Thursday, April 16, 2026

Chapter 123 Birth of Vṛtrasura - అధ్యాయము 123 వృత్రాసుర జననము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 123

వృత్రాసుర జననము

పాపలోభాత్ముడగు నింద్రుడైరావతమెక్కి త్రిశిరోమునిని సమీపించెను. త్రిశిరుడు సూర్యాగ్ని సమతేజుడు - దృఢాసనుడు - సమాధి నిమగ్నుడు నైయుండెను. మునిని గాంచగనే యింద్రునిలో విషాద రేఖ లలముకొనెను. ఇతడింద్రాసన కాముకుడు. మునీశుడు పాపరహితుడు ఇంద్రవైరి. ఇపుడితనిని చంపుటెట్లు? చంపకూరకుండుటెట్లు?' అని యిట్లు తలపోసి ఇంద్రుడు రవిచంద్ర సమానుడగు తాపసునిపై తనపరమాయుధమగు వజ్రమును ప్రయోగించెను. 

వజ్రము దెబ్బకు గిరి శిఖరములు పడిన విధముగ వజ్రాయుధము వ్రేటునకు తాపసుడు భూమిపై పడి కన్ను మూసెను. మునిని చంపి సురపతి ముదమందెను. కాని యచటి మును లెల్లరు హాహాకారములు చేయుచు నింద్రు డెంతటి ఘోరము చేసెనేయని యార్తనాదములు చేసిరి. 
ముని నిరపరాధి. ఇంద్రుడీతబిసిని చంపుట వలన తాను పాపఫల మనుభవించి తీరునని మునులనిరి. 

ఇంద్రుడట్లు మునిని చంపి స్వర్గమేగెను. చచ్చి పడియును పునర్జీవితునివలెనున్న తేజోనిధియగు మునిని గని యితడు మరల బ్రదుకునేమో' యని యింద్రుడు వ్యాకులచిత్తుడయ్యెను. ఇట్లు తలపోసి యింద్రుడు తన యెదుటనున్న తక్షనుగాంచి తన పనికి దగినట్లుగ నతనితో నిట్లు పలికెను : 

ఓ తక్షా! ఇతడు బ్రతికినవానివలె నున్నాడు. ఈ మహాతేజుడు బ్రదుకరాదు. కాన నా మాట విని యతని తల తెగవేయుము అను నింద్రుని వాక్యములు 

తక్ష విని ఇట్లనెను : 'ఇంద్రా! అతడు మహాస్కందుడు. నా గొడ్డలి యతని కఠిన కంఠ సీమను తెగనఱుక చాలదు. ఈ నీచకార్యమునకు నేను బూనుకొనను. నీవు సాధువులు నిందించు పని చేసితివి. నాకు పాపభీతి గలదు. ఈ చచ్చిపడిన ముని తల తెగనఱకుటవలన నీ వేమి మూట కట్టుకొందువు?

ఇందు నీకు గల్గు భయమేమో తెలుపుము అన ఇంద్రుడిట్లనెను : ఇతని దేహము సజీవముగ నున్నట్లు తోచుచున్నది. కనుక నా శత్రువు మరల జీవించునేమోయని నా గుండె దడదడలాడుచున్నది. 

తక్ష ఇట్లనెను : 'నీవు విబుధుడవు గద! ఈ నీ క్రూరకర్మమునకు నీకు సిగ్గేల గల్గుటలేదు? ఈ ఋషి కుమారుని చంపినందున నీకు బ్రహ్మహత్యాభయము గల్గుట లేదా?' అన 

ఇంద్రు డిట్లనెను : పాపపరిహారమునకై ప్రాయశ్చిత్తము చేసికొందును. పగతుని మోసముననైన చంప వలయునని పండితులందురు.' 

తక్ష ఇట్లనియెను: 'నీవు లోభవశమున పాపము చేయుచుంటివి. నాకట్టి లోభము లేదు. కనుక నేనట్టి పాపమునకు పాల్పడను.' 

ఇంద్రు డిట్లనెను : 'నీకు యాగములందు హవిర్భాగము లిత్తును. నరులు యాగములందు నీకు పశుశిరమర్పింతురులెమ్ము. నీవితని శిరము ఖండించి నాకు ప్రియమొడగూడ్పుము' అని యింద్రుడనెను. తుదకింద్రుని మాటలకు లొంగి తక్ష ముదముతో తన గండ్రగొడ్డట ముని తల తెగనఱికెను. 

ముని మూడు తలలు నేల పడగనే వాని నుండి పక్షులు గుంపులు గుంపులుగ వేగముగ వెడలజొచ్చెను. అతని వేర్వేరు మొగముల నుండి కలవింక తిత్తిర కపింజలములు మున్నగు పక్షులు పుట్టెను. వేదాధ్యయనమును సోమపానమును చేయునట్టి ముఖమునుండి కపింజలపక్షులు పుట్టెను. దెసలన్నిటిని త్రాగివేయునట్లు పరికించు మొగమునుండి తిత్తిరిపక్షులు వెలువడెను. అతని సురాపానము సేయు మోము నుండి కలవింక పక్షులు పుట్టెను. అట్లు వెడలిన పక్షుల గుంపులను గని సురపతి మోదముతో స్వర్గసీమ కేగెను.

ఇంద్రుడు వెళ్ళిన వెంటనే తక్షయును తన గృహమేగి యజ్ఞ భాగమందుకొని ముదమందెను. అట్టు లింద్రుడు తన శత్రుని చంపి స్వర్గమేగి తన్నుతా కృతార్థునిగ దలచుచు బ్రహ్మహత్యా పాపమును మఱచెను. విశ్వకర్మ తన ధార్మికుడగు పుత్రుడు నిహతుడగుట విని కన్నుల నిప్పులురాల నిట్లనియెను : 

నా పుత్రుడు నిర్దోషుడు ధార్మికుడు ముని. ఇట్టి నా పుత్రుని చంపినవానిని తిరిగి చంపుటకు మరొక పుత్రుని బడయగలను. దేవతలు నా తపోవీర్యమును తేజోబలమును గాంతురు గాక! ఇంద్రుడు తన పాపము పండినదని గుర్తించుగాత! అని పలికి త్వష్ట మహాక్రోధముతో నాథర్వణమంత్రములతో పుత్ర ప్రాప్తికి హోమము చేసెను. 

అట్లెనిమిది రాత్రులు వేల్చిన పిమ్మట వహ్నిజ్వాలలనుండి యగ్ని పురుషు డొకరుడు ఉద్భవించెను. అట్లు తేజోబలములు గల్లి రెండవ యగ్నివలె వెల్గులు చిమ్ముచు తన యెదుటనున్న సుతుని గాంచి త్వష్ట యిట్లనెను : 

'ఓ యింద్రశత్రూ! నా తపోబలమున వర్ధిల్లుము.' అట్లు త్వష్ట కోపముతొ పలుకనే యగ్ని తేజుడగు మునిసుతు డాకసమును నీరంధ్ర మొనర్చుచు నెంతయో యెత్తుగ పెరిగెను. అత డట్లు కాలాంతకునివలె పర్వతాకారమున పెరిగి పెరిగి చింతాతురుడగు తన తండ్రి కిట్లనెను : 

' నే నిపుడేమి చేయవలయును? నాకు పేరు పెట్టుము. నా వలన గావలసిన కార్యము తెలుపుము. నీవు చింతాతురుడవై శోకమున మునుంగుటకు కారణము తెల్పుము. నీ శోకము మాన్పుటయే నా వ్రతము. తండ్రి కడగండ్ల పాలగుచుండగ కొడుకు పుట్టి యేమి లాభము? సాగరములను త్రాగుదునా? గిరులను నుగ్గును గ్గొనర్తునా? ఉదయించు రవితేజము నరికట్టుదునా? సురలను సురపతిని యముని మరే దేవతనేని పల్లార్చవలయునా? ఈ భూగోళమును పెకలించి మున్నీట ముంచుదునా?

అను తన పుత్రుని యతిలోకవాక్కులు విని త్వష్ట ముదమంది పర్వతాకారుడగు తన తనయున కిట్లనియెను : 

వృజిన పదమునకు దుఃఖమని యర్థము. నీవు నన్ను దానినుండి గాపాడ (త్రాణమొనర్ప) జాలుదువు. కాన నీవు లోకమున వృత్రనామమున వాసికెక్కుదువు. నీ సోదరుడు త్రిశిరుడు. మహాతపస్వి. అతని మూడు తలలు మహాశక్తి గలవి. అతడు వేద వేదాంగ విద్యావిశారదుడు. అతడు ముల్లోకముల కచ్చెరువు గొల్పు తపమొనర్చెను. ఇట్టి నిరపరాధు నింద్రుడు తన వజ్రముతో పడగొట్టి యతని శిరములు ఖండింపజేసెను. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషి - సిగ్గుమాలినవాడు - దుర్మతి. నీ వతనిని సంహరింపుము. 

ఇట్లు త్వష్ట పుత్రశోకమున పొగిలి పిమ్మట వివిధ దివ్యాయుధములు సిద్ధము జేసెను. ఇంద్రవధకు ఖడ్గ-శూల-గదా-శక్తి-తోమర-శార్గ-ధనుర్బాణములు- పరిఘ-పట్టిసములు - సుదర్శనము వంటి సహస్రారములు కల చక్రమును - అక్షయతూణీరములు - సుందర వచము - మేఘమువలె వేగముగల రథమును - ఈ మున్నగు యుద్ధ సామాగ్రినంతయును సిద్ధము చేసి త్వష్ట వానినెల్ల తన కుమారునకిచ్చి రణమున కతనిని ప్రేరించెను.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...