Wednesday, April 15, 2026

Chapter 91 Guru's advice to Indra - అధ్యాయము 91 ఇంద్రునకు గురుని హితబోధ

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 91

ఇంద్రునకు గురుని హితబోధ

మహిషుని దూత వెడలిన మీదట నింద్రుడు యమ వాయు వరుణ కుబేరులను పిలిపించి వారికిట్లనెను : 

సురలారా! రంభుని సుతుడు మహిషుడు. అతడు మహాబలశాలి. వరగర్వమున మత్తుడు. పెక్కు మాయలు పన్నుటలో నేర్పరి. అతడు స్వర్గమును గోరి యొక దూత నంపెను. ఆ దూత యిప్పుడే నా చెంతకు వచ్చి యిట్లు పలికెను: 

'యింద్రా! స్వర్గము వదలి నీ కిష్టమైన చోటికేగుము. లేక మహాత్ముడగు మహిషుని సేవ లొనరింపుము. నీ వతనికి భృత్యుడవైనచో నిన్నతడు కోపింపక దయతో వదలిపెట్టి నీకు తగిన వృత్తి యేర్పరచగలడు. కానిచో బవరమునకు సేన నాయత్త పఱచుకొనుము. నేను వెడలిన వెంటనే దైత్యపతి యుద్ధసన్నద్ధుడై రాగలడు అని యిట్లు పలికి దానవ దూత యేగెను. 

కాన నిక మన కర్తవ్య మేమో యోజింపుడు. తన వైరి యెంత దుర్బలుడైనను బలశాలి వానిని వదలిపెట్టరాదు. ఇపుడా దైత్యుడు బలగర్వితుడు. పొగరుబోతు. అతడు ప్రయత్నశీలుడైన నిక చెప్పెడి దేమున్నది? ప్రతివాడును తన బుద్ధి బలముల ననుసరించి ప్రయత్నమొనరింప వలయును. 

జయాపజయములు దైవా ధీనములు గద! ఖలునితో సంధి యే నాటికిని దగదు. అది నిరర్థకము. సాధు వన్ని విధములుగ చక్కగ విచారించి పనికి బూనుకొనవలయును. మనమిపుడు తొందఱపడి యుద్ధయాత్రకు సాగగూడదు. శీఘ్రగాములు - సుప్రవేశకులు - ఇంగితజ్ఞులు - నిస్సంగులు - సత్యవాదులు నగు చారుల పంపి శత్రుసేనల సంఖ్యాబలము నెఱుగ వలయును. 

అటులే సేనలలోని వీరుల యావత్‌ బలాబలము లెఱుగ వలయును. ఆ పిదప యుద్ధభేరి మ్రోగింతము లేక యేదేని దుర్గములో తలదాచుకొందము. బుద్ధి శాలియైనవాడు చక్కగ విచారించి కాని యే పనియైన చేయడు. తొందఱ పడి చేసిన పని దుఃఖములు కలిగించును.

కాన తెలిసిన వాడాలోచించి చేయవలయును. దానవు లిపుడు ఐకమత్యముతో నున్నారు. వారిలో నిపుడు భేదము కలిగింప వీలుపడదు. కావున చారులేగి వారి బలాబలము లెఱిగి రావలయును. పిదప విజ్ఞులతో యథావిధిగ కార్యమాలోచించి చేయుదము. ఇట్లు చేయనిచో మన పని విపరీతఫలము లొసగును. అపుడు మన పని శాస్త్రమెఱుగని వైద్యుడిచ్చిన ఔషధమువలె నుండును. 

ఇట్లు దేవత లెల్ల రాలోచించుకొని కార్యకుశలుడగు చారుని బలిచిరి. ఇంద్రు డతనిని రహస్యము లెఱిగి రమ్మని పంపెను. దూత వేగిరమేగి తిరిగి వచ్చెను. అతడు శత్రుసేనల బలాబలములు తెలిపెను. మహిషుని బలము ప్రయత్నము విని యింద్రుడు విస్మయమందెను. అతడు దేవతలను పోరునకు సంసిద్ధులుగ నుండుడని ప్రేరించెను. 

మంత్రవిదుడు ఆంగిరసవరుడు గురుడునగు బృహస్పతి వరాసనమున నుండగ నింద్రు డేతెంచి యతనితో నిట్లనెను: 

'దేవగురూ! మా కిపుడు కర్తవ్య ముపదేశింపుము. నీవు సర్వజ్ఞుడవు. ఇప్పటి మా యీ పనిలో నీవే మాకు దిక్కు. మహిషుడను దానవుడు మహావీర్యుడు నుమత్తుడు. అతడు దానవులను వెంటగొని పోరుటకు రానున్నాడు. నీవు మంత్ర విదుడవు. కాన దానికి ప్రతిక్రియ నాలోచింపుము. శుక్రు డసురులకు విఘ్నహరుడు. నీవును మా కటులే విఘ్నహరుడవు అను మాటలువిని గురుడు కార్యసాధన తత్పరుడై బాగుగ నాలోచించి ఇంద్రునితో నిట్లనెను:

గురుడు నిట్లనియెను: ''ఇంద్రా! స్వస్థుడవు గమ్ము. ధైర్య మూనుము. ఆపదలందు ధైర్యగుణ మావశ్యకము జయాపజయములు దైవాధీనములు. కానున్నది కాకమానదు. దీని నెఱిగి ధీశాలి ధైర్యముగ నుండవలయును. ప్రతివాడును తన శక్తికి తగినట్లు ప్రయత్నము చేయవలయును. 

మునులు సైతము బంధమోచనమునకు యత్న మొనరింతురు. వారు సర్వము దైవాధీనమని యెఱిగి ధ్యానయోగ మొనరింతురు. 

కనుక శాస్త్రము ననుసరించి యత్నింపవలయును. సుఖము గలిగినను గులగకున్నను దైవమును నిందింపరాదు. ఒకవేళ కుంటి - గ్రుడ్డివారలకు గలిగినట్లు పురుష ప్రయత్నము లేకయే పని నెరవేరవచ్చును. అట్లు సిద్ధి చేకూరినను దానికి సంతసింపరాదు. 

ఒకప్పుడు పురుష కారమున ఫలము సిద్ధింపక పోవచ్చును. ఐనను దానిని దూషింపరాదు. ఏలయన, కార్యఫలములు దైవాధీనములు. కనుక నెపుడైన కేవలము సైన్యముచేతగాని మంత్రములతోగాని మంత్రణములచేతగాని పని సాధ్యము కాదు. రథములతో ఆయుధములతోనే పనియు నెరవేరదు. కేవలము దైవాధీనముగనే కార్యసిద్ధి జరుగును. 

ఒక్కొక్కప్పుడు బలశాలియును దుఃఖములందును. బలహీనుడును సుఖములందును. ధీశాలియు వ్యాకులపాటు చెందును. బుద్ధిహీనుడును సుఖభోగియగును. పిరికివాడు జయమందవచ్చును. శూరు డపజయమందవచ్చును. ఈ విశ్వమంతయును దైవాధీనము. దీనికి శోకింప నేటికి? 

భవితవ్యము ప్రాణిని తప్పక యత్నమునకు ప్రేరించును. ఈ పని సుఖప్రదమా దుఃఖదమా యని విచారింప దగదు. నరులు దుఃఖములందు దుఃఖాధిక స్థితులను గాంతురు. సుఖములందు మిక్కిలి సుఖము లందుదురు. ఎట్టివాడును హర్షశోకములకు వశుడై తన్ను శత్రువుల కర్పించుకొన దగదు - పండితుడు హర్షశోకములందు ధైర్యముతో నుండవలయును. అధైర్యమందు దుఃఖము గల్గును. ధైర్యమందు దుఃఖము గలుగదు. కనుక సుఖదుఃఖముల యెడల తాలిమి వహింపవలయును.

హర్షశోకములందు బుద్ధి నిశ్చలముగ నుండవలయును. ఈ దుఃఖ మేమి? ఇది ఎవరికి గలుగును? వేను నిర్గుణుడను. అవ్యయుడను. చతుర్వింశతి తత్వముల కతీతుడను. ఇట్టి నాకు సుఖదుఃఖము లెక్కడివి? ఆకలిదప్పులు ప్రాణమునకు గలుగును. శోకమూర్ఛలు మనస్సునకు గల్గును. జరామృత్యువులు దేహమునకు కలుగును. 

నే నీ యారు వ్యాధులు లేనివాడను. చిదానందరూపశివుడను. శోకమోహములు శరీర గుణములు. ఇంక నాకు వీని చింత యేల? నే నీ శరీరమను గాను. నాకు దీనితో నెట్టి సంబంధమును లేదు. నే నష్టప్రకృతులకంటె పదారువికృతులకంటె భిన్నుడను. కాన, నేను సుఃని-నిత్యానందరసఘనమను. నేను ప్రకృతినిగాను - వికృతిగాను. ఇక నాకు దుఃఖ మేల గలుగును? 

అని నెమ్మది దలచి నిర్మముడవు గమ్ము. దుఃఖనాశమునకు ముఖ్యమగు నుపాయము వినుము. నిర్మమత్వమున సుఖము గల్గును. ఈ లోకమందు సంతోషము కంటె వేరగు సుఖస్థానము లేదు. నీకు మమతానాశము వలన జ్ఞానము గలుగును. కానిచో భవితవ్యమందు నిశ్చయము గలిగి యుండుము. ప్రారబ్ధ కర్మము లేవియు ననుభవింపక నశింపవు. ఏది జరుగవలయునో యది జరిగితీరును. నీకు సురబల ముండుగాక! బుద్ధిబలముండుగాక! ఇక సుఖదుఃఖముల గూర్చి నీకు చింతయేల? 

నరులకు పుణ్యములు నశించుట కొఱకు సుఖభోగములు గలుగును. అటులే వారికి పాపములు నశించుటకు దుఃఖములు గల్గును. కనుక తన పుణ్యములు నశించినందులకు బుధుడు ముదమందవలయును. ఇపుడు చక్కగా నాలోచించి యథావిధిగ ప్రయత్న మొనరింపుము. ఆలోచించి ప్రయత్నించినచో పిమ్మట కాదగినది కాగలదు.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...