Thursday, April 16, 2026

Chapter 115 The presence of other deities besides Sridevi - అధ్యాయము 115 శ్రీదేవి కితర దేవతలు తోడుపడుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 115

శ్రీదేవి కితర దేవతలు తోడుపడుట

శ్రీదేవీ రక్తబీజుని మాటలకు నవ్వి మేఘ గంభీర రావముతో యుక్తి యుక్తముగ నిట్లు పలికెను : మూఢాత్మా! గొప్పలేల చెప్పుకొందువు? నేను ముందుగనే దూతతో తగిన మంచిమాటలన్నియు చెప్పిపంపితిని గదా! నేనీ ముల్లోకములలో రూప బలసంపదలలో నాకీడుజోడైన వానిని వరింపగలను. నేను శుంభనిశుంభులతో ముందే శపథము చేసితిని. 

కనుక నాతో బోరుసల్పి గెల్చి నన్ను పెండ్లిచేసికొమ్మనుము. నీవతని పనిమీద నతని యానతో వచ్చితివి. నీకు శక్తియున్న నాతో పోరుము లేదా నీ పతిని గూడి పాతాళమేగుము. దేవిమాటలు వినిన దానవుడు రోషముతో ఆమెపై దారుణ బాణములు ప్రయోగించెను. అతని బాణములు నింగిపై పాములవలె వచ్చుచుండెను. 

అంబిక వానినెల్ల తన హస్త లాఘవముతో క్షణమాత్రన తుత్తునియలు చేసెను. రుద్రరూపిణి యగు దేవి చెవిదాక చాపములాగి యినుపములుకుల శరములచే రక్తబీజుని నొప్పించెను. దేవి బాణఘాతమున కా పాపాత్ముడు రథముపై మూర్ఛిల్లెను. వాడు పడగనే సేనలో కలకలము బయలుదేరెను. 

సైనికులు చచ్చితిమని కేకలు వేసిరి. వారి కఠినమైన యేడ్పు గోల శుంభుని చెవుల బడెను. దానవ సేనలను పురికొల్పుచు కాంభోజగణము - కాలకేయాది శూరుల బలము - దానవులెల్లరు యుద్ధమునకు బయలుదేరుడు అని శుంభుడు తన చతురంగబలము నాజ్ఞాపించెను. వారెల్లరును కండకావరముతో శ్రీదేవి చెంతకేగిరి. చండిక తనచెంత కేతెంచు దానవ సేనలను గాంచెను.

అపుడు జగదంబ భీషణ ఘంటాశంఖధ్వని చేసి నారి సారించెను. కాళికయును తన పెద్దనోరు తెఱచి యఱచెను. ఆ ధ్వని శ్రీదేవి యొనర్చిన ధ్వనివలె భీకరముగ నుండెను. ఆ ఘోర ధ్వనులను విని సింహము తాను గూడ భయంకరముగ గర్జించెను. దానవులా గర్జాధ్వని విని భయాద్భుతము లొందిరి. వారు కోపముతో మూర్ఛిల్లిరి. 

అంత వారితో మహాబలులందఱు నొక్కుమ్మడిగ దేవిపై తూపులేసిరి. అపుడు వారి నడుమ భీకర దారుణ సమరము సంఘటిల్లెను. బ్రహ్మాది దేవతలలోని శక్తులన్నియు నొక్క పెట్టుగ జగదంబను చేరెను. ఏ దేవత రూపభూషణము లెట్టివో అట్టివి కలవారై దేవతలు సంగ్రామాంగణమునకు రాజొచ్చిరి. 

వారిలో బ్రహ్మశక్తి సూత్రము - అక్షకమండలువులు దాల్చి హంసి నెక్కి వచ్చెను. ఆమె బ్రహ్మాణియను నామమున ప్రసిద్ధిగాంచెను. శ్రీ వైష్ణవశక్తి పీతాంబరముగట్టి శంఖ చక్ర గదా పద్మములు ధరించి వెల్గులు జిమ్ముచు గరుడ వాహనమెక్కి వచ్చెను. శాంకరీ దేవి వృష వాహనయై త్రిశూలము ధరించి యుండెను. ఆ దేవి నెన్నొసట చంద్రరేఖ వెల్గుచుండెను. చేతులకు సర్పవలయములు శోభించుచుండెను. 

శ్రీ షష్ఠీదేవి నెమలి వాహనమెక్కి చేత శక్తి దాల్చి యుద్ధము చేయు కోరికతో కౌమారీ రూపమున వచ్చెను. సుముఃయగు నింద్రాణీదేవి యైరావతమెక్కి చేత వజ్రము ధరించి పటురోషముతో రణరంగమున దుమికెను. శ్రీవారాహీ దేవి ప్రేతాసనయై వరాహరూపముతో వచ్చెను. శ్రీ నరసింహ రూపముగొని శ్రీ నారసింహీ దేవి వచ్చెను. యామ్యాదేవి మహిష వాహనారూఢయై దండధారిణయై భయంకరముగ నవ్వుచు యమరూపముతో రణస్థలి కేతెంచెను.

శ్రీ వారుణీ కౌబేరీ శక్తులును రణమునకు వచ్చిరి. అటులే తక్కిన దేవతలును రూపు దాల్చిన కోపములవలె తమతమ రూపబల సంపదలతో విజయము చేసిరి. వారి నెల్లరినిగాంచి శ్రీదేవి పరమానంద భరితురాలయ్యెను. ఆ సమయమున దేవత లెల్లరును స్వస్థులై ప్రమోద మందిరి. 

దానవులు భయకంపితులైరి. అచ్చోటి కంతలో లోకశంకరుడగు శంకరుడు పరమ శివుడు దేవతలను వెంటగొని యుద్ధభూమి కేతెంచి శ్రీ చండికతో నీవు దేవతల కార్యసిద్ధికై వెంటనే దానవులను రూపుమాపుము. శుంభనిశుంభులను తక్కిన రక్కసులను చక్కడంచుము. దానవ బలమును నిర్మూలించి విశ్వమును భయరహితముగ చేయుము. ఆ పిదప నెల్ల శక్తులును తమ తమ వాసముల కరుగ వలయును. 

మరల పూర్వమువలె దేవతలు హవిర్భుజులగుదురుగాక! భూమి దేవతలు యాగనిరతులగుదురు గాత! ఈ చరాచర ప్రాణులెల్లరు సంతుష్టులగు గాక! ఈతి బాధలుత్పాతములుపశమించుగాక! మేఘములు సకాలమున వర్షించుగాక! పైరు పచ్చని పొలములు పంటలతో నుండుగాక! అని వచించెను. అంతట శ్రీ చండికాదేవి శరీరమునుండి యొక మహాద్భుత దివ్యశక్తి ప్రాదుర్భవించెను. ఆమె మహాభీషణముగ ప్రచండముగ నూఱు ఆడునక్కలంతగ భయంకర ధ్వని చేయుచు ఘోరరూపమున తేజరిల్లెను. ఆమె మందహాసము చిందులాడగ శివునితో నిట్లు పలికెను : 

దేవ దేవా! నీవు దానవపతి చెంతకేగి దౌత్యము నెఱపుము. నా మాటలుగ మదాంధులగు శుంభనిశుంభులతో నిట్లనుము. 'మీరు స్వర్గము వీడి వేగపాతాళ మేగుడు. ఇంద్రుడింద్రాసనమున సురలు స్వర్గసీమలో మరల స్వస్థులగుదురుగాక! వారు మరల యాగభాగము లనుభవింతురుగాక!

మీరు జీవింపగోరినచో వెంటనే దానవులుండు రసాతమునకు వెళ్ళుడు. మీ బలముతో గలిసి పోరి చావదలతురా రండు. నేడు నా పరివారమగు ఆడునక్కలు మా మాంసముతో సంతృప్తిజెందుగాక!' అను వచనములను శూలపాణి విని సత్వరమే యేగి సభలోకొలువున్న శుంభునిజేరి యిట్లనెను : రాజా! నేను జగదంబిక దూతను. 

త్రిపుర హరుడను - హరుడను. నీ మేలుగోరి నేనిటకు వచ్చితిని. నీవు స్వర్గము వదలి సత్వరమే వెళ్ళుము. మహాబలిశాలియగు బలి-బ్రహ్లాదుడువసించు పాతాళమేగుము. చావుగోరుకొందువా రణమునకు సిద్ధపడుము. రణమునకు రమ్ము. మిమ్మెల్లర నిపుడే యుద్ధమందు దునుమాడగలను. అని అమృతమువలె మేలొడగూర్చు శ్రీదేవి వాక్కులు శివుడు దానవముఖ్యులకు వినిపించి తిరిగి వచ్చెను. 

అట్లు శివుని దానవుని చెంతకు దూతగ పంపిన దేవి లోకమునందు శివదూతియను పేరు గాంచెను. దానవులు దేవి వాక్కులు శివునివలన విని కవచములు శస్త్రములు దాల్చి రణోన్ముఖులై బయలుదేరిరి. వారు వేగమే యుద్ధమందు దుమికి వాడి ములుకులు చెవులవఱకు లాగి చండికమీద ఏసిరి. 

అంత శ్రీభద్రకాళికాశక్తి కొందఱిని శూలములతో బొడుచుచు-మఱికొందఱిని గదాశక్తులతో మోది చెండాడుచు-నింక కొందఱిని నోట కఱకఱ నమలుచు నుండెను. బ్రహ్మాణీదేవి సమరాంగణమందలి దానవవీరులపై తన కమండలు జలము మంత్రించి చల్లి వారి ప్రాణములు దీయుచుండెను.

మహేశ్వరీదేవి వృషారూఢయై రణమందలి దానవుల నెల్ల తన త్రిశూలముతో బొడిచి చంపిపడవేయుచుండెను. శ్రీవైష్ణవీదేవి తన గదాచక్రప్రహారములతో రక్కసుల కుత్తుకలు కత్తిరించి ప్రాణములు దీయుచుండెను. ఐరావతము తన తొండముతో దానవవీరులను బాధించుచుండెను. 

ఇంద్రాణీదేవి వారిని తన వజ్రముతో గొట్టి నేల పడవేయుచుండెను. వారాహీదేవి తన గట్టిముట్టెతో కోపాతిరేకమున వాడి కోఱలతో పెక్కు దైత్యదానవులను బడగొట్టి చంపుచుండెను. శ్రీనారసింహీ దేవియును తన వాడి గోళ్లతో దైత్యవరులను జీల్చి తినుచు పల్మారు ఘోర సింహనాద మొనరించుచుండెను. 

శివదూతి మహాట్టహాసముతో నేలగూలనేసిన దానవుల నెల్ల చాముండాకాళికలు తినుచుండిరి. దేవహితము గోరివచ్చిన శ్రీ కౌమారీదేవి మయూర మెక్కి వింటినారి చెవులవరకు లాగి దానవులపై బాణములు ప్రయోగించుచుండెను. శ్రీవారుణీదేవి తన పాశములతో దైత్యవర్యులను బంధించి వారిని మూర్ఛితులగ విగతజీవులగ చేయుచుండెను. 

ఈ ప్రకారముగ మాతృకాగణము వీరవిహారము సల్పుచుండగా వీరదానవ సైనికులు పీడితులై ఘోరాపజయమంది వెన్నుచూపి పారిపోయిరి. ఆ దానవసేనలో నేడ్పులు కల కలములు చెలరేగెను. అమరులు మాతృకాగణముపై పూలవానలు గురిసిరి. అట్లు దానవులు పలాయనము చిత్తగించిరి. 

అసురుల యార్తధ్వనులు విని రక్తబీజుడు కోపోద్రిక్తుడయ్యెను. పరాక్రమిమగు రక్తబీజుడు హర్షధ్వానము లొక్కపెట్టున నొనరించు దేవతలను గనిరణమున కుద్యమించెను. అతని కనుగ్రుడ్లెఱ్ఱగ నుండెను. అతడాయుధములు దాల్చి రథమెక్కి నారి మ్రోగించుచు శ్రీదేవి చెంతకు వచ్చెను.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...