Saturday, April 18, 2026

Srinivasa Mangapuram - Tirupati - శ్రీనివాస మంగాపురం - తిరుపతి

శ్రీనివాస మంగాపురం తిరుపతి

శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది మరియు పవిత్రమైనది. తిరుమల వెళ్లలేని వారు లేదా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం విశేషంగా భావిస్తారు.

స్థల పురాణం: ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీ వేంకటేశ్వరస్వామి మరియు పద్మావతి అమ్మవార్లు తిరుమల కొండపైకి వెళ్లే ముందు, అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు.

అగస్త్య మహర్షి కోరిక మేరకు, నూతన వధూవరులైన స్వామివారు, అమ్మవారు ఆ ఆశ్రమంలోనే ఆరు నెలల పాటు గడిపారు.

ఆ సమయంలో స్వామివారు ఒక వరం ఇచ్చారు "తిరుమల కొండ ఎక్కలేని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా నూతన వధూవరులు నన్ను ఇక్కడ దర్శించుకుంటే, తిరుమలలో లభించేంత పుణ్యఫలం లభిస్తుంది" అని తెలిపారు.

చారిత్రక ఆధారాల ప్రకారం, ఈ ఆలయం చాలా కాలం పాటు శిథిలావస్థలో ఉండేది.

క్రీ.శ. 13వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. అయితే, 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయానికి గొప్ప వైభవం వచ్చింది.

తాళ్లపాక అన్నమయ్య: ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య మనవడైన చిన్నన్న, 1540వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది.

విగ్రహ రూపం: ఇక్కడి మూలవిరాట్టు (వేంకటేశ్వరస్వామి) తిరుమల శ్రీవారి కంటే పరిమాణంలో పెద్దదిగా, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారు ఇక్కడ 'కల్యాణ' రూపంలో ఉండటం వల్ల అత్యంత సుందరంగా ఉంటారు. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.

కల్యాణ కంకణం: పెళ్లి కాని వారు ఇక్కడ స్వామివారికి పూజ చేసి, అర్చకులు ఇచ్చే 'కల్యాణ కంకణాన్ని' ధరిస్తే, త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం జరిగిన తర్వాత దంపతులు మళ్ళీ వచ్చి ఆ కంకణాన్ని స్వామివారికి సమర్పిస్తారు.

నిత్య కల్యాణం: తిరుమల లాగే ఇక్కడ కూడా ప్రతిరోజూ స్వామివారికి కల్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.

ఈ ఆలయం , శ్రీనివాస మంగాపురం చిత్తూరు జిల్లాలో, తిరుపతి, మదనపల్లి రోడ్డులో తిరుపతికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తిరుమల నడక దారిలో (శ్రీవారి మెట్టు) వెళ్లే భక్తులు మొదట ఈ ఆలయాన్ని దర్శించుకుని, ఆ తర్వాతే కొండపైకి వెళ్లడం ఒక సంప్రదాయంగా వస్తోంది.

గతంలో ఈ మెట్లదారిలో భక్తులతో పాటు చంద్రదిరి పరిసర ప్రాంతాలలో పల్లెవాసులు కూడా నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్ల దారి గుండా కొండపైకి తీసుకెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాల దగ్గరి దారి. ఒక గంట లోపుల గమ్యస్థానం చేరుకోవచ్చు.

తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడా ఉంది. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ మెట్ల దారి (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి.


దర్శన సమయం: ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...