Wednesday, April 15, 2026

Chapter 103 Mahishudu Sridevi Gani Mohavashudaguta - అధ్యాయము 103 మహిషుడు శ్రీదేవినిగని మోహవశుడగుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 103

మహిషుడు శ్రీదేవినిగని మోహవశుడగుట

మహిషుడట్లు తన సేనల మాటలు విని కన్నులెఱ్ఱజేసి వేగిరమే తన యద్భుత రథము దెమ్మని దారుకునితో ననెను. ఆ రథము ధ్వజపతాకములతో నాయుధములతో మంచి చక్రములతో శోభిల్లి వేయిఖరములచే నడుపడుచుండెను. సూతుడా రథము దెచ్చి, 

రాజా! రథము దెచ్చితిని. ద్వారము చెంత నలంకృతమై యున్నదని యతని కనియెను. సకలాభరణములతో నొప్పురథమును మహిషుడు చూచెను. అతడు నరరూపముతో రణమునకేగదలచె. శ్రీదేవి నా దుర్ముఖమును గనును. ఆమె నా పొడుగైన కొమ్ములుగని మహిష రూపమును గాంచును. దాన నామె మనస్సు వికలమై నాయందు తగులదు. స్త్రీలు సురూపము చాతుర్యము కోరుదురు. 

కనుక నేనిపుడామె చెంతకు సురూపము చాతుర్యముగల నరాకారముతో వెళ్ళుదును. ఆమె నన్ను చూచిన తొలిచూపులోనే ప్రేమయుక్త కావలయును. నాకు నాదేవి సోయగము చూచిననే కాని సుఖము గలుగదు. ఇట్లు దానవేంద్రుడు మహాబలుడునగు మహిషుడు దలపోసెను. 

మహిషరూపము విడనాడి చక్కని పురుషరూపము దాల్చెను. సకలాయుధధరుడు భూషణ భూషితుడు దివ్యాంబరధరుడునై మెడలో పూలమాల దాల్చి విల్లమ్ములు చేతబట్టి రెండవ మదనుడో యన నొప్పుచు నరదముపై కూర్చుండెను. 

ఇట్లతడు రమణులకు మనోహరమగు రూపము దాల్చి సకలసేనలతో నహంకార మదగర్వితుడై శ్రీజగదంబను సమీపించెను. అట్లు పెక్కు వీరసైనికులతో వచ్చిన మహిషునిగని దేవి శంఖము పూరించెను. లోక విస్మయకరమగు ఆ శంఖధ్వని విని యతడు చెంతకేగి నవ్వుచు దేవితో నిట్లనెను:

దేవీ! ఈ విశాలవిశ్వమందలి స్త్రీపురుషులెల్లరును సర్వవిధముల సుఖమునే కోరుదురుగద! అట్టి సుఖము నరులకు సంయోగమందే కల్గునుగాని వియోగమున గల్గదు. ఆ సంయోగ సుఖము పలురీతుల గలదు. దానిని వచింతును వినుము. సుఖభేదములు ప్రేమవలన స్వభావము వలన ననేకముగ నుండును. 

తొలుత ప్రీతిభావములు దెల్పుదును వినుము. తల్లి దండ్రులకు తమ పుత్త్రులపై ప్రేమవలన సంయోగము గల్గును. అది ఉత్తమ సుఖప్రదము. కారణవశమున సోదరుల నడుమ కలయిక గల్గును. అది మధ్యమము. ఉత్తమ సుఖము గల్గించు సంయోగము శ్రేష్ఠము. 

అల్పసుఖమొసగునది మధ్యమము. నావికులు పెక్కుపనుల వలన వ్యాకుల చిత్తులై ప్రసంగ వశమున కలిసికొందురు. వారి సంయోగము స్వాభావికమని బుధులందురు. ఇది మిక్కిలి కొలది సుఖము గల్గించుట వలన దీని నల్ప సుఖమని బుధులందురు. జగమున నత్యుత్తమ సంయోగముత్తమ సుఖము నొసంగు చుండును. 

కాంతా! సరిఈడుజోడుగల యువతీయువకుల మేలుకలయిక యత్యుత్తమము. అట్టివారి కలయిక యత్యుత్తమ సుఖప్రదమైనది. ఈ కలయికకు రూపగుణ చతురతలు-కులశీలములు నావశ్యకములు. ఈ గుణము లొకరియందు కంటె నొకరి యందెక్కువ నుండవలయును. నేనన్ని విధముల నట్టి వర గుణములు గల వీరుడను. నా మూలమున నీకు నిస్సంశయముగ నత్యుత్తమ సుఖము గల్గును. 

ప్రియా! నేను బహూరూపములు దాల్చు మొనగాడను. ఇంద్రాది దేవతలే నాతో బోరలేక పారిపోయిరి. నా యింట వారి దివ్య రత్నములు పదిలముగ నుంచితిని. వానినెల్ల నీ యిష్టము వచ్చి నట్టు లనుభవింపుము. లేదా దానము చేసికొమ్ము, సుందరీ! నాకు పట్ట మహిషివిగమ్ము! నేను నీ చరణదాసుడను.

నీ మాట చొప్పున నే నీనాటినుండి సులరతో పగ మానివేయుదును. నీకు దేనివలన సుఖము గల్గునో దాననే యొనరింతును. విశాలాక్షీ! చారుభాషిణీ! నీ మోహనరూపమునకు నా చిత్తము ముగ్ధమైనది. 

కనుక నన్నాజ్ఞాపింపుము. నీ చెప్పినట్లు చేయుదును. రంభోరూ! వలరాజు బాణములచే పీడితుడనై యాతురతతో నీ మరుగు జొచ్చితిని. నన్ను రక్షించుము. తలోదరీ! శరణాగతరక్షణ ధర్మ మత్యుత్తమము. నేను నీవాడను. నీ దాసుడను. 

తన్వంగీ! ప్రాణములు పోయినను సరియే నీమాట జవదాటను. నా యాయుధములు వదలి నీ పాదములమీద పడుదును. కామ బాణములకు నా యెద తపించిపోయినది. దయగనుము. నేను పుట్టిన నాటినుండి దీనత్వ మెరుగనివాడను. నేను బ్రహ్మాదుల ముందుగూడ దీనముగ నుండలేదు. నేడు నేను నీకు దీనుడను గావలసివచ్చినది. బ్రహ్మాది దేవతలు రణమందున నా లావెఱుంగుదురు. అంతటి నేను నీకు దాసుడనైతిని. 

భామినీ! నా మెగము చూడుము అను మహిషుని మదమెక్కిన పలుకులు దేవి వినెను. 

అంత లీలా భగవతి యగు దేవి చిరునగవుతో నతనితో నిట్లనెను : 

నే నా పరమపురుషుని దక్కొరుని వరింపను. దైత్యాధమా! నే నా పరమశివుని యిచ్ఛాశక్తిని. ఈ సకల జగములను నేనే సృజింతును. నేను శివాప్రకృతిని. ఆ విశ్వాత్ముడు నన్ను వీక్షించువాడు. నేను జడమను. ఆతని సాన్నిధ్యము వలన శాశ్వత చైతన్య మందుదును. ఆతని సంయోగవశమున నేను చైతన్యవంతురాల నగుదును. 

ఇను మయస్కాంతపు సన్నిధివలన నయస్కాంతముగ మారును. నేను నా పరమశివును సన్నిధిచే సచేతన యగుదును. నాలో తుచ్ఛమైన గ్రామ్యసుఖవాంఛఖలేదు. మందమతీ! నీవు వట్టి మూఢుడవు. పరస్త్రీ సాంగత్యము కోరుచున్నావు. స్త్రీ నరుని బంధించు నినుప సంకెలయని చెప్పబడెను.

ఒకవేళ లోహబంధనములనుండి యైన విడివడవచ్చును. స్త్రీబద్ధుడేనాటికిని ముక్తి జెందడు. ఈ మల మూత్రముల కొంప నేల సేవింపగోరుదువురా? సుఖము కొఱకు చిత్తశాంతి బొందుము. శాంతి వలన సుఖము గల్గును. నారీ సంగమమున దుఃఖము గల్గునని తెలిసియును మోహమునబడుదువేల? ఇకనైన నిఖిల సురలతోడి వైరము బాసి యథేచ్ఛముగ వర్తింపుము. 

కాక జీవితాశ గలదేని రసాతలమున కేగుము. కానిచో నాతో బోరుము. నీకంటె మిక్కిలి బలముగలదానను. దేవతలందఱును కలిసికట్టుగ నన్ను నీ చావునకు పంపిరి. నేను నిజము పలుకుచున్నాను. నీవు సామవచనములు పల్కుటవలన నీకు సంతుష్టి జెందితిని. 

ఇకనైన బుద్ధికల్గి ప్రాణాలతో వెడలిపొమ్ము. ఏడు పదముల వలననే సాధువులకు పరస్పమైత్రి గల్గును. నిన్ను ప్రాణాలతో వదులుచున్నాను. పొమ్ము. చావగోరుదువేని నాతో పోరునకు రమ్ము. మహాబాహూ! నిన్ను చంపితీరుదును. ఇది ముమ్మాటికి నిజము అను దేవి వాక్కులు విని దానవుడు కామపరవశుడయ్యెను. 

అతడు తీపి మాటలతో నిట్లనెను : వరాననా! వరారోహా! నిన్ను చంపుటకు నేను భయపడుచున్నాను. నీవు కోమలాంగివి; భువనమోహినివి కనుక నిన్ను చంపజాలను. నేను హరిహరాదులను లోకపాలురను గెల్చితిని. 

కమలలోచనా! శుభాంగీ! ఇట్టి నీతో పోరాటము నాకు తగునా? నీ మదికి నచ్చినచో నన్ను చేపట్టి భజింపుము. కానిచో నీవచ్చిన చోటికేగుము. నీతో నేస్తము పాటించుటచే నేను నిన్ను నా చేజేతుల చంపజాలకున్నాను. హితము శుభకరము నగు మాట చెప్పితిని. ఇంక నీ చోటికి నీవేగుము. నీవు చారులోచనవు. నిన్ను చంపినంత మాత్రాన నాకేమి లాభము? స్త్రీ హత్య - బాలహత్య-బ్రహ్మహత్య-ఇవి చాల చెడ్డవి. కనుక నిన్ను గ్రహించి యింటికేగుదును. నా వెంట రమ్ము.

భోగ సుఖములు బలాత్కారము వలన గలుగవు. కనుక నేను వినయముగ చెప్పుచుంటిని. పురుషునికి యువతి ముఖమున దక్క మరెక్కడ సుఖము గలుగదు. అట్లే పురుషుడు లేనిచో యువతికిని సుఖములేదు. వారిర్వురి మనస్సులొక్కటైనచో సుఖ ప్రాప్తి గల్గును. వియోగమున దుఃఖము గల్గును. 

నీవు కాంతవు రూప సంపన్నవు సర్వాభరణ భూషితవు. నీలో చతురతలేదు. నీవు నన్ను భజింపకున్నావు. సుఖభోగములు వీడుమని నీకెవరు బోధించిరోకదా! నీ శత్రువెవరైన నీకు చెప్పినచో నీవు మోసగింపబడితివి. ఇకనైన పట్టు వదలి శుభకార్యమునకు గడంగుము. మన యిర్వురి వివాహమున మనకు సుఖము గల్గును. 

లక్ష్మి విష్ణుని - సావిత్రి బ్రహ్మను-పార్వతి రుద్రుని-శచి యింద్రుని చేపట్టినట్లు నీవు నన్ను చేపట్టుము. దీనివలన నీకును నాకును సుఖముగల్గును. పురుషుడులేని స్త్రీ యెన్నడును సుఃఖింపదు. నల్లని కడగంటి చూపుదానా! కాంతా! నావంటి వీరుని పతిగ గ్రహింపవేల? పూవిల్తుడు నీ హృదయమందు మెత్తని పూముల్కులు వేయడేమి? మందమతియగు మదనుడు తన యైదు బాణములతో నీమది మరుల్గొన జేయడేమి? 

సుందరీ! తెలిసెనులే. అతడు నాయందువలె నీయందును దయగలవాడని దలతును. నీ వబలవని మన్మథుడు నీపై బాణములు వేయుటలేదేమో? లేక అతనికి నామీద నేదేని పగ గలదో? దానిచే నతడు నీమీద బాణములు వేయుటలేదేమో? లేక వైరులగు దేవతలు మదనుని వారించిరేమో? సురలు నా సుఖము గోరువారుగారు. నన్ను వదలిన తర్వాతనైన నీవు పశ్చాత్తాపమొందగలవు. 

తొల్లి మందోదరి యను పడతి తన కనుకూలుడగు గొప్పరాజును త్రోసి రాజని యొక శఠుని పతిగ వరించెను. ఆమె పిదప మోహపరవశతచే కామార్తయై పశ్చాత్తపించినది.

అధ్యాయము 104 మహిషుడు శ్రీదేవికి మందోదరికథ వినిపించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...