Monday, April 13, 2026

Chapter 77 Prahlada praises the glory of Sridevi - అధ్యాయము 77 ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 77

ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుట

ఓ నృపనందనా! మహాత్ముడగు భార్గవుని వచనము లాకర్ణించి ప్రహ్లాదుడు సంతుష్టాంతరంగుడై దైవమే బలవత్తరమైనది. దేవతలతో ఇపుడు యుద్ధమొనరించినను మనకు జయము కలుగదు.' అని దైత్యులతో నుడివెను. అపుడు మదగర్వితులు విజయశీలురునైన దానవు లిట్లు పలికిరి.

'మేము యుద్ధమే చేసెదము. మాకు దైవముతో బనిలేదు. దానవేంద్రా! ఉద్యోగహీనులు దైవమును ప్రధానముగ తలచెదరు. దాని నెవరు చూచిరి? ఎక్కడ చూచిరి? దాని నెవరేర్పరచిరి? అదెట్టిది? మేమిపుడే తగినబలము చేకూర్చుకొని రణ మొనర్తుము. నీవు సర్వజ్ఞుడవు. కాన మాకు నాయకుడవు గమ్ము అను దానవుల మాటలకు వైరినాశకుడగు ప్రహ్లాదుడు వారికి సేనానిగ నుండి దేవతలను రణమున కాహ్వానించెను. 

యుద్ధ సన్నద్ధులైన రాక్షసులను జూచి దేవతలును తగిన సన్నాహములతో వారితో బోర సమకట్టిరి. అపుడింద్ర ప్రహ్లాదులకు నూఱండ్లవరకు ఘోరసమరము సాగెను. అది మునులకు సైతము వింతగొల్పునదిగ నుండెను. 

ఆ మహాయుద్ధము జరుగుచుండగ నందు శుక్రపాలితులైన ప్రహ్లాదుడు మున్నగు దానవులకు జయము చేకూరెను. ఆ కష్టసమయమున నింద్రుడు గురుని వచనాను సారముగ సర్వదుఃఖ వినాశినీ - ముక్తిదాయిని - శివస్వరూపిణి యైన శ్రీరాజరాజేశ్వరిని నెమ్మదిలో నీరీతిగ స్మరించి ప్రస్తుతించెను: 

ఇంద్రుడిట్లనెను: ఓ దేవి! ఓ మహాదేవి! ఓ మహామాయా! భక్తుల యిలవేల్ప! ఓయమ్మా! నీవు శంఖ చక్ర గదా పద్మములు శూల ఖడ్గములు ధరించి మా కభయ వరము లొసగు తల్లివి. నీకు జయమగుత. భువనేశానీ! మాతా! నాదబిందు కళాస్వరూపిణీ! దశతత్త్వాత్మికా! శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్యనాయికా! నీకు వందనములు తల్లీ|

మహాకుండలినీ శక్తి స్వరూపిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! నిత్య చైతన్యజ్యోతీ! ఓ ప్రాణాగ్ని హోతృవిద్యా! శిఖాత్మికా! నీకు వందనములు: 

నీవు పంచకోశాంతర నిలయవు. ఆనంద కోశమందలి పుచ్ఛ బ్రహ్మస్వరూపిణివి! ఆనంద కళికవు! సర్వోపనిషదర్చితవు. నీకు వందనములు తల్లీ! ఓహో జగజ్జననీ! ఏము దైత్యులవలన నోటుపడితిమి. దుర్బలులమైతిమి. మా యెడల ప్రసన్నవుగమ్మా! అమ్మా మమ్ము గాపాడుమమ్మా! 

ఈ త్రిభువనములం దీవొక్కతెవే శరణమొసగుదానవమ్మా! మా దుఃఖము లెడబాపుట కీవే సర్వశక్తురాలవు. వీర్యయుక్తురాలవు. నీకు వందనములు తల్లీ! ఓ విశ్వజననీ! నిన్ను నిరంతరము ధ్యానించువారు శాశ్వత సుఖశాంతు లందుదురు. నిన్ను ధ్యానింపనివారు భయశోకములతో దుఃఖముల పాలగుదురు. సంగరహితులైన ముముక్షులీ భవసాగరము తరింతురు. 

ఓయమ్మా? నీవు విశ్వజననివి. దేవీ! నీ ప్రభావము విశ్వ ప్రసిద్ధము. నీవు దుఃఖార్తిహారిణివి. నీవే సర్వరక్షణ దక్షురాలవు. నీవే యఖండ కాలస్వరూపవు. ఈ సకలము నీవే సంహరింతువు. ఓ తల్లీ! నీ దివ్యచరితము మందమతికేమి తెలియును? నీ యతుల దివ్యశక్తి ప్రభావమును హరిహర బ్రహ్మలును ముని జనగణమును నిగమాగమములు నెఱుగ నేరవు. 

ఓ యుమాదేవీ! నీ పాదపద్మ సేవాపరాయణులైన మహాత్ములే ధన్యులు. వారు సంసార దుఃఖరహితులు. కాని, భోగ సాగరమగ్నులు భక్తిరహితులు జన్మమృత్యుసాగరము దాటనోపరు. 

ఓ మాతా! నిత్యము వెల్లచామరములచేత వీవబడువారును సుఖక్రీడ లాడువారును బంగరు టందలము లెక్కువారును తొల్లిటి జన్మమును నిన్ను పెక్కులుపచారములచే బూజించియుండిరని నేను దలతును. 

ఓ తల్లీ! ఎవ్వరు నిత్యము పూజ్యులో ఎవరేనుగల నధిరోహింతురో ఎవరు విలాసినీ బృందమున విలాసవంతులై వర్తింతురో తమకు నమ్రులైన సామంతులతో గూడి సంచరించు చుందురో వారు మున్ను నిన్ను పూజించియుండిరని భావింతును అని యీ విధముగ నింద్రుడు ప్రస్తుతి సేయగా 

శ్రీ త్రిభువనేశ్వరీదేవి సింహాధిరూఢయ్తె చతుర్భుజయై వేగమే ప్రత్యక్షమయ్యెను. 

ఆ రాజీవనయనయగు జనని శంఖ చక్ర గదా కమలములు ధరించి రక్తాంబర ధారిణియై దివ్యమాల్య విభూషితయై దేదీప్యమానయై యొప్పెసగెను. శ్రీదేవి ప్రసన్న వదనముతో నమృత వచనములతో దేవతలతో నీవిధముగ వచించెను: 

"ఓ దేవతలారా! భయము విడువుడు. మీకిపుడు సుఖశాంతులును సిరిసంపదలును గలిగింతును."
అని పలికి సింహాసనాసీనయైన జగదేకమాత వెనువెంటనే మదగర్వితులగు దైత్యులున్న యెడ కరిగెను. ప్రహ్లాదుడు మున్నగువారా దేవిని గని వారొకరి మొగము లొకరు చూచుకొని యిపుడేమి చేయుదమని చింతించిరి. 

ఈ దేవత శ్రీచండిక. ఈమె దేవతల రక్షణ కిటకు వచ్చినది. తొల్లి చండముండ మహిషాసురాదుల నీమెయే పరిమార్చినది. 

పూర్వ మీ తల్లియే వక్రదృష్టితో మధుకైటభులను తెగటార్చినది. ఇపు డీమె తప్పక మన యంతు తేల్చుకొనగలదు అని యిట్లు చింతాపరులగు దానవులను గని 

ప్రహ్లాదు డిట్లనెను: దానవులారా! ఇపుడు యుద్ధము తగదు. మనము కాలికి బుద్ధి చెప్పుట మంచిది అనెను. ఆ మాటలు పాటించి పరుగిడుటకు సిద్ధపడిన దనుజులతో 

నముచి యను నతడిట్లనెను: మీరు పరుగెత్తి నప్పటికిని జగన్మాత రోషముతో నాయుధములతో మనలను చంపకమానదు. కనుక మనకు దుఃఖము గలుగని పనిచేయుట మంచిది. ఆ తల్లి నిపుడు సంస్తుతించి యామె యాన బడసి మనము పాతాళమున కేగుదము అన 

ప్రహ్లాదు డిట్లనియెను: నేను సృష్టి స్థిత్యంతకారిణి-సర్వజనని-భక్తుల కభయప్రదాయిని - మహామాయాశక్తియగు మహాదేవిని సంస్తుతించుచున్నాను' అని నుతించి పరమార్థవిదుడు విష్ణుభక్తుడునైన ప్రవ్లూదుడు జగదంబకు నమస్కరించెను. పూలమాలయందు సర్పభ్రాంతి గలుగు నట్లే యే తల్లియందు చరాచరజగ మాభాసించునో యా సర్వాధిష్ఠానరూపిణి యగు హ్రీంబీజ స్వరూపిణిని నమస్కరించుచున్నాను. 

"తల్లీ! ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయును నీవలననే కలిగినది. బ్రహ్మాదులును నీచేతనే సృజింపబడి నిమిత్తమాత్రులై యున్నారు. ఓ మహామాయాదేవీ! నీకు నా నమోవాకములు. నీవు బ్రహ్మాండమాతవు. దేవదానవులను నీవే సృజించితివి. కాన నీకు వీరిపట్ల భేద మెక్కడిది?

తల్లికి బుట్టిన పుత్రులలో సన్మార్గులు దుర్మార్గులు నుందురు. ఐనను తల్లి వారిని సమానముగా గాంచును. అటులనే యిపుడు దేవతలయందును మాయందును నీకు భేదభావము తగదు. 

మాతా! నీవు పురాణములందు విశ్వజననివిగ పేరొందితివి. నీకు దేవత లెట్లో మేము నట్లు సుతులము. 

జననీ! వారును స్వార్థపరులే. మేమును స్వార్థపరులమే. నిజముగ దేవదానవుల మధ్య భేద మన్నది లేదు. ఉన్నచో నది భ్రాంతి మాత్రమే. 

ఓ యమ్మా! దేవేశ్వరీ! మేము ధనభార్యాది భోగము లందు నిత్యము సంసక్తులమైన మాట నిజమే. వారును మావంటివారే కదా? ఇంక మా యిరువురి నడుమ భేద మెక్కడిది? 

మాతా! వారును కశ్యపాత్మజులు. మేమును కశ్యపాత్మజులమే. ఇంక మా యిర్వురియందు నీకు భేదభావ మేల కలిగెను? 

విశ్వజననీ! నీయం దిట్టి విరుద్ధభావము తగదు. నీవు మమ్ములను దేవతలను సమభావమున జూడుమమ్మా! సురాసురులెల్లరును గుణకర్మ సంయోగమున సంభవించిరి. ఇంక దేహధారులైన దేవతలు మాకంటె నధికతరముగ గుణవంతు లెట్టులగుదురు? అన్ని శరీరము లందును కామక్రోధలోభమోహము లుండును. ఇంక విరోధభావము లేనివాడెవ డుండును? 

తల్లీ! నీకు నీ బుద్ధియందు మా యుద్ధము గను వేడుక పుట్టి యుండును. అందుచే నీవు లీలామాత్రముగ మాలో విభేదములు పుట్టించి పరస్పర విరోధములు గల్పించితివని తలంతుము. 

చాముండా! ఓ యనఘురాలా! నీకు నిక్కముగ మా కలహము గాంచు కోరికయే లేనిచో నన్నదమ్ములమైన మాలో మా కీ పొరపొచ్చెము లేల కలుగును? మేమును కొంచెము ధర్మ మెఱుగుదుము. ఇంద్రునిగూర్చి మాకంతయును తెలియును. ఇక మాలో మాకు గల కలహము కేవలము నీ భోగముకొఱకే సుమా! 

ఈ విశ్వబ్రహ్మాండ మందెల్ల నీవు గాకింకొకరు డెవడు శాసకుడు గలడు? కామములు గలవాని కోర్కు లన్నిటి నెంతటి పండితుడైన నెరవేర్చజాలడు.

మున్నొకప్పుడు దేవాసురులు గలిసి పాలసంద్రము మథించిరి. అపుడందుండి దివ్యామృతమును దివ్యరత్నములును వెలువడినవి. ఆ యమృతము పంచు నెపముతో శ్రీహరి మాలో భేదములు గల్పించెను. 

విశ్వమాతా! జగద్గురువగు శ్రీహరి నీచేతనే విశ్వపరిపోషణకు నియమింపబడెను. అతడే స్వయముగ నమరసుందరియైన శ్రీమహాలక్ష్మిని గ్రహించెను. ఆ సమయమున దేవరా జైరావతమును ఉచ్చైఃశ్రవమును కామధేనువును పారిజాతమును గ్రహించెను. 

హరి యనుమతితో తక్కిన దేవతలు తక్కిన విలువగల వస్తువులు గ్రహించిరి. అట్లా నా డన్యాయమునకు పాల్పడిన దేవతలే నేడు సాధువర్తనులైరి. నిజము చెప్పవలె ననిన దేవతలే యన్యాయపరులు. ఇక ధర్మలక్షణ మెట్టిదో యెఱుగుము. 

లోకమాన్యుడైన విష్ణువే వారి నంత మహోన్నతస్థాన మందుంచెను. అపుడు సురలవలన నసురులు పరాభవ మందిరి. 

కనుక నేది ధర్మము? ఏది కార్యము? ఆ ధర్మస్వరూప మెట్టిది? ఆ సాధుత్వ మెట్టిది? ఇవన్నియు నీవే యెఱుగ సమర్థురాలవు. 

నీవు ధర్మసూక్ష్మతాదృష్టితో నంతయు సమతతో గనుమమ్మా! ఇక మీమాంసకుల మతము నెవరిముందు వెల్లడింపదగును. తార్కికులు యుక్తివాద మెఱిగినవారు. వేదవాదులు విధి మార్గమును సూటిగ ననుసరించువారు. ఈ విశ్వమంతయు సృష్టించిన యీశ్వరు డున్నాడను విషయమున మందమతులగు ఈ నిరీశ్వర మీమాంసకులు వివాదము సేతురు. 

నిజముగ నీ విశాల విశ్వమంతటికిని సృష్టికర్త యొక్కడే యైయున్నచో మఱి యొక్కని సృష్టిలో నింత వైవిధ్య మేల యుండవలయును? ఈ పరస్పర వైరుధ్య మేల గల్గవలయును? ఎల్ల వేదశాస్త్రములం దైక్యభావ మేల లేదు? అని వీరందురు. ఈ స్థావర జంగమాత్మకమైన జగంబంతయును స్వార్థమయమే. 

అందువలన ఈ వేదవిదుల వాక్కులందు నైక్యములేదు. ఈ ప్రపంచమందెల్ల కోర్కులు లేనివాడు లేడు. 

చంద్రుడు గురు భార్యయని తెలిసియు తారను బలిమితో సొంతము చేసికొనెను. ఇంద్రుడు ధర్మసూక్ష్మ మెఱిగినవాడే కదా! ఐన నతడును గౌతమ మహర్షి భార్యను గూడెను. గురుని సోదరుని భార్య గర్భిణిగ నుండెను. ఐనను గురుడామెను బలిమి మీర పొందెను. మఱి గురుడామె గర్భమందలి శిశువును గ్రుడ్డివాడవు గమ్మని శపించెను. 

శ్రీవిష్ణువు చక్రముతో బలిమితో రాహు శిరమును ఖండించెను.

నా మనుమడు బలి. అతడు ధార్మికాగ్రాణి-సత్యవ్రత పరాయణుడు-శాంతుడు-సర్వజ్ఞుడు-సర్వపూజకుడు-నిరపరాధి. అతడు దానవపతి. ఐనను శ్రీహరి కపట వామన రూపము వహించి అతని నెత్తిపై కాలు పెట్టి యతని రాజ్యము నపహరించెను. ఐనను దేవతలే ధర్మపరులని మనీషులు పొగడుదురు. 

ఈ లోకములలో చాటువాదము లాడువానినే ధర్మవాది యందురు. ఇవన్నియును నీకు తెలియనికావు. కాన నీకెట్లుదోచిన అట్లు చేయుము. దానవులందఱు నీకిపుడు శరణార్థులైనారు. కాన వారిని గాపాడుదువో, విడనాడుదువో! అంతయు నీయిష్టము అనగా దేవి యిట్లు వచించెను. 

"ఓ దానవులారా! మీరిపుడు పాతాళమేగి స్వేచ్చగా నుండుడు. మీరు కోపము వీడుడు. నిర్భయులుగండు. శుభాశుభములకు కారణమగు కాలమున కెదురు చూడుడు. ఎల్లడల నెల్లపుడు నిర్వేదపరులకు మాత్రము సుఖము చేకూరును. లోభచిత్తులకు త్రైలోక్య రాజ్యము ప్రాప్తించినను సుఖము మాత్రము సున్న. 

వేయేల? కృతయుగ మందును లోభాత్ములు ఫలము బొందియు సుఖము బడయకుండిరి. కావున మీరిపుడే నేలను వదలి పాతాళమున కేగుడు. మీరెల్లరును నా యాన తలదాల్చి పాపరహితులు గండు అనిన దేవీ వచనములు విని వారటులే మేము పాతాళమున కేగుదుమని చేతులెత్తి మ్రొక్కి యామెచేత రక్షితులై పాతాళమున కేగిరి. 

అంత దేవి యంతర్ధాన మొందెను. దేవతలును నిజ భవనముల కరిగిరి. ఇట్లు అపుడు దేవదానవు లందఱును వైరము బాసిరి. ఈ యాఖ్యానక మంతయును వినిన-చదివినవాడు సర్వదుఃఖములు బాసి యుత్తమపద మందును.

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...