Thursday, April 16, 2026

Chapter 120 Even the gods are captivated by Mahamaya - అధ్యాయము 120 మహామాయకు దేవతలు సైతము మోహితులగుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 120

మహామాయకు దేవతలు సైతము మోహితులగుట

రాజిట్లనియెను : మునీశ్వరా! ఇతడు వైశ్యుడు. ఇతని దారపుత్త్రులితని నిల్లు వెడలగొట్టిరి. ఇట్టి ఇతడీ వనమును జేరి నాతో నెయ్యము నెఱపెను. ఇతడు కుటుంబ వియోగముతో దుఃఖముతో దుర్మనస్కుడై చిత్తశాంతి గోల్పోయెను. నేను నట్లే రాజ్యభ్రష్టుడనై దుఃఖార్తుడనైతిని. ఈ యకారణమైన చింత నా యెదను దహించివేయుచున్నది. 

అక్కటా! నాగజాశ్వములు శత్రువులపాలై యెంతగ దుర్బలమైనవో కదా! నా సేవకులు నన్ను క్షణమైన జూడకున్నచో కొందలపాటు జెందుదురు. నా శత్రువులు నా ధనాగారమును త్రుటిలో శూన్యము చేసియుందురు. ఇట్టి చింతలచే నాక నిద్రాసుఖముగూడ గల్గుటలేదు. ఈ జగము కలవంటిదని యెఱుంగుదును. ఐనను నా మది కుదుటపడుట లేదు. నేను వాస్తవమున ఎవడను? ఈ గజాశ్వములతో నాకేమి సంబంధము? వాస్తవముగ ఈ సోదరులును ఈ పుత్త్రమిత్త్రులును లేరు. ఐనను వారి వియోగమున నాకు బాధ గల్గుచున్నది. 

ఇది అంతయును మిథ్యయని యెఱుంగుదును. ఐనను నా మదికి శాంతి చేకూరుటలేదు. నా మనసునుండి మోహభ్రాంతులు తొలగుటలేదు. ఇది అంతయు వింతగ నున్నది. స్వామీ! నీవు సర్వవిదుడవు. సర్వసంశయములు తీర్చువాడవు. 

కనుక దయానిధీ! నా యొక్కయు వైశ్యుని యొక్కయు మోహమునకు కారణమేమో తెలుపుము అని యిట్లు రాజు మునితో బలికెను. 

అంత ముని రాజునకు శోకమోహ నాశకమగు జ్ఞానబోధము నిట్లు చేసెను. రాజా! వినుము. నీకు బంధమోక్షముల కారణము వివరింతును. ఎల్ల ప్రాణులందలి త్రిగుణముల సమావస్థ మహామాయ యనబడును. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు - ఇంద్రాగ్ని వరుణులు - సకల దేవతలు - గంధర్వోరగ రాక్షసులు - మనుజులు - మృగ-పశు-పక్షులు-చెట్లు-తీగలు-ఈ మున్నగున వన్నియును మహామాయ కధీనములు. ఇవన్నియును బంధమోక్షము లందవలసినవే. 

ఈ చరాచర జగమంతయును మాయచేతనే సృజింపబడినది. సకల జీవరాశి మోహజాలమందు బంధింపబడి - మాయకు జిక్కియున్నది. నీవొక క్షత్రియుడవు. మనుజమాత్రుడవు. రజోగుణముతో మలినుడవు. నీవెంతటివాడవు!

మునులమగు మేము నజ్ఞానులమే. మా చిత్తములును మోహపరవశములే. వేయేల? హరిహరబ్రహ్మలు జ్ఞానసంపన్నులు గదా! వారనురాగబంధాలతో మోహావేశాలతో నెల్లలోకములు పరిభ్రమింతురు. 

మున్ను సత్యయుగమందు విష్ణువగు నారాయణుడు వెలుగుచుండెను. ఆతడు శ్వేతద్వీపమున బ్రహ్మ విద్యాప్రాప్తికి పదివేలేండ్లు మహోగ్రతప మొనరించెను. మోహపాశము నుండి బయలుపడుటకు బ్రహ్మ సైత మొక విజన ప్రదేశమున మహాద్భుతముగ తప మొనరించెను. 

అంతలో విష్ణువును మరొక స్థలము కుతూహలముతో తన తపోభూమి వదలి వేరొకస్థాన మేగదలచెను. అపుడు బ్రహ్మయును తన పూర్వస్థానము వదలి మరొకచోటి కేగసాగెను. బ్రహ్మవిష్ణువులు మార్గమధ్యమున గలసికొనిరి. వారొకరి నొకరు చూచుకొని నీవెవ్వరవు - నీవెవరవని పరస్పరము ప్రశ్నించుకొనిరి. 

'నేనే యీరేడులోకాలకు కర్త' నని బ్రహ్మ యనెను. నే నచ్యుతుడను. జగత్కర్తను నేనే. నీవు మూఢుడవు. రజోగుణప్రధానుడవు. నీ బలమేపాటిది? నేను సత్త్వగుణము నాశ్రయించితిని. నన్ను సనాతనుడగు వాసుదేవునిగ దెలిసికొనుము. తొల్లి మధుకైటభులు నిన్ను పీడించిరి. నీవపుడు నన్ను శరణుజొచ్చితివి. 

అంత నేను వారితో బోరి నిన్ను గాపాడితిని. ఓరీ మందమతీ! ఆ దానవులు నా చేతిలో మడిసిరి. ఏల విఱ్ఱవీగుదువు? ఈ మాయామోహము నికనైన విడనాడుము. ఈ విపుల ప్రపంచమునందు నాకంటె నధికుడు లేడు అని విష్ణు వనెను. 

ఇట్లు బ్రహ్మ విష్ణు లొకరితోనొకరు వాదించుకొనిరి. వారి కన్నులనుండి నిప్పురవ్వలు రాలుచుండెను. వారి పెదవు లదరసాగెను. అంతలో నా వాది ప్రతివాదు లిరువురి నడుమ నొక వింత జరిగెను. 

పాతాళము నుండి గగనమంత మహాదీర్ఘము - విపులతరము నగు నొక జ్యోతిః స్ఫాటిక మహాలింగము వారి నడుమ ప్రాదుర్భవించెను. అది పూర్ణచంద్రామృతమువలె సుందరముగ తెల్లగ నొప్పెను. అంత గగనసీమ నుండి యాకాశవాణి పరస్పరము వాదించుచున్న ఆ మహాభాగులను ఇద్దరను సంబోధించి ఇట్లనెను:

''మహానుభావులగు బ్రహ్మవిష్ణులారా ! మీరు పరస్పర వివాదము చూసుకొనుడు. మీలో నెవ్వరైన ఈ మహాలింగముయొక్క పైకొననుగాని క్రిందికొననుగాని కనుగొన్నచో వారే శ్రేష్ఠులు. నా మాట ప్రమాణముగ స్వీకరింపుడు. వట్టి మాటలు కట్టి పెట్టుడు ఒకరు పాతాళ మేగుడు; మరొక రాకాశము వైపు వెళ్ళుడు. మీకు మధ్యస్థుడుకూడ నుండవలయును'' అను గగనవాణి విని బ్రహ్మవిష్ణులు సన్నద్ధులై యాపనికి పూనుకొనిరి. 

ఆ మహాలింగమును కొలుచుటకు బ్రహ్మ నింగివైపుగను విష్ణువు రసాతలము వైపుగను బయలుదేరిరి. విష్ణువు తన మహాశక్తితో లింగమును కొలుచుటకు బయలుదేరెను. కాని కొంత దూరమేగిన పిమ్మట విష్ణు వలసట చెందెను. ఎంతకును లింగము మొదలు తెలియనందున విష్ణువు తిరిగి తన యథా పూర్వ స్థానమునకు వచ్చి చేరెను. 

బ్రహ్మ మాత్రము పై కేగుచునే యుండెను. అతనికి త్రోవలో మొగలిపూవు కనబడెను. అది పరమ శివుని తలనుండి జారి పడుచుండెను. బ్రహ్మ దానిని గొని హరికి చూపించెను. నేనే యీ మహాలింగముపై నుండి యీ మొగలిపూవు తెచ్చితినని బ్రహ్మ యసత్యమాడెను. 

నీ మదికి శాంతి గలుగుటకు సాక్ష్యముగ దీనిని నేనే కొనివచ్చితిని అను బ్రహ్మ మాటలు వినిన విష్ణువు మొగలి పూవును గాంచి దీనికి సాక్షి యెవరో చెప్పుము. యథార్థవాది - శుచి - మేధావి - సర్వసముడు - సదాచారి - ఇట్టి వారెల్లెడల వివాదము గల్గినపుడు సాక్షులుగ నుండవలయును. అనగా 

బ్రహ్మ యిట్లనెను: అంతటి దూరమునుండి యిపుడెవడు అట్టి సాక్షి రాగలడు? ఈ మొగలిపూవే నీకు సాక్ష్యమిచ్చును. అనుచు సాక్ష్యము పలుకుమని బ్రహ్మ ఆ పూవును ప్రేరించెను. 

ఆ పూవు వెంటనే హరితో 'నేను శివలింగముపై నుండగ బ్రహ్మ నన్ను గొని వచ్చెను. నా మాట మీకు నీకు సందియము వలదు.బ్రహ్మ లింగము చివరకేగె ననుటకు నా మాటయే ప్రమాణము. శివ భక్తులు నన్ను శివున కర్పించగా బ్రహ్మ నన్ను గొనివచ్చెను'' అనెను. 

మొగలి పూవు పలికిన మాటలు విని హరి నవ్వి ఈ మాటలు శివుడే వచ్చి చెప్పినచో నమ్ముదు'' ననెను. విష్ణు వచనములను శివుడు విని కోపించి మొగలి కిట్లనియెను : 

ఓ అసత్యమాడుదానా! నోరుమూసి కొనుము. నా శిరమునుండి జారిపడుచు నడుమ బ్రహ్మకు దొరికితివి గదా! నీ వసత్య మాడితివి. కనుక నేను నిన్ను త్యజించుచున్నాను.' అనెను. బ్రహ్మ విష్ణుని పాదములకు మ్రొక్కెను. నాటి నుండి శివుడు మొగలిపూవు తన పూజకు తగదని దానిని పరిత్యజించెను. 

ఇట్లు మహామాయ జ్ఞానులను సైతము మోహభ్రాంతిలో ముంచివైచును. ఇంక నితరులగు సామాన్యులకు మోహము గల్గుననుటలో వింతయేమున్నది? హరి దేవతలు శ్రేయస్సును కోరి వారి కార్యసిద్ధికి పాటుపడును. ఆయన పాపభీతి వదలి రక్కసులను వంచించుచుండును. 

అందులకై అతడు పెక్కు యోనులందు జన్మము లెత్తుచుండును. తన సుఖము వదలుకొని దైత్యులతో బోరాడుచుండును. అతడు జగద్గురువు - సర్వజ్ఞుడు - రమాధవుడు; అట్టివాడు మాయా బలమునకు లొంగునా? విష్ణువే లొంగినచో సాధారణుల మాట చెప్పవలయునా! 

ఆ పరాప్రకృతి జ్ఞానుల చిత్తములను గూడ వశీకరించును. మాయాశక్తి యెంత లావు వానినైనను లాగిపట్టి మోహములో పడద్రోయును. ఆ భగవతి మూలముననే యీ చరాచర జగమంతయును మాయాజాలముతో నిండియున్నది.

ఆ మహామాయ యెల్లరకు మోహము జ్ఞానము బంధమోక్షములు మున్నగు వానిని గల్గించును'' అన 

రాజిట్లనెను : ఓ మునీశ్వరా ! ఆ మహామాయా స్వరూపమెట్టిది? ఆమె మహాసత్త్వమెట్టిది? శక్తి పుట్టు స్థానమేది? ఆ ప్రాణశక్తి పరమస్థానమేది? 

ముని యిట్లనెను : ఆ విశ్వశక్తి యనాది. కనుక నామె కుత్పత్తి యెన్నడు నెప్పుడు నెక్కడ లేదు. ఆమె నిత్యసత్యపరాప్రకృతి - కారణ కారణ - సర్వభూతములలోని శక్తి రూపమున నెల్లప్పుడు చైతన్యజ్యోతిగ వెలుగుచుండును. ఆ శక్తి లేనివాడు శవమే. ఆ మహాశక్తి సర్వభూతములందు చిచ్ఛక్తి రూపమున వెల్గులు విరజిమ్మును. 

ఆ దేవమాత దేవతల కార్యసిద్ధి కావిర్భవించును. ఆమె నానా శక్తులు - నానా రూపములు - దాల్చి వన్నెగాంచును. ఆ పరమేశ్వరి దేవకార్యసిద్ధికై తనకు తానే యావిర్భవించును. ఆ మహాశక్తి తక్కిన దేవతలవలె దైవమునకు లోబడదు. 

ఆ విశ్వమాత కాలమునకు లోబడునదిగాదు. ఆమె పురుషుని ప్రయోజనములనుబట్టి ఆతని పనులు నిర్వహించును. పురుషుడు ద్రష్ట - అకర్త. ఈ జగములన్నియును దృశ్య మాయా జగన్నాటకమాడి, పరమ పురుషుని రంజింపజేయును. 

అట్లామె పురుషుని రంజింపజేసి తిరిగి యంతటిని ప్రళయమున ముంచివేయును. హరిహర బ్రహ్మలును నిక్కముగ నిమిత్తమాత్రులే. ఆ మహాశక్తి వారి వారి పనులందు లీలగ నియమించును. ఆమె వారియందు తన శక్తినుంచుట వలన వారు మహాబలశాలులైరి. 

ఆ తల్లి బ్రహ్మ - విష్ణు-మహేశులకు సరస్వతీ-పార్వతుల నొసంగెను. దేవేశ్వరులగు తిమూర్తులు సైతమా జగదేకమాతను నిరంతరముగ పరమప్రీతితో ధ్యానించుచుందురు. 

ఆ సర్వేశ్వరీ శక్తి సృష్ఠి-స్థితి-సంహారము లొనర్చునని వారెఱింగిరి. ఈ విధముగ శ్రీదేవీ మాహాత్మ్య మత్యద్భుతముగ వెలుగుచుండును. 

దీనిని నా బుద్ధికి తోచినంతగ నీకు చెప్పితిని. కాని దానిని సాకల్యముగ నేను నెఱుగను.

అధ్యాయము 121 శ్రీమద్దేవీ నవరాత్ర వ్రత విధానము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...