Wednesday, April 15, 2026

Chapter 92 Indra fights with Mahisha's army - అధ్యాయము 92 ఇంద్రుడు మహిషుని సేనలతో బోరుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 92

ఇంద్రుడు మహిషుని సేనలతో బోరుట

గురుని మాటలు విని యింద్రు డతనికి మరల నిట్లనెను : ''నేనా మహిషు నాశనమునకు యుద్ధప్రయత్న మొనర్తును. ప్రయత్నము చేయనిచో రాజ్యముగాని సుఖముగాని యశముగాని యేదియు లభింపదు. పిరికివారు ప్రయత్నము లేకుండుటే మంచిదని తలతురు. 

కాని ప్రయత్నశీలు రట్లు దలపరు. యతులకు జ్ఞానమును ద్విజులకు సంతోషమును సంపదలు గోరువారికి శత్రు హనన ప్రయత్నమును భూషణములు. 

మునీశా! మునుపు ప్రయత్నించి వృత్ర నముచి బలాసురులను వధించినట్టు లిపుడే మహిషుని అంతమొందింతును. నాకు దేవగురువగు నీవు బలము; వజ్రాయుధము బలము. హరిహరులు నాకు గొప్ప సహాయకులు. నా పరువు దక్కించుము. రక్షోఘ్న మంత్రములు పఠించుము. నే నిపుడే నా సేన గూర్చుకొని మహిషునితో బోర నుద్యమింతును. అను నింద్రుని మాటలు విని చిరునగవుతో బృహస్పతి యుద్ధకాంక్షియగు నింద్రున కిట్లనియెను : 

'పోరుచున్న వాని జయాపజయములు నిర్ణయింపలేము. కనుక నిన్నిపుడు యుద్ధమునకు బొమ్మనను; వద్దనను. జరుగవలసినది జరిగితీరును. దానిలో నీ దోషము లేదు. సుఖమో దుఃఖమో తప్పక సంభవించును. ముందు జరుగబోవు సుఖదుఃఖముల పరిజ్ఞానము నాకు లేదు. మునుపు నా భార్య యపహరింపబడగా నేను పడిన పాట్లెన్నియో నీ వెఱుగుదువుగదా! 

పూర్వము చంద్రుడు నా పత్ని నపహరించెను. అపుడు నేనెంతయో శ్రమపడితిని; వెతలపాలయితిని. సుఖములు కోల్పోతిని. లోకములందు బృహస్పతి బుద్ధిశాలి యన వాసికెక్కితిని. నా భార్యను మరొకడు బలిమిమీర హరించినపుడు నా బుద్ధి యేమయ్యెను? 

కనుక ప్రజ్ఞావంతు డుపాయమునకు యత్నింపవలయును. కార్యసిద్ధి యొప్పుడేని దైవాధీనమే.

గురుని సత్యవచనము లాలకించి యింద్రుడు బ్రహ్మను శరణు చొచ్చి యతని కిట్లనియెను: 

'పితామహా! మహిషాసురుడు స్వర్గకామి. అతడు స్వర్గము బొందుటకు తగిన ప్రయత్నములు చేయుచున్నాడు. రణకోవిదులును వీర్యవంతులు నగు దానవులు రణమున నతని కండగ నున్నారు. అందువలన నేను జంకి మీ సన్నిధి కేతెంచితిని. మీరు సర్వజ్ఞులు - ప్రాజ్ఞులు. సాహాయ్య మొనరింప దక్షులు' అన 

బ్రహ్మ యిట్లనెను: 'ఇపుడు మన మందఱమును కైలాస మేగుదము. అటనుండి శివుని సైతము వెంటగొని మహాసత్త్వుడగు హరి సన్నిధి కేగుదము. అచట దేవతలను గూడి దేశకాల పరిస్థితులాలోచించి పిమ్మట యుద్ధము చేయుట మంచిది. ఎదుటి బలాబలము లెఱుగక వివేకము గోల్పోయి దుస్సాహసముతో కార్యము చేయువాడు పతనము జెందును.'' 

అపుడింద్రుడు లోకపాలురతోకూడి బ్రహ్మ ముందు నడుపగ కైలాసగిరి కేగెను. అట వారు మహేశ్వరుడగు శంకరుని వేదమంత్రములతో ప్రస్తుతించి వరగర్వితుడగు మహిషుని భయమున నిచటికి వచ్చితిమనిరి. హరి దేవతల భయకారణము విని యిపుడు యుద్ధము చేయుదము, ఆ దుర్జయుని హతమార్చుదము అని వారితో ననెను. ఇట్లు నిశ్చయించుకొని బ్రహ్మ విష్ణువు శివుడు సురలు తమ తమ వాహనము లెక్కి తరలిరి. 

బ్రహ్మ రాయంచ నెక్కెను. విష్ణువు గరుడు నెక్కెను. శంభుడు వృషభ మెక్కెను. ఇంద్రు డైరావతము నెక్కెను. కుమారస్వామి మయూరవాహనుడయ్యెను. యముడు మహిషముపై నెక్కెను. సురసైన్యముతోడు నడువ ఇట్లు వారు రణమునకు తరలిరి.

అపుడు మహిషుని వశమందున్న దానవబలము గర్వించి వారి నెదుర్కొనెను. అంత దేవదానవులకు ఘోర సంగ్రామము జరిగెను. వారు బాణ-ఖడ్గ-ప్రాస-ముసల-పరశు-గదా-పట్టిస-శూల-చక్ర-శక్తి-తోమర-ముద్గర-భిందిపాల హలములతో నితర వివిధాస్త్రములతో పరస్పరము దారుణముగ రణ మొనర్చిరి. 

అందు మహిషుని సేనాని చిక్షురుడు గజమెక్కి యైదు బాణములతో నింద్రుని ప్రహరించెను. ఇంద్రుడును త్వరితగతితో వానిని ఛేదించి యర్ధచంద్ర బాణముతో నతని ఱొమ్ముపై ప్రహరించెను. చిక్షురుడు బాణాహతుడై గజముపై మూర్ఛిల్లెను. అపుడింద్రుడు దానవు నేనుగు తొండముపై వజ్రఘాత మొనర్చెను. ఆ వజ్రఘాతమునకు గజము భగ్నమయ్యెను. సైన్యము పారిపోయెను. 

అదిగని దానవపతి బిడాలుడను వానిని గని యతనితో నీవు వరుడవు. బలశాలివి. నీవు వెళ్లి మదగర్వితుడగు నింద్రుని చంపుము. పిదప వరుణాది దేవతలను తుదముట్టించి నా చెంతకురమ్ము' అనెను. ఆ మాటలు విని బిడాల దానవుడొక మత్త గజమునెక్కి యింద్రుని సమీపించెను. 

ఇంద్రుడు బిడాలుని గాంచి రోషముతో విషమువంటి విశిఖము లతనిపై బఱపెను. అతడు వానినెల్ల తన ములుకులతో దునిమి మరల నైదువందల వాడి బాణములతో నింద్రుని నొప్పించెను. ఇంద్రుడు సైతము వానినెల్ల నడుమన దునుమాడి వానిపై కోపాతిరేకమున నాశీ విషసమంబులగు బాణములు ప్రయోగించెను. 

ఇంద్రుడు తనపైకి వచ్చు శరములను త్వరత్వరగ ఖండించి గదతో వాని గజము తుండమును మోదెను. తన తుండము పై దెబ్బ తగులగనే మార్తనాదమున గీపెట్టుచు నటునిటు గ్రుమ్మరుచు నడ్డువచ్చిన దానవ సేనలనెల్ల చంపివేసెను. అట్లు తన గజము రణభూమి వదలి వెళ్ళుట గని బిడాలుడొక చక్కని తేరెక్కి యమరుల ముందు నిలువబడెను.

వాడు తిరిగి యరదమెక్కి వచ్చుటగని యింద్రుడాశీ విష ప్రభావముగల వాడి బాణపరంపరలు వానిపై గురిసెను. బిడాలుడును క్రోధముతో బాణములు ఇంద్రునిపై ఏసెను. అపుడు జయకాములగు వారిరువురికి పోరు ఘోరముగ జరిగెను. తన వైరి మహాబలుడగు టెఱిగి యింద్రుడు వ్యాకుల చిత్తుడయ్యెను. 

అపుడింద్రుడు తన తనయుడగు జయంతుని తోడుగ గొని వానితో మరల బోరదొడగెను. జయంతుడు మదగర్వితుడగు దానవుని ఱొమ్ముపై నైదు ప్రబల శితశిలీముఖములు గాటముగ నాటెను. వాడు బాణాహతుడై రథముపై కూలబడెను. సారథి రథముతోలుకొని రణభూమి వెలువడెను. 

బిడాలుడు మూర్ఛితుడై వెడలిపోగా దేవతల జయజయ కారములు దుందుభి స్వనములు మిన్నుముట్టెను. అమరులెల్లరును ప్రమోదభరితులై యింద్రుని గొనియాడిరి. గంధర్వులు పాడిరి. అచ్చరలాడిరి. ఆ దేవతల జయనినాదములు విని మహిషుడు కోపముతో పరుల మదమడంచు తామ్రుడను వానిని పంపెను. 

అతడును పెక్కు సేనలతో వచ్చి సముద్రమున మేఘము వర్షము గురియునట్లు రణస్థలమున రిపులపై బాణములు గురిసెను. అపుడు పాశము చేతబట్టి వరుణుడును మహిషమెక్కి దండధారియై యముడును రణమునకు తరలిరి. దేవదానవులకు బాణఖడ్గ ముసలశక్తి పరశువులతో ఘోరసంగ్రామము సంఘటిల్లెను. 

తామ్రుడు యముని చేత దండతాడితు డయ్యెను. అయ్యునతడు రణమునుండి వెనుకంజ వేయలేదు. అతడు వెంటనే ధనువెక్కిడి నారిలాగి యింద్రాదులను బాణములతో గట్టిగ గొట్టెను. దేవతలును తీవ్రరోషమున వాడియగు దివ్యశరముల పెక్కింటిని దానవసైన్యముపై గురియుచు నిలునిలుడను కేకలు వేయుచు ముందునకు సాగిరి. తుదకు దేవతల చేతిలో తామ్రాసురుడు రణరంగమున మూర్ఛితుడై పడిపోయెను. దైత్యసేన భయమున హాహాకారము లొనర్చెను.

అధ్యాయము 93 హరిహరులు మహిషునితో బోరుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...