Monday, April 13, 2026

Chapter 78 The incarnations of Lord Vishnu - అధ్యాయము 78 శ్రీ విష్ణువవతారములు దాల్చుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 78

శ్రీ విష్ణువవతారములు దాల్చుట

ఈ కథవిని 

జనమేజయు డిట్లనియెను: మునిశ్రేష్ఠా! అద్భుతకార్యము లొనరించునట్టి శ్రీహరి భృగుమహర్షి శాపకారణమున నేయే మన్వంతరములందే యే యవతారములు ధరించెను? శ్రీమన్నారాయణుని దివ్య లీలావతారములు మహాపాతక నాశకములు. అమృతమయమైన శాంతి సమృద్ధి గలిగించునవి. వానిని విశదముగ నాకు తెలియబలుకుము. అనగా 

వ్యాసుడిట్లనెను: రాజా! శ్రీహరి యే యే మన్వంతరములందే యే యుగములందే యే యవతారము లెత్తెనో యే యే మానవాతీత కార్యముల లోనరించెనో వానినెల్ల నిపుడు సంక్షేపముగ తెలుపుదును. 

చాక్షుష మన్వంతరమున ధర్మపుత్రులగు నరనారాయణులు ఈ మహీతలమున విఖ్యాతి గడించిరి. అది ధర్మావతార మనబడును. 

ఈ వైవస్వత మన్వంతరమున రెండవ మహాయుగమున హరి యత్రి పుత్త్రుడుగ నవతరించెను. అది దత్తాత్రేయ నామమున పేరుబొందెను. 

అత్రిభార్య అనసూయ. ఆమె సతులలో నుత్తమసతి. ఆమె ప్రార్థన నంగీకరించి బ్రహ్మ సోమరూపమున విష్ణువు స్వయముగ దత్తాత్రేయ రూపమున రుద్రుడు దుర్వాసుడుగ నిట్లు త్రిమూర్తులామెకు పుత్రులై యుద్భవిల్లిరి. 

నాలుగవ యుగము నందు విష్ణువు దేవకార్య సంసిద్ధి కొఱకు రెండు సుమనోహరమైన రూపములు దోప హిరణ్యకశిపుని చంపుటకు దేవతల కబ్బుర మగునట్లు నృసింహ రూపము దాల్చెను. 

శ్రీ భగవానుడు హరి త్రేతాయుగమందు బలిప్రభావ మడచుటకు కశ్యప మహర్షికి వామనుడుగ నవతరించెను. ఆ రాక్షసరాజు యజ్ఞ మొనరించు చున్నపుడు వామన రూపమున వచ్చి యతని వంచించి యతని రాజ్యము హరించి యతనిని పాతాళమున కంపెను. 

పిదప పందొమ్మిదవ త్రేతాయుగమున హరి బలశాలియగు పరశురాముడుగ నవతరించెను. అతడు జమదగ్ని తనయుడు.

సత్యవాది - జితేంద్రియుడు - క్షత్రియాంతకుడు. అతడు భూమినంతయును కశ్యప మహర్షికి దానమొసంగెను. అద్భుత చరిత్రుడగు శ్రీహరి పరశురామావతారము పాపహరము. 

అదే పందొమ్మిదవ త్రేతాయుగమున శ్రీమన్నారాయణుడు రఘువంశమందు దశరథనందనుడైన రాముడుగ నవతరించెను. 

ఆ తరువాత ఇరువదెనిమిదవ ద్వాపరమందు బలశాలురగు నరనారాయణులు భూభారముడుపుటకు కృష్ణార్జునులుగా నవతరించిరి. వారు కురుక్షేత్రమున మహాఘోరమైన యుద్ధమొనరించిరి. 

ఇట్లు యుగయుగమున హరి పెక్కులవతారములు దాల్చుచుండును. సర్వము ప్రకృతి ననుసరించి సంభవించుచుండును. ఈ ముజ్జగములును మహా ప్రకృతిశక్తి చేతిలోని కీలుబొమ్మలు. ప్రకృతి తాను తలచిన రీతిగ జగములను భ్రమింపజేయును. పరమ పురుషుని బ్రహ్మానందమునకై జగములను వెలయించుచుండును. 

ఈ లోవెలిలేని మయోపాధి వలన సర్వగుడు - సర్వాది - అవ్యయుడు - దుర్జేయుడు - నిరాలంబుడు - నిరాకారుడు - నిరీహుడు అగు పురుషోత్తముడు సృజించును. ఈ మాయ యుపాధివశమున త్రిగుణ రూపముల ప్రతిభాసించును. ఈ త్రిగుణముల సమ్యక్స్వరూపమైన మాయ పరా ప్రకృతియన వెలయును. 

ఆ శివా ప్రకృతి యుత్పత్తి కాలమున మహాకాలవశమున భిన్న భిన్న గతులతో ప్రతిభాసించును. ఆ కామప్రదాయిని యెల్ల లోకములు విరచించి కాపాడును. ఆమె కల్పాంతమున లోకములను సంహరించును. ఈ విశ్వమోహిని వలననే బ్రహ్మ సృజింప గల్గును. విష్ణువు పాలింప గల్గును. రుద్రుడు సంహార కార్యమొనర్చును. 

ఆ విశ్వమాత తొల్లి రాజవర్యుడైన కాకుత్థ్సు నవతరింపజేసెను. ఆమె దానవులకు జయము గలుగకుండునట్లు జేసెను. ఈ విశాల ప్రపంచమందు ప్రాణులందఱును సుఖదుఃఖములతో గూడి చరించుచుందురు.

ఎల్ల ప్రాణులును విధిచేతి కీలుబొమ్మలై వర్తింతురు.

అధ్యాయము 79 జనమేజయునకు గల్గిన సందేహములు

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...