Thursday, April 16, 2026

chapter 117 Death of Nishumbha - అధ్యాయము 117 నిశుంభుడు మరణించుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 117

నిశుంభుడు మరణించుట

ఆ శూరుడగు నిశుంభాసురుడు చావో గెలుపో చేకూరవలయునని మదినెంచి బలముతో ప్రయత్నముతో రణములో దేవి నెదుర్కొనెను. నిశుంభునికి బాసటగ సమరకోవిదుడగు శుంభుడుగూడ తన సేనలతోవెళ్ళి సంగ్రామము చూచుచుండెను. ఇంద్రాది దేవతలును యక్షగుణమును యుద్ధము తిలకించు వేడుకతో నింగిపై మేఘముల మాటున బారులు దీర్చిరి. 

నిశుంభుడు రణరంగములో శార్గకమను ధనువు చేపట్టి జగన్మాతను బెదరించుచు బాణములు గురిసెను. అట్లు విల్లు చేబూని బాణములు వదలుచున్న నిశుంభునిగాంచి చండికాదేవి పలుమారు పకపక నవ్వెను. 

దేవి కాళికతో నిట్లనెను: ఓ కాళీ! వీరి మూర్ఖత్వము చూడుము. నేడు వీరు చావుగోరుకొని నా యెదుటబడినారు. వీరు రక్తబీజుని చావు-దానవ సంక్షయము గనియును నా మాయచే మోహితులై జయాశ వీడకున్నారు. ఆశ యెంత బలవత్తరమైనదో చూడుము. అది నరులనెప్పుడును వదలిపెట్టదు. దానవ పక్షములో బలము తగ్గించెడి ప్రాణాలు గోలుపోయిన వారెందఱో కలరు. 

ఐనను శుంభనిశుంభు లాశాపాశబద్ధులై యుద్ధసన్నద్ధులైరి. కాళీ! నేను వీరి నిపుడే యంతమొందింప గలను. వీరు దైవమోహితులు. వీరికి చావు మూడినది. సురలెల్లరు చూచుచుండగ వీరిని నేడే సంహరింపగలను. 

ఇట్లు దేవి కాళికతో పలికిన పిదప చండిక ధనువు చెవినరకు లాగి శరములతో తన ముందున్న నిశుంభుని నొప్పించెను. ఆతడు తన వాడి బాణములతో నామె శరములు దునిమెను. ఇట్లు వారిర్వురినడుమ భీకరమగు పోరాటము సాగుచుండెను.

మహాగజము కాసారమును చీకాకు పరచునట్లే విక్రమముగల సింహము తన జూలు విదలించుచు సేనా వాహినిలో దుమికెను. అది తన వాడియైన నఖ దంతములతో తన ముందున్న శత్రుసేనలను మదపుటేనుంగులను జీల్చునట్లు చీల్చి చెండాడి తినుచుండెను. 

సింహముచే సేనలు మడియుటగని నిశంభుడు గొప్ప చాపము చేబూని విజృంభించెను. అంతలో నితర దానవు లనేకులు కోపాటోపముతో కండ్లెఱ్ఱచేసి పటపటపండ్లు కొఱుకుచు దేవిని చంపుటకు గడంగిరి. వెంటనే శుంభుడు తన బలముతో కాళినిచంపి దేవిని గ్రహించు తలంపున కోపముతో నచటికి వచ్చెను. 

అతడు తన సమక్షమున శృంగార రసమున నొప్పారు చున్న రౌద్ర భీకరయగు జగదంబను యుద్ధభూమిలో గనెను. ఆ త్రిజగన్మోహిని కరుణా కటాక్షములు సహజముగ నెఱ్ఱ నందగించు చుండెను. ఐన నపుడవి క్రోధ సంరక్తములైన చూపులు గల్గియుండెను. అతడు నెమ్మదిలో పెండ్లిమీద జయము మీద ఆసమానుకొని చావునిశ్చయించుకొని ధనుస్సుచేదాల్చి నిలుచుండెను. 

అట్టి దానవునిగని రణమందలి దైత్యులెల్లరు విన శ్రీదేవి మందహాసముచేసి యీ రీతిగ పలికెను : మూఢులారా! మీకు జీవితాశగలదేని మీమీ యాయుధములు వదలుడు. పాతాళ మేగుడు - సముద్రమునైన జేరుడు. కానిచో రణమందు నా బాణఘాతములతో ప్రాణములు విడనాడి నిశ్చింతగ స్వర్గసీమలో క్రీడా సుఖము లందుడు. వీరత్వము భీరుత్వమను నీ రెండొకచో నెన్నడు నుండజాలవు. మీకిప్పటికైన నభయమిచ్చుచున్నాను. మీ నచ్చినచోటి కేగుడు.

అను దేవి పలుకులు వినిన నిశుంభుడు దుర్మదగర్వముతో వాడికత్తిని ఎనిమిది చంద్రకములు (అర్ధ చంద్రాకృతి అంచులుగల) డాలును చేతదాల్చెను. అతడు తొలుత మదమత్తసింహము తలపై కత్తి విసరి పిమ్మట జగదంబపై విసరెను. 

అంత శ్రీదేవియును తన గదతో వాని కత్తి వ్రేటు తప్పించుకొని వెంటనే వాని బాహుమూలములందు గొడ్డట కొట్టెను. ఆ క్రొవ్వుపట్టినవాడు తన చంకలో దగిలిన దెబ్బ బాధ సైచి తిరిగి చండికపై కత్తి విసరెను. ఆమె నరులకు భీతి గొల్పునట్టి ఘోరఘంటానాద మొనరించి నిశుంభుని చంపదలచి మత్తుగ మరల మరల మధుపాన మొనరించెను. 

ఈ రీతిగ జయశీలురగు దేవీ దానవుల భీకర యుద్ధము సాగుచుండెను. అపుడు మాంసాహారులగు క్రూరమైన పక్షులు కుక్కలు నక్కలు గ్రద్దలు కంకకాకములు పటు సంతోషముతో నర్తించెను. రణరంగమున దనుజులు గజాశ్వములు తెగిపడెను. వాని నెత్తుటితో రణస్థలి బీభత్సముగ నుండెను. నిశుంభుడట్లు నేలగూలిన తన సేననుగని అతిరోషముతో వేగమే గదపూని కఠినముగ చండికపై కురికెను. 

అతడు దుర్మదముతో సింహము తలపై గదాఘాత మొనర్చి వికవిక నవ్వి పిమ్మట దేవిని గదతో మోదెను. అట్లు తన ముందు నిలుచుండి పోరుచున్న నిశుంభుని దేవి చూచి మహారౌద్రమూర్తియై యతని కిట్లనెను : 

ఓరీ మందమతీ! ఈ నా బెడదపుటడిదము నీ కుత్తునకు తగులనంతవఱకు నిలువుము. తగిలినచో నీకు యమాలయమే నిలయ మగును. అని వచించి చండికాదేవి తన వాడికత్తితో బలునేర్పుతో నిశుంభుని తల తెగనఱికెను. 

అట్లు దేవిచే వాని తల తెగినప్పటికిని వాని మొండెము గదగొని సురలను జడింపించుచు భీకరముగ తిరుగసాగెను. పిమ్మట దేవి వాడిబాణములతో వాని కాలు సేతులు తెగనఱికెను. అంత పాపాత్ముడగు నిశుంభ దానవు డసువులుపాసి నేలగూలెను. అట్లు పరాక్రమియగు నిశుంభుడు చచ్చిన పిదప వాని సేనలు భయకంపితములై హాహాకారము లొనర్చెను. సైనికు లెల్లరును నెత్తుట దోగాడుచు నాయుధములు విడనాడి ఘోర పరాజయముతో విలపించుచు శుంభుని రాజమందిరము జేరిరి. 

అట్లు వచ్చిన వారినిగని శత్రునాశకుడగు శుంభుడు. నిశుంభు డేమయ్యెను? మీరేల పారివచ్చితి' రని వారి నడిగెను. రాజు మాటలు విని వారు వినతులై యతని కిట్లనిరి.' ఓ రాజా! నీ సోదరుడు రణమందు నిహతుడై పడిపోయెను. అతని యనుచరుల నందఱిని దేవి తునుమాడెను. హతశేషులమగు మేము నీ కా విషయము తెలుపవచ్చితిమి. నేడు చండిక చేతిలో నిశుంభుడు హతుడయ్యెను. 

రాజా! కనుక నిపుడు మనకు రణమందు బోరుటకు తగిన కాలముగాదు. ఒక పరమదేవత నేడు దేవతలను పునరుజ్జీవింప జేయుటకును దానవకులమును నశింపజేయుటకును వచ్చినదని యెఱుంగుము. ఈ దేవి కేవలస్త్రీ కాదు. ఈమె నిజముగ గొప్పశక్తి. దేవాత్మశక్తి. ఈమె దేవతలకు సైతము తెలియరానిది. ఈమె నానా రూపధరి. మాయామూల తత్త్వము నెఱిగినది. విచిత్ర భూషణములు సర్వాయుధములును ధరించిన శుభస్వరూప.

ఈమె గహనమగు తత్త్వము - సర్వశుభలక్షణ లక్షిత - పరిపూర్ణ - అపారపారగురాలు - అపర కాళరాత్రి - గూఢగహన చరిత - ఇట్టి శ్రీదేవి దేవకార్యము సాధించునట్టి పరమాద్భుత మూర్తి. ఈమెను గగన సీమలో విరాజిల్లు దేవగణములు పలుగతుల భయముడిగి నుతించు చున్నవి. 

ఇపుడు మనము బలుసాకునైన తిని బ్రతుకుదము. పారిపోవుట మంచిది. ఈ దేహమున్నచో మనకు మరల తగిన మంచి దినములు ముందు రావచ్చును. వేరొక యుద్ధములో తప్పక జయము గాంచగలవు. కాలము బలశాలిని బలహీనునిగ జేయుము. తిరిగి వానినే బలవంతునిగ జేయును. వానికి జయము చేకూర్చి పెట్టగలదు. 

అదే కాలము మహాదాతను బిచ్చగానిగ మార్చగలదు. బిచ్చగానిని మహాదాతగ జేయగలదు. హరిహర బ్రహ్మలును ఇంద్రాది దేవతలును కాలమునకు కట్టుపడినవారే సుమా! కాలము స్వయముగ తానే ప్రభువు. కనుక మంచి కాలమున కెదురుచూడుము. నేడు నీకది యెదురు తిరిగినది. కాలమిపుడు దేవతల యెట్టయెదుట దనుజ వినాశము చేయుచున్నది. 

కనుక రాజా! కాలగతి యెన్నడు నొక్కరీతిగ నుండదు. కాలమును బహురూపములు దాల్చుదానిగ నెఱుగుము. దాని పనులు తీరుతెన్నులు వింత వింతలుగ నుండును. అది ఒక్కొకప్పుడు నరులను పుట్టించును. మరొకప్పుడు మహాప్రళయమును తెచ్చిపెట్టును. కనుక నొకే కాల ముతృత్తి హేతువు - నాశహేతువునగును. 

ఈ విషయము నీవును ప్రత్యక్షముగ నింద్రాది దేవతల విషయమున నెఱిగియేయున్నావు. ఒకప్పుడింద్రాదులే నీకు కప్పము చెల్లించిరి గదా! ఆ కాలేమ నీకిపుడు ప్రతికూలమయ్యెను. దాన నే డొక్కయబల బలము గల దైత్యులను మట్టుపెట్టినది. కనుక శుభాశుభములకు కాలము కారణముగాని సనాతన దేవి గాదు. కాళి కాదు. 

కాలము నేడు నీకు నీ దానవులకును కలిసిరాలేదు. కావున చక్కగ నాలోచించుకొని నీకు రుచించినట్లు చేయుము. ఒక కాలమున విష్ణువు - రుద్రుడు - వరుణ కుబేర యములు - ఇంద్రుడు నీతో బోరి నిరాయుధులై పారిపోయిరి. అటులే నేడు నీవును జగము కాలవశమని తెలసి పాతాళమేగుము. బ్రతికి యున్న నూరేండ్లకైన సుఖములు పడయ వచ్చును గదా! 

ఇక నీవును చచ్చినచో దేవతలు ప్రమోదభరితులై మంగళ గీతికలు పాడుచు నెల్లెడల విహరింతురు.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...