దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట
అట్లు మహిషాసురుడు నిహతుడైన పిదప నింద్రాది దేవతలు పరమానందమంది జగదంబిక నీవిధముగ ప్రస్తుతింప గడంగిరి :
భగవతీ ! దేవీ ! నీ దివ్య శక్తి ప్రభావముననే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకార్యము లొనరింపగల్గుచున్నారు. కాని, నీ శక్తి తోడులేనిచో వారా యా పనులు చేయజాలరు. కనుక వాస్తవముగా సృష్టి-స్థితి-సంహారకారిణిని నీవే.
శ్రీమాతా! నీవు సత్యముగ ధ్రువకీర్తివి-ధృతివి-మతివి-విశ్వగతివి; కరుణవు-దయవు-శ్రద్ధవు-వసుధవు; ఆజప గిరిజ కమల కల జయ యను పేరుగల దానవు; తుష్టి-పుష్టి-ప్రమ-బుద్ధి-ఉమ-రమ మున్నగు వారందఱు నీవే. ఈ భువన త్రయమందలి విద్యా-క్షమా-మేధాకాంతులు నీవే. సకల లోక నివాసభూమివి నీవే. ఈ నీ శక్తులు లేనివాడు లోకమందెందులకును కొఱగాడు. ఏమియు చేయనోపడు.
విశ్వధారిణీ! నీవు ధారణాశక్తివి గానిచో శేషుడు భూమిని మోయునా? కూర్మము గిరిని భరించునా? అమ్మా! నిజమునకు నీవే భూమాతవు కానిచో మహాభారముగల భూమి నిరాధారముగ గగనతలము నందెట్లు నిలువగలదు? లోకజననీ! ఈ జనులు నీ మాయామోహితులై బ్రహ్మ విష్ణు రుద్ర చంద్రాగ్ని యమ వాయు గణపత్యాది దేవతలను సంస్తుతింతురు. ఆ దేవతలును నీచే శక్తి యుక్తులుగానిచో కార్యదక్షులగారుగదా!
జగజ్జననీ! మూఢులు దేవతల నుద్దేశించి యజ్ఞాగ్నిలో హవిస్సు వేల్తురు. నీవు స్వాహా దేవివి గానిచో దేవతలా హుతము నెట్లు స్వీకరింపగలరు? జనులు నిన్ను వదలి యితరులను గొల్చుట వలన నిజముగ మూఢులేకదా మహేశ్వరీ! నీ నిజాంశముల వలన చరాచరప్రాణులకు వారివారి కర్మానుసారముగ భోగానుభవము లొసగుదువు. నీవు నీవారైన దేవతలను పోషించు విధమున పరులను సైతము పోషింతువు తల్లీ!
మాతా! తోటలో వినోదమునకు నాటిన చెట్లు ఫలపుష్ప రసములు లేనివైనను పండితులు వానిని నఱికివేయరు. అట్లే నీవే దైత్యులను సైతము పాలింతువు. తల్లీ! నీ దయామృతరసమెంతని వర్ణింపగలము? నీవు నా బాణములతో దైత్యులను వధింతువు. ఏలన, వారును స్వర్గసీమలో సురాంగనలతో సురత క్రీడలనుభవించవలయునని నీవట్లు చేయుదువు. నీ పరమ చరితము భక్తుల కోర్కు లీడేర్చునది!
అసురులు గొప్ప బలవంతులు. ఐనను వారు నీ సంకల్ప మాత్రమున నసువుల బాయుదురు. ఇది యాశ్చర్యకరము. నీవు దేహము దాల్చుట లీలా విలాసముగానే కాని మరే హేతువుచే గాదు. కలికాలమున పురాణ చతురులగువారు వంచకులు. వారి ప్రేరణవలన మూఢులు హరిశంకరులను సేవింతురేకాని నిన్ను భజింపరు. నరులకెంత దురవస్థ పట్టినది తల్లీ! లోకశరణ్యా! దేవతలు రాక్షసపీడితులు - అట్టి దేవతలు నీకు వశ్యులు - ఐనను నరులీలోకమున మూఢులై యా దేవతలనే భజింతురు. అయ్యో! చేతిలో నిర్మలదీప ముండినను వీరు నీరులేని చీకటి నూతిలో కూలుచున్నారే!
జననీ! నీవు సుఖశాంతులొసగు సారవిద్యవు - ఘోర సంసార దుఃఖములు గల్గించునట్టి యవిద్యవు నీవే-నిన్నే నెఱనమ్మి యారాధించునట్టి ముముక్షుల యార్తి బాపు తల్లివి నీవే - అజ్ఞులు భోగలాలసులు మందమతులు నిన్ను సేవింప జాలరు.
వరేణ్యము శరణ్యమునగు నీ పాదకమల యుగమును హరి హర బ్రహ్మాది దేవతలు సంతతము కొల్చు చుందురు. అల్పమతులగు భ్రాంతులు నిన్ను సేవింప నోపక సంసారసాగరమున గూలుదురు. చండికా! భవదీయ దివ్యచరణ కమల ప్రసాదముననే బ్రహ్మ-విష్ణు-మహేశులు-సృష్టి-పాలన-సంహార కార్యము లొనరింతురు. ఈ భూమిపై నిన్ను గొల్వనివారికి నోటమాట యెటుల వచ్చును?
వరేణ్యము శరణ్యమునగు నీ పాదకమల యుగమును హరి హర బ్రహ్మాది దేవతలు సంతతము కొల్చు చుందురు. అల్పమతులగు భ్రాంతులు నిన్ను సేవింప నోపక సంసారసాగరమున గూలుదురు. చండికా! భవదీయ దివ్యచరణ కమల ప్రసాదముననే బ్రహ్మ-విష్ణు-మహేశులు-సృష్టి-పాలన-సంహార కార్యము లొనరింతురు. ఈ భూమిపై నిన్ను గొల్వనివారికి నోటమాట యెటుల వచ్చును?
పరా వాగ్దేవీ! నీ దయలేనిచో మనుజులు సైతము మాటాడజాలరుగదా! జగదేకమాతా! భృగు మహర్షి కుపితుడై హరిని శపించెను. అందుచే హరి మీన-కూర్మ-వరాహ-నారసింహ-వామనాది రూపములు దాల్చెను. అట్టి పరాధీనుడగు వానిని గొల్చినవానికి మృత్యుభయమెట్లు పాయును? దయా కల్పవల్లీ! తల్లీ! తొల్లి శివుడు వనమునందు చరించు చుండగ భృగు మహర్షి శివుని శపించెను. అపుడు శివుని లింగము నేలపైపడెను. ఇది అందఱికిని దెలిసినదే కదా! అట్టి కపాలిని గొల్చినవారి కిటనట సుఖమెటుల గల్గును?
అమ్మా! శివుని కొడుకు గణపతి. అతనిని గొల్చువారెంతటి భ్రాంతులనవలయును. వారు సకలార్థ ప్రదాయినివి సుఖసేవ నీయవు విశ్వజననివియగు నిన్నుఱుగ జాలరు గదమ్మా? అమ్మా! నీ శరములచే రాక్షసులు రణమున మరణింతురు. దయగల నీ యమృతపు చూడ్కులు వారిని సైతము స్వర్గమున కంపును గదా? కానిచో వారు తప్పక తమ కర్మాను సారముగ పాపగతియగు నరకమున గూలెడి వారే కదా! హరిహర బ్రహ్మలును గర్వమోహమున నీ మహోజ్జ్వల దివ్యప్రభావము నెఱుగజాలరు.
ఇంక నీ గుణ ప్రభావములకు మాయామోహితులగు నరులు నిన్నెట్టులెఱుగ జాలుదురు? విశ్వమాతా! మహామునులు సైతము సూర్యాగ్నులను సేవించి మూఢ మతులగుదురు. నీ భవ్యపదపద్మములు వేదశతములకును దెలియరాని పరమార్థతత్త్వము వంటివి. అట్టి నీ పదపద్మములను మునులు సేవింపక కర్మక్లేశము లనుభవింతురు. శుభకారిణీ! జననీ! ఈ లోకములందు త్రిగుణమాయా మూలమున వివిధాగమముల మూలమున హరి-హర-రవి-గణపతుల యుపాసనలు వ్యాపించినవి. మూఢులు వీనిని గల్పించుకొని నీ విషయమున భక్తిభావమును విముఖులై యుందురు.
ఓహో త్రిభువనేశ్వరీ! తల్లీ! జనులు విప్రులాగమ శాస్త్రములను తామే రచించుకొనిరి. వారు వానితో భక్తిభావముతో హరిహరుల నర్చింతురు. కాని, వారు మహామహిమగల నీ పదపద్మ సేవకు పెడమొగము పెట్టుదురు. ఐనను నీవు వారిని కోపింపక మోహకమంత్రశాస్త్ర నిపుణులుగ జేతువు. వారిపై నీ యపారదయామృతమును ప్రసరింపజేయుదువు.
ప్రణతసౌభాగ్యదాయినీ! జననీ! తొల్లిటి సత్యయుగమునందు శుద్ధసత్త్వగుణము ప్రధానముగ నుండెను. ఆనాడు సచ్ఛాస్త్రములు కానివి లేవు. కాని, యీ కలియుగమున బుద్ధిచతురులగు కవులు-పండితులు నీ నిత్య సత్యోపాసనకు స్వస్తి చెప్పి, నీవు కల్పించిన సురగణములను పూజింతురు. అవిద్యను బాపు భార్గవీ! తల్లీ! నిర్మలసత్త్వగుణముగల మునులు పరావిద్య-దరిద్ర చింతామణి - చైతన్య మధుఝురి-ముక్తియోగఫలసిద్ధిద అగు నిన్నాత్మవిచారముతో ననుధ్యానించి తల్లీనులై గర్భనరకములో గూలరు. అట్టివార లెట్టి పుణ్యులు ధన్యులు మహాత్ములో కదా!
మమ్మాదుకొను అభయవరదపదకమలా! అమ్మా! నీవు చిచ్ఛక్తి రూపమున నిర్గుణ పరమాత్మయందు వెలయుచుందువు. అందుచేతనే పరమాత్ముడు సృష్టిపాలన సంహారము లొనర్పగల్గునని తెలియుచున్నది. హృదయాంతరమున నీ స్పందనశక్తి లేనిచో ప్రాణికి శక్తి యెక్కడిది? నీ శక్తిలేని నరుడు తిరుగుటకును చలించుటకును పనిచేయుటకును జగమున నెట్లు సమర్థుడు కాగలడు? చైతన్య సుమమధూ! అంబా! చతుర్వింశతి తత్త్వములును జడతామయములు- చిచ్ఛక్తి రహితములు. అవి జగములను నిర్మింపజాలవు. ఇంద్రియములు గుణకర్మయుతములు. అవియును నీ శక్తితో గూడనిచో ఫలితము లొసగజాలవు.
అమ్మా! భవానీ! మునులు విధిప్రకారమున యజ్ఞములందు హోమము చేయుదురు. నీవు యజ్ఞములందు స్వాహాదేవివై నిమిత్తమాత్రముగ నుందువు. కానిచో దేవతలు హవిర్భాగములు గ్రహింపజాలరు. కనుక తల్లీ! ఈ విశ్వమున కేడుగడ నీవే అమ్మా, మాతా! తొలిసృష్టి రచన తొలుదొల్త నీవలననే జరిగినది. నీవు హరిహరాదులను దిక్పతులను పరిపాలింతువు. నీవంతకాలమున విశ్వమంతటిని సంహరింతువు.
అమ్మా! భవానీ! మునులు విధిప్రకారమున యజ్ఞములందు హోమము చేయుదురు. నీవు యజ్ఞములందు స్వాహాదేవివై నిమిత్తమాత్రముగ నుందువు. కానిచో దేవతలు హవిర్భాగములు గ్రహింపజాలరు. కనుక తల్లీ! ఈ విశ్వమున కేడుగడ నీవే అమ్మా, మాతా! తొలిసృష్టి రచన తొలుదొల్త నీవలననే జరిగినది. నీవు హరిహరాదులను దిక్పతులను పరిపాలింతువు. నీవంతకాలమున విశ్వమంతటిని సంహరింతువు.
కనుక నీ సచ్చరిత్ర దేవతలకే యెఱుగరానిది. ఇక మందభాగ్యులగు నరు లెట్లెఱుగగలరు? బ్రహ్మ గ్రంథి విచ్ఛేదినీ! శివమహిషీ! మహిషరూపము దాల్చిన మహోగ్ర రాక్షసు నంతమొందించి దేవతలను బ్రోచితివి. నీ తత్త్వమును వేదములు సైత మెఱుగజాలవు. మందమతులమగు మేమెట్లు నిన్ను నుతింపగలము? ఓ మహిషాసురమర్దినీ! అహంమమతానాశినీ! భువనకంటకుడు దుర్దముడు దుష్టుడు నగు రాక్షసుని సంహరించి మాకు శుభము గూర్చితివి. నీ చల్లని కీర్తిచంద్రికలు జగము లెల్ల నిండినవి. కాన తల్లీ! మమ్మనుగ్రహించి సతతము కాపాడగదవమ్మా! అని విబుధులు సన్నుతింపగ
శ్రీదేవి సంతసించి వారికి మృదుమధుర స్వరమున నిట్లనియెను : సురలారా! మీ కింకను సాధ్యముగాని పని యున్నచో దెలుపుడు. మీ కసాధ్యమైన కార్య మెప్పుడెపుడు సంభవించునో యప్పుడపుడు నన్ను స్మరింపుడు. తలచినంతనే నేను మిమ్మాదుకొందును. మీ యాపదలు తొలగింతును'' అన
దేవత లిట్లనిరి: దేవీ! అఃల దేవతాత్మా! మా శత్రువగు మహిషాసురుని సంహరించితివి. మమ్ముద్ధరించితివి. మా కార్యము నెరవేర్చితివి. అమ్మా! అభయ వరము లొసగు నీ పదపద్మములను మేము నిరంతరము సంస్మరించునట్లును మాకు నీయందు నిశ్చలైకాంతికభక్తి గల్గునట్లు ననుగ్రహింపుము. అమ్మా! నీవమ్మవలె మా యపరాధము లన్నియు సైతువని జనులకు తెలియును. ఐనను ఆరు జగత్కారణవగు నిన్ను భజింపరు. ఈ శరీరమునందు రెండు పక్షులు స్నేహముతో నివసించుచున్నవి. అపరాధములు సైచు మూడవ మిత్రు డెవడును లేడు. ఆ రెంటిలో జీవు డొక పక్షి. అతడు నిన్ను వదలినచో నతనికి గతులు లేవు. అట్టివాడు దేవమనుజులందు మహాపాపి-మందభాగ్యుడు. ఈ మనుజ జన్మము కడు దుర్లభమైనది. ఇట్టి యుత్తమజన్మ బడసియును మనోవాక్కాయ కర్మలతో నిన్ను స్మరింపనివాడు నిజముగ నరాధముడని మేము పలుమారులు నొక్కి పలుకుచున్నాము.
కావున తల్లీ! లోకశరణ్యా! మా సుఖదుఃఖములందు మాకు నీవే శరణ్యము. దేవీ! నీ సర్వాయుధములతో మమ్ము సర్వకాలము బ్రోచుచుండుము తల్లీ! నీ పదపద్మరజము గాక మాకు మఱి శరణము లేదమ్మా!'' అని యీ ప్రకారముగ స్తుతింపబడి శ్రీదేవి యచ్చట నదృశ్యురాలయ్యెను. అట్లు దేవి యంతర్ధానమందుట గని దేవత లెల్లరును పరమ విస్మయమందిరి.
No comments:
Post a Comment