మహిషుని మంత్రాలోచనము
ఆ జగదంబిక తామ్రుని మాటలు విని నవ్వి మేఘగంభీర వాక్కుతో వారి కిట్లనియెను :
''త్రామ్రా ! నీ పతి మూఢుడు-మందమతి-జ్ఞానశూన్యుడు-కామార్తుడు. చావు మూడి నాతో పగ పూనినవాడు. అతని చెంతకేగి యిట్లనుము:
నీవు గడ్డి-గాదము-తినువాడవు. తోక-కొమ్ము లాడించువాడవు. బానకడుపు గలవాడవు. నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు-వరుణకుబేరులు మొదలుగాగల దేవతలలో నెవరియందును మనసు లేదు. ఇంతటి దేవగనమును త్రోసిరాజని యొక నాలుగుకాళ్ళ పసరము నేమని వరింపగలను? అపుడు లోకము నన్ను నీవు పనికిమాలినదానవని నిందింపదా? నేను వేరొక పతిని వరించుదానను గాను. నాకు పతిగలడు.
అతడు సర్వకర్త-సర్వసాక్షి-అకర్త-నిష్కాముడు-విశ్వప్రభుము-సుస్థిరుడు-నిర్గుణుడు-నిరాలంబుడు-నిర్మముడు-నిరాశ్రయుడు-సర్వజ్ఞుడు-సర్వగుడు-సుహృత్తముడు-అనంతుడు-పూర్ణకాముడు-విశ్వరూపుడు-పరమశాంతుడు-విశ్వచక్షువు హృదయాంతరజ్యోతి-దక్షుడు-పశుపతి-విశ్వభావనుడు.
అట్టి సదాశివుని విడనాడి యొక మందుని మహిషుని సేవింప నెట్టులుత్స హింతును? నన్నిట్టు లెఱిగియును వాడు నాతో యుద్ధము చేయుచో వానిని యముని వాహనముగ గాని నరులకు నీరు మోయు వాహకముగ గాని యొనరింతును. వానికి బ్రదికి బట్టకట్టవలయుననియున్నచో దానవుల నెల్ల వెంటగొని వెంటనే పాతాళమేగుమనుము. కానిచో సంగ్రామమందు వాని యంతు తేల్చుకొందుననుము.
ఈ జగమున సమానులకు గలిగిన సుయోగము సుఖప్రదమగును. కాని యజ్ఞానమున వికల్పిమైన యోగము దుఃఖదాయక మగును. నీవు నన్ను నీ పతిని భజించుమంటివి. దీనినిబట్టి నీవును మూర్ఖుడవే. కొమ్ములున్న మహిషుడెక్కడ? పద్మవర్ణనగు నేనెక్కడ? మా యిద్దఱికిని సంబంధ మెట్లు కూడును? నీవు పాతాళము వెళ్ళిన వెళ్ళుము. లేదా నాతో బోరుము. నిన్ను-నీబందుగుల-నిపుడే రూపు మాపెదను. నీవు దేవలోకమును యాగ భాగములను వదలి సుఖముండుట మంచిది.
అని యిట్లు జగదంబ కల్పాంత మహాఘోషమో యన దైత్యులకు భయావహముగ గర్జించెను. ఆ గర్జాధ్వనికి భూమి కంపించెను. గిరులు క్రక్కదలెను. దానవ భార్యలు గర్భములు స్రవించెను. తామ్రుని గుండె దడ దడ కొట్టుకొన నతడు మహిషుని చెంతకు పరుగుదీసెను. దేవి భీకర ధ్వనికి నగరమందలి దైత్యులెల్లరు చెవిటివారై చింతాభీతులై పారిపోయిరి.
సింహము కూడ మహాక్రోధముతో మహాభయంకరముగా గర్జించెను. దాని ధ్వనికి దైతేయులు భయకంపితులైరి. అట్లు తామ్రుడు వెనుదిరిగి వచ్చుట గని మహిషు డతిమోహితుడై తన మంత్రులతో కర్తవ్యముగూర్చి మంతనములు జరిపెను. ఇప్పుడు కోటలో దాగుదమా? బయటి కేగి పోరుదమా? కాలికి బుద్ధి చెప్పుదామా? మీరు ధీశాలురు-అజేయులు-శాస్త్ర విదులు కాన కార్యసిద్ధికి రహస్యముగ నాలోచనలు నెఱపుడు.
రాజ్యమునకు మంత్ర మాధారము. అది సదాచారముగల తెలిసిన మంత్రులచే నెల్ల భంగుల రక్షింపబడదగినది. మంత్రము గుట్టు బట్టబయలైనచో రాజ్యమునకు రాజునకు చేటు మూడును. కనుక రాజు సేమము గోరువాడు దానిని వెల్లడి సేయక గుప్తముగ నుంచవలయును. దేశ కాలానుసారముగ రాజనీతి నిర్ణయించి సకారణముగ మంత్రు లెల్లరిపుడు హితము పలుకవలయును.
ఆమె దేవతా శక్తిసంపన్న. ఏకమూర్తి. తోడులే కొక్కతెయే వచ్చినది. ఆమె యబలగాదు. సబల-ప్రబల. కనుక నామె రాకకు కారణమేమో యెఱుగడు. ఆమె యుద్ధమునే కోరుచున్నది. ఇంతకంటే నాశ్చర్యమేమున్నది? యుద్ధము వలన మేలో-కీడో యేది జరుగునో యెవడెఱుగును? పెక్కుమంది యున్నను జయము కలుగక పోవచ్చును. ఒక్కడున్నను విజయము కలుగవచ్చును.
రణమునందు జయాపజయములు దైవాధీనములని యెఱుగవలయును. అదృష్టమనగ దైవము-భాగ్యము. దాని స్వరూపమేమి? దాని నెవరు గాంచిరి మున్నగు నవన్నియు నుపాయము లెఱిగిన పండితు లెఱుగుదురు. అట్టి దైవము పిరికివారి నాశ్రయించుకొని యుండును. ఐనను దాని యునికికి ప్రమాణమేమి? అది సమర్థుల జోలికిపోదు. మహాశూరునకు ప్రయత్న మిష్టము. పిరికివానికి దైవ మిష్టము. కనుక మన మిపుడు బుద్ధితో చక్కగ నాలోచించి కార్యము నడుపవలయును.
అను మహిషుని సహేతుకములగు మాటలు విని బిడాలాఖ్యుడు కైమోడ్చి మహిషున కిట్లనెను :
అను మహిషుని సహేతుకములగు మాటలు విని బిడాలాఖ్యుడు కైమోడ్చి మహిషున కిట్లనెను :
'రాజా! ఆ విశాలాక్షి యెవర్తు? ఎటనుండి వచ్చినది? ఎవరి భార్య? మున్నగు విషయములను మొదట తెలసికొనుటకు యత్నింపవలయును. నీకు స్త్రీ చేతిలో చావు గలదని సురులకు తెలియును. కనుక వారు తమ తమ తేజముల నుండి యీ కమలదళాక్షిని సృజించి పంపియుందురు.
ఇపుడు వారెల్లరును రణము జూచు కౌతుకముతో గగన వీథులందు దాగియున్నారు. తఱియెఱింగి వారామెకు సాయముగ పోరు కొనసాగింతురు. ఆ కామినిని ముందుంచుకొని విష్ణుడు మున్నగు దేవత లెల్లరును మమ్ముల నందఱను వధింపగలరు. ఆమె నిన్ను రణమున చంపితీరును. వారు చేయదలచినదిదే యని నేను ముందే యెఱింగితిని. కాని, భవిష్యత్తును దెల్పు జ్ఞానము మాత్రము నాకు లేదు. ఇత్తఱి యుద్ధము చేయరాదని నేను మాత్రము నీకు చెప్పజాలను. ఇది దైవకృత కార్యము. దెల్పు జ్ఞానము మాత్రము నాకు లేదు. ఇత్తఱి యుద్ధము చేయరాదని నేను మాత్రము నీకు చెప్పజాలను.
ఇది దైవకృత కార్యము. ఇందు నీకు దోచినట్లుగ జేయుము. కార్యభారమునుబట్టి మేమును నీతోబాటు చావవలసినదే. విహరించునపుడు నీతో గలిసి మేమును విహరించవలసినదే. ఇది అనుజీవుల ధర్మము. ఒంటరిగ వచ్చి ఆ కామిని మన యింతటి బలదర్పములుగల సేనను సైతము పోరుటకు పురికొల్పుచున్నదను విషయము బాగుగ విచారించదగినది అన
దుర్ముఖు డిట్లనెను: రాజా! ఈ యుద్ధములో మనకు గెలుపు గలుగదని నాకు తెలియును. ఐనను లోకమం దపకీర్తి గలుగునట్లు నేడు పారిపోవుటయును తగదు. ఇంద్రాదులతో పోరునప్పుడును మన మిట్టి నిందిత కార్యము చేయలేదు గదా! మఱి యొంటిగ నున్న యొక యాడుదానిని గని యెవ్వడు పిక్కబలము చూపగోరును? రణము వలన విజయమో మరణమో లభించి తీరును.
కాన పోరవలసినదే. ఏది కానున్నదో యది జరిగి తీరును. తెలిసినవాడు దీనికింతగ వగవడు. మనము చచ్చితిమా - కీర్తి గలుగును. బ్రతికితిమా - సుఖము గలుగును. ఈ రెంటి నెఱింగి యిపుడు యుద్ధము చేయుట కార్యము. ఆయువు మూడినచో చావు తప్పదు. పరుగెత్తినచో నపకీర్తి తప్పదు కనుక జీవన మరణ విషయమున నింతగ శోకింపబనిలేదు.''
అను దుర్ముఖుని మాటలు విని వాక్యవిశారదుడగు బాష్కలుడు చేతులు జోడించి యిట్లనెను :
అను దుర్ముఖుని మాటలు విని వాక్యవిశారదుడగు బాష్కలుడు చేతులు జోడించి యిట్లనెను :
ఈ కొలది పని నింతకాతర భావముతో చింతింపదగదు. ఇపుడు నేనొక్కడనే వెళ్ళి యాచంచలాక్షియగు చండిక యుక్కడగింతును. ఈ పట్టున నుత్సాహము బూనవలయును. వీరమునకు స్థాయిభావ ముత్సాహము గదా! భయానకము వీరమునకు విరుద్ధరసము. కనుక నేను భయము విడనాడి యద్భుత యుద్ధమొనర్పగలను.
ఆ చండికను యమాలయమున కంపుదును. ఇంద్ర-అగ్ని-యమ-వరుణ-వాయు-కుబేరులు-శివకేశవులు-సూర్యచంద్రులు మున్నగువారిలో నెవని వలనను నాకు భయము లేదు. ఆమె మదగర్వితయగు పడతి. ఆమెను నా వాడి బాణములతో దునుమాడగలను. నా భుజబలము నేడు చూతువు గాక! ఆమె నెదుర్కొనుటకు యుద్ధమునకు నీవు వెళ్ళవలదు. నీవు సుఖముగ నుండుము. బాష్కలుడు క్రొవ్వి మదగర్వమున నిట్లు ప్రేలగా దుర్ధరుడు మ్రొక్కి రాజున కిట్లనెను
ఓ మహిషా! ఆ దేవి అష్టాదశ భుజరమ్య-కారనాంతరమున వచ్చినది. ఆమెను నే నోడింపగలను. దేవత లెల్లరు కలిసి నిన్ను బెదరించుట కీ మాయ పన్నిరి. ఇదొక బిభీషికగ నెఱుగుము. నీ మదిలోని మోహమును వదలుము. దీనినే రాజనీతి యందురు. ఇక మంత్రికార్యము వినుము.
ఓ మహిషా! ఆ దేవి అష్టాదశ భుజరమ్య-కారనాంతరమున వచ్చినది. ఆమెను నే నోడింపగలను. దేవత లెల్లరు కలిసి నిన్ను బెదరించుట కీ మాయ పన్నిరి. ఇదొక బిభీషికగ నెఱుగుము. నీ మదిలోని మోహమును వదలుము. దీనినే రాజనీతి యందురు. ఇక మంత్రికార్యము వినుము.
సాత్త్వికులు-రాజసికులు-తామసికులు అని మంత్రులు ముత్తెఱగులు. సాత్త్విక మంత్రి తన పూర్ణశక్తితో ప్రభు కార్యము సాధింపగలడు. మంత్రశాస్త్రకుశలుడు-ధర్మపరుడు-ఏకాగ్రచిత్తుడు నగు మంత్రి తన స్వామి కార్యమునకు హాని గలుగనీయక తన విధి నెరవేర్చును. రాజసమంత్రి మనస్సు దీనికి భిన్నము. యాదృచ్ఛికముగ అతడు తన సొంతపనిలో మునిగియుండును. ఐనను నప్పుడప్పుడు ప్రభుకార్యము నెరవేర్చును.
తామసులు స్వార్థలోభరతులై ప్రభుకార్యము చెడగొట్టి తమ పని సాధించుకొందురు. వీరింటనే యుండి సమయము వచ్చినప్పుడు శత్రులచే వంచన చేయబడి తమ గుంపులనుండి చీలి తమ రహస్యములు వైరులకు వెల్లడింతురు. వీరొఱలో దాచిన కత్తివంటి వారు. రాజకార్యము భేదించువారు. సంగ్రామము సాగునపుడు భయపెట్టువారు. ఇట్టి వారి నే నాడును నమ్మరాదు. నమ్మినచో కార్యహానియు మంత్రహానియు జరుగును.
స్వార్థులు-పాపరతులు-శఠులు-బుద్ధిహీనులునగు తామసులు పైకి విశ్వాసము నటించి చేయజాలని అపకార మేమున్నది? కనుక నేనే రణమున దుమికి పోరుదును. నీవిం కెంతమాత్రము వంత జెందకుము. ఆ దురాచార నిప్పుడే పట్టుకొని వత్తును. నేడు చూతువుగాని నా ప్రభుభక్తి నా భుజాశక్తి నా బలము నా ధైర్యము.
No comments:
Post a Comment