Wednesday, April 15, 2026

Chapter 88 The influence of yogamaya - అధ్యాయము 88 యోగమాయా ప్రభావము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 88

యోగమాయా ప్రభావము

ఋషు లిట్లనిరి: 'ఓ సూత మహర్షీ! శ్రీకృష్ణ పరమాత్ముని చరితార్థమైన చరిత్రము దివ్యము. సర్వపాపహరము. అట్టి మహాఖ్యానమును మాకు వినిపించితివి. వాసుదేవుని కథను సంక్షేపముగ చెప్పుటవలన దానినిగూర్చి మాలో పెక్కు సందేహములు గలుగుచున్నవి. 

వాసుదేవుడు శ్రీవిష్ణు నంశావతారము గదా! అతడును పరమశివు నారాధించి తన మాచరించెను. పార్వతి-పరాప్రకృతి-జగన్మాత-యగు శ్రీదేవీయొక్క యంశావతారమగు పార్వతియును కృష్ణునకు పెక్కు వరము లొసగెను. శ్రీకృష్ణుడీశ్వరుడు గదా! అతడు వారి నేల పూజించెను? దీనిచే కృష్ణుడు పార్వతీపరమేశ్వరుల కంటె నల్పుడను శంక మాకు గల్గుచున్నది.' అన విని 

సూతు డిట్లనెను: మహాశయులారా! మీ రడిగిన ప్రశ్నకు సమాధానమగు కారణమును నేను వ్యాసునివలన వింటిని. మహోజ్జ్వలము గుణభరితము నగు శ్రీకృష్ణుని గాథ వినిపింతును. శ్రద్ధగ వినుడు. మీకు గల్గిన సందేహము మేధావియగు జనమేజయునకును గల్గెను. 

అతడు వ్యాసు నిట్లు ప్రశ్నించెను: సత్యవతీ తనయా! నీ వలన శ్రీదేవీ తత్త్వమహత్త్వ మెంత వినినను నా మది సందియము వదలుట లేదు. దేవదేవుడు విష్ణువునగు కృష్ణుడు శంభు నారాధించెననుట నాకు వింత గలిగించుచున్నది. సర్వభూతాత్మకుడు సర్వసిద్ధిప్రదుడు సర్వేశ్వరుడు నైన శ్రీహరి సామాన్య మానవునివలె దారుణ తప మేల యొనరించెను? శ్రీకృష్ణుడీ జగములను రచించి పెంచి సంహరింప నమర్థుడు. అంతటి వానికి కఠిన తప మేల చేయవలసివచ్చెను? అన 

వ్యాసుడిట్లనియెను: రాజా! నిజము పలికితివి. వాసుదేవుడు సర్వకార్యదక్షుడు - దానవాంతకుడు - జనార్దనుడు - నిజమే. ఐనను మానవుడగుట వలన నా పరమేశ్వరుడును వర్ణాశ్రమ ధర్మసమ్మతమైన మానవ భావములు గలిగియుండెను.

గురు పాదాభివందనము-వృద్ధసేవ-విప్రపూజ-దేవతారాధనము-ఇతరుల హర్షశోకములకు హర్షశోకములకు హర్షశోకము లొందుట-దైన్యము-అపరాదము-యువతులతోడి రతిక్రీడలు-కామక్రోధలోభ గుణములు అనునవి ప్రతి దేహికి ప్రతికాలమున ప్రతిచోట గలుగుచుండును. 

ఇక నిర్గుణత్వ మెట్లు గలుగును? గాంధారీ శాప విప్రశాపములు కారణముగ యాదవుల చావు - కృష్ణుడు తనువు చాలించుట - దోపిడిగాండ్రు వారివారి భార్యల నపహరించి దోచుకొనుట - అర్జునుడు బాణములు వదలుట - అతడు నిర్వీర్యత జెందుట - ద్వారకనుండి ప్రద్యుమ్నానిరుద్ధు లపహరింపబడినను తెలియకపోవుట మున్నగు పనులన్నియును నరులకు గలుగు సామాన్య వ్యవహారములే కదా! 

శ్రీవిష్ణు నంశమువలన నారాయణ మహర్షి - యతని యంశమువలన వాసుదేవుడు నుద్భవించిరి. అట్లు పుట్టినవాడు శివుని సేవించుటలో వింత యేమున్నది? సర్వేశ్వరుడగు శివుడు సుషుప్తి స్థానమున కధిష్ఠాత. 

కనుక శివుడు విష్ణునకు కారణభూతుడై యతనిచేత పూజ లందుకొనెను. రాముడు కృష్ణుడు మొదలుగాగల యవతారములు విష్ణుని యంశములు. మఱి వారు శివు నేల పూజించరాదు? అకారము బ్రహ్మ. ఉకారము విష్ణువు. మకారము రుద్రుడు. మహేశ్వరి అర్ధమాత్ర. కనుక నుత్తరోత్తరముగ నొకరి కన్న నొక రుత్తమోత్తములని బుధోత్తము లందురు. 

అర్ధమాత్ర యెవరి చేతను నుచ్చరింప బడదు. 

కాన నిత్యమైనది. కావున సర్వ శాస్త్రములందు శ్రీదేవి సర్వోత్తమురాలైనది. బ్రహ్మకంటె విష్ణువు విష్ణునికంటె రుద్రుడు నధికుడు. కనుక కృష్ణుడు శివుని పూజించుటలో నెట్టి సంశయమును పెట్టుకొనరాదు. 

బ్రహ్మ ముఖమునుండి సదాశివుని కోరికపై రుద్రాంశమున మరొక రుద్రుడావిర్భవించి వరము లొసగును. ఆత్మ స్వరూపిణి యగు దేవి సాన్నిధ్యపు ప్రభావమున రెండవ రుద్రునకు శ్రేష్ఠత్వము పూజ్యత్వము లభించినవి. ఇంక మూలరుద్రునడుగు వారెవరు?

ఇట్టి యోగమాయా ప్రభావ విశేషమున యుగయుగమున విష్ణు నవతారములు గలుగు చుండును. ఇందు సందియము లేనేలేదు. ఆ విశ్వజనని తాను కనురెప్ప తెరచినంత మాత్రమున ప్రచ్ఛన్న రూపమున నీ బ్రహ్మాండములనెల్ల సృజించి పెంచి సమయింప గలదు. 

ఆ తల్లియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పెక్కులవతారములు దాల్పజేసి వారికి శ్రమ గలిగించును. ఆ దేవి కృష్ణుని పురిటింటినుండి గొల్లపల్లెలో నందగోపాలు నింటనుంచునట్లు చేసినది. 

ఆ తల్లి యతనిని కంసవధకొఱకు ద్వారక కంపినది. కృష్ణునకు జరాసంధుని భీతి గలుగగా నతనిని ద్వారక కంపినది. 

జగన్మాతయగు దేవి స్వకళాంశజలగు నెనమండుగురు రమణులకు పదారువేల ఏబదిమంది యువతులను సృజియించి వారియందఱియందు కృష్ణుడు విలాస వంతుడై దక్షుడై యుండునట్లు నతడు తనకు దాసుడుగ నుండునట్లును కల్పించెను. 

ఒక్క యువతి తన యినుప సంకెళ్ల వంటిమాయలతో పురుషుని బంధించి వేయును. ఇంక పదారువేల ఏబదిమంది కామినులు హరిని పెంపుడు చిలుక పగిదిబంధించి రనుటలో నచ్చెరు వేమున్నది? 

కృష్ణుడు సత్యభామకు సమ్మదమున లోబడెను. అతడు స్వర్గమేగి యింద్రునితో బోరి సంతాన తరువు గొనితెచ్చి తన ప్రియురాలి యింటి కలంకారముగ నందగింప జేసెను. కృష్ణుడు నిఖిఃల ధర్మ సంస్థాపన పరుడు. అతడు శిశుపాలాదులను జయించి భీష్మకసుతయగు రుక్మిణిని తన వీర్యబలమున గైకొని తన ధర్మపత్నిగ జేసికొనెను. 

ఇంక పరదారాపహరణమునగల్గు పాపమెక్కడ నున్నది? దురహంకారము నరుని పతితుని జేయును. అట్టి యహంకార జాలమున జిక్కి మూఢుడు శుభా శుభము లొనర్చుచుండును. మూల సహజ ప్రకృతినుండి హరి హర హిరణ్యగర్భు లుద్భవించిరి. 

తామసాహంకారము నుండి చరాచరజగ ముప్పతిల్లెను. బ్రహ్మ తన యహంకారమును విడనాడిన ముక్తుడగును. అతడహంకారమయుడైనపుడు విశ్వరచన వెలయించును. అటులే జీవు డహంకారము విడిచిన ముక్తుడగును. అహంకారవశుడైన బద్ధుడగును. ధనము గృహము భార్య పుత్రులు సోదరులు - వీరు ప్రాణులకు బంధన కారకులు గారు. 

ప్రాణి కహంకారమే బంధనకారణము - దురహంకారము మూలమున నేను కర్తను, ఈ పని నా బలమున సాధ్యమైనది, నేను చేతును చేయగలనని ప్రాణి స్వయముగ నహంకృతిచే బద్ధుడగును. కారణములేక కార్యమెన్నడును జరుగదుగదా! మట్టిలేనిచో ఘటములేదు. 

కనుక నహంకారముతోగూడి హరి విశ్వపాలన జరుపును.

నరుడహంకార బద్ధుడై పలువంతలకు గురియగును. అట్టి యహంకారమును విడువగల్గిన వాడు దేనికిని చింతింపడు. అహంకారము నుండి మోహము - దాని నుండి సంసారము - గలుగుచుండును. అట్లుగానిచో సదాశయుడగు హరి యవతార ప్రవాహములలో నేల మునుగును? 

కనుక నహంకారము లేనివారికి మోహములేదు. సంసారములేదు. పురుషుడు సత్వరజస్తమో గుణములనుబట్టి ముత్తెఱంగులుగ నుండును. ఈ త్రిగుణములును బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను త్రిమూర్తులయందును గలపు. ఈ యహంకార నిజరూపమును గూర్చి తత్త్వవిదులైన మునులు చెప్పగలరు. 

త్రిమూర్తులు మువ్వురు నిస్సంశయముగ నహంకారబద్ధులే. విష్ణువు స్వేచ్ఛగ పెక్కవతారము లెత్తునని మాయామోహితుడైన మందుడనును. జడుడు సైతము దుఃఖములకు నెలవగు గర్భవాసము కోరుకొనడు. ఇంక నన్నియు తెలిసిన చక్రి గర్భవాసమేల కోరుకొనును? 

మధుసూదనుడు - దేవకీ కౌసల్యల మలమూత్ర దూషితములగు గర్భములందు తన యిచ్ఛానుసారము చేరెనని కొందఱందరు. అల వైకుంఠ నివాస సౌఖ్యము త్రోసిరాజని పెక్కు చింతలకు వంతలకు సంతయై విషయమువంటి గర్భవాసమును హరి యే సుఖమాశించి కోరుకొనును? 

లోకులు దుఃఖ భూయిష్ఠమగు గర్భవాస నరకమును మరల బడయకుండుటకు యజ్ఞ దాన తపము లాచిరంతురు. భగవంతుడైన విష్ణువును స్వతంత్రుడుగాడు. జనార్దనుడు స్వతంత్రుడైనచో గర్భవాస మేల వాంఛించును? ఈ బ్రహ్మాది స్తంబ పర్యంతమగు జగము దేవ - నరతిర్యక్కులతో నిండినది. 

ఇట్టి జగము యోగమాయకు వశమై యుండునని యెఱుంగుము. కావుననే హరిహర బ్రహ్మాదులా మాయాతంత్రములచే బద్ధులై సాలెపురుగులవలె లీలగ క్రీడించు చుందురు.

అధ్యాయము 89 మహిషాసురుని జన్మవృత్తాంతము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...