Wednesday, April 15, 2026

Chapter 100 Sridevi Bashkala Dhrmukhulanu Dunumaduta - అధ్యాయము 100 శ్రీదేవి బాష్కలదుర్ముఖులను దునుమాడుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 100

శ్రీదేవి బాష్కలదుర్ముఖులను దునుమాడుట

సకల శస్త్రాస్త్ర నిపుణులు మదమత్తులునగు బాష్కల దుర్ముఖులు ఇట్లు పలికి రణమునకు తరలిరి. ఆ మదోన్మత్తులు మేఘగంభీరవాక్కులతో మహాదేవి కిట్లనిరి: 

దేవదేవీ! మహిష మహీపతి నిర్జరులను నిర్జించెను: నీ వా దైత్యపతిని వరింపుము. అతడు సర్వలక్షణలక్షితమగు మనుజరూపము దాల్చును. దివ్యభూషలు ధరించును. నీ సన్నిధికి ఏకాంతమున రాగలడు. 

సుహాసినీ! అతని యందు నీ మనస్సు లగ్నము చేయుము. త్రైలోక్య సంపద లనుభవింపుము. సుమధురభాషిణీ ! ఆ మహావీరుని పతిగ బడయుము. స్త్రీలు సహజముగ వాంఛించు నద్భుత సంసార సుఖము లనుభవింపుము అన 

శ్రీదేవి యిట్లనియెను : మూఢులారా! నన్ను కామమోహితగ మందమతిగ నెంచుచున్నారా? నే నా దుష్టమహిషు నెట్లు సేవింపగలను? కులాంగనలు తమకంటె బుద్ధి సురూపము శీలము నేర్పు నోర్పు నెక్కువగనుండి తమకన్నివిధాల సదృశమైన కులశీలములు గలవానిని సేవింతురు. 

ఏ దేవరూపిణియైన కామాతురతతో పశువులలో నధముడు పశురూపియగు మహిషాధముని సేవించునా? వాని కేనుగంత మేను గలదు. పొడవైన కొమ్ములు గలవు. కనుక మీరా మహిషుని చెంతకేగి నా మాటలుగ వానితో నిట్లనుడు. నీవిపుడు పాతాళమేగుము. లేక నాతో సమరమొనర్పుము. ఇపుడు దేవపతి యుద్ధమున కెంతమాత్రము వెనుకంజ వేయడు. నేనిపుడు నీ యంతు తేల్చుకొనక తిరిగి వెళ్ళను. 

దుర్మతీ! ఇట్లెఱిగి నీకు దోచినట్లు చేయుము. నన్ను గెల్వుము. పారిపోయినచో నీకు స్వర్గమందుగాని భూమియందుగాని గుహలందుగాని ఎక్కడేని నిలువ తావుండదు.

అను దేవి మాటలు విని దైత్యు లిర్వురును కోపమున కండ్లెఱ్ఱజేసి విల్లమ్ములుదాల్చి యుద్ధమున కాయత్తపడిరి. పరాశక్తి నిర్భయముగ నిలిచి భయంకరమైన ధ్వని చేసెను. దైత్యులాదేవిపై బాణవర్షములు గురిసిరి. అపుడు ప్రజ్వలిత శక్తియగు దేవియును దేవకార్యార్థసిద్ధికై మధురనాద మొనరించుచు దానవులపై శరపరంపరలు ప్రయోగించెను. 

రణాంగణ మందున మొదట దేవికి సమ్ముఖమున బాష్కలుడుండెను. దుర్ముఖుడు తానును దేవిని చూడగోరి యామెకెదురేగెను. శ్రీదేవికిని బాష్కలునకును బాణ-అసి-పరిఘలతో ఘోర యుద్ధము సంఘటిల్లెను. విజయరూపిణియగు దేవి బాణము లాకర్ణాంతము లాగి క్రోధముతో నా యుద్ధ దుర్మదుని గాయపఱచెను. 

దానవుడును సింహముపై బాణములను విసరెను. దేవి వానినెల్ల నడుమనే తునకలుచేసి పది వాడి బాణములతో వాని నెదుర్కొని పల్మారు పకపక నవ్వెను. ఆమె మరల నర్ధచంద్ర బాణముతో వాని విల్లు దునిమెను. వాడు గదగొని దేవిపై కురికెను గదగొని తనపైకి వచ్చు మదగర్వితుని చండి తన గదాఘాతముతో నేలపై పడవేసెను. 

నేలపై పడినవాడు ముహూర్తమాత్రాన లేచి చండవిక్రమముతో చండికపై గద విసరెను. వాడు మరల లేచివచ్చుట గని దేవి క్రోధాతిరేకముతో వాని ఱొమ్మున త్రిశూలము నాటెను. ఆ గట్టి దెబ్బతిని బాష్కలుడు నేలకొరిగి యసువులు పాసెను. అంతట వానిసేన చెల్లాచెదరయ్యెను. సురలు మింట జయజయ ఘోషములు చేసిరి.

బాష్కలుడు నిహతుడు గాగా మహాబలుడగు దుర్ముఖుడు క్రోధకర్త నయనములతో పోరుటకు శ్రీదేవి ముందునకు వచ్చెను. అతడు విల్లమ్ములు దాల్చి కవచము తొడిగి యరదమెక్కి 

'నిలునిలు బాలా!' యనుచు పలుమారు గావుకేకలు పెట్టెను. వచ్చువానినిగని దేవి విజయశంఖము పూరించెను. వానికి రోషము గల్గునట్లుగ వింట నారిటంకారమొనరించెను. వాడాశీవిషమువంటి వాడి బాణములు వదలగా మహామాయ వానినెల్ల తన కఱకుటమ్ములతో ఛేదించి ఘోరనినాదమొనర్చెను. 

అపుడు వారిర్వురకు బాణ-శక్తి-గదా-ముసల-తోమర-ప్రహారములతో అపుడు వారిర్వురకు బాణ-శక్తి-గదా-ముసల-తోమర-ప్రహారములతో ఘోరసంగ్రామము జరిగెను. రణాంగణమున నెత్రుటేర్లు ప్రవహించుచుండెను. వాని తీరములందు తెగిన వీరుల తలలు దొరలియాడు చుండెను. తలలు యమకింకరనాయకులు క్రొత్తగా యమలోకములో శిక్ష ననుభవింప వచ్చినవారిని వైతరణీనది దాటించుటకు సంతసమున తెచ్చిన తుంబీఫలములవలె నుండెను. 

రణరంగము తెగిపడిన పీనుగుల మొండెములను దిను తోడేళ్లతో భీకర బీభత్సముగ నుండెను. అందొక్కచో తెగిపడిన దుష్టుల శవములను గ్రద్దలు-డేగలు-నక్కలు-కుక్కలు కాకకంకాయోముఖములు పీకికొని తినుచుండెను. ఆ పీనుగు పెంటలనిండ భరిపరాని దుర్గంధము నిండి యుండెను. అపుడు మహాకోపి దుష్టుడు నగు దుర్ముఖుడు కాలమోహితుడై తన కుడిచేయెత్తి సగర్వముగ దేవితో నిట్లనెను :

చండీ! నీకు దుర్బుద్ధి పుట్టినది. వెళ్ళి పొమ్ము. పోనిచో నిన్ను చంపుదుము. లేక మదగర్వితుడగు మహిషునకు లొంగిపొమ్ము. అని 

శ్రీదేవి యిట్లనెను: నీకు వినాశకాలము దాపురించినదిరా. కాలమెహితుడవై కాఱుకూతలు కూయుచున్నావు. నిన్ను నిపుడే బాష్కలు నంపిన చోటి కంపుదును. పోరా మందా! నీకు చావు రుచించినచో నిలుము. నిన్ను చంపి పిదప మహిషుని వధింపగలను అను దేవి మాటలు విని దుర్ముఖుడు చావసిద్ధపడి దేవిపై బాణములు కురిసెను. ఆమె సత్వరమే తన బానములతో వాని బాణములను ఛేదించెను. 

పిదప నామె వృత్రుని మహేంద్రుడు బాధించినట్లు తన వాడి బాణములతో వానిని గాయపఱచెను. ఆ యిర్వురి పోరితము చూపఱలకు భయంకరముగ నుండెను. అది భీరులకు భయమును శూరుల కుత్సాహమును గల్గించెను. రణచండి వెంటనే వాని విల్లువిఱిచి యైదు బాణములతో వాని యరదము నుగ్గునుగ్గొనరించెను. 

దుర్ముఖుడు దుర్ధరునిగద తీసికొని చండికపై కురికెను. వాడు తన బలముకొలది గదతో సింహము తలపై మోదెను. అది దెబ్బ తినియు నా వంతయును చలింపలేదు. అంబిక తన బెడిదపుటడిదముతో దుర్ముఖుని తల తెగనఱికెను. వాడు నేల గూలెను. 

సురుల హర్షధ్నాములు జయకారములు మిన్నుముట్టెను. వాడు చావగానే దేవతలు మింట నిలిచి శ్రీదేవిని స్తోత్రము చేసిరి. విరివానలు గురిసిరి. జయజయ ఘోషలు పెట్టిరి. సమరతలమున దానవుడు పడిపోవుటగని సిద్ధులు-విద్యాధర-గంధర్వ-కిన్నరులు హర్షామోదములు వెలిపుచ్చిరి.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...