Thursday, April 16, 2026

Chapter 116 Death of Raktha Beeja - అధ్యాయము 116 రక్తబీజుని మరణము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 116

రక్తబీజుని మరణము

వ్యాసు డిట్లనెను : ఓ రాజా! పూర్వము పరమశివుడు రక్తబీజున కద్భుత వర మొసగెను. దానిని గూర్చి తెల్పుదును. వినుము. 

రక్తబీజుని శరీరమునుండి నెత్తుటిబొట్లు నేల పడగనే యందుండి యతనిబోలు రూపపరాక్రమములుకల దానవులు పుట్టుదురు. అట్లు మహావీరులు లెక్కలేనంత మంది పుట్టుదురను విచిత్రవరమును శివు డతని కొసంగెను. అట్టి రక్తబీజుడు వరగర్వముతో మహాకోపముతో కాళికాదేవిని సంహరించుటకు రణభూమికి వేగమే వచ్చెను. 

వాడు గరుడవాహనయై వెలుగుచున్న శ్రీవైష్ణవీదేవిని గాంచి యామెపై శక్తిని ప్రయోగించెను. ఆమె తన గదతో వాని శక్తిని నివారించి తిరిగి రక్తబీజునిపై చక్రమును ప్రయోగించెను. ఆ చక్రఘాతమునకు వాని శరీరమునుండి వజ్రపు దెబ్బకు పర్వతమునుండి సెలయేళ్లవోలె రక్తము కాల్వలు గట్టెను. 

వాని రక్తబిందువులు పడినచోట్ల నెల్ల వానిని బోలువారు వేలకొలది పుట్టిరి. పిదప నింద్రాణీదేవి మహాక్రోధముతో తన వజ్రాయుధముతో రక్తబీజుని కొట్టగ వానినుండి నెత్తురు మిక్కుటముగ చిమ్మి పడుచుండెను. ఆ రక్తమునుండి మరల వానిని బోలు పెక్కురు రక్తబీజులు యుద్ధమదముతో సాయుధులై పుట్టిరి. 

బ్రహ్మాణి బ్రహ్మదండముతో మాహేశ్వరి త్రిశూలముతో రౌద్రరూపమున వానిని బాధ పెట్టుచుండిరి. శ్రీనారసింహి తన వాడి కొనగోళ్లతో వానిని చీల్చివేయుచుండగ శ్రీవారాహి తన పెనుముట్టెతో వానిని పొడుచుచుండెను.

శ్రీకౌమారీదేవి తన శక్తితో వాని ఱొమ్ము పగులగొట్టగ వాడు కోపముతో నా దెబ్బలకు తట్టుకొనుచు మరల బాణములు కురియసాగెను. అతడు గదాశక్తులతో మాతృకా దేవతలను వేర్వేరుగ ప్రహరించుచుండగ నా దేవతా శక్తులును ప్రకోపముజెంది వానిని తమ నిశిత శరాఘాతములతో నొప్పించిరి. 

అంతట శ్రీచండికాదేవి మహోగ్రమూర్తియై తన వాడి శరములతో వని ములుకులు ఛేదించి పిదప వానిని నివితశిలీముఖములతో నొప్పించెను. వాని శరీరమునుండి నెత్తురు వెడలుటే తడవుగ నందుండి వేలకొది దానవులు పుట్టుచుండిరి. ఆ నెత్తుట బుట్టిన రక్తబీజుల గుంపు సాయుధముగ కవచములు దాల్చి యెల్లెడల పోరు సాగించుచుండిరి. అట్లు పోరుచున్న పెక్కురు రక్తబీజులను గాంచి యమరులు భయభ్రాంతులై చింతాక్రాంతులై తమలోతా మిట్లనుకొనిరి: 

ఈ నెత్తుట బుట్టిన పెక్కురు మహావీర్య మహాకాయులగు దైత్యు లెట్లు చావగలరు? ఇచ్చట శ్రీచండికయు కాళికయు మాతృకలు మాత్రము గలరు. ఈ దానవుల నెల్లరను గెల్చుట వీరికి కష్టసాధ్యముగ నుండును. శుంభనిశుంభులుగూడ నిపుడే వచ్చినచో మరింత కీడు కల్గును. అని దేవతలు భయవ్యాకులురై చింతాగ్రస్తులై యుండగ శ్రీజగదంబిక శ్రీకాళికాదేవి కిట్లు పలికెను: 

చాముండా! నేను వీరినెల్ల శస్త్రఘాతమున బాధింతును. నీవు వానినుండి వెడలు నెత్తురంతయు నోరు తెరచుకొని త్రాగివేయుము. నేను గద-అసి-ముసలములతో వీరిని చంపుదును. నీవు పిదప వీరితో పొట్ట నింపుకొని స్వేచ్ఛగ విహరింపుము.

విశాలాక్షీ! వీరినుండి యొక్క నెత్తుటిబొట్టుగూడ క్రింద పడకముందే త్రాగివేయుము. తినబడినవారు మరల పుట్టరు గదా! ఇట్లు చేసినచో వీరు తప్పక నశింతురు. ఇంకొక విధముగ వీరు చావరు. అంతలో సర్వనాశనమునకు వాని నెత్తు రెల్ల గ్రోలుము. ఇట్లు దైత్యనాశ మొనరించి స్వర్గ మింద్రున కొసంగి మనము సుఖముగ వెళ్ళుదము. 

అని యిట్లు శ్రీదేవి యనినంతనే చండవిక్రమయగు చాముండ రక్తబీజుని నుండి కారిన రక్తమెల్ల క్రోలసాగెను. శ్రీ మహామాయ ఖడ్గముసలములతో రక్తబీజుని ఖండఖండములు చేయగా శ్రీచాముండా దేవి వాని తెగిన యవయవములనెల్ల తినసాగెను. అపుడు రక్తబీజుడు కోపముతో గదాఘాతముతో శ్రీ చాముండా దేవిని నొప్పించెను. 

దెబ్బతినియును ఆ దేవి వాని రక్తమెల్లగ్రోలుచు నంగములు తినుచుండెను. నెత్తుట బుట్టిన తక్కిన క్రూరులగు రక్తబీజులందఱును శ్రీదేవి చేతిలో నేలగూలిన వెంటనే కాళిక వారినెత్తురు త్రాగసాగెను. అట్టుల పుట్టిన వారెల్లరు పుట్టినట్లుగ హతులుగాగా జగదంబిక నిజమైన రక్తబీజుని ఖడ్గముతో ముక్కలు ముక్కలుచేసి నేలగూల్చెను. 

అట్లు క్రూరుడగు రక్తబీజుడంతమొందగ తక్కిన దానవులు భయకంపితులై పరుగిడ సాగిరి. వారస్త్రములు వదలి చేష్టలుడిగి నెత్తుట దోగి వ్యాకులురై హాహాకారములు చేయుచు శుంభునిచేరి యిట్లు మొఱ పెట్లుకొనిరి: రాజా! భువనైకమాత యగు దేవి రక్తబీజుని నేలగూల్చినది. వెనువెంటనే చాముండా దేవి యతని రక్తమెల్ల త్రాగివేసినది.

కొందఱు దానవులు దేవివాహనమగు సింహమువాతబడి మడిసిరి. ఇంకను మిగిలిన వారిని కాళికాదేవి మ్రింగివేసెను. ఆ రాక్షసఘ్నియగు దేవి సమరాద్భుత నైపుణ్యము నీకు వినిపింపవచ్చితిని. 

ఆ కాలకాలరూపిణియగు దేవిని గంధర్వాసుర-యక్ష-పన్నగోరగ-దైత్య-దానవ-రాక్షసులలో నెవ్వరు నే విధముగనైన జయింపజాలరు. ఆ యుద్ధములో నింద్రాణి మున్నగు తక్కిన దేవతలును తమ వాహనము లెక్కి యాయుధములుదాల్చి వచ్చి పోరు సాగించుచుండిరి. వారి యాయుధములచే దానవసేన యంతయు నిహతమయ్యెను. 

రక్తబీజుడును నేలగూలెను అతుల ప్రభావముగల సింహము సైతము రాక్షసుల నెల్ల చీల్చి చెండాడెను. ఆ దేవి నొక్కతెను గెల్చుటే కష్టము. ఇక తక్కిన దేవతలతోనున్న యామె నెట్లు గెల్వగలము? 

కనుక నీవు నీ మంత్రులతో నాలోచించి తగినది చేయుము. ఇంతకు నా దేవితో మనకు పగ తగదు. సంధి మేలు. ఆ మహాదేవి రాక్షసులనెల్ల జంపి రక్తబీజునంతటి వానిని మట్టుపెట్టి వాని నెత్తురు గ్రాగినదే! ఇది ఆశ్చర్యకరముగ లేదా? అంబిక దానవులను పడగొట్టుచుండగ కాళికాదేవి వారి రక్తమాంసము లారగించెను. 

కనుక మన కిపు డా విశ్వమాతను సేవించుటయో లేక పాతాళ మేగుటయో తగును గాని రణము చేయుట తగదు. ఆమె సామాన్య స్త్రీ కాదు. ఆమె దేవాభ్యుదయముగోరి దానవ కులక్షయ మొనరింప ప్రతిజ్ఞబూని వచ్చిన ప్రబల మాయాదేవి అను సేనల వాస్తవము లైన మాటలు వినియును శుంభుడు కాలమోహితుడై తన చావు తానే కొనితెచ్చుకొని పెదవి కంపింప నిట్లనియెను:

మీరు పిరికిపందలు. మీ రా దేవినే శరణు వేడుడు. లేదా పాతాళ మేగుడు. నేను మాత్రము ప్రయత్నించి యామెను చంపగలను. నే నాలములో దేవతలనెల్ల గెల్చి విపుల సామ్రాజ్యము బొందితిని. అట్టి నేను నేడొక నారికి జంకి యెట్లు పాతాళ మేగగలను? రక్తబీజాదులు నా యనుచరులు. 

వారి చావునకు నేనే కారణమైతిని అట్టి నేను నా కీర్తి మంటగలిపి ప్రాణాలమీది తీపితో నే డెట్లు పారిపోగలను? ఎల్ల ప్రాణులు కాలవశమున సృజింపబడుదురు. వారెల్లరుకు మరణము ధ్రువము. పుట్టువుతోడనే చావు భయము గల్గును. ఐనను దుర్లభమైన యశము నెవడు కాలదన్నుకొనును? నిశుంభా! నే నిపుడు రథమెక్కి సమరమున కేగుదును. ఆమెను చంపి తిరిగి రాగలను. చంపజాలనిచో రాజాలను. 

నీవు నీ సేనలతో నా ప్రక్కనే నిలిచి నా వాడి తూపులతో నా దేవిని యమాలయమున కంపుము అన నిశుంభుడును ఇపుడు నేనే వెళ్ళుదును. ఆ దుష్టకాళిని చంపి దేవిని గ్రహించి వెంటనే మరలి వత్తును. జగములెల్ల గెల్చిన యీ బాహువీర్యున కాబాల యొక లెక్కయా? ఆమె నాకొక సామాన్యయువతి. నీ వింక నిశ్చింతగ నుండుము. 

అన్నా! ఆ నెలతను సగౌరవముగ నిపుడే కొనితెత్తును. దిగులు మానుము. భోగము లనుభవింపుము. నేనుండగ నీవు యుద్ధమున కేగుట తగదు. నేనే వెళ్ళి నీకు జయలక్ష్మిని గొనితెత్తును'' అని తన యన్నతో బలికి మదగర్వమున యుద్ధసన్నద్ధుడై సేనల గూర్చుకొనెను. మంగళకృత్యములు జరుపుకొని నిశుంభుడు వందిమాగధులు సంస్తుతించుచుండ సాయుధుడై వేగమే యుద్ధమునకు తరలెను.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...