Monday, April 13, 2026

Chapter 83 Devaki Vasudeva's conversation - అధ్యాయము 83 దేవకీవసుదేవసంవాదం

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 83

దేవకీవసుదేవసంవాదం

అటుపిమ్మట దేవరూపిణియగు దేవకి ఋతుకాలమునందు నియమముతో వసుదేవునితోడ సంగమించి గర్భము దాల్చెను. ఆమెకు నిండుగ పదినెలలు నిండెను. అంత నామెకు రూపావయవ సంపన్నుడగు చక్కని కుమారుడు తొలిసారి యుదయించెను. మహానుభావుడైన వసుదేవుడు భవితవ్యమును - సత్యవాక్యమును జ్ఞప్తికి దెచ్చుకొని దేవమాతయగు 

దేవకితో నిట్లు పలికెను : ప్రియా! దేవకీ! ఆనాడు నేను చేసిన శపథమును బట్టి నీవు విముక్తి బొందితివి. ఇపుడు మన కుమారుని కంసున కప్పగించు సమయ మాసన్నమైనది. ఇది నీ వెఱుగుదవు. ఈ బాలుని నీ సోదరునక కర్పింతును. కంసుడు కడు దుష్టుడు. దైవము వినాశము గోరుచుండ నింక నీవేమి చేయగలవు? 

కర్మపరిపాక మతి విచిత్రమైనది. అది సామాన్యులకు తెలియరానిది. ఎల్ల ప్రాణులును కాలపాశవశులై తమ తమ శుభాశుభ కర్మము ననుభవించుదురు. ఎల్ల జీవుల కెల్ల విధముల తమ తమ ప్రారబ్ద మనుభవింపక తీరదు. అది విధికృతము అన 

దేవకి యిట్లనెను: స్వామీ! నరులు తప్పక తమ పురాకృత మనుభవింతురు. ఈ పురాకృత దోషము తీర్థ తపోదానముల వలన శమింపదు. ధర్మశాస్త్రములందు మహాత్ములు పూర్వార్జిత పాపనాశమునకు ప్రాయశ్చిత విధానమును వ్రాసిరి. 

బ్రహ్మహంత-సువర్ణచోరుడు-సురాపాయి-గురుతల్పగుడు- వీరు పండ్రెండేడులు నియమవ్రత మనుష్ఠించినచో శుద్ధి జెందుదురని మన్వాదులు వీరికి ప్రాయశ్చిత విధానము నుడివిరి. ధర్మశాస్త్ర ప్రవర్తకులు - తత్త్వ దర్శనులు నగు మునులు ప్రాయశ్చిత విధానము తెలిపిరి గదా? 

నరులావిధముగ నాచరించి పాపముక్తులగుదురా లేదా? కానిచో యాజ్ఞవల్కాది మునివరుల వాక్కులు మిథ్యలై నింద్యము లగును గదా! ప్రభూ! కానిచో మంత్రశాస్త్రము - ఆయుర్వేదము నన్నియు పనికిమాలినివే యగును. సర్వము దైవసంఘటితమే యైనచో నింక మానివ యత్నము వ్యర్థమే. జరుగనున్నది జరిగి తీరును. 

కానున్నది కాకమానదని యూరకున్న నిక ప్రవృత్తియే యుండదు. అపుడు స్వర్గ సాధనములైన వేదవాక్కులు ప్రమాణ రహితములు నిరర్థకములు నగును. అవి యబద్ధములైనచో ధర్మచ్యుతి గలుగును. అట్లుగాక ప్రయత్నముచేత ఫలసిద్ధి ప్రత్యక్షముగ గలిగినచో దానికి తగిన విధాన మాచరింపవలయును.

కనుక నిపుడు మన పుత్త్రునకు మేలు గలుగు విధ మాచరింపుము. మేలుగోరువాడు కల్లలాడినను మంచిదే. అట్టి వానికి దొసగు కొంచెమేనియు నంటదని పెద్దలందురు అన విని 

వసుదేవుడిట్లనెను : ఓ సౌభాగ్యవతీ! సత్యవాక్కు పలుకుదును. ఆలింపుము. నరుడు ప్రయత్నము మాత్రము చేయవలయును. ఫలితము దైవాధీనము. 

పూర్వతత్త్వ విధులు పురాణములందు లోకమున దేహికి మూడు విధములైన కర్మములు గలవని వచించిరి. అవి సంచితము ప్రారబ్ధము వర్తమానము అనబడునవి. శుభాశుభ బీజరూపమున నుండు శుభాశుభ కర్మములు సంచితములు. అవి జన్మాంతరములందు జీవులను వెంటాడు చుండును. జీవుడు తన మేను చాలించి కర్మ పరాధీను డగును. అపుడు జీవుడు తన సంచిత కర్మానుసారముగ స్వర్గమో నరకమో పొందును. 

దివ్యదేహమో యాతనా శరీరమో అతడు దాల్చును. అతడు స్వర్గమందు వివిధ భోగము లనుభవించును. నరకమందు యాతనలు కుడుచును. అవి అనుభవించిన పిదప మరల జన్మించు, సమయ మేతెంచును. అపు డతడు లింగ దేహముతో జీవరూపము దాల్చును. అంత సంచిత కర్మములతో నుండి పరిపక్వమైన కర్మములు కొన్ని కాలునిచే జీవునిలో గూర్చబడును. 

ఇట్లు జీవుని దేహములో సంచితములైన శుభాశుభ కర్మములు నిరంతరము కొనసాగుచుండును. ఇవియే ప్రారబ్ధ కర్మములు. ఇవి యనుభవింపక తీరవు. వర్తమాన కర్మములు ప్రాయశ్చితముచే తొలగిపోవును. వర్తమానములవలె సంచితములును తొలగిపోవును. కాని ప్రారబ్దములు మాత్ర మనుభవించిననే క్షమించును. వేరు విధముగ గాదు. 

కనుక, నీ కుమారు నిపుడు తప్పక కంసున కప్పగింప వలయును. కానిచో నీలోకము మనల దూషించినిందించును. నే నసత్యములు పలుకజాలను.

ఈ విచిత్ర సంసారము సారహీనము. ధర్మము మాత్రము సారవంతమైనది. మహాత్ముల జీవన మరణములు దైవాధీనములు కావున జీవు లెప్పుడును వ్యర్థముగ శోకింప గూడదు. ఎవడు సత్య భ్రష్టుడో వాని జీవితము నిరర్థకము. అట్టి భ్రష్టున కీలోకమే లేదు. ఇక పరలోక మెక్కడిది? 

కాన నీ సుతునిమ్ము - కంసునకు సమర్పింతును. సత్య నిష్ఠ పాటించినచో మనకు తప్పక శుభములు చేకురును. కనుక నరులు సుఖ దుఃఖములందు పుణ్యకార్యము లాచరింప వలయును. సత్య సంరక్షణమున సకల శుభము లొనగూడును అని యిట్లు వసుదేవుడు పలుకగ దేవకి బోరున నేడ్చుచు తన నవ జాత శిశువును తన పతి చేతిలో నుంచెను. 

ధర్మాత్ముడగు వసుదేవుడు తన తనయు నెత్తుకొని కంసునింటి కేగుచుండగ జనులతని సత్యనిష్ఠ నిట్లభినుతించు చుండిరి: 

'సుజనులారా! ఈ మహా మనీషిని గనుడు. ఆహా! ఇతడు తన మాట నిలువ బెట్టుకొనుటకు తన పసికందును గొని యేగు చున్నాడు. ఈ సత్యవాది యీసు లేనివాడు. ఇతడు తన కుమారుని మిత్తి వాత బడవేయ నున్నాడు. ఇతని జీవిత మెంత ధన్యము! ఇతని యత్యద్భుత ధర్మ మేమన వచ్చును? ఇతడు కాలరూపుడైన కంసునకు తన సుతు నప్పగింప నేగుచున్నాడు అని జనులు నుతించుచుండ మానవాతీతుడైన వసుదేవుడు కంసునింటి కేగి తన కుమారు నతని కర్పించెను. 

కంసుడును మహాత్ముడగు వసుదేవు ధైర్యమున కబ్బుర పడెను. కంసుడా చిన్నారి బాలుని గైకొని నవ్వుచు నిట్లనియెను : 

'శూరపుత్రా! పుత్త్ర సమర్పణమున నీవు కడు ధన్యుడ వైతివి. గగనవాణి నీ యష్టమ పుత్రుని నా మృత్యువుగ పేర్కొనినది. కాని యీ బాలకుని గాదు. ఇతడు చంపబడదగడు. నీ యింటి కితనిని గొని పొమ్ము. నీ యెనిమిదవ సుతుని తెచ్చి యిమ్ము. నీకు శుభమగుత! అని యా బాలకుని మరల వసుదేవున కప్పగించెను. 

వసుదేవుడు బాలునిగొని ముదమున తన సదనమున కేగెను.

కంసుడు మంత్రులను పిలిపించి వారికిట్లనెను: ఈ పసికందును వ్యర్థముగ చంపనేల? దేవకి యెనిమిదవ పుత్రుడు గదా నా పాలి శత్రువు? కాగా తొలి బాలుని చంపి పాపము మూటకట్టుకొన నేల?' అను మాటలకు మంత్రులము మేలు మేలని కంసుని బొగడి కంసు ననుమతితో తమ నివాసముల కరిగిరి. 

పిమ్మట నారద మునీంద్రు డచ్చోటి కరుగుదెంచెను. కంసుడు నారదున కర్ఘ్యపాద్యవిధు లాచరించి సేమమడిగి యతని రాకకు కారణ మడిగెను. ఆ మునీంద్రుడు నవ్వుచు కంసున కిట్లనెను. 

ఓ మహాభాగా! కంసా! నేను మేరుగిరి కరిగితిని. అచట బ్రహ్మాదిదేవతలు సమావిష్టులై యిట్లు మంత్రాలోచనలు చేసిరి. కంసుని చంపుటకై దేవకీ వసుదేవులకు సురవరుడగు విష్ణువుద్భవింపగలడు అని. ఆ యుద్భవించువాడు విష్ణువే కనుక రాజ నీతివిదుడవగు నీవు వసుదేవుని సుతు నేల జంపకుంటివి'? అన కంసుడు దేవ వాణి ననుసరించి నే నెనిమిదవ వానినే వధింతును' అనెను. 

నారదుడిట్లు పలికెను : ఓ నరవరా! నీవు రాజనీతి యందలి మంచి చెడ్డ లెఱుగవు. దేవతల మాయాబల మెట్టిదో నీకు తెలియదు. ఇట్టి నీకు నేనేమి చెప్పుదును? తన మేలు గోరుకొనువాడు చిన్న పగతునైన చంపక విడువడు. కలియగలిపి లెక్కించిన ప్రతి యొకడును ఎనిమిదవవాడే యగును. అన్నియు తెలిసిన నీవు శత్రుని చేజేతుల వదలుట మూర్ఖత్వము' అని పలికి దేవ సమానుడగు నారదుడు వెళ్ళెను. 

పిదప దుష్టుడగు కంసు డా బాలుని తెప్పించి బండకు మోది చంపి నిశ్చింతుడయ్యెను.

అధ్యాయము 84 దేవదానవుల యంశావతారముల వర్ణనము

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...