే నకనకలాడి చత్తురు. కనుక వీరిలో నొకని నమ్మి యా డబ్బుతో మిగిలినవారిని పోషించుట నా కిపుడు తగిన పని.
ఇట్లు చేయ కిందఱి నాకలిమంటకు చంపుట తగదు. ఎట్లో కాల మీడ్చుట కొక్కని తప్పక విక్రయించగలను. ఆ సతి యిట్లు గుండె ఱాయి చేసికొని దర్బత్రాటిని తన పుత్రుని మెడకు వేసి బయలుదేరెను.
ఆ మునుపత్ని నడిమివాని మెడకు త్రాడువేసి తక్కినవారిని పోషించుట కిల్లు వెడలినంతలో సత్య వ్రత రాజపుత్రు డామెను జూచి యిట్లనెను.
ఓ శోభనాంగీ! నీవు శోకమూర్తివై యేమి పని చేయుచున్నావు. సర్వాంగ సుందరీ! ఇపు డీ బాలుని మెడకు త్రాడుగట్టి యత డేడ్చుచుండగ నీ వెచటికి గొనిపోవుచున్నావు. నిజము పలుకుము.
ఋషిపత్ని యిట్లనెను : ఓ రాకుమారా! నేను విశ్వామిత్రుని భార్యను. ఇతడు నా కొడుకు. ఈ నా కన్న బిడ్డ నీ పట్టణమున నమ్ముట కేగుచున్నాను. రాజా! నా పతి మమ్ము విడనాడి తపమున కేగెను. మేము తిండిలేక మలమల మాడు చున్నాము. తక్కినవారిని పోషించుట కితని నమ్ముచున్నాను అనెను.
ఋషిపత్ని యిట్లనెను : ఓ రాకుమారా! నేను విశ్వామిత్రుని భార్యను. ఇతడు నా కొడుకు. ఈ నా కన్న బిడ్డ నీ పట్టణమున నమ్ముట కేగుచున్నాను. రాజా! నా పతి మమ్ము విడనాడి తపమున కేగెను. మేము తిండిలేక మలమల మాడు చున్నాము. తక్కినవారిని పోషించుట కితని నమ్ముచున్నాను అనెను.
రాజిట్లనెను: ఓ పతివ్రతా! ఈ పుత్రుని కాపాడుము. నీకు భరణ మిత్తును. అంతలో నీ పతియును వనమునుండి తిరిగి రాగలడు. నీ యాశ్రమముచెంత నున్న చెట్టునకు ప్రతిదిన మన్నముమూట కట్టి వెళ్ళగలను. ఇది నా సత్యవ్రతము సుమ్ము. అట్లు రాజు పలుకగ మునిపత్ని తన కొడుకు మెడ బంధము తొలగించి తన యాశ్రమము చేరెను.
గలమున (మెడలో) బంధ ముండుటవలన నతడు గాలవ మహాముని యయ్యెను. ఆమె తన యాశ్రమమేగి బాలకులతో సంతోషముగ కాలము గడుపుచుండెను. సత్యవ్రతుడును దయాభక్తులతో నిండి విశ్వామిత్ర మునిపత్నిని పోషించుచుండెను.
రాజు వనమందలి జింకలను దున్నలను పందులను చంపివాని మాంసమును విశ్వామిత్రు నాశ్రమముచెంత చెట్టునకు కట్టుచుండెను. అట్లు మునిపత్ని ప్రతిదినము మాంసముబడసి తాను దీని పుత్రులకు తినిపించి సుఖముగ నుండెను.
అరుణు డడవులకు తపమున కేగుటవలన నయోధ్యారాజ్యము నంతఃపురమును వసిష్ఠుడు పరి రక్షించుచుండెను. సత్యవ్రతుడును ధర్మాత్ముడై తండ్రి యాజ్ఞ ననుసరించి నగరు బయట వసించి వన్యజంతువులను వేటాడు చుండెను.
ఏదో నెపమున సత్యవ్రతు డకస్మాత్తుగ వసిష్ఠునిపై కోపముతో నుండెను. తన తండ్రి ధర్మిష్ఠుడు ప్రియసుతుడగు తన్ను నడవుల కంపునపుడు వసిష్ఠుడతని వారింపలేదని సత్యవ్రతునకు కోపము గల్గెను. వివాహము పూర్తియగుటకు భార్యాభర్త లేడడుగులు కలిసి నడువవలయును.
అది జరుగక మునుపే విప్ర భార్యను నేను గ్రహించితిని. ఆ ధర్మాత్మున కది తెలియదా అని అతడనుకొనెను. ఒక నా డడవిలో రాజునకు మృగములు కని పించలేదు. అంతలో నట్టడివిలో వసిష్ఠుని గోవతని కంటబడెను.
అతడు నీచునివలె నాకలిమంటచే కోపముతో దానిని చంపి దాని మాంసము తిని మిగిలినది చెట్టునకు కట్టెను. సువ్రతయగు మునిపత్ని యది గోమాంసమని తెలియక మృగమాంసమని తలచి తన కొడుకుల కది తినిపించెను.
వసిష్ఠుడు తన గోవు చంపబడు టెఱింగి కోపముతో నిట్లనెను. ఓరి దుర్మార్గుడా! పిశాచునివలె గోవును చంపి పాపము మూటకట్టుకొంటివి. కనుక స్త్రీ హరణము తండ్రి కోపము గోవధ యీ మూడు చెడు మచ్చలు నీకు గల్గుగాత. ఈ మూడు శంకలవలన నీవు త్రిశంకువుగ పేరు గాంతువు.
నీ వెల్లరకు నీ పిశాచరూపము చూపించుచు తిరుగుచుందువు. సత్యవ్రతు డట్లు వసిష్ఠునిచే శపింపబడి తన యాశ్రమమందుండి తీవ్ర తప మాచరించెను. అత డొకానొక మునిపుత్రుని దయవలన పరా ప్రకృతి-శివాభగవతియగు శ్రీదేవియొక్క మంత్రము గ్రహించి జపింపసాగెను.
No comments:
Post a Comment