Wednesday, April 15, 2026

Chapter 95 Sridevi Avirbhavinchuta - అధ్యాయము 95 శ్రీదేవి యావిర్భవించుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 95

శ్రీదేవి యావిర్భవించుట

దేవత లెల్లరును శ్రీవిష్ణువు పరిపాలించు వైకుంఠపుర మేగిరి. వారు దాని నలుగడలు దర్శించిరి. అది సకలములగు సంపదలకు శోభలకు నిలయము. అచట సుందర దివ్య మందిరము లనేకములు గలవు. హంస-సారస-చక్రవాకముల కలకూజములతో నొప్పు సరస్సులు వాపీనదులు గలవు. 

చంపక-అశోక-కహ్లార-మందార-మల్లికా-తిలక-చూత - కురవక - వకుళములను పుష్ప తరువులు శోభిల్లును. ఆ చెట్లపై కోయిలల మధుర కలస్వనములు చెలంగుచుండును. ఆచోట మయూర నృత్య మనోహరములు భ్రమర రావరమ్యములు నైన దివ్యసుందరోపవనములు లలరారుచున్నవి. పరమ విష్ణు భక్తితత్పురులు సనందనాది పార్షదులు నిత్యము శ్రీ మహావిష్ణుని సంస్తుతించుచుందురు. 

రత్నఖచితములు కాంచన చిత్రితములు అంబర చుంబులు నగు భవ్య ప్రాసాదములు గలదు. పరమభక్తి పరాయణులగు దేవ-కిన్నర-గంధర్వులు సరసరాగములతో మధుర కంఠములతో గానము చేతురు. అచ్చరలు నర్తింతురు. వేదాధ్యయన మందానందన మందు ప్రశాంత మునులు శ్రుతి సూక్తులతో వేదపారాయణ మొనరింతురు. ఈ చందమున చెన్నొందు నిందిరా రమణ మందిరమును బృందారకులు సందర్శించిరి. 

అచ్చో బంగారు బెత్తములు పట్టుకొని దివ్య శరీరముల వెలుగొందు జయవిజయులను ద్వారపాలురను గాంచి సురలు బ్రహ్మాది దేవతలు విష్ణు దర్శనార్థము వచ్చి ద్వారమందున్నారని మీలో నొక రేగి పరమాత్మునకు నివేదింపుడు అనిరి. విజయుడా మాటలు విని వేగమే విష్ణు సన్నిధి కేగి దోయిలించి 

'విభూ! దేవదేవా! మహారాజా! రమాకాంతా! దానవాంతకా! అమరు లెల్లరు ద్వారమందున్నారు. మిమ్ము దర్శింపగోరి బ్రహ్మ - రుద్ర - అగ్ని - యమ - వరుణులు వేదసూక్తములతో మిమ్ము సంస్తుతించుచున్నారు' అని సురల రాక నివేదించెను.

విజయుని మాటలు విని రమాపతి మిక్కిలి సంతోషముతో తన మందిరము నుండి బయటికి వచ్చెను. ద్వారము ముందు దుఃఖార్తులు శ్రమపీడితులు నగు దేవతలను గని హరి తన చల్లని నెయ్యపు చూపులతో వారికి ముదము గలిగించెను. దేవత లెల్లరును దేవదేవుడగు జనార్దనుని వేదవాక్కులతో చక్కగ సంస్తుతించుచు నంజలి ఘటించి 

'ఓ దేవదేవా! జగన్నాధా! సృష్టిస్థిత్యంతకారకా! మేము శరణార్థులము. మమ్ము గాపాడుము' అనిరి. అది విని విష్ణు విట్లనెను : ఓ నిర్జరులారా ! మీరు మీమీ యాసనముల నుండుడు. మీ కుశలములు తెలుపుడు. మీరెల్లరును దీనులు నార్తులునై చింతాపరులై బ్రహ్మరుద్రులతో గూడి కలసికట్టుగ ఏగుదెంచిన హేతువు వెల్లడింపుడు' తన 

సుర లిట్లనిరి: మహారాజా! మహిషుడు వరగర్వితుడు; పాపకర్ముడు; దుష్టాత్ముడు - అజేయుడు. వాడు మమ్ము బాధించుచున్నాడు. వాడు విప్రులొసగు హవిర్భాగములు గ్రహించుచున్నాడు. వానికి భయపడి దేవతలు గిరిదుర్గముల పాలయినారు. 

మధుమథనా! వాడు విధివరమున దుర్జయు డయియున్నాడు. మాకు భారమగుటచే నిన్ను శరణు వేడుకొనుచున్నాము. 

కృష్ణా! మాయా విశారదా! దానవమర్దనా! వాని వధోపాయ మాలోచించి మమ్ముద్ధరింప నీవే సమర్థుడవు. వాడు నరుల కవధ్యుడు. బ్రహ్మవరము బొందినవాడు. అట్టి దుష్టుని రణమందే యబల చంపజాలును? వాడు వర ప్రభావమున కన్నుమిన్ను గానకున్నాడు. అట్టివానిని భారతి - లక్ష్మి - పార్వతి - శచీదేవులలో నెవరు చంపగలరు? 

భక్తవత్సలా ! వాని మరణోపాయమును సూక్ష్మబుద్ధితో నాలోచింపుము. దేవకార్యము నిర్వహింపుము.''

దేవతల ఈ మాటలాలకించి చిరునగవుతో హరి వారి కిట్లనియెను : నేను మునుపు వానితో బోరి చూచితిని. కాని, వాడు చావలేదు. ఇపుడెల్ల దేవతల తేజోంశముల నుండి చక్కని వీరాంగన యావిర్భవించవలయును. ఆమె స్వశక్తితో వానిని యుద్ధమందు హతమార్చగలదు. మన కళాంశముల నుండి తేజోరూపము దాల్చిన వీర రమణి వరగర్వితులు మాయా విశారదులు నగు నూరుల కొలది మహిషులనైనను చంపజాలును. 

ఇపుడు మనమును మన పత్నులును మన తేజోంశములను ప్రార్థింతము. ఆ తేజోంశముల నుండి యొక తేజోరాశి యావిర్భవించుగాక! రుద్రుడు మొదలుగాగల దేవతల త్రిశూలము మున్నగు నాయుధముల నన్నిటి నా దివ్యావతారమూర్తి కొసంగుదము. అట్టి సర్వదివ్యాయుధములతో దివ్యతేజములతో వెలుగులు జిమ్ము వీరనారీమణి తప్పక మదగర్వితుడగు ఆ దుష్టుని పరిమార్చగలదు' అని విష్ణువు పలుకగనే 

చతుర్ముఖుని వదనముల నుండి దుస్సహమైన తేజోరాశి స్వయముగ నావిర్భవించెను. ఆ బ్రాహ్మతేజము పద్మ రాగమణి కాంతులు వెలార్చుచున్నది. రక్తవర్ణముగ సమ శీతోష్ణముగ నున్నది. మరీచి కాంతి మాలలతో నలంకృతమై మేలు వెలుగురూపున నొప్పుచున్నది. అట్లు వెలువడిన బ్రహ్మతేజమును గాంచి ఉరుక్రములగు హరిహరులు పరమ విస్మయమందిరి. 

రుద్రుని శరీరమునుండి రుద్రతేజ మావిర్భవించెను. అది దారుణమై దుర్దర్శమై మహాద్భుతమై తీవ్రమగు తెల్లని వెండికాంతుల విరజిమ్ముచు విరాజిల్లుచుండెను. అది దైత్య భయంకరము; దేవ విస్మయకరము; ఘోర ఘోరతరము; గిరివిశాలము; రూపు దాల్చిన తమోగుణమోయన వెలయుచుండెను. 

విష్ణుని శరీరమందుండి వైష్ణవ తేజము ప్రాదుర్భవించెను. అది సత్త్వగుణముతో కాంతివంతమై నీలవర్ణయుతమై వెలుగొందుచుండెను. ఇంద్రుని శరీరము నుండి యైంద్రతేజ ముద్భవిల్లెను. అది సర్వగుణాత్మకము. దుస్సహము. సుందరము. విచిత్ర రూపము.

అగ్ని - యమ - వరుణ - కుబేరుల శరీరముల నుండి యొకేసారి మహా తేజములుద్భవించెను. అటులే యితర దేవతల నుండియు తేజో రాసులుదయయించెను. వాటి సముదాయము మహోజ్వల రాశిగ బొలిచెను. ఇట్లు దేవతేజో రాశినుండి అసుర నాశమునకై సముద్భవించిన ఆ దేవి వాస్తవమున అష్టాదశ భుజములే యుండియు సహస్ర భుజాలంకృతగా నుండెను. 

ఆ మహోజ్జ్వల తేజము రెండవ హిమాలయము చందమున దివ్యముగ నుండెను. దానిని విష్ణువు మొదలుగాగల వారు దర్శించి పరమాశ్చర్య మందిరి. దేవతలు చూచుచుండగనే యా తేజశ్రీల నుండి పమరాద్భుతము గొల్పుచు శ్రేష్ఠము సుందరియునగుయునొక దివ్యరమణి రూపొందెను. 

అట్లు సర్వదేవతల శరీరముల నుండి యావిర్భవించిన యాదేవి త్రిగుణయగు మహాలక్ష్మి. ఆ దేవి త్రిగుణమయి - అష్టాదశభుజ - జగన్మోహిని - త్రివర్ణ. తెల్లని మోము - నల్లని కన్నులు - మిగుల ఎర్రని అధరపల్లవములు ఎర్రని అరచేతులు - కలిగి దివ్యభూషణభూషితయై మనోహరగా నుండెను. 

ఇట్లు దేవతేజోరాశినుండి అసురనాశమునకై సముద్భవించిన ఆ దేవి అష్టాదశభుజ యయి యుండియు వాస్తవమున సహస్రభుజాలంకృతగా నుండెను అన 

జనమేజయుడు నిట్లనెను : కృష్ణా! దేవా ! సర్వజ్ఞా! మహాభాగా ! మునిసత్తమా! ఆ తల్లి శరీర సంభవము గూర్చి విపులముగ తేట పఱచుము. ఆ యెల్ల దేవతల తేజము లొక్కటిగ నయ్యెనా? లేక వేరు వేరుగ నుండెనా? ఆమె యంగములు తేజోమయములా కావా? ఆమె ముఖము - ముక్కు - కన్నులు - ఇవి వేరు వేరు తేజముల నుండి కలిగెనా? ఏ దేవత తేజమునుండి యే యంగము రూపు దాల్చెనో యట్టి శరీరాంగముల పుట్టుక గూర్చి నాకు సర్వము నభివర్ణింపుము. ఆమె కెవరెవ రేయే యాభరణము లేయే యాయుధము లొసగిరో యదియంతయును నీ ముఖకమలమునుండి విని నుత్సహించుచున్నాను. నీ మోముదమ్మినుండి చిప్పిలు శ్రీ మహాలక్ష్మీ చరితామృత మధురస మెంత క్రోలినను నా యెడంద తనియుట లేదు.

అను రాజు మాటలు విని వ్యాసుడు మధురిమలు చిందు పలుకులతో ప్రీతి గల్గించుచు మరల నీ విధముగ చెప్ప దొడంగెను. 

'రాజా! ఆ కఱకుచీకటులు బాపు తేజముల తేజస్స్వరూప మేర్పడిన తీరుతెన్నులు నా బుద్ధి కందినంతవఱకు వివరింతును, వినుము: 

హరి-హర-బ్రహ్మ-వాసవులలో నెవరేని యా జ్యోతిస్స్వరూప మున్నది యున్నట్లుగ వివరింపజాలరు. ఆ తేజముత్పన్నమయ్యె ననుట వాక్కును ఆలంబనము చేసికొని పలుకు పలుకే కాని వాస్తవముగ నది యుత్పన్నమయినది కాని అగునది కాని కాదు. మఱి యా స్వరూపము నెట్లని యేమని యెంతని తెలియగలను? 

ఆమె నిత్య కావున ఎల్లప్పుడు ఉండునదియే. ఏక రూపమయ్యు ఆమె దేవతల దుష్కరమైన కార్యము నెఱవేర్చుట కనంతరూపములు దాల్చును. ఒకే రూప మొకే స్వభావముగల నటుడు రంగ స్థలముపై చూపఱను రంజింపజేయుటకు బహురూపములు ధరించును. 

ఆ దేవి కనంతనామములు గలవు. అవి కార్యకర్మములు ధాత్వర్థముల ననుసరించి ముఖ్యములు నముఖ్యములు ననబరగును. ఆ దివ్య ప్రకటితమైన యమృతకాంతులీను స్వరూపమును నా బుద్ధికి తోచినట్లుగ వచింపగలను. 

శంకరుని తేజమునుండి శ్వేతతేజమునుండి వర్ణముతో నామె చక్కని శుభాకారముగల ముఖకమల ముద్భవించెను. ఆ దేవి కేశములు కుటిలాగ్రములు సహజ పరిమళములు అతి దీర్ఘములు. చిక్కగ నునుపుగ సుమనోహరముగ మేఘవర్ణముతో నొప్పుచున్నవి. అవి యముని తేజము నుండి గల్గినవి. 

ఆమెకు మూడు కనుదమ్ములు గలవు. అవి తెలుపు-నీలము-ఎఱుపు వన్నెలతో నందగించుచున్నవి. ఆ కన్ను లగ్నితేజమునుండి వెలసినవి.

ఆ దేవి కనుబొమలు వంపులు తిరిగి కోమలములై మరుని చాపములను తలపించుచున్నది. అవి నీలవర్ణము గలవి. సంజకెంజాయలనుండి యేర్పడినవి. 

వాయుని తేజమునుండి ప్రశస్తములగు ఆమె చెవులు గల్గినవి. అవి యంత పొట్టిగ లేవు పొడవుగ లేవు. అవి మదనుని తులకు చెందిన పళ్లెరములో యన నొప్పుచున్నవి. 

ఆమె సునాసికలు నూగు పూవులవలె కోమలములు మనోహరములు. అవి కుబేరునివలన నేర్పడినవి. 

ఆమె దంతపంక్తులు కుందసుమములవలె కొనలుదేలి కాంతులు విరజిమ్ముచున్నవి. అవి దక్షుని తేజము వలన గలిగినవి. 

ఆమె క్రీబెదవి యరుణుని తేజమున గలిగినది. అది యరుణవర్ణము వెలార్చుచున్నది. 

పై పెదవియు నట్లే రమ్యమైనది. అది కార్తికేయుని తేజమున సంభవించినది. 

విష్ణుని తేజమునుండి యష్టాదశభుజములు రూపుగొన్నవి. 

వసువుల తేజమునుండి చిగురుటాకులవంటి యెఱ్ఱని వ్రేళ్లు గలిగినవి. 

ఆ దేవి చనుదోయి సౌమ్యుని తేజమున గలిగినది. 

ఇంద్రుని తేజమునుండి నడుము - త్రివళులు రూపు దాల్చినవి. 

వరుణుని ప్రకాశమునుండి యామె తొడలు జంఘలు రూపైనవి. 

ఇంద్రుని తేజమునుండి పిఱుదులు వెలసినవి. 

ఈ విధముగ శ్రీదేవి యా యా దేవతల యా యా తేజములనుండి సురూపము సుస్వరము గలిగి యావిర్భవించెను. ఇట్టి శుభలక్షణసర్వాంగి-సుదతి-చారులోచన యగు శ్రీదేవిని సందర్శించి మహిషపీడితులైన దేవత లెల్లరును పరమానందభరితు లైరి. 

అపుడు విష్ణువు దేవతలారా! మీ రిపుడు శ్రీదేవికి మీ మీ దివ్యభూషణములు దివ్యాయుధములు సమర్పింపుడు. దేవత లెల్లరును తమ తమ తేజోవంతములగు నాయుధములనుండి దివ్యాయుధములు సిద్ధముచేసి శ్రీదేవికి సత్వరమే సమర్పింపుడు' అనెను.

అధ్యాయము 96 శ్రీదేవి దివ్యస్వరూపమునకు మహిషుడు మోహితుడగుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...