మహిషాసురుని జన్మవృత్తాంతము
జనమేజయు డిట్లనియెను: ''మహామాయా యేగేశ్వరీ ప్రభావము విపులముగ వచించితివి. ఆ తల్లి యమృతచరిత్రము నాకింకను విన కౌతుహలము గల్గుచున్నది. దయతో వివరింపుము. విశ్వమాతయగు మహాశక్తి విజృంభణముచే నీ చరాచరజగము సృజియింపబడినదని యెఱింగినవాడు దేవీ ప్రభావము వినుట కేల యిచ్చగింపడు? అన
వ్యాసుడిట్లనెను : రాజా! భక్తి శ్రద్ధలు - శాంతిగలవానికి తెలిసినవాడు తనకు తెలిసినది చెప్పవలయును. అట్లు చెప్పనివాడు మందమతి గలవాడగును. కాన తేటతెల్లముగ చెప్పుదును. నిశ్చలముగ వినుము.
పూర్వమీ భూతలమున మహిషాసురుడను రాజుండెను. అతని కాలమున దేవాసురులకు ఘోర యుద్ధము సంఘటిల్లెను. ఆ దానవుడు తన కోర్కి యీడేరుటకు మేరుగిరిపై తీవ్ర తపమొనర్చెను. దానికి వేలుపు లబ్బురపడిరి. ఇట్లతడు నెమ్మదితో పదివేలేండ్లు దేవతను ధ్యానించెను. అంత లోక పితామహుడగు బ్రహ్మ సంతుష్టుడయ్యెను. నలువ రాయంచనెక్కి వచ్చి యో ధర్మాత్మా ! నీ వాంఛిత మీడెర్తును. వరమడుగు'మనెను.
మహిషుడిట్లనెను : ''దేవదేవా! పితామహా! నే నమరత్వము గోరుచున్నాను. కాన నాకు చావుభయము గలుగనట్టు లొనరింపుము?
బ్రహ్మయిట్టనెను : పుట్టిన వానికి చావు - చచ్చినవానికి పుట్టుక నిశ్చయము. ఇవి యెల్ల జీవులకు ధ్రువముగ నెల్ల భంగుల జరుగుచుండును. దానవపుంగవా ! ఈ పర్వతములు - సాగరములు - ప్రాణులు - సర్వము కాలము వచ్చినపుడు పోవలసినదే ! కనుక అమరత్వము దక్క మరొక్కటేదైన నీ మనసులోనిది కోరుకొనుము అన
మహిషు డిట్లనెను: పితామహా ! నాకు దేవ దానవ నరుల వలన చావు గలుగకుండుత! ఆడుది నన్నేమి చేయగలదులే!
కనుక పద్మజా! నాకు స్త్రీ వలన చావుమూడిన మూడనిమ్ము. ఒక యబల నన్నేమి చంపగలదు?
బ్రహ్మ యిట్లనియెను : ''మహిషాసురా! నీకు నరుల వలన చావులేదు. నీ కెప్పుడైన స్త్రీ మూలముననే చావుగల్గును. నీవు చాల అదృష్టవంతుడవు' అని యిట్లు వర మొసంగి బ్రహ్మ తన లోకమున కరిగెను.
బ్రహ్మ యిట్లనియెను : ''మహిషాసురా! నీకు నరుల వలన చావులేదు. నీ కెప్పుడైన స్త్రీ మూలముననే చావుగల్గును. నీవు చాల అదృష్టవంతుడవు' అని యిట్లు వర మొసంగి బ్రహ్మ తన లోకమున కరిగెను.
దానవుడును ముదమంది తన చోటికి తాను వెళ్ళెను. అన విని
రాజిట్లనెను : ''ఆ మహిషుడెవ్వని కొడుకు? అతని జన్మకారణమేమి? అతడు మహిషరూపము దాల్చుటకు కారణమేమి?' అన
వ్యాసుడిట్లనియెను : 'మహారాజా ! పూర్వము భూమండలమందు దనుకుమారులిర్వురు పేరు గాంచిరి. ఒకడు రంభుడు. రెండవవాడు కరంభుడు. వారిరువురకు పుత్త్రసంతానము లేదు. వారు పుత్రార్థము పావనపంచ నదజలములందు పెక్కు లేండ్లు తపమొనర్చిరి. వారిలో కరంభుడు నీట మునిగి తపించుచుండెను. రంభుడొక పెద్ద వటవృక్షము నాశ్రయించి యగ్ని నారాధించుచుండెను.
రంభుడు పంచాగ్నులను సాధించుటలో మునిగియుండెను. అది తెలిసి యింద్రుడు దుఃఖితుడై వారిచెంతకేగెను. ఇంద్రుడు పంచనదమునకేగి మొసలిరూపుదాల్చి కరంభుని పాదములు గట్టిగ పట్టెను. ఇంద్రుడట్లు పట్టి కరంభుని నంతమొందించెను. తన యన్న చావు విని రంభుడు దేవేంద్రునిపై కారాలు మిరియాలు నూరెను.
అతడు క్రోధాతిరేకముతో నెడమచేత తన తలవెంట్రుకలు పట్టుకొని కుడిచేత తల నఱికి యగ్నిలో వేల్చదలచెను. అతడు కుడిచేత కత్తిబూని తన తల తెగవ్రేసికొనబోవునంతలో నగ్ని యతనికి తెలివి గలిగింపవచ్చి యిట్లనియెను :
"ఓరి మూర్ఖదైత్యా ! నీ తల నీవే నఱకుకొనదలతువేమి? ఆత్మహత్య కడు దుస్సాధమైనది. తగనిది. దాని నేల తలపెట్టితివి? ఊరక ఏల ప్రాణములు తీసికొందువు? చచ్చి యేమి సాధింతువు? నీ మదిలోని కోరిక తెల్పుము. వర మడుగుము. నీకు మేలగుత!
అగ్ని పలికిన సుభాషితములు విని రంభుడు చేతిలోని వెండ్రుకలు వదలి యగ్నితో నిట్లు పలికెను:
అగ్ని పలికిన సుభాషితములు విని రంభుడు చేతిలోని వెండ్రుకలు వదలి యగ్నితో నిట్లు పలికెను:
దేవేశా ! నీవు ప్రసన్నుడవైనచో ముల్లోకములు గెలిచి వైరుల మద మడచు కుమారుని నాకు ప్రసాదించుము. అతడు దేవ దానవ మానవుల కజేయుడు - మహావీర్యుడు - కామరూపి - లోకవందితుడు గావలయును అన
అగ్ని యిట్లనియెను : ''నీకు నీవు కోరిన కొడుకు పుట్టగలడు. ఇక చావునుండి విరమించుము. మహాభాగా! నీ మనస్సే ప్రమదయందు తగుల్కొనునో యామెకు బలాధికుడగు కొడుకు పుట్టగలడు' అట్లు తన మది కింపగు పలుకులు విని దానవుడగ్నికి నమస్కరించి అచటి నుండి యక్షులు తిరుగు రమణీయ ప్రదేశము చేరెను.
అట దానవుడు మంచిరూపము గలిగి మత్తతతో నున్న యొక మహిషి యందు తన భావము నిలిపెను. అతడు మరే యువతిని కన్నెత్తియైన చూడలేదు. అతనిని చూడగనే ఆ మహిషి (గేదె) యును సమ్మదమున నతని నెదలో కామించి అతని కడకు వచ్చెను.
అపుడు రంభుడు దైవ ప్రేరణచేత మహిషితో గలిసెను. మహిష యతని వీర్యమున గర్భము దాల్చెను. అతడు తన ప్రియ మహిషి నితర మహిషములనుండి గాపాడుటకు దానిని సుందరమైన పాతాళమునకు తోలుకొనిపోయెను. పిమ్మట నొక మదించిన మహిషము పెల్లుబుకు కామ మద మాపుకొన లేక యా మహిషిపై కురికి వచ్చెను.
అపడు రంభుడు స్వయముగ వచ్చి దానిని చంపుటకు పరిగెత్తుకొనివెళ్ళెను. అతడు తన మహిషిని గాపాడుట కా మహిషమును గొట్టెను. అదియు బాగుగ మదమెక్కి యున్నందున నతనిని వాడి కొమ్ములతో గట్టిగ పొడిచెను. దాని వాడి కొమ్ముల పోట్లు తన గుండెకు తగులగ రంభుడచటనే మూర్ఛితుడే పడి యసువులు పాసెను.
అపుడు మహిషి తన పతి మృతిగని దీనయై భయార్తయై యొక వటవృక్షము చెంతనున్న యక్షులను శరణు వేడెను. అపుడు బలవీర్య మదోద్ధతిచే కామాంధమగు మహిషము మహిషి వెంట దగిలెను.
అపుడు మహిషి తన పతి మృతిగని దీనయై భయార్తయై యొక వటవృక్షము చెంతనున్న యక్షులను శరణు వేడెను. అపుడు బలవీర్య మదోద్ధతిచే కామాంధమగు మహిషము మహిషి వెంట దగిలెను.
అట్లు మహిషము తనమీదకి వచ్చుచుండగ మహిషి దీనముగ నఱచుచుండెను. అట్లు తమ చెంతకు వచ్చు మహిషిని రక్షించుటకు యక్షులు సిద్ధపడిరి. అంత యక్షులకు మహిషమునకు మధ్య పెద్ద పోరాటము సాగెను. వారు దానిని బాణముల గొట్టిరి. అది నేల గఱచెను.
యక్షులు తమ కిష్టుడగు రంభుని మృతదేహము శుద్ధినందుటకు రంభుని శవమును చితిపై నుంచిరి. తన పతి శవము చితిపై నుంటగని మహిషి తన ప్రియునితో నగ్నిలో సహగమనము చేయదలచెను. యక్షులెంతగ నడ్డగించినను వినక సాధ్వియగు మహిషి తన ప్రియునితో జ్వాలలెగయు నగ్నిలో ప్రవేశించెను.
అంత మహిషి గర్భము వెల్వడి చితిమీదినుండి మహాబలుడగు మహిషుడు బయటకు వచ్చెను. రంభుడును పుత్త్రవాత్సల్యమున మరొక రూపు దాల్చి వచ్చెను. ఈ మరొక రూపు దాల్చిన రంభుడు రక్తబీజుడనబరగెను.
మహిషుడు రాక్షసులచేత తమ రాజుగ నభిషిక్తుడయ్యెను. ఇట్లు వీర్యవంతులగు మహిష రక్తబీజులు పుట్టి దేవ దానవ నరుల కవధ్యులైరి.
రాజా! నీకు ఇట్లు మహిషునకు బ్రహ్మ వర ప్రదానము - మహిషాసురుని జన్మము విపులీకరింపబడినవి.
No comments:
Post a Comment