Wednesday, April 15, 2026

Chapter 90 Mahishasura's pride in his boons - అధ్యాయము 90 మహిషాసురుడు వరగర్వితుడగుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 90

మహిషాసురుడు వరగర్వితుడగుట

ఆ మహిషాసురుడు వరగర్వమున బలశాలియై రాజ్యము బడసి జగ మంతటిని తన చేతిలో నుంచుకొనెను. తన కెదురాడు వైరులు లేనందున సాగరాంతమగు భూమండలమంతయు నత డేకచ్ఛత్రాధిపతిగ పాలించెను. 

అతనికి మహామదవీర్యుడగు చిక్షురుడు సేనాపతి. అయుత సైన్యముగల తామ్రుడు కోశాధిపతి. అసిలోముడు ఉదర్కుడు బిడాలుడు బాష్కలుడు త్రినేత్రుడు బలదర్పితుడగు కాలబంధకుడు మున్నగు దానవులు మిగుల సర్వసమృద్ధులై తమ సేనలతో సాగరమేఖలయగు నేల నంతయు నాక్రమించిరి. 

వీరు వెనుకటి రాజులచే నందఱిని కప్పము గట్టునట్లు చేసిరి. తమ్మెదిర్చిన బలశాలురను రూపుమాపిరి. మహిషుని రాజ్యమందలి విప్రులెల్ల రతనికి వశులై యాగభాగము లర్పించిరి. మహిషుడు వరదానగర్వమున తన రాజ్యము నేకాతపత్రముగ నొనరించుకొని జయించుటకు పూనుకొనెను. 

ఆ దైత్యరాజు దేవేంద్రుని చెంతకు దూత నంపదలచి యొక సందేశహరుని బిలిచి యతని కిట్లనియెను : 

'వీరా ! నీవు నాకు దూతవగుము. నీవు జంకుకొంకులు లేక దేవతల సన్నిధి కేగి యింద్రునితో నిట్లు చెప్పుము

ఓ సహస్రాసాక్షా! ఇక స్వర్గము వీడుము. నీ నచ్చినచోటి కేగుము. లేక మహాత్ముడగు మహిషుని సేవింపుము. అతడు మహారాజు. శరణాగతుల కాశ్రయదాత. నీవతనిని శరణు వేడుము. కాదేని బలసూదనా! వజ్రముదాల్చి రణమున కాయత్తుపడుము. నీవు మా పూర్వుల చేతిలో నోటమి బొందితివి. నీ బలము నాకు తెలియనిది కాదు! 

అహల్యాజారుడవగు నీ బలము నాకు తెలియనిదా! నన్ను (మహిషుని) మార్కొనుము. కానిచో నీ యిచ్చమెచ్చుచోటికేగుము'. అని మహిషుడంపిన దూత మాటలు విని యింద్రుడు కుపితుడై దూతకిట్లనియెను : 

''ఓరీ మందమతీ! నీవు మదదర్పమున కన్నుగానకున్నావు. నీ వేగుము. శిష్టులు దూతను చంపరు. కాన నిన్ను విడిచిపెట్టితిని. అతని ముందు నా మాటలుగ నిట్లు పలుకుము. 

'ఓ మహిషీసుతా ! నీకు పోరాట మిష్టమైన త్వరగ రమ్ము. ఓరీ దున్నపోతా ! గడ్డి కఱచువాడవు. జడాకృతివి. నీ బలిమి నాకును తెలియును. నీ కొమ్ములు పట్టి విల్లుచేసి గట్టిగ నాడింతును. నీ కొమ్ములు చూచుకొని నీ వింతగ మిట్టి పడుచున్నావు. నీ బలకారణము తెలిసినది. ఇపుడే నీ కొమ్ములు గోసి నీ బలము మట్టుపెట్టుదును. 

మహిషాధమా! నీవు కొమ్ముల బలమున నింత బలదర్పితుడవైతివి. నీ కొమ్ములు కోసివేతును. నీకు కొమ్ములతో పొడుచుట మాత్రము తెలియును. యుద్ధ మేమి తెలియును.'

అను సురేంద్రుని వచనములు విని దూత వేగిరమే మహిషుని జేరి మ్రొక్కి యతని కిట్లనెను : 

'దేవా ! అట నింద్రుడు సేనలతో కొలువుండి తన బలమునే చెప్పుకొనెను కాని, నిన్ను లెక్కించుట లేదు. ఆ మూర్ఖుడు పల్కిన పల్కులు నేనెట్లు పల్కగలను? దూత తన ప్రభుని ముందు సత్యము ప్రియము నగు పలుకులు పలుకవలయును. రాజు మేలుగోరుదూత రాజుముందు శుభకరముగ ప్రియముగ పలుకుట నీతి యందురు. నీకు తృప్తి గలుగునట్లు పలికిన గాని నీ పని నెర వేరదు. 

శుభము గోరువా డెపుడును పరుషముగ బలుకరాదు. పగతుని నోట వెలువడిన విషము వంటి మాట లొక నమ్మినబంటు నోటి కెట్లు వచ్చును? ఆతని నోట పలుకబడిన పలుకులు నా నోటికి రాకున్నవి అను హేతుగర్భితములైన మాటలు విని గడ్డి కఱచు మహిషుడు కోపించెను. 

అపుడు మహిషుడు తోక లేపి యాడించుచు మూత్రించుచు గ్రుడ్లెఱ్ఱచేయుచు తన దైత్యులను బిలిచి యిట్లనెను: 

'దైత్యులారా! ఇంద్రుడు యుద్ధసన్నద్ధుడయ్యెను. మీరు మీ మీ బలములు సమకూర్చుకొనుడు. ఆ సురాధము నోడింపవలయును. నా ముందు నిలువబడు వీరు డెవ్వడు? కోట్ల కొలది యింద్రులు వచ్చినను నేను వెనకంజ వేయను. నే నింద్రుని నేడే పరిమార్తును. 

అతడు శాంత తాపసుల యెడల శూరుడు - బలశాలి - మోసగాడు - లంపటుడు - పరదారల దగులువాడు. ఖలుడు - పాపి - రంధ్రాన్వేషి - అచ్చరల యందము చూచుకొని మత్తిల్లువాడు. విశ్వాసఘాతకుడు. తపము చెఱచువాడు. మున్నతుడు సముచికి భయపడి పెక్కు బాసలు సేసి యతనితో సంధి చేసికొనెను. పిమ్మట కపటముగ నతనిని జంపెను. 

విష్ణువు సైతము కపటాచార్యుడు శపథాకరుడు టక్కరి మాయలమారి బహురూపములవాడు గర్వ పండితుడు. కావుననే విష్ణువు వరాహరూపమున హిరణ్యాక్షుని - నృసింహరూపమున హిరణ్యకశిపుని దునుమాడెను.

దనుజులారా! నే నా మరి కేనాటికిని వశుడగాను. ఆ దేవతలనుగూడ నేను నమ్మనే నమ్మను. నన్ను రణాంగణమున రుద్రుడు సైత మెదిరించలేడే! ఇంకింద్రవిష్ణులు నన్నేమి చేయగలరు? నే నింద్రాగ్ని యమ వరుణ కుబేరులను సూర్య చంద్రులను గెలిచి స్వర్గము గైకొనగలను. 

దానవుల మెల్లరము కలిసి దేవతలను గెలిచి యజ్ఞభాగములుగొని సోమపానము చేయుచు విహరింతము. నాకు బ్రహ్మ యిచ్చిన వరలాభము గలదు. దానివలన నాకు దేవమనుజులవలన భీతిలేదు. ఇంక నాడుది నన్నేమి చేయగలదు? పాతాళపర్వతములనుండి ప్రముఖ దానవవీరులను పిలిపించి సేనాపతులుగ నియమింపుడు. 

ఎల్ల దేవతలను నే నొక్కడనే జయింపగలను. మిమ్ము వినోదమునకు బవరమునకు వెంటగొనిపోదును. బ్రహ్మవర ప్రభావమున నాకు దేవతల భయము లేదు. వారిని నా వాడికొమ్ములతో గిట్టలతో నంతమొందింతును. నేను సురాసుర నరులచే చంపబడను. కాన స్వర్గ విజయమున కాయత్తపడుడు. 

మనము సురాలయము గెలిచి మందారమాలలు దాల్చి యచ్చరలతో నందనవనములందు క్రీడింతము. కామధేనువు పాలుగ్రోలి యమృతము త్రావి దేవగంధర్వుల నృత్యగీతములతో ముదమందుదము. ఊర్వశి-రంభ- మేనక-ఘృతాచి-తిలోత్తమ-ప్రమద్వర-మహాసేన - మిశ్రకేశి - మదోత్కట - విప్రచిత్తి మున్నగు నృత్యలాస్యగీత విశారదలు మధుర మద్యపానాదులతో మనలను రంజింపజేయుదురు. 

మీ కిష్టమేని ఇదొక వినోదకార్యముగ నెంచి సురలతో బోర సిద్ధపడుడు. మన సంరక్షణకొఱకు శుక్రాచార్యుని బిలిచి ఆతని పూజించి యతనిని యజ్ఞకార్యమున నియోగింపుడు. 

జనమేజయ రాజా! ఆ పాపమతియగు మహిషు డిట్లు దానవుల కాదేశించి ముదముతో తన యింటి కేగెను.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...