మహిష వధానంతరము ప్రజల ధర్మప్రవృత్తి
జనమేజయు డిట్లు ప్రశ్నించెను: మునిసత్తమా ! శ్రీదేవీ దివ్యచరిత కథామృతరసము శాంతికరము-హితకరము-మహాద్భుతము. దానిని మీ ముఖకమలమునుండి యెంత గ్రోలినను తనివి తీరుటలేదు. అట్లు భవాని యంతర్ధానము జెందిన పిమ్మట దేవత లేమి చేసిరి? నాకు సర్వము తెలుపుము.
దేవీ పరమపావన పుణ్యచరిత మల్పపుణ్యముగలవారికి లభ్యముగాదు గదా! అది యల్పభాగ్యునకు సాధ్యము కానేకాదు. ఇక భక్తిప్రపత్తులతో వినువాడు దేవీ మధుర కథారసామృత మెంతయని క్రోలగలడు! ఎంతయిన తనియగలడు! ఏ సత్కథామృతము గ్రోలిన అమరత్వమబ్బునో యట్టి దాని నాస్వాదింపని వానిజన్మ మెన్ని జన్మములకును వ్యర్థమే కదా! జగదంబికా లీలా చరిత్రము ముక్కోటి దేవతలకును మునులకును శ్రీరామరక్ష. సంసారసాగరమందలి నరులను దాటించు నావ.
అట్టి దానిని కృతజ్ఞు లేల వదలుకొందురు? దేవీ దివ్యలీలలు నవరస భరితములు-కోర్కులీడుర్చునవి. ముముక్షులు-రోగులు-సంసారులు-ప్రతివాడును వినదగినవి అని పండితులందురు. దేవీ మహిమములను ధర్మార్థకామనిరతులగు రాజులు తప్పక సావధానముగ వినవలయును. ముక్తసంగులును దేవీ మహిమామృతము గ్రోలుదురే! ఇక పామరుడేల క్రోలడు?
తొంటి పుట్టువున శ్రీజగదంబ నెవరు కుంద-చంపక-బిల్వ సుమదళములతో పూజించిరో వారలీ జన్మమున భరతభూమిపై రాజభోగము లనుభవింతురు. ఈ పరమ పావనమైన కర్మభూమిపై మనుజుడై పుట్టినవాడు శ్రీజగదంబ నర్చింపనిచో వాడు ధనధాన్య సంతానహీనుడై రోగియై యలమటించును. అట్టివారు దాసులుగ పరాజ్ఞాకరులుగా బరువులు మోయువారుగ రేబవళ్ళు శ్రమించువారుగ స్వార్థపరులుగ జీవింతురు. ఐనను వారి పొట్టలు పూర్తిగ నిండవు. నేటి కుంటి-గ్రుడ్డి-చెవిటి-మూగ-కుష్ఠరోగి-నిత్యదరిద్రుడు-మున్నగువారినిగని వీరు తొల్లి యాతల్లిని సేవించినవారుకారని తెలిసిన వారు తలంపవలయును.
నేడు రాజభోగములతో సకల సంపదలతో తులతూగుచు పెక్కుమందిచే సేవింపబడువారు గలరు. వీరు పూర్వమా లోకమాతను గొల్చిన వారని తలంపవలయును. కావున సత్యవతీనందనా! దయామయా! నాయందు దయయుంచి నాకు విచిత్రమైన దేవీదివ్య చరిత్రము తేనెలొలుక తేటతేటలుగ వినిపింపుము. అట్లు సర్వజ్యోతుల మేళనమున నవతరించిన మహాలక్ష్మి పాపాత్ముడగు మహిషుని దెగటార్చి దేవసన్నుతయై పిమ్మట నెచ్చటికేగెనో తెలుపుము.
మహాత్మా! ఆ త్రిభువనేశ్వరి వేగముగ నంతర్ధానమందెనంటివి. ఇపుడామె స్వర్గలోకమందుండునా? లేక మనుజలోకము నందుండునా? ఆ దేవతామయి యచ్చోటనే అదృశ్యయైనాదా? విష్ణులోకము జేరినదా? హిమాలయమునకేగినదా? నాకిపుడు నిజము తెలుపుము.
వ్యాసుడిట్లనెను : రాజా! మున్ను నీకు సుమనోహరమైన మణిద్వీపముగూర్చి తెలిపితివి. ఆ ద్వీప మనంతకోటి బ్రహ్మాండ జననికి పరమప్రియమైనది. తొల్లి హరిహరబ్రహ్మ లచ్చోటనే స్త్రీభావము లొందిరి. వారు పిదప దయామతల్లి యగు దేవీకృపవలన మరల పురుషత్వమంది తమ తమ పనులు నిర్వహించుచున్నారు.
వ్యాసుడిట్లనెను : రాజా! మున్ను నీకు సుమనోహరమైన మణిద్వీపముగూర్చి తెలిపితివి. ఆ ద్వీప మనంతకోటి బ్రహ్మాండ జననికి పరమప్రియమైనది. తొల్లి హరిహరబ్రహ్మ లచ్చోటనే స్త్రీభావము లొందిరి. వారు పిదప దయామతల్లి యగు దేవీకృపవలన మరల పురుషత్వమంది తమ తమ పనులు నిర్వహించుచున్నారు.
ఆ సుందరదివ్యమణిద్వీపము సుధాసాగరము నడుమ వెలుగొందుచున్నది. అందు సకల వర్ణసంశోభినియగు దేవి పలురూపముల విహరించుచుండును. కామ రూప-మాయాశక్తి-సనాతనియగు భవాని నిత్యమే మణిద్వీపమందు విరాజిల్లునో యా ద్వీపమునకే దేవతల వలన పూజాస్తుతులందుకొనిన మహిషాసుర మర్దిని యరిగెను.
ఆ సర్వేశ్వరి అదృశ్యయైన పిదప దేవతలొక రాజును చేరిరి. అతడు రవివంశజుడు-బలిశాలి-సకల శుభ లక్షణ లక్షితుడు-అయోధ్యాధిపతియగు శత్రుఘ్నుడు. దేవతలతనిని మహిషాసురుని రాజ్యమున కధిపతిగ జేసిరి. అట్లతనికి రాజ్యమప్పగించి యింద్రాది దేవతలు తమ తమ వాహనములెక్కి నిలయముల కరిగిరి.
సురులు వెడలినపిదప భూమండలమున ధర్మరాజ్యము నెలకొల్పబడెను. ప్రజలు సుఖముండిరి. మేఘము లదనునకు వానగురియు చుండెను. నేల నాల్గుచెఱగులు పాడి-పంటలతో నిండెను. చెట్లు ఫలపుష్పములతో సుఖదాయకములయ్యెను. ఆలమందల పాలపొదుగులు నిండుకుండలవలెనుండి జనుల కోర్కులు తీర్చుచుండెను.
చల్లని నిర్మలోదకముచే నొప్పుచు జంతువులకు ప్రీతి గూర్చుచు తిన్నని మార్గమున ప్రవహించు చుండెను. విప్రులు వేదతత్త్వములు నెరిగి యజ్ఞకార్యము లందు మునిగిరి. రాజులు శస్త్ర విద్యానిపుణులు-ప్రజారక్షణ పరాయణులు-న్యాయతత్పరులు-దండనీతి పరులునై యుండిరి.
భూతములలో వేటి యందును పరస్పరము వైరభావము లేకుండెను. పెన్నిధులు ధనరాసు లొసగుచుండెను. గొల్లపల్లె లాలమందలతో కళకళలాడుచుండెను. భూమి యందంతటను నాల్గువర్ణములవారును శ్రీదేవీభక్తిపరులై యుండిరి. భూమి యెల్లెడల బ్రాహ్మణ క్షత్రియులు గొప్ప యజ్ఞము లాచరించిరి. యాగశాలలు యూపస్తంభములతో నలరారుచుండెను. స్త్రీలు శీలవతులు-పతివ్రతలు-సత్యసంపన్నులునై యుండిరి. పుత్త్రులు పితృభక్తిపరులు-ధర్మపరాయణులునై వర్తించిరి. ఎచ్చటను నాస్తికత్వముగాని యధర్మముగాని లేకుండెను.
ఎల్లెడల వేదశాస్త్రవాదములు వినిపించుచుండెను. ఎవరిలోను కలహము-దైన్యము-చెడుతలంపులేవు. అకాలమరణములు లేవు. ప్రజానీకమంతయును సుఖశాంతులతో వర్ధిల్లెను. ప్రజల కెన్నడును తమ మిత్రులవలన వియోగముగాని-యాపదగాని గలుగకుండెను. దుఃఖదాయకములగు కరవుకాటకములు-అనావృష్టి-మారీరోగములు లేకుండెను.
స్త్రీ పురుషు లెల్లరు నెల్లెడల మచ్చరము వైరముమాని యే రోగములు లేక సుఖసంపదలతో నభివర్ధిల్లిరి. వేయేల? అతని పాలనలో స్వర్గమందలి యమరులవలె మనుజులు క్రీడావినోదము లనుభవించిరి. ఆనాడు భూమిపై దొంగ-నాస్తికుడు-వంచకుడు-దాంభికుడు-లోభి-చపలుడు-మందుడు- బ్రహ్మద్వేషి-పాపి మున్నగు వారెవరును లేకుండిరి. ఆనాళ్లలో మనుజు లెల్లరును ధర్మపరులై బ్రాహ్మణ సేవా పరాయణులై యుండిరి. ఈ సృష్టి మూడు విధములుగ నుండును. అటులే బ్రాహ్మణులు మువ్విధములుగ నుందురు.
వారు సాత్త్వికులు-రజసులు-తామసులని మూడు విధములగలరు: వేదార్థవిదులు-సకల సమర్థులు-స్త్వ వృత్తి గలవారు సాత్విక ద్విజులు. వీరొకరినుండి యేమియు గ్రహింపరు; దయా ధర్మశాంతిపరులు. ఆత్మవిచారరతులు న్యాయార్జిత ధనములతో సాత్త్వికభావమున పురోడాశాదికముతో యాగము లొనర్తురు. పశుహింస జేయరు.
వారు సాత్త్వికులు-రజసులు-తామసులని మూడు విధములగలరు: వేదార్థవిదులు-సకల సమర్థులు-స్త్వ వృత్తి గలవారు సాత్విక ద్విజులు. వీరొకరినుండి యేమియు గ్రహింపరు; దయా ధర్మశాంతిపరులు. ఆత్మవిచారరతులు న్యాయార్జిత ధనములతో సాత్త్వికభావమున పురోడాశాదికముతో యాగము లొనర్తురు. పశుహింస జేయరు.
బ్రాహ్మణులకు ముఖ్యమైనవి మూడు కర్మములు. అవి దానము-అద్యయనము-యజ్ఞము. సాత్త్విక బ్రాహ్మణులీ త్రివిధ కర్మము లాచరింతురు. రాజసిక విప్రులును వేదవిదులై యుందురు. వీరు క్షత్రియులకు పురోహితులుగ నుందురు. షట్కర్మనిరతులై విధి విధానమున మాంస భక్షణ మొనర్తురు; యజన-యాజనములు-దాన-ప్రతిగ్రహములు-అధ్యయనాధ్యాపనము లొనర్తురు.
తామసద్విజులు రాగద్వేషములకు కామక్రోధములకు వశులైయుందురు. వీరు కొలదిగ చదువుకొని గొప్ప గొప్ప రాజులకు పనులు చేయుచుందురు. మహిషు డంతమొందిన పిదప విప్రులందఱును వేదతత్పరులైరి. వారు దానధర్మవ్రతము లనుష్ఠించుచుండిరి. క్షత్రియులు సముచితముగ పాలించిరి. వైశ్యులు వాణిజ్య వృత్తిలో మునిగియుండిరి. శూద్రులు వ్యవసాయము-గోరక్షణ-వడ్డీవ్యాపారములు చేయుచుండిరి. ప్రాణులెల్లరును సుఖముగ నిద్రించిరి.
ప్రజలు కోపోద్రేకములు మానిరి. న్యాయముగ డబ్బు సంపాదించిరి. ఆవులు బహుక్షీరములతో నొప్పెను. నదులు శాంతముగ ప్రవహింపసాగెను. వృక్షములు ఫలభరములతో వంగియుండెను. ప్రజలు రోగములు లేకుండిరి. వారి కీతిబాధలు-ఆధివ్యాధులు లేవు. ఇట్లు ప్రాణు లెల్లరు నకాలమరణము లేక రోగ రహితులై వేద ధర్మానుసారముగ వ్యవహరించిరి. వారు హ్రీంకారిణియగు చండికయొక్క పద-కమల సేవయందు నిరతులై సకల విభవ సంపన్నులై విలసిల్లిరి.
అధ్యాయము 108 శుంభనిశుంభుల వరగర్వము
No comments:
Post a Comment