Saturday, April 18, 2026

Trishankudi's coronation with the grace of the Goddess - దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా త్రిశంకురాజు వషిష్ఠునిచేత శపింపబడి తిరిగి యెట్లు శాపవిముక్తుడయ్యెనో తెల్పుము. 

సత్యవ్రతు డట్లు శపింపబడి పిశాచత్వమంది యదే యాశ్రమమునందు శ్రీదేవీ భక్తిపరాయణుడై యుండెను. ఆ రాజు శ్రీనవాక్షర మంత్రరాజమును జపించి భక్తితో బ్రాహ్మణులకు నమస్కరించి హోమము చేయదలచి వారి కిట్లనియెను. 

ఓ విప్రులారా! మీకు నమస్కారములు. నా మాట యాలింపుడు. మీరెల్లరును నేను జేయు యజ్ఞమునందు ఋత్విజులుగ నుండుడు. చెయింపుడు నేను రాజును. నా పేరు సత్యవ్రతుడు మీరు బ్రహ్మ విద్వరులు. నా సుఖముగోరి మరునా హోమము మీరు దయాపరులు-వేదవిదులు. నేను దేవీ మంత్రజప మొనరించితిని. 

కనుక కార్యసిద్ది కొఱకు నా జపములోనిదశాంశము హోమము యథావిథిగ జరిపింపుడు. అను మాటలువిని బ్రాహ్మణులు రాకొమరున కిట్లనిరి: 

నిన్ను గురుడు పిశాచత్వముబొందు మని శపించెను. కనుక నీవు యాగము చేయుటకు తగవు. నీకు వేదమం దధికారము లేదు. నీవు పిశాచత్వమంది లోక మందు నిందలు పొందితివి.

అను వారి మాటలువిని రాజు దుఃఖ మొందెను. ఇక నా జీవితము వ్యర్థము. ఈ వనమం దింక నేనేమి చేయగలను! తండ్రిచే విడువబడితిని. గురునిచే శపింపబడితిని. రాజ్యభ్రష్టత్వము-పిశాచత్వము-పొందితిని. 

ఇపుడేమి చేతును అని తలచి యా రాకుమారుడు కట్టెలతో పెద్ద చిత పేర్చి యందు ప్రవేశింపదలచి శ్రీచండికాదేవిని నెమ్మది తలంచెను. అతడు చితకు నిప్పంటించి స్నానముచేసి చితకెదురుగ దోసిలొగ్గి నిలుచుండి శ్రీమహామాయాదేవినిని సంస్మరించెను. 

చావనున్న రాజు భావమెఱిగి శ్రీభగవతీదేవి యాకాశమార్గమున నేతెంచి ప్రత్యక్షమయ్యెను. రాజా! శ్రీదేవి రాజకుమారునకు సింహారూఢయై దర్శనమిచ్చి మేఘమువలె గంభీరవాక్కుల నిట్లనియెను. 

మహాత్మా! సాధూ! నీ వేమి తలంచితివి? నీవీ మంటలలో దుముకవలదు. నీ తండ్రి ముసలివాడు. కనుక స్థిరచిత్తముతో నుండుము. నీ తండ్రి నీకు రాజ్య మప్పగించి తపమున కడవుల కేగదలచెను. 

వీరా! విచారము వదలుము. ఎల్లుండి నీ యింటికే జేరుము. నా దయవలన మంత్రులు నిన్ను గొనిపోవుటకు రాగలరు. నీ తండ్రి నిన్ను సింహాసనమున నభిషేకించును. పిదప నీ తండ్రి కామము జయించి ధ్రువముగ బ్రహ్మ సాలోక్యమందును. 

అని దేవి పలికి యచటనే యంతర్థాన మొందెను. అపుడు రాజపుత్రు డగ్నిచే మరణము తప్పించుకొని యయోధ్యానగరమేగెను. మహాత్ముడగు నారదు డంతయు నెఱిగెను. అతడు జరిగిన దంతయు నరుణునకు వేగిరమే తెలిపెను. తన కొడుకు చావతలంచుట విని రాజు దుఃఖించెను.

ధర్మాత్ముడగు రాజు పుత్రశోకములో మునిగి మనసులో పరిపరి విధముల చింతించి మంత్రులతో నిట్లు పలికెను. నేను బుద్ధిమంతుడగు నా కొడుకును వనముల కంపితిని. మీరు నా కొడుకు తలపెట్టిన మహోగ్రమైన పనిని నాకు దెలిపితిరి. 

నా కుమారుడు రాజ్యమునకు తగినవాడు-పరమార్థవిదుడు-విజ్ఞానశీలి. నే నా జ్ఞాపింపగనే నిర్జనవనములకేగి యోర్మితో బీదవాడై కష్టము లొందెను. అతడు వసిష్ఠునిచేత పిశాచముగ శపింపబడి భరింపరాని దుఃఖముచే నిప్పులో దుముకదలచెను. 

అతని దుస్సాహసమును శ్రీదేవి వారించెను. కనుక మహాబలుడగు జ్యేష్ఠపుత్రుని వేవేగ జేరవలయును. మీరు త్వరిత గతిని చల్లని మాటలతో నతని నూరడించి కొనితెండు. పరిపాలింపదగిన నా కన్నకొడుకును రాజ్యమంభిషేకింతును. 

పిదప నేను వనమునకేగి శాంతముగ తప మొనర్చుకొన నిశ్చయించుకొంటిని. అని రాజు తన మంత్రులను పంపెను. మంత్రులు రాకుమారుని తోడితెచ్చుటకు ప్రేమపూర్వకముగ వెళ్ళి యతనిని మంచిమాటలతో నోదార్చిరి. వారు మహాత్ముడగు రాచపట్టిని సగౌరవముగ నయోధ్యకు కొనితెచ్చిరి. 

సత్యవ్రతుడు కృశించి మురికిగుడ్డలు గట్టియుండెను. అతడు పెద్ద జడలుదాల్చి క్రూరముగ చింతాపరుడై యుండగ రాజు చూచి నేనెంత నిష్ఠురమైన పని చేసితినే! నా కొడుకును వెళ్లగొట్టితినే! ఇతడు రాజ్యార్హుడు- మేధావి-ధర్మనిర్ణయ మెఱిగినవాడు. 

అని రాజు తన కొడుకు శరీరమును కౌగిలించుకొనెను.

నీతి విశారదుడగు రాజు పిమ్మట తన తనయుని తన యాసనముచెంత కూర్చుండబెట్టుకొని ప్రేమగదుర నోదార్చి ప్రేమగద్గగవాక్కుల నతని కిట్లనెను.

అరుణుడు చేసిన నీతిబోధ

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...