Thursday, April 16, 2026

Chapter 110 Sugrivuni Rayabaramu - అధ్యాయము 110 సుగ్రీవుని రాయబారము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 110

సుగ్రీవుని రాయబారము

ఈ ప్రకారముగ దేవతలు రాక్షస పీడితులైన శ్రీ పరాభట్టారికా దేవిని సంస్తుతించిరి. ఆ దేవి తన శరీరమునుండి యొకానొక దివ్యతేజోరూప ముద్భవింప జేసెను. ఆ మహోజ్జ్వల రూపము పార్వతీ శరీర కోశమునుండి వెలువడినది. అందుచే నామెకు కౌశికి యని యెల్లలోకములు పేరిడెను. 

అట్లు తన శరీరమునుండి కౌశికి యుద్భవించిన మీదట పార్వతి కృష్ణవర్ణము దాల్చి కాళికయను పేర ప్రసిద్ధి గాంచెను. కాళికాదేవి నీలవర్ణముతో ఘోర రూపముతో భీకరముగ నుండెను. ఆమె దనుజులకు భయము గొల్పుచు భక్తులకు కోర్కులు గురియుచు కాళరాత్రి యనుపేర ప్రఖ్యాతి గాంచెను. ఆ కాళికాంబా రూపము సకల లావణ్య పుంజమై సుమనోహరమై సకల భూషణములతో చెన్నొందెను. 

అపుడా భగవతీ దేవి దేవతలతో నిట్లనెను: మీరు భయపడవలదు. వగవవలదు. నేను పగతుర నిపుడే సంహరింపగలను. మీ కార్యము తప్పక నెరవేర్తును. మీ యోగక్షేమములకు రణమున దూకి శుంభనిశుంభుల నంతమొందింపగలను అని దేవతల కూరట గల్గించి దేవి యుద్ధమదోత్కటయై సింహవాహన మధిష్ఠించి కాళికతోడుగాగల జగదంబ యొక యుద్యానవనము జేరెను. 

ఆందామె జగదేక సుందరిగ వెల్గులు జిమ్ముచు కలకంఠముతో నమరగానము మధుర మోహనముగ సాగించెను. ఆ గాన మధుర రాగమాలకించి పశుపక్షులు సైతము పరవశతనందెను. దివి దేవతలు పరమహర్షము వెలిపుచ్చిరి. 

అంతలోనిట శుంభుని సేవకులు-చండ ముండులను ఘోర దానవులు తమ యిచ్చమెచ్చునట్లు గ్రుమ్మరు చుండిరి. వారు గానమొనరించు నంబికా దివ్య సుందర రూపము నాదేవి సన్నిధినున్న కాళికను సందర్శించిరి. ఆ దేవి యజ్ఞానము రూపుమాపు రవిప్రభవలె విరాజిల్లెను. వారామె రూపలావణ్యముల కచ్చెరువొంది వేగ శుంభునిచెంతకేగి దైత్యపతిముందు తలలువంచి దోసిలొగ్గి తీయని మాటల నిట్లనిరి:

రాజా! ఒక దివ్యకామిని కామమోహినిగ నున్నది. ఆమె పవిత్ర హిమాచలమునుండి దిగివచ్చెను. ఆమె సర్వ శుభ లక్షణములతో వెలుగొందుచు సింహము నధిష్ఠించి యున్నది. మనమిట్టి స్త్రీ రత్నమును దేవ గంధర్వ లోకములలో నెచ్చటనేని కనివిని యెఱుగము. ఆమె మనోరంజని. ఆమె మధురగాన రవళులకు మోహించి మృగములు సైతమామె సన్నిధిలో ఱాపడి నిలుచుండెను. 

ఆమె యెవరికూతురో? ఏలవచ్చెనో? యెఱుగుము. నీ వామెను చేపట్టుము. ఆమె మీకన్ని విధముల తగినది. ఇట్టి నారీమణి యీ నారీలోకమునం దెచ్చటను లేదు. కావున నన్నియు నెఱిగి నీవీ సులోచనను భార్యగ స్వీకరింపుము. నీవు దేవరత్నములెల్ల గైకొంటివి కద! మఱి యీ స్త్రీ రత్నమునేల గ్రహింపవు? నీ వింద్రుని యైరావతమును ఏడు మొగాల యుచ్చైః శ్రవమును కల్పతరువును బల్మికొలది గ్రహించితివి. 

హంస ధ్వజముగల బ్రహ్మ విమానమును బలముతో నబ్బురముగదుర గైకొంటివి. కుబేరుని పద్మనిధిని వరుణుని వెల్లగొడుగును విక్రమముమెఱయ చేకొంటివి. వరుణుడోడిన పిదప నతని పాశమును నీ అన్నయగు నిశుంభుడు లాగుకొనెను. సాగరుడు నీకు జడిసి వాడని కమల మాలలు-నానావిధరత్నరాసు లొసంగెను. నీవు యమునిగెల్చి దారుణ మృత్యుపాశమును యమదండమును వశము చేసికొంటివి. ఇంకేమని చెప్పగలను? 

సాగరమునుండి యుద్భవించిన మేనక మున్నగు నచ్చరలును కామధేనువును నీ వశమందున్నవి గదా! ఇట్టి దివ్యరత్నములను నీవు విక్రమముతో హరించితివి. ఇపుడీకాంతారత్నము నేల గ్రహింపవు?

నీ యింటిలో ఈ రత్న మొక్కటి యున్నప్పుడే యితర రత్నరాసులు విశదములైన యథార్థ రత్నరాసులనబడును. 

దైత్యపతీ! ఈ ముజ్జగములందు నిట్టి లలన దుర్లభ కావున నీ వామెను తెచ్చుకొని నీ దానిగ జేసికొనుము అను చండ ముండుల తీయని మాటలు విని దైత్యరాజు ప్రసన్నుడై తన చెంతనున్న 

సుగ్రీవునితో నిట్లుపలికెను : సుగ్రీవా! నీవు నాకు దౌత్యము నెఱపుము. ఆ రమణి నన్ను జేరునట్టు లామెతో వ్యవహరింపుము. స్త్రీల యెడల సామ దానములను రెండుపాయములు ప్రయోగింప దగినవని రసజ్ఞులందురు. భేదమువలన రసాభాసము నిగ్రహమున రసభంగము గల్గును. 

కనుక నివి ప్రయోగింపదగనివని బుధులందురు. కామిని సామదానములతోడి నర్మ వాక్యములచే వశమగును అను శుంభుని తీపి పల్కులు విని సుగ్రీవు డంబికయున్నచోటి కేగెను. సింహ వాహనయగు జగదంబకు దోసిలొగ్గితీయగ నిట్లుపలికెను: 

సుందరీ! శుంభుడను రాజు సురారి - అందగాడు-శూరుడు త్రిలోకపతి - ఎల్లరిని గెల్చినవాడు. నీ యంద చందాలు విని సంతాపించు చిత్తముతో ఆ మహాత్ముడిపుడు నన్ను నీ చెంత కంపెను. ఆ దైత్యపతి నీకు ప్రణమిల్లి పల్కిన ప్రేమ వచనము లాలకింపుము.

కాంతా! నేను సురలను గెల్చితిని త్రిలోకపతినైతిని హవిర్భాగములు గొనుచున్నాను. దివ్య రత్నములెల్ల గ్రహించితిని. స్వర్గమును నిస్తేజముగ రత్నకాంతి హీనముగ జేసితిని. ఈ ముజ్జగము లందలి రత్నరాసులెల్ల నేనే యనుభవింతును. నర సురాసురులెల్లరును నా చెప్పు చేతల మెలగుదురు. నీ సుగుణ గణములు నా చెవుల నుండి యెడదలో ప్రవేశించినవి. నేను నీకు వశుడను నీ బానిసను. నన్నేమి చేయుమందువో చెప్పుము. 

తరుణీ! నేను నీ యధీనుడను; నీ దాసుడను; నన్నాజ్ఞాపింపుము. నన్ను మదనుని విరిములుకులనుండి కాపాడుము. వలరాజు వస్త్రముల సెగలు పొగలు నా గుండె నలముకొన్నవి నన్ను జేరుము త్రిలోకేశ్వరివై భోగమునెల్ల ననుభవింపుము. నారీమణీ! నాకు చావులేదు. నేను మనుజదేవాసురులకవధ్యుడను; 

అట్టి నేను నీ యాన తల దాల్తును. వరాననా! సౌభాగ్యవతివి కమ్ము. నీ యిచ్చవచ్చుచోట మనము సయ్యాటలాడవచ్చును దేవీ! అని యిట్లు పల్కిన శుంభుని పల్కులు నీ చిత్తమందాలోచించుకొని ప్రేమ మధురముగ బలుకుము. 

చంచలాక్షీ! నీ పల్కులు శుంభునకు నివేదింతును అను దూతవాక్కులాలించి దేవి చిర్నగవు నగి దేవ కార్యార్థమై తీయని వాక్కులతో నిట్లనెను: 

నేను శుంభ నిశుంభుల నెఱుగని దాననుగాను. అతడెల్ల దేవతలను గెల్చి వైరులను సంహరించెను. సుగుణములు గని, ఎల్ల సంపదలు భోగించుచున్నవాడు. దాత; శూరుడు; మదనసుందరుడు; ముప్పదిరెండు లక్షణములు గల వాడు; సురమనుజుల కవధ్యుడు.
ఇన్నిటి నెఱిగియే యా మహాసురుని చూచు వేడ్క నరుదెంచితిని. 

రత్నము తన కాంతి నినుమడింప జేయుటకది బంగారమును జేరునుగదా! అట్లే నా పతినిచూచి పోవుటకే నెంతయో దూరమునుండి వచ్చితిని. నేనెందఱనో నరులను గాంచితిని. సురలను జూచితిని. ప్రియ దర్శనులగు గంధర్వులను రాక్షసులను జూచితిని. వీరెల్లరును నేడు శుంభుని భయమున గడగడలాడుచు చేష్టలుడిగి యున్నారు. ఇట్టివాని గుణములు విని వానిని చూడవచ్చితిని. 

దూతా! నీవదృష్టవంతుడవు. నీవు మహాబలుడగు శుంభుని జేరుము. అతనితో నొంటరిగ తీయగ నా మాటగ నిట్లుపలుకుము: 

నీవు బలశాలురలో మహాబలివి. అందగాండ్రలో నందగాడవు. దాతవు గుణివి శూరుడవు విద్యావిశారదుడవు-నేర్పరివి-కులీనుడవు-మహోగ్రుడవు-సుర విజేతవు. నీవు నీ బలముతో నెల్ల రత్నములు స్వాధీనము చేసికొని యనుభవించు చున్నవాడవు. నేను నీకు దగిన దానను. నాకు పతిగావలయును. నేను స్వయముగ నీ పురికి వచ్చితిని. 

కాని, నా వివాహమునకు కొలదిగ నాటంకము గలదు. నేను నా బాల్యమున నా నెచ్చెలులతో నాడుకొనునాడు బాల్య చాపల్యమున ఆ నాడున్న బలగర్వమున-నాతో సమాన బలముగల శూరుడు నన్ను రణముగ గెల్వవలయును. అపుడు బలాబలము లెఱిగి నేనతనిని వరింపగలను అని వారి ముందేనొక ప్రతిన బూనితిని. 

దానికి నా చెలులు విస్తుపోయిరి. ఇంత క్రూరము నద్భుతమునగు నియమమీమె యేల పూనెనని నా చెలులు నన్ను నవ్విరి. కాన దైత్యపతీ! నీవు నా బల మెఱుగుము. నీ బలముతో నన్ను గెల్చి నా కోర్కి దీర్పుము. నీవుగాని నీ సోదరుడుగాని సమరాంగణమునకు రావచ్చును. నన్నోడించి నన్ను పెండ్లికమ్ము.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...