Monday, April 13, 2026

Chapter 84 Description of the incarnations of the gods and demons - అధ్యాయము 84 దేవదానవుల యంశావతారముల వర్ణనము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 84

దేవదానవుల యంశావతారముల వర్ణనము

జనమేజయు డిట్లు ప్రశ్నించెను : ఓ పితామహా! ఆ పపిపాపడు పుట్టిన వెంటనే దుర్మార్గుని చేతిలో దిక్కులేని చావు చచ్చెగదా! వాడేమి పాప మొనర్చెనో కదా! అట్లు బ్రహ్మ విత్తముడు జ్ఞాని ధర్మనిరతుడు మునిప్రవరుడు నగు నారదుడు సైత మా పాపకార్య మేల చేయించెను? 

కర్త-కారయిత ఇరువురును పాపమును సమముగ ననుభవింతురని పెద్దలందురు. అది తెలిసియు నారదడు కంసు నేల ప్రేరించెను? ఆ బాలుడు ఎట్టి కర్మవిపాకము కారణమున చచ్చెనో నాకు తెల్ల మొనరించి నా శంక తొలగింపుము అన విని 

వ్యాసుడిట్లనెను : నారదుడు వినోదప్రియుడు - కలహభోక్త. అతడు దేవకార్యార్థముగ వచ్చి యిదంతయును చేయించెను. ముని కసత్యములు గిట్టవు. అతడు సత్యభాషి. సురకర్తవ్య నిరతుడు - శుచి. ఏది యెట్లున్నను దేవకి కారుగురు బాలురు పుట్టిరి. వారందఱును శాపవశమున చంపబడిరి. వారి శాప కారణము చెప్పుదును వినుము. 

పూర్వము స్వాయంభువ మన్వంతరమున మరీచికి ఊర్ణనాభి యను పత్నివలన ఆరుగురు మహాబలులు పుట్టిరి. వారు ధర్మరతులు. వారొకసారి బ్రహ్మ తన కన్యతో గలియుట కుద్యమించుట గని నవ్విరి. అంత మీరసురులకు పుట్టుదురు గాకని బ్రహ్మ వారిని శపించెను. దాని ఫలితముగ నాయారుగురును కాలనేమికి సుతులై పుట్టిరి. 

వారు మరొక జన్మమున హిరణ్యకశిపునకు పుత్రులైరి. కాని వెనుకటి శాపభయమువలన వారు జ్ఞానచ్యుతులు గాకుండిరి. ఆ జన్మములో వారు శాంతులు తపోనిరతులునై యుండిరి. అందుచే బ్రహ్మ సుప్రసన్నుడై వారి కిట్లు వరప్రదానము చేసెను :

'ఓ పుత్రకులారా! ఆనాడు నేను మిమ్ము కోపమాపుకొనలేక శపించితిని. ఇపుడు మీ యెడల ప్రసన్నుడనైతిని. ఏదేని వరము గోరుకొనుడు.' బ్రహ్మవాక్కులు విని వారు ప్రీత మనస్కులై తమ కార్యము సాధించుకొనుటకు బ్రహ్మతో నిట్లు పలికిరి. 

'పితామహా! నీవు ప్రసన్నుడవే యైనచో మా వాంఛిత వరమిమ్ము. మేము దేవ నర పన్నగుల వలన చావకుందుము గాక! మాకు గంధర్వ సిద్ధపతుల వలన చావు లేకుండు గాక!' అనగా బ్రహ్మయు నట్లేయగు గాక! నాయనలారా! నా యీ వాక్కు నిక్కువమైనది. సంవయింప బనిలేదు' అని బ్రహ్మ వారికి వరమొసగెను. 

వారును వరమంది ముదమందిరి. అపుడు హిరణ్యకశిపుడు కోపముతో కిట్లనెను. మీరలు నన్ను వదలి బ్రహ్మను సంతోషపఱచితిరి. మీరు వరబల గర్వితులైరి. నా స్నేహమును కాలదన్నితిరి. కాన నేను మిమ్ము విడనాడుదును. ఇక మీరు షడ్గర్భులను నామమున బఱగుదురు. మీరు పాతాళమునకు పొండు. 

అట మీరు నిద్రావశులై పెక్కేండ్లుందురుగాక! మీరు ప్రతి యేట దేవకీ గర్భమందు పుట్టగలరు. మీ వెనుకటి తండ్రియైన కాలనేమి కంసుడుగ బుట్టగలడు. పుట్టుటే తడవుగా ఆ కఠినాత్ముడు మిమ్ము చంపగలడు.' వారిట్లు శపింపబడి దేవకీ గర్భమున మాటిమాటికి జన్మించిరి. 

కంసుడు శాపప్రేరణ వలన షడ్గర్భులనబడు దేవకీ పుత్రులను చంపెను. దేవకి కేడవ గర్భమున శేషుడంశావతారమున నుండెను. అపుడు యోగమాయ తన యోగబలమున దేవకీ గర్భస్థ శిశువు నాకర్షించి రోహిణీ గర్భమందుంచెను. దేవకికైదవ నెలకే గర్భము పోయినదని జనులనుకొనజొచ్చిరి. 

కంసుడును గర్భపాతము జరిగెనేమో యని భావించెను.

ఈ విషయము దుష్ట కంసునకు సంతోషకరముగ నుండెను. చివరకు దేవకి కష్టమ గర్భమునందు సాధు పోషకుడు - సాక్షాత్తుగ భగవానుడు - భూభార ముడుప దేవకార్యార్థము వసించెను 

అను వ్యాసవచనములు విని జనమేజయుడిట్లు ప్రశ్నించెను : ఓ మునిసత్తమా ! కశ్య పాంశజుడైన వసుదేవుని శేషాంశమును విష్ణునంశమును తెలిపితివి. మఱి యిచట జన్మించిన యితర దేవాంశములను గూడ విశదపఱచుము. 

అనఘా! భూ భారము దింపుటకు భూదేవి ప్రార్థన పురస్కరించుకొని యెవరెవరు జన్మించిరో తెలుపుము అన 

వ్యాసుడిట్లనెను : భూమిపై సురాసురుల యెన్నో యంశములు ప్రసిద్ధి గాంచినవి. శేషాంశము వలన బలరాము డవతరించెను. ధర్ముని కుమారుడగు నారాయణ మహర్షి దివ్యాంశము వలన శ్రీ వాసుదేవు డవతరించెను. అతని తమ్ముడగు నరునంశమువలన నర్జును డుద్భవించెను. 

ఇటులే ధర్మాంశమున యుధిష్టిరుడు వాయునంశమున విదురుడు గురునంశమున ద్రోణుడు శివాంశముతో నశ్వత్థామయు సముద్రాంశమున శంతనుడును గంగ స్త్రీ రూపమున శంతనుని పత్నిగను నవతరించిరి. 

గంధర్వ పత్యంశమున దేవకరాజు పుట్టెను. వసు నంశమున భీష్ముడు మరుద్గణాంశమున విరాటరాజు అరిష్టనేమి సుతుడైన హంసువంశమున ధృతరాష్ట్రుడును మరుద్గణాంశమున కృప కృతవర్మలు ఘోరకల్యంశమున దుర్యోధనుడు ద్వాపర యుగాంశమున శకుని ఉద్భవిల్లిరి.

సోమపుత్త్రుడు సువర్చసుడు. అతడు సోమప్రరు నామమున బరగెను. పావకాంశమున ధృష్టద్యుమ్నుడు రాక్షసాంశమున శిఖండి సనత్కుమారాంశమున ప్రద్యుమ్నుడు వరుణాంశమున ద్రుపదుడు లక్ష్మ్యంశమున ద్రౌపదియు - విశ్వేదేవతలు యంశము వలన ద్రౌపదేయులును జన్మించిరి. 

కుంతి సిద్ధిరూప - ధృతిరూప మాద్రి. గాంధారి మతిరూప. ఎల్ల దేవవార కాంతలును శ్రీకృష్ణుని భార్యలుగ నుద్భవించిరి. ఈ తీరు నెల్లరాజులు రాక్షసులు నింద్రుని ప్రేరణచే జన్మములు దాల్చిరి. 

హిరణ్యకశిపుని వంశమున శిశుపాలుడు విప్రచిత్తి వలన జరాసంధుడు ప్రహ్లాదాంశముతో శల్యుడు కాలనేమ్యంశమున కంసుడు హయశిరోంశమున కేశి పుట్టిరి. బలిపుత్రు నంశమున నరిష్టుడను వృషాసురుడు గోకులమందు పుట్టి వారిచే నీల్గెను. 

అనుహ్రదాంశమున ధృష్టకేతువు బాష్కలు నంశముతో భగదత్తుడు లంబాంశమున ప్రలంబుడు ఖరాంశముతో ధేనుకుడు వరాహ కిశోరు లనబడు దారుణ రాక్షసుల అంశముతో చాణూర ముష్టికులను మహామల్లులు పుట్టిరి. దితిసుతుడగు నరిష్టునంశముతో కువలయమను కంసు నేనుగు బలికూతురు బకిగ నామె సోదరుడు బకుడుగ పుట్టిరి. 

కామ క్రోధ రుద్ర యమాంశములన్నియు పుణికి పుచ్చుకొని యశ్వత్థామ యుద్భవిల్లెను. ఇట్లు భూభారము తొలగించుట కసురాంశముల వలన పెక్కు దైత్య రాక్షస గణములు పుట్టెను. 

రాజా! ఇట్లు పురాణములందు కీర్తింపబడిన సురాసురాంశముల యవతారము లెల్ల నీకు తెల్పితిని. 

పూర్వము బ్రహ్మాది దేవతలు శ్రీహరి ప్రార్థింప నేగిరి. అపుడు హరి వారికి తెలుపు నలుపు వెండ్రుకలు రెండు ఒసంగెను. అందు శ్యామల వర్ణము మేఘశ్యాముడగు శ్రీకృష్ణుడుగ శ్వేతవర్ణము బలరాముడుగ నయ్యెను. ఆ రెండును ఇట్లు శ్రీ మహావిష్ణు నంశమున భూభార ముడుప నవతరించెను. 

ఏ పరమ భాగవతోత్తముడు ప్రేమభక్తుల నివాళులతో నీదేవాసురుల యంశావతార వర్ణనము వినునో యతడు సర్వపాప విముక్తుడై స్వజనములను గూడి మోదమున నలరారును.

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...