Wednesday, April 15, 2026

Chapter 102 Sridevi's killing of Yasiloma Bidals - అధ్యాయము 102 శ్రీదేవి యసిలోమ బిడాలులను సంహరించుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 102

శ్రీదేవి యసిలోమ బిడాలులను సంహరించుట

అట్లు వారు మడియుట విని మహిషుడు విస్మయమందెను. అతడు దేవివధకు మఱికొందఱి నంపెను. వారు బలశాలురు - రణ దుర్మదులు - మహా సేనాయుతులు - ఆయుధాలంకృతులు అగు నసిలోమబిడాలులను దైతేయులు. వారు రణ స్థలము నందు శ్రీమత్సింహవాహనమైన యష్టాదశభుజాఢ్యయై ఖడ్గ-ఖేటాది దివ్యాయుధ ధారిణియై వెలుగువెల్లువలయైన దేవిని గాంచిరి. 

అసిలోముడు వికవికనగుచు నతి వినయశాంతులతో దైత్య వధకు కంకణము కట్టుకొనిన యాదిపరాశక్తి కిట్లనెను : 

ఓ కళామయీ! దేవీ! నీ విచటి కేల వచ్చితివి? ఏ పాపమెఱుగని దానవుల నేల చంపితివి? నిజము పలుకుము. ఆ కారణము చెప్పినచో నేను నీతో సంధి చేసికొందును. నీ కేమి కావలయునో కోరుకొమ్ము. బంగారమా? మణిరత్నములా? వరపాత్రములా? నీకు కావలసిన దెల్ల గ్రహించి శీఘ్రమే వెళ్ళుము. దుఃఖ సంతాపకారకమగు బవరమేల కోరుచున్నావు? యుద్ధము సకలసుఖములకు గొడ్డలిపెట్టని మహాత్ములందురు. నీ మేని నిగనిగలు సోయగము - మెత్తందనము - పూదెబ్బకు సైతము తాళజాలదే! ఇట్టి లావణ్యతివగు నీ విట్టి శస్త్రబాధ లోర్చుకొనుట వింతగ నున్నది. చతురతకు ఫలము శాంతి, దానివలన నిత్య సుఖములు బడయవచ్చును. 

కనుక దఃఖమూలమగు సంగరమేల చేయదలంతువు? సుఖము లనుభవింప వలయును - దుఃఖములు బాపుకొనవలయుననుట లోకమర్యాద గదా! సుఖము నిత్యము - అనిత్యము నని రెండు తెఱంగులు - ఆత్మ జ్ఞానానంద సుఖము నిత్యము. విషయ విషభోగములచే సుఖమనిత్యము. ఈ నాశకరమగు దుఃఖమును వేదశాస్త్రార్థములు విచారించువారు వీడుదురు. వరాననా! నీవు బుద్ధమతము స్వీకరించినచో పరలోకము లేదని నమ్మినచో నీ యందాల పరువము బొందినందులకు గొప్ప విషయభోగము లనుభవింపుము. ఈ మురిపించు జవ్వనము నీటిబుడగ. ఇట్లెఱిగి స్వర్గసుఖములు గల్గించు పున్నెము లొనరింపుము. బుధులెల్లవేళల పరపీడనము విడనాడవలయును. ధర్మార్థ కామములు వరుసగ చక్కగ నాచరింపవలయును. 

కునుక నో సర్వమంగళా! శ్రీ మాతా! ధర్మమతివి గమ్ము. నిరపరాధులగు దైత్యుల నూరక ఏల చంపుదువు? ఈ ప్రాణులు సత్యనిష్ఠులు. ఈ శరీరములు దయాధర్మములాచరించుటకు తావులు. కావున బుధులు చక్కగ దయాసత్యములు పాటించవలయును.

శాతోదరీ! ఈ ఘోరదానవ వధకు కారణమేమో తెలుపుము. 

శ్రీదేవి యిట్లనెను: మహాబాహూ! నన్ను నీవేల వచ్చితివని యడిగితివి. వధ కారణము వక్కాణింతును వినుము. నేనెల్ల లోకములందెల్లవేళల సంచరింతును. నేను సర్వ సాక్షిణిని. ఎల్ల భూతముల న్యాయాన్యాయములు సమీక్షింతును. నాకు భోగేచ్ఛగాని లోభవైరములుగాని లేవు. నేను ధర్మాభ్యుదయమును సంరక్షింప తిరుగుదును. ఈ రేడు లోకాలలోని పరమ సాధువుల పరిరక్షణము నా వ్రతము. 

నేను దీనిని నియతముగ నిత్య మనుసరింతును. నేను పెక్కు లవతారములు దాల్చి వేదములను సాధువులను బ్రోతును. దుర్మార్గుల వినాశ మొనరింతును. నేను యుగయుగమున నవతరింతును. మహిషుడు దుష్టుడు. దేవత పాలి శత్రువు. వీడిట్టివాడని యెఱిగి నేను వీనిని చంప నేతెంచితిని. సురవైరి-దురాచారుడు-మహాబలుడగు మహిషుని నే నమరతేజమునై పరిమార్పగలను. నా యీ పలుకులు నిజములు. 

నీకు చేతనైన నిలుము. లేదా వెళ్ళుము. నేను పలికిన పై మాట సత్యము. ఆ దురాత్ముడగు మహిషరాజున కంతయు నిట్లు చెప్పుము - నీ వితరుల నేల పంపుదువు? నీవే వచ్చి యుద్ధ మొనర్పుము. నీకు నాతో సంధి యిష్టమైనచో రమ్ము. నీవు పగలు పెంచుకొనక వైరము విడిచి పాతాళ మేగుము రణమందు దేవతల నోడించి దేవ ద్రవ్యము లపహరించితివి. 

వారివి వారి కిచ్చి ప్రహ్లాదుడు వసించు పాతాళ మేగుము. అను దేవి మాటలు విని 

యసిలోముడు దేవి కెదురుగ నిలిచెను. ఆ వీరుడు బిడాలునితో నెమ్మి నిట్లనెను: 'బిడాలా! భవాని పల్కిన పల్కులు నీవు వింటివి గదా! ఇప్పుడు మన కర్తవ్య మేమి? సంధియా?' అన 

బిడాలు డిట్లనెను : చావు నిక్కమని మన రాజునకు తెలియును. అతడు దేహాభిమాని - సంధి కోరడు. అతడు నిహతులను గనియును మనల మరణ రణమునకు పురికొల్పుచున్నాడు. విధి దాట నెవని తరము? సేవకు అభిమానము లేనివారు. వారి ధర్మ మెల్లప్పుడు దుస్సాధమైనదే. వారు త్రాడు పట్టి పలురీతుల నాడించు వానికి వశమగు తోలుబొమ్మల వంటివారు. 

ఇంక నతని ముందున కేగి నీవు నేను నిట్టి బెట్టిదపు పల్కులెట్టుల పల్కగలము? ధనమును రత్నములు సురల కొసంగి పాతాళమేగుట మంచిదని యతని కెట్లు చెప్పుదుము? అసత్య మెప్పుడును ప్రియముగ నుండును. మేలుగూర్చు నిజ మప్రియముగ నుండును. 

ఈ లోకమందు సత్యము ప్రియముగల పలుకు దుర్లభము. కాని, నిట్టి పట్టుల మౌనముగ నుండుట బుద్ధిశాలుర లక్షణము. వీరు డెప్పుడును తన ప్రభువును లోభముచే వశము చేసికొనరాదని నీతిశాస్త్రము వాక్రుచ్చును. 

కనుక నిపుడు మనము ప్రేమతో హితము చెప్పుటకు గాని కుశల మడుగుటకు గాని మన రాజు చెంతకు పోదగదు. పోయినచో నతడి వేడి కోపము రేగును. మన మిట్లెఱిగి ప్రాణ సంకటము గల్గినను స్వామికార్యమే గొప్పదని యెంచి చావును గడ్డిపోచగ దలచి యుద్ధమునకు తలపడవలయును అని యిట్లు విచారించుకొని వారిర్వురును విల్లమ్ములు దాల్చి రథమెక్కి యుద్ధ సన్నద్ధులైరి. 

మొదట బిడాలు డేడు బాణములు వదలెను. అస్త్రవిదుడగు నసిలోముడు దూరమునుండి యంతయు గనుచుండెను. నిరంకుశయగు దేవి తన మీదికి వచ్చు బాణములను ఖండ ఖండములు చేసి వానిపై మూడు కఱకుటమ్ములు వదలెను. దానవు డా వాడి బాణముల దెబ్బకు రణరంగమునబడి మూర్ఛిల్లి వెంటనే విధివశమున ఈల్గెను. 

అట్లు దేవి బాణములకు రణమున బిడాలుడు హతు డగుటగని యసిలోముడు విల్లమ్ములు దాల్చి పోర సమకట్టెను. అతను తన యెడమచేయి పైకెత్తి యిట్లనెను : 

దేవీ! దుష్ట దానవులు తప్పక నిహతులగు టే నెఱుంగుదును. ఐనను మా మహిషుడు మందమతి. మంచి చెడ్డ లెఱుగడు. నేను పరాధీనుడను. కనుక నాకు యుద్ధము చేయుట తప్పని పని. అతని యెదుట మేలు గల్గించు నప్రియము బలక జాలను. మేలో - కీడో వీరమరణమందుట నా ధర్మము. నీ బాణమునకు దానవు లెల్లరు బలి యగుచున్నారు. 

కనుక దైవమే గొప్పము. పౌరుషము పనికి మాలినది అని తలంతును.

అని పలికి యసిలోముడు బాణముల నేసెను. శ్రీ విష్ణుమాయ యవి తన్నుజేరక మున్నే వాని నెల్ల దునుమాడెను. వెనువెంటనే యసిలోముని తన నిశిత శరములతో గాయపఱచెను. అమరులెల్ల వినువీథి నంతయును వీక్షించుచుండిరి. బాణపుదెబ్బలు తినుట వలన వాని మేను రక్తధారలు చిమ్ముచు విచ్చిన మోదుగుపూవులవలె నొప్పెను. 

అంత డంత నొక పెద్ద యినుపగద గొని వాడిగ చండికపై కురికి కోపావేశమున సింహము తలపై మోదెను. ఆ బెట్టిదపు గద దెబ్బ లెక్కచేయక మృగరాజు తన వాడి గోళ్లతో నతని బుజములు తెగచీల్చెను. దైత్యుడు వెంటనే గదబూని సింహము తలపై కెక్కి యంబికను మోదెను. 

రుద్రరూపిణి వాని దెబ్బ వమ్మొనరించి కఱకు కత్తితో వాని తల తెగనఱికెను. దైత్యుడు నేలగూలెను. వాని సేనలో హాహాకారములు చెలరేగెను. దేవత లందఱును జయజయ నినాదములతో శ్రీత్రిభువనేశ్వరిని సన్నుతించిరి. దేవదుందుభులు మొరసెను; కిన్నరులు పాడిరి. 

అట్లు దానవు లిర్వురు మడిసిన పిదప తక్కిన సైన్యము సింహము నోటికి బల్మి బలియైనది. సింహము కొందఱిని పొట్ట పెట్టుకొనెను. కొందఱు దుఃఖితులై మహిషుని చెంతకు పారిరి. రణ స్థలము శూన్యమయ్యెను. 

పారిన వారు కావుకావుమని మహిషుని జేరి విలపించిరి. అసిలోమ బిడాలులు మడిసిరి. ఇతర సైనికులు సింహము వాతబడిరి అని పలికి వారు రాజునకు మరింత దుఃఖము గల్గించిరి. వారి మాట లన్నియు విని మహిషుడు దుఃఃతుడై చింతాక్రాంతు డయ్యెను.

అధ్యాయము 103 మహిషుడు శ్రీదేవినిగని మోహవశుడగుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...