Wednesday, April 15, 2026

Chapter 93 Harihara and Mahishasura fight - అధ్యాయము 93 హరిహరులు మహిషునితో బోరుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 93

హరిహరులు మహిషునితో బోరుట

తామ్రుడు మూర్ఛపొందిన పిమ్మట మహిషుడు రోషముతో పెద్ద గదగొని దేవతలపై కురికి 
'ఓ యమరులారా! మీరు కాకులవలె బలిభుజులు బలహీనులు. మిమ్మిపుడు నా గదతో హతమొనర్తును' అని మదగర్వమున పలికి వెంటనే గజారూఢుడైన యింద్రుని భుజములపై గదతో కొట్టెను. 

దేవపతియును తన ఘోరవజ్రముతో గదను తుత్తునియలు చేసి త్వరిత గతిని మహిషునిపై దెబ్బ వేయుటకు ముందునకు సాగెను. మహిషుడును కోపమూని తళతళమను ఖడ్గము బూని మరల కొట్టుటకు వీర్యవంగుడగు నింద్రుని సమీపించెను. అపుడు వారిరువురకు వివిధాయుధములతో లోకభీకరముగ మునులకు విస్మయకరముగ యుద్ధము జరిగెను. 

అందు మహిషుడు మునీశ్వరులను సైతము మోహింపజేయు లోకనాశకరమగు శాంబరీ మాయ పన్నెను. అపుడు మహిషుని వంటి రూప పరాక్రమములు గల కోట్లకొలది సాయుధులుప్పతిల్లి దేవసేనపైబడి కొట్టుటకు పూనుకొనిరి. మోహకరమగు వాని మాయను గని యింద్రుడు భయవిస్మయములతో వ్యాకులు డయ్యెను. 

సూర్య చంద్రులు అగ్నియమవరుణ కుబేరులును భీతిల్లి పలాయనము చిత్తగించిరి. దనుజ మాయా మోహితులైన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను హృదయములందు సంస్మరించిరి. స్మరణమాత్రమున త్రిమూర్తులు హంసగరుడ వృషభ వాహనము లెక్కి దివ్యాయుధములతో దేవతలను బ్రోవ నరుగుదెంచిరి. 

ఆ మోహినీ మాయను గాంచి శౌరి తన చక్రము బంపెను. దాని దివ్యతేజము వలన మాయాజాలము వ్రీలిపోయెను.

మహిషుడొక పెద్ద పరిఘ చేబూని సృష్టి స్థిత్యంతకారులగు త్రిమూర్తులపై కురిగెను. అతనివెంట చిక్షురసేనాని ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు అసిలోముడు త్రినేత్రుడు బాష్పకాంధకులు నితరులు పెక్కురు యుద్ధకాములై నడిచిరి. వారరదములెక్కి విండ్లుబూని చిన్నదూడలపైకురుకు తోడేళ్లవలె దేవతలను చుట్టుముట్టి మద గర్వముతో బాణవర్షము గురిసిరి. దేవతలు నటులే వారిపై బాణములు ప్రయోగించిరి. 

అంధకుడు హరిపై విషదిగ్ధములు శిలాశితములు నగు నైదు బాణములు చెవిదనుకనారిని లాగి వదలిపెట్టెను. దానవాంతకుడగు త్రివిక్రముడు తనపైకివచ్చు బాణములను నడుమన తునిమి తిరిగి యైదు వాడి బాణములు ప్రయోగించెను. అట్లు వారిరువురును బాణాసిగదా చక్రముసల - శక్తి - పరశువులతో భీకరముగ బోరిరి. 

వాసుదేవాంధకుల మధ్య గగుర్పాటొదవు తుముల సమర మేబది నాళ్లు ఘటిల్లెను. ఇంద్రబాష్కలులు రుద్రమహిషులు యమత్రినేత్రులు కుబేర మహాహనులు వరుణాసిలోములు పరస్పరము పరమ దారుణరణమొనర్చిరి. అందు దైత్యుడు హరివాహనమగు గరుడుని గదతో గొట్టెను. ఆ దెబ్బతిని గరుత్మంతుడు నిట్టూర్చుచు పడిపోయెను. 

శౌరి తన దక్షిణహస్తముతో మహాబలుడగు గరుడు నూరార్చి యతనికి బలము గలిగించెను. పిమ్మట హరి శార్జ చాపమునులాగి పెక్కు బాణములు తొడిగి యంధకు నంతమొందింప దలచి వానిపై పెక్కు బాణములు ప్రయోగించెను. దానవుడును వాని నెల్ల తన వాడి యమ్ములతో ఛేదించి కోపముతో నేబది నిశితబాణములేయగ హరివాని నెల్ల వేగమే విఫలమొనరించెను.

చక్రి తన సహస్రారసుదర్శన చక్రము ప్రయోగింపగా దానవుడు తన చక్రముతో దానిని వారించి దేవతలు మోహితు లగునట్లు పెల్లు గర్జించెను. హరి చక్రము విఫలమగుట గని సురముఖ్యులు శోకాకులులైరి. దానవులు ముదమందిరి. దేవతలు శోకించుట చూచి వాసుదేవుడు కౌమోదకీగదగొని సత్వరమే దానవునిపై కురికి యా మాయావి తలపై గదాప్రహార మొనరించెను. ఆ గద దెబ్బకు వాడు మూర్ఛిల్లి నేల కొరిగెను. 

అతడు పడిపోవుట గనినంతనే మహిషుడు మిక్కిలి కోపమూని గర్జించుచు బెదరించుచు హరిని దాకెను. దానవుడట్లు కోపము వచ్చుట వాసుదేవుడు గ్రహించి భీకరముగ నారి సారించుచు మహిషునిపై తీవ్రబాణవృష్టి గురిసెను. సురులు హర్షము వెలిపుచ్చిరి. వాడును తన బాణములతో హరి శరములన్నిటిని మింట దునిమెను. అట్లు వారిర్వురు భీషణముగ సంగర మొనర్చిరి. 

అంతలో కేశవుడు మహిషుని తలపై గదాఘాత మొనరించెను. వాడు మూర్ఛితుడై నేలకొరిగెను. దానవసేనలో హాహాకారములు చెలరేగెను. వాడును ముహూర్తమాత్రమున తెప్పరిల్లి లేచెను. పిమ్మట వాడు పరిఘగొని వ్రేయగ హరి మూర్ఛిల్లెను. గరుడు డంత మూర్ఛిల్లిన హరిని గొని రణభూమినుండి వెడలెను. 

జగన్నాథుడు మూర్ఛితుడుగాగా వాసవాది దేవతలు భయంపడి యార్తనాదమున వగచిరి. విలపించు సురులను గాంచి మహాధన్వియగు శివుడు తన త్రిశూలము చేత దాల్చి పట్టరాని రోషముతో మహిషుని దాకి వానిని శూలమున బొడిచెను. ఆ దుష్టుడును శంకరు నురమున శక్తిని వైచి బిట్టుగ గర్జించి శివుని త్రిశూలమును విఫల మొనర్చెను.

అంత దెబ్బ తాకినను శంకరుడెంతమాత్రము బాధపడక ఉగ్రుడై మహోగ్రుడై కనులవెంట మంటలెగయ త్రిశూలముతో మరల వానిని పొడిచెను. అట్లు శంకరుడు దుష్ట మహిషుతో తలపడెను. అంతలో మూర్ఛనుండి లేచి హరియు నచటి కేగెను. మహిషు డదిగని మరిహరులను సమీపించెను. 

మహావీర్యులగు హరిహరులు యుద్ధకాములై చక్రశూలములు ధరించి నిలిచియుండుటగని మహిషుడు కుపితుడై మహిషాకృతితో మరల పోరుటకు వారిని దాకి తన తోక యాడించుచు అమరులెల్ల భీతిల్లునట్లుగ తన కొమ్ములు త్రిప్పుచు భీకర దారుణముగ మేఘమట్లు గర్జించెను. తన కొమ్ములతో గిరిశిఖరములు పెల్లగించి చిమ్మెను. మహావీర్యులగు దేవసత్తములు దానిని గాంచి దానవునిపై మరల దారుణ తీవ్ర బాణవర్షము గురిసిరి. 

వాడు హరిహరులు గురియు శరవర్షమును వారించి మరల తోకతో గిరిశిఖరములు చుట్టి వారిపై చిమ్మెను. విశ్వపతి యగు హరి తనపైకి వచ్చు గిరులను గాంచి వానిని తన చక్రముతో ముక్కలు ముక్కలుగచేసి సత్వరమే వానిపై చక్రము ప్రయోగించెను. మరి చక్రఘాతమునకు మహిషు డక్కడి కక్కడనే మూర్ఛిల్లెను. 

ఆ దుష్టుడు మరల క్షణములో లేచి పర్వతము వంటి నరుని యాకారము బూని గద చేపట్టి దేవతలు వెఱగంద మేఘగంభీర ధ్వని చేసెను. అది విని విష్ణువు మహోజ్జ్వలమైన పాంచజన్యము గ్రహించి వేగముగ ఆ శంఖము పూరించెను. ఆ ధ్వనికి దానవుల గుండె లవిసెను. తపోధనులగు ఋషులును దేవతలును హర్షించిరి.

అధ్యాయము 94 దేవతలు త్రిమూర్తుల శరణు చొచ్చుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...