Wednesday, April 15, 2026

Chapter 96 Mahishasura was captivated by Sridevi's divine form - అధ్యాయము 96 శ్రీదేవి దివ్యస్వరూపమునకు మహిషుడు మోహితుడగుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 96

శ్రీదేవి దివ్యస్వరూపమునకు మహిషుడు మోహితుడగుట

విష్ణుని వచనములు విని యెల్ల దేవతలును సహర్షముగ శ్రీదేవికి తమ తమ దివ్యభూషణములు వస్త్రములు దివ్యాయుధములు సమర్పించిరి. 

శ్రీదేవికి క్షీరసాగరము ప్రీతితో నక్షయములు దివ్యములు సూక్ష్మములు నగు రెండెఱ్ఱని వస్త్రములు నొక మిగుల నలంకృతమగు మణిహారము నొసంగెను. విశ్వకరమ ప్రసన్నములగు ఇంద్రియములును మనస్సున కలవాడై సూర్యకోటి సమప్రభలతో వెలుగు దివ్య చాడామణిని చెవులకు శుభకుండలములను భుజములకు దివ్యకటకములను నానా రత్న విరాజితములై దివ్యములైన కేయూర కంకణములను దేవి కొసంగెను. 

దేవి పదపద్మములకు త్వష్ట సూర్యకాంతి సదృశకాంతులు విరజిమ్ముచు నిర్మల మంజుల రత్నభూషితములైన గజ్జెలందియ లొసంగెను. మహాసాగరుడు దేవదేవికి సర్వతేజోవంతములగు ముద్దుటుంగరములు సుందర కంఠహారములు నొసంగెను. వరుణదేవుడు శ్రీదేవికి వాడని కమలముల మాలను వైజయంతిని కానుకగ నొసంగెను. కమ్మని నెత్తావులు గుబాళించుటవలన కమలముల చుట్టు గుండుతుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. 

హిమవంతుడు సంతుష్టుడై బంగారమువంటి కాంతితో మనోహరమగు సింహవాహనమును వివిధ రత్నరాసులను దేవి కర్పించెను. ఈ విధముగ శ్రీదేవి సకల లక్షములతో భూషణములతో శ్రేష్ఠురాలై శుభరూపయై వరారోహయై మృగరాజుపై విరాజిల్లుచుండెను. 

అంత చక్రి తన చక్రమందుండి యొక దివ్య సుదర్శన చక్రమును సముత్పన్న మొనరించి శ్రీదేవి కొసంగెను. ఆ చక్రము రక్కసిమూకలు తలలు ప్రక్కలించుటకు సమర్థమై యుండెను. శూలి తన శూలమునుండి యొక యుత్తమ త్రిశూల ముత్పన్న మొనరించి మహాలక్ష్మి కొసంగెను. ఆ శూలము సురవైరులను నరుకజాలి సురల భయ ముడుపజాలి వెలుగొందుచుండెను. వరుణుడు తన శంఖమందుండి అతి శుభకరమగు నొక శంఖము సృజించి దేవికి ప్రసన్నమతితో నొసంగెను. 

అది మహాఘోష గంభీరమై దివ్యమై తనరారుచున్నది. అగ్నిదేవుడు దైత్య వినాశకరమైన తీవ్రవేగముగల శతఘ్నియగు శక్తిని శ్రీదేవికి ప్రదానము చేసెను.

వాయుదేవుడు గొప్ప చాపమును కఱకుటమ్ములతో నిండిన యమ్ముల పొదియుగు శ్రీదేవి కొసంగెను. ఆ ధనువు లాగుటకు శక్యముగాక చూపఱ కచ్చెరువు గొల్పుచు భీకర టంకారమున నొప్పుచుండెను. ఇంద్రుడు తన వజ్రము నుండి సిద్ధపఱచిన యొక దారుణ వజ్రమును ఐరావతము నుండి శోభన శబ్దము కలదియు అతి సుందరమును నగు నొక ఘంటను శీఘ్రమే సమర్పించెను. 

కాలము తీరిన యెల్ల ప్రాణులకు దేనివలన చావుమూడునో యట్టి కాలదండము నుండి యముడొక దండమును సృజించి దేవి కర్పించెను. బ్రహ్మ గంగాజల పూరితమైన దివ్య కమండలువును వరుణుడు దివ్యపాశమును సంతసమున దేవదేవి కొసంగిరి. కాలుడు ఖడ్గ చర్మములను విశ్వకర్మ వాడి గండ్ర గొడ్డలిని శ్రీదేవికి సమర్పించిరి. వరుణ కుబేరులు దేవికి వరుసగ మనోహరమైన కమలమును సురతో నిండిన బంగరు మధుపాత్రను నందించిరి. త్వష్ట దానవ నాశనికి ప్రసన్న చిత్తముతో సురశత్రు వినాశనియు నూఱు గంటలతోకూడి ధ్వనించుచున్నదియు నగు కౌమోదకీ గదను సమర్పించెను. 

త్వష్ట దేవికి వైరులను నుగ్గొనర్చు పెక్కు విధములగు దివ్యాస్త్రములను భేదింపరాని కవచము నర్పించెను. సూర్యుడా జగదంబకు తన దివ్యతేజము నొసంగెను. ఆమె భూషణములతో నాయుధములతో విలసిల్లు త్రైలోక్యమోహినిగ శివస్వరూపిణిగ ప్రకాశించు చుండెను. 

ఆ తల్లిని గని దేవతలెల్లరును పరమ విస్మయము జెంది యామె నిటుల నుతింప దొడగిరి: 

మే మెల్ల వేళల నిత్యకల్యాణి-శాంతి-పుష్టి-భగవతి-రుద్రాణి-దేవదేవి యగు శివస్వరూపిణిని నమస్కరింతుము. కాళరాత్రి-సిద్ధి-వృద్ధి-సమృద్ధి-ఇంద్రాణి-స్థితబుద్ధి-వైష్ణవి యగు తల్లికి మా వందనశతములు. ఏ యీశ్వరీశక్తి భూమియందుండి భూమిచేత దెలియబడక భూమిని నియమించు చుండునో యట్టి పరాశక్తికి పునఃపునర్నమస్సులు. మాయలో నుండి మాయచేత నెఱుగబడక మాయను కార్యములకు ప్రేరించు చున్నట్టి ప్రేరయిత్రీ శివశక్తి కంజలి ఘటింతుము.

జగదంబా! నీ దివ్యతేజముతో మహిషుని మోహితుని జేసి యా పాపిని దెగటార్చుము. మేము శత్రు పీడితులము. మమ్ము కాపాడి మాకు మేలు ప్రసాదించుము. మహిషుడు ఘోరుడు-ఖలుడు-మాయావి. స్త్రీవధ్యుడు. వరబల దర్పితుడు-బహురూపధారి- దేవతలకు దుఃఖదాయకుడు-శఠుడు. 

ఓ భక్తవత్సలా! నీ వొక్కర్తుకవే దేవతల కెల్లరకు శరణ్యము. మేము దానవ పీడితులము. అమ్మా మమ్ము బ్రోవుమమ్మా! నీకు వందనములమ్మా,' అని యిటుల సురలు సన్నుతింపగ సుఖదాయిని యగు మహాదేవి చిరునగవులు చిందు మేలుమాటలతో వారికిట్లనెను : 

దేవతలారా! ఇక భయపడకుడు. వరదర్పితుడు-మదమోహితుడు మందమతి యగు మహిషు నిపుడే రణమున నేలగూల్తును అని దేవి వారితో బలికి ఎలుగెత్తి పెద్దగ పకపక నవ్వెను. దానికి జగమంతయును వింతగ మోహ సంభ్రాంతులు జెందెను. బ్రహ్మ విష్ణుమహేశులు-ఇంద్రాది దేవతలును మహిషునికి భయపడి గడగడ లాడుచున్నారు. 

ఓ సురసత్తములారా! దైవబల మతి విచిత్రము-ఘోరము-దుర్జయము. ఈ యెల్ల సుఖదుఃఖములకు కాలము కర్త-ప్రభువు-ఈశ్వరుడు. ఏలన, సృష్టి స్థితి సంహార దక్షులగు త్రిమూర్తులు సైతము మహిషుని ధాటి కోర్వలేక విమోహితులై క్లేశ సంతాపము లందియున్నారు అను భావముతో దేవి బెట్టిదపు టట్టహాసముతో నవ్వు నవ్వి దానవుల గుండె లదఱునట్లు ఘోర గంభీర ధ్వని చేసెను. 

ఆ భీకరాద్భుత ధ్వనికి భూమి కంపించెను. గిరులు గ్రక్కదలెను. సారము గల జలధులు క్షోభిల్లెను. ఆ ఘూర్జిల్లు శబ్దమునకు దిక్కులు పిక్కటిల్లెను. మేరువు క్రింది మట్టి లేచెను. ఆ మహా నిస్వనమునకు దానవుల గుండెలు దడదడ లాడెను. అంత దేవతలు పరమ హర్షమున 

'ఓహో దేవీ! నీకు విజయ మగుగాక! మమ్ము గాపాడుమమ్మా!' యని పలికిరి. మహిషుడా ధ్వని విని మదగర్వముతో క్రొవ్వుతో కనుగ్రుడ్లెఱ్ఱ జేసెను. ఆ ధ్వని యతని కనుమానము గల్గించెను. అందుచే నతడా మహాశబ్దము పుట్టుటకు కారణమేదో తెలిసికొనుడని దానవుల నంపెను.

ఈ భీకరధ్వని కర్ణకఠోరము-వజ్రకఠినము. దీనికి కారకుడు దానవుడు గానిమ్ము. దేవుడు గానిమ్ము. మరెవ్వడేని గానిమ్ము. అట్టి దురాత్ముని పట్టి నా ముందునకు గొనితెండు. అట్లు గర్జించు దుర్మదాంధుని దునుమాడుదును. అట్టి మందమతి నల్పాయుష్కుని జేసి వాని నిపుడే యమాలయమున కంపుదును. సుర లోడిపోయి భీతిల్లిరి. 

కాన వారు గర్జింప నోపరు. అసురులు నాకెపుడును వశ్యులేగదా! మఱి యీ చెడ్డపని యింకెవ్వనిది గావచ్చును? మీరు త్వరగ నేగి శబ్దకారణ మెఱిగి నా చెంతకు రండు. అట్లూరక కేకలు వేయుచు శ్రమించు పాపినంత మొందింతునని మహిషుడు దూతలకనెను. 

అంత దూతలేగి సర్వాంగ సుందరియగు దేవిని గనిరి. ఆ దేవి యష్టా దశ భుజములతో దివ్య సర్వాభరణ భూషణములతో సర్వ శుభ లక్షణ సంపదలతో వరశుభా యుధములతో వెలయుచుండెను. ఆమెచేత మధుపాత్ర గలదు. ఆమె మాటిమాటికి మధురసము గ్రోలుచుండెను. దూతలామెను గని భయత్రస్తులై శంకాన్వితులై పారిపోయిరి. 

వారు మహిషునకు ధ్వనికారణ మిట్లెఱిగించిరి: ఓ దైత్యనాథా! ఓక ప్రౌఢాంగన యగు దేవి మాకు గనంబడినది. ఆమె యంగము లెల్ల రత్నభూషణశోభితములు. ఆమె దానవ స్త్రీ గాదు-మానవ వనిత గాదు. ఆమె ప్రత్యణువునుండి రమ్యములైన యమృతకాంతులు వెలయుచున్నవి. ఆ దేవి సింహాసీన-అష్టాదశభుజ-దివ్యాయుధధారిణియై ఘోర నినాదము చేయుచున్నది. చూడగ మద గర్వితవలె గనబడుచున్నది. 

సురాపానముచే మత్తిల్లి నున్నది. ఆమెకు పతి లేడని యెఱిగితిమి. సురలు గుమిగూడి వినువీథులందు ప్రమోదమున దేవిని ప్రస్తుతించుచున్నారు. ఓ దేవీ! నీకు విజయము. శత్రులను దునుమాడుము. మమ్ముల గాపాడు'మని వారు నుతించుచున్నారు. ఆ సుందరి యెవతెయో! ఎవ్వాని పత్నియో! ఆమె యేల యిట కరుగుదెంచెనో! ఏమి చేయదలచినదో మే మెఱుగము. 

ఆమె తేజమునకు మేము ముగ్ధులమైతిమి. ఆ మిఱుమిట్లు గొల్పు కాంతిని మేము చూడనేలేకపోతిమి.

ఆమె శృంగారము-హాస్యము-వీరము-రౌద్రము-అద్భుతము మున్నగు రసముల కాశ్రయమై యొప్పారుచున్నది. అట్టి నారీమణిని గాంచి మే మామెను పలుకరించకయే తిరిగి వచ్చితిమి. ఇపు డేమి చేయవలయునో యానతిమ్ము అన 

మహిషు డిట్లనెను: ఇపుడు బలవంతులగు మంత్రు లేగవలయును. ఆ శుభాంగిని సామాద్యుపాయములతో వారు తేవలయును. ఆమె మూడుపాయములచే వశ్యురాలై రాకపోవచ్చును. అపుడామెను చంపకయే నా చెంతకు గొనితెండు. ఆ కుటిలాలకను నా పట్టమహిషిగ ప్రియమున నొనర్తును. 

ఆ హరిణలోచన నెమ్మితో రాదలచినచో రసభంగముగాని తెఱగున తెచ్చి నా కోరిక నీడేర్చుడు. ఆమె సర్వశోభనమైన సురూపము విన్నంతనే మోహితుడ నైతిని అను మహిషుని మృదూక్తులొక మంత్రివర్యుడు వినెను. అతడు వేగమే గజాశ్వరథములతో నేగి దూరముగ నుండెను. 

అతడు వినయమున తలవంచి తీయని మెత్తని మాటలతో నా సుమనస్కురాలి కిట్లనెను: 

ఓ మధుర మంజుభాషిణీ! నీ వెవతెవు? నీ రాకకు కారణ మేమి? అని నా ప్రభువు నా నోట నిన్నడుగుచున్నాడు. అతడు తేజస్వి. సకల నరదేవతల కవధ్యుడు. 

చారులోచనీ! దైత్యపతి బ్రహ్మవరప్రసాది. మదమత్తుడు. కామరూపధారి. నీవు చారువేషవై మనోహరవై వచ్చితివి. నా మహిష మహీపతి నిన్ను చూడ వేడుక పడుచున్నాడు. 

ఓ శోభనాంగీ! అతడు నిన్ను మానవ రూపమున సమీపింపగలడు. నీ యిచ్చమెచ్చునట్లు కార్యము చక్కపెట్టుదుము. 

కనుక నో మృగనయనీ! నీవా ధీమంతుని యొద్దకు రమ్ము. కానిచో నీయందు భక్తితత్పరుడగు మా రాజును నీ సన్నిధికి దెత్తుము. ఓ దేవేశీ! నీ మది కేది యిష్టమో దాని నొనరింతుము. నీ సురూప సంపద విని యతడు నీకు గడుంగడు వశుడై యున్నాడు. 

కనుక నోకరభోరూ! నీవు శీఘ్రముగ నేది పలుకుదువో దానిని తప్పక యాచరింతుము.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...