శుంభనిశుంభుల వరగర్వము
రాజా ! ఆ సర్వేశ్వరీ దేవి పావన చరితము సకల జంతు పాపహరణము. దానిని వినిపింతును. సావధానముగ నాలింపుము
పూర్వము శుంభనిశుంభులను సోదరులు దానవవీరులు. పురుషులచే చంపబడనివారు మదోన్మత్తులు దురాచారపరులు. వారు దానవసేనలను గూడి దేవతలను బాధించుచుండిరి.
అపుడాదిశక్తియగు జగన్మాత దేవతల శ్రేయోభివృద్ధికై ఘోరసంగ్రామమందు దానవ వీరులను దెగటార్చెను. ఆ సంగ్రామ రంగమందు మహావీరులగు చండముండులును రక్త బీజ ధూమ్రలోచనలును మడిసిరి. ఇట్లు లోకానుగ్రహకారిణియగు దేవి రాక్షసులజంపి సురలభయము తొలగించెను. దేవతలు మేరుగిరిపై శివప్రియను బూజించి సన్నుతించిరి అనిన
జనమేజయ మహారా జిట్లనెను : ఆ దానవ వీరు లెవరు? వారెట్లు మహాబలశాలురైరి వారి నెవరు నిలిపిరి? వారు స్త్రీ చేతిలో చచ్చుటకు కారణమేమి? విపులముగ నంతయును దెలుపుము.
వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీ పరదేవతా చరిత్రము సర్వపాపహరము సర్వార్థ ఫలప్రదము మంగళకరము. దానిని వినుము. మునుపు శుంభనిశుంభులను దానవులు పాతాళమునుండి భూమిపైకి వచ్చిరి. వారు నిండు పరువములోనుండి పావన పుష్కర తీర్థమందు నీరాహారములు మాని యోగవిద్యా నిపుణులై యొకేయాసనమందు వేలేండ్లు ఘోర తపమొనరించిరి.
వారి తపమునకు సంతసించి లోకపితామహుడగు బ్రహ్మ హంసవాహనమెక్కి యచ్చటి కేతెంచి ధ్యానరతులైన దానవులనుగని
బ్రహ్మ యిట్లనెను : లెండు, మీ తపమునకు సంతసించితిని. మీ తపో మహిమగాంచి వచ్చితిని. కోరుకొనుడు. మీ వాంఛితము లీడేర్తును. వరము లిత్తును. బ్రహ్మవాక్కులు విని వారు ధ్యానము వదలి లేచి బ్రహ్మకు ప్రదక్షిణ నమస్కారములొనర్చిరి. తనువులు కృశించియున్న ఆ ఇరువురు దండ ప్రణామమొనర్చి గద్గదమధుర వాక్కులతో బ్రహ్మకిట్లనిరి.
'దేవ దేవా! దయాసాగరా! అభయ దాయకా! నీకు మాపట్ల సంతోషము గల్గినచో మా కమరత్వము ప్రసాదింపుము. ఈ భూమిపై చావును మించిన భయములేదు. మేము మరణ భీతితో నిన్ను శరణు వేడితిమి.
దేవేదా! జగత్కర్తా! క్షమానిలయా! విశ్వాత్మా! మా మరణ భయము బాపి మమ్ము గాపాడుము' అన
బ్రహ్మ యిట్లనెను: 'మీరు కోరునదిదియా? ఇది విపరీతమైనది. ఇట్టి వరమీలోకములందింతవరకెవ్వడు నెవ్వనికి నీయలేదే! పుట్టినవాడు గిట్టుట-గిట్టినవాడు పుట్టుట అను పద్ధతిని విశ్వకర్త యీ లోకములందు సృష్టికిమున్నే యేర్పరచెను. ప్రాణులెల్లవిధముల తప్పక చావవలసినదే.
కనుక వేరొకటి కోరుకొనుడు-ఇచ్చెదను.' దానవులు బ్రహ్మ వాక్కులు విని చక్క నాలోచించుకొని తమముందున్న బ్రహ్మకు ప్రణమిల్లి యిట్లనిరి :
దయామయా! మాకు నర-పశు-పక్షులవలన చావులేని వరమిమ్ము - అదిచాలును. ఇంక స్త్రీలలో మమ్ము చంపగల బలవతియగు యువతి యెవతె యుండును? ఈ చరాచర ప్రపంచమున మేమొక స్త్రీకి జంకము. కునుక ఓ విధీ! మేమిర్వురము నరుల కవధ్యముగనట్లు వరమిమ్ము. స్త్రీలు సహజముగ నబలలు; వారివలన మా కెట్టి భయమును లేనేలేదు. వారి యీ కోర్కి విని బ్రహ్మ వారికోర్కి దీర్చి సంతోషముతో నిజాలయమున కరిగెను.
బ్రహ్మ వెళ్ళిన పిదప దానవులును తమ తమ యిండ్లకేగి శుక్రుని పురోహితునిగ నేర్పరచుకొని యతనిని పూజింపసాగిరి. శుక్రుడొక శుభదినమున శుభనక్షత్రమున నొక బంగరు సింహాసమును నేర్పరచి దానిని రాజనకొసంగెను. శుంభుడు జ్యేష్ఠుడు కనుక రాజసింహాసన మతని కీయబడెను.
ఇతర దానవులందఱు నతనిని కొలువ నేతెంచిరి. వారిలో చండ ముండులను వీర సోదరులు గలరు. వారు బలగర్వితులు. వారు తమ రథగజ సేనలతో వచ్చి చేరిరి. శుంభుడు రాజగుట విని చండవిక్రముడగు ధూమ్రలోచనుడనువాడు తాను తన బలముతో వచ్చి చేరెను.
అంతలో వరబలముగల రక్తబీజుడనువాడును తన రెండక్షౌహిణుల సేనలతో వచ్చి చేరెను. అత డజేయుడగుట కొక కారణము గలదు. అతడు పోరుచుండగ శత్రులయాయుధపు దెబ్బచే నతని నెత్తుటిబొట్లు నేలపడును. అపు డతని ప్రతి నెత్తుటి బొట్టు నుండి యతనివంటి క్రూరులు శస్త్రపాణులు లెక్కకు మిక్కిలిగ బుట్టుచుందురు. అట్లు నెత్తుట బుట్టిన వీరు లతనివంటి పరాక్రమములగల్గి వారును తిరిగి యుద్ధ మొనర్చుచుందురు. రక్త బీజ మహాసురుడందువలన నజేయుడు. మహావీరుడు. యుద్ధమున సకల భూతముల కవధ్యుడు.
శుంభుడు రాజైన పిదప నిట్లు పెక్కురు వీరులు తమ సేనలతో వచ్చి శుంభుని భృత్యులుగ జేరిరి. ఇట్లు శుంభ నిశుంభుల సేన లపరిమితముగ నుండెను. వారు తమ బాహుబలముతో భూమిపై నున్న రాజ్యము లన్నిటిని వశము చేసికొనిరి. పిమ్మట నిశుంభుడు గొప్ప సేన కూర్చుకొని యింద్రునిపై దాడి చేయుటకు స్వర్గమునకు తరలెను.
శుంభుడు రాజైన పిదప నిట్లు పెక్కురు వీరులు తమ సేనలతో వచ్చి శుంభుని భృత్యులుగ జేరిరి. ఇట్లు శుంభ నిశుంభుల సేన లపరిమితముగ నుండెను. వారు తమ బాహుబలముతో భూమిపై నున్న రాజ్యము లన్నిటిని వశము చేసికొనిరి. పిమ్మట నిశుంభుడు గొప్ప సేన కూర్చుకొని యింద్రునిపై దాడి చేయుటకు స్వర్గమునకు తరలెను.
అతడు లోకపతులతో బోరుచుండగ నింద్రు వజ్రముతో నతని ఱొమ్ముపై గొట్టెను. ఆ వజ్రఘాతమును నిశుంభుడు నేలగూలెను. అతని సేన చెల్లాచెదరయ్యెను. తన సోదరుడు మూర్ఛిల్లుట విని శుంభుడు స్వర్గమేగి సురలపై బాణములు వదలెను. యుద్ధకుశలుడగు శుంభుడు పోరుచుండగ నింద్రాది దిక్పాలకులు దిక్కులు పట్టిరి.
శుంభుడపుడింద్రాసనమును - కామధేనువును-కల్పతరువును బల్మితో గ్రహించెను. త్రైలోక్యరాజ్యమును - యాగభాగముల హరించి నందనవనముజేరి ప్రమోదమొందెను. సుధాపాన మొనర్చి సుఖము బడసెను. కుబేరు నోడించి యతని రాజ్యమును కైవసము చేసికొనెను. సూర్య-చంద్ర-యములను గెలిచి వారి పదవులు గ్రహించెను. వహ్ని-వరుణ-వాయువుల రాజ్యములను బలముతో చేపట్టి వారి పనులు తానే నిర్వహించుచుండెను.
రాజ్యసంపదలు గోల్పోయిన దేవతలు నందనవనము వదలి గిరిగుహలపాలైరి. వారధికారములు గోల్పోవుట వలన నిస్తేజస్కులైరి. నిరాయుధులైరి. నిరాలంబులైరి. దిక్కుమ్రొక్కులేనివారై వనములవెంట గ్రుమ్మరిరి. వారెల్లరును కొండగుహలందు నదీవనములందు విజన ప్రదేశములందు దిరుగాడుచుండిరి.
రాజ్యసంపదలు గోల్పోయిన దేవతలు నందనవనము వదలి గిరిగుహలపాలైరి. వారధికారములు గోల్పోవుట వలన నిస్తేజస్కులైరి. నిరాయుధులైరి. నిరాలంబులైరి. దిక్కుమ్రొక్కులేనివారై వనములవెంట గ్రుమ్మరిరి. వారెల్లరును కొండగుహలందు నదీవనములందు విజన ప్రదేశములందు దిరుగాడుచుండిరి.
లోకపాలురు పదచ్యుతులైరి. వికలమనస్కులైరి. ఎచ్చటనైనను సుఖము జెందకుండిరి. సుఖము దైవాధీనము గదా! గొప్ప జ్ఞానము-బలము-ధనము గలవాడు సైతము తనకు కాలము కలిసి రానప్పుడు దుఃఖదైన్యము లనుభవించును. కాలగతి విచిత్రము. అది రాజును బిచ్చగానిగ మార్చును. దాతను యాచకునిగ బలశాలిని దుర్బలునిగ పండితుని వికలునిగ శూరుని పిఱికివానిగ నొనర్చును.
ఇంద్రు డంతటివాడు నూఱు యాగము లొనర్చియు నింద్రాసనము బడసియు దుఃఖము లనుభవించెను. కాలగతి యిట్లే యుండును. కాలపాకము పామరుని జ్ఞానముగల ధర్మిష్ఠునిగ మార్చును. అదే కాలపాకము జ్ఞానములేని పాపిష్ఠునిగగూడ మార్చును. ఇట్టి కాలగతి కచ్చెరువంద బనిలేదు. ఏలయన హరిహరబ్రహ్మలకు సైత మిట్టి కడగండ్లు తప్పని వయ్యెను. విష్ణువు సూకరాది జన్మములెత్తెను. హరుడు నరుని పుర్రె చేత దాల్చెను. ఇది యంతయును కాలపరిపాక ప్రభావమే కదా!
No comments:
Post a Comment