Monday, April 13, 2026

Chapter 82 The story of the birth of Shri Devaki Vasudeva - అధ్యాయము 82 శ్రీ దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 82

శ్రీ దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతము

ఓ జనమేజయా! శ్రీ యోగమాయాప్రభావమున భూభారహరణము-కురుక్షేత్రమందు ప్రభాస తీర్థమందు సైన్యావినాశము - భృగు మహర్షి శాప ప్రభావమున మహా మాయాశక్తి వలన పరాక్రమ శాలియైన విష్ణువు యదువంశమందుద్భవించుట మున్నగునవి తెలుపుచున్నాను. కడుశ్రద్ధగ వినుము. 

ఈ భూతలమందు దుష్ట సంహారమునకు-భూభార ముడుపుటకు - శ్రీ మహామాయ ప్రభావమున శ్రీమహావిష్ణు వవతరించెనని తలంచు చున్నాను. చిద్రూపమైన మాయాదేవి సకలాంతర్గతమగు స్వ మాయాశక్తిచే బ్రహ్మ-విష్ణువు మున్నగు దేవతల నాటాడించును. ఇంక నితరులను మోహింపజేయుననుటలో చోద్యమేమున్నది? 

ఆ విశ్వమాత తన లీలతో విష్ణునకు సైతము మలమూత్ర స్నాయు సంయుత మగు గర్భవాసపు దుఃఖము గలిగించినది. ఆ లోకాల బ్రోచుతల్లి తొల్లి రామావతారమందు దేవతలను వానరులుగ జేసినది. హరి యంతటివాడు తీరని దుఃఖపాశములచే బద్ధుడయ్యెను. ఆతడు నహంకార మమకార పాశముల యనుబంధములతో గట్టిగ గట్టబడెను. పరమయోగులు ముక్తసంగులు బంధముక్తిని గోరుదురు. సంగదోషము లేనివారు విశ్వేశ్వరీదేవియగు శివంకరి నుపాసింతురు. 

ఆ పరాదేవికి యాత్మనివేదన మను భక్తితో లేశలేశ లేశలేశలవాంశమంతయైన ఎడదలో కుదురుకొన్న తరించుటకు చాలును. అట్టి దేవీభక్తుడు సమతాయుత మనముతో నిచటనే ముక్తుడు గాగలడు. అంతటి దయామృత రస ప్రసన్నయగు అంతటి తల్లి సేవలు సేయని మూర్ఖు డెవడుండును? 

ఒక్కసారి శ్రీ త్రిభువనేశ్వరి' యను మధుర మధుర నామ ముచ్చరించిన చాలును. ఆ తల్లి వానికి త్రిభువనశ్రీలు ప్రసాదింప గలదు. 

ఓ యమ్మా! నన్ను కాపాడుమమ్మా! నేను నీవాడనమ్మా! యని యొకసారి యన్న చాలును. అతని కీయదగిన వస్తువులేమి దేవి యతనికి ఋణపడి యుండును. ఆ దేవికి విద్య యవిద్యయను రెండు రూపులు గలవని యెఱుంగుము. ప్రాణులు విద్యవలన ముక్తిబొందుదురు. అవిద్యవలన బంధముల పాలగుదురు. బ్రహ్మ-విష్ణు-రుద్రులు సైత మా మహనీయ శక్తికి వశులై వర్తింతురు; 

విష్ణుని యవతారములన్నియును త్రాటిచే బంధింపబడి నట్టులుండును. ఆతడొకప్పుడు వైకుంఠమందు మరొకప్పుడు పాలసంద్రముపై సుఖములందును.

అతడొక్కమారు బలవంతులైన దానవులతో బోరుసల్పును. వేరొక్కసారి పెక్కు యజ్ఞము లాచరించును. ఆతడొక్కొక్క సమయమున పుణ్యతీర్థములందు తీవ్ర తపమాచరించును. ఇంకొక్కతఱి యోగనిద్రను జెంది పరుండును. 

కనుక మధుసూదనుడు సైత మేనాడును సర్వతంత్ర స్వతంత్రుడుగాడు. అటులే బ్రహ్మ-రుద్రుడు-ఇంద్రుడు-యముడు-వరుణుడు-కుబేరుడు-అగ్ని-సూర్యచంద్రలు-ఇతర సురసత్తములు, సనకుడు-వసిష్ఠుడు మున్నగు మునులును మహర్షులును ఎల్లరును త్రిభువనేశ్వరీ మాయకు వశులై యాటబొమ్మల వలె మెలగుదురు. 

ముకుత్రాడు వేసిన యెంత బలముగల యెద్దయిన నరునకు వశమై అతని వెంటబడి తిరుగుచుండును గదా! అటులే దేవతలెల్లరు నఖండమైన కాలపాశముచే నియంత్రితులై భ్రమింతురు. హర్షశోకాదిభావములు- నిద్ర-తంద్ర-అలసత్వము-ఇవి దేహధారియైన ప్రతి ప్రాణి నాశ్రయించి విడువకుండును. 

దేవతల నమరులని నిర్జరులని గ్రంథకారులు వచించిరి. కాని, వాస్తవమున వారి యమరత్వము నామ మాత్రమైనదే. అది సార్థకమైనదిగాదు. ఉత్పత్తి స్థితిలయములు వారికిని గలుగును. ఇట్టివారి నమరులని నిర్జరులని యెట్టులు చెప్పవలయును? వీరును దుఃఖపీడితులు గదా! వీరు విబుధోత్తము లెట్లగుదురు? వారికిని విపత్తులు మూడును. వారికిని క్షణమాత్రమున చావు పుట్టువులు గలుగుచుండును. 

ఇట్టివారికి శాశ్వత క్రీడాసుఖము లెట్లు గల్గును? నీటిలోని పురుగులు - దోమలు నంతలో పుట్టి యంతలో చచ్చును. వీనితో దేవతలకు పోలిక గనుపట్టుచున్నది. వారికిని వీటికి వలెనే ఆయువు మూడునుగదా! మఱి వా రమరులెట్లు గాగలరు? ఒక ఏడాది వానికంటే నూఱేండ్లవాడు - నూఱేండ్ల వానికంటే దేవతలు - దేవతలకన్న బ్రహ్మ –బ్రహ్మకంటె శివుడు, శివునికంటే విష్ణువు నుత్తరోత్తరముగ దీర్ఘకాల జీవులు. 

ఇట్లు సర్వులును క్రమముగ నభివృద్ధి జెందుచు నష్టమగుచుందురు. ప్రతి దేహికి చావునిక్కము. చచ్చిన ప్రతివానికిని మరల జన్మము ధ్రువము. ఇట్టు లెల్లరును చక్రము పగిది క్రిందుమీదులకు తిరుగుచుందురు. ఈ ప్రాణులన్నియును మోహజాలములో చిక్కుకొన్నవి. ఇ వేనాటికిని ముక్తిజెందవు. 

ఈ ఘోరమైన మాయా సంసారమందు తిరుగాడు వానికి మోహజాలమెట్లు నశించును? బ్రహ్మ మొదలుగా గల ప్రాణులన్నిటికిని వరుసగ సృష్టికాలమున సంభవము కల్పాంతమున నాశము జరిగి తీరును. ఎవని నిమిత్తమున నెవనికి చావు వ్రాయబడెనో వానిచే వాడు చచ్చును. విధి ప్రాణులనొసట వ్రాసిన వ్రాలు వేరు విధముగ నెన్నడును జరుగదు. 

ఆయా జీవులకు విధి నిర్ణయానుసారముగ చావుపుట్టుకలు జరావ్యాధులు సుఖదుఃఖములు గలుగుచుండును. దీనికి తిరుగులేదు. ఎల్ల ప్రాణికోటికిని సూర్యచంద్రులు ప్రత్యక్షముగ సుఖము గలిగింతురు. ఐనను వారికి సైతము శత్రుబాధ తప్పలేదు. రవి సుతుడు మందుడయ్యెను. చంద్రుడు కళంకియు క్షయరోగియు నయ్యెను. 

కాన విధి విధానమెంత గొప్ప వారికైనను దాటతరముగాదు. వేదకర్త విశ్వకర్త నలువ బుద్ధిప్రదాత యైన బ్రహ్మ తన సొంత కూతురగు సరస్వతిని గని మోహ పరవశుడయ్యెను. భక్తిలోకార్తిహరుడగు హరుడు సైతము తన భార్య తనువు చాలించినపుడు మదనబాధ కోపలేక దుఃఖపీడితుడయ్యెను. 

కామాగ్ని దగ్ధుడైన శివుడు కాళిందీనదిలో మునిగెను. రుద్రుని యొడలి వేడిమి మంటలకు నదీజలము సలసలమని క్రాగి నీలవర్ణమయ్యెను. అపుడు మహాదేవుడు భృగువనమందు కామాతిరేకమున రమణీలోలుడై యుండెను. అట్టి శివుని తపోధనుడగు భృగుమహర్షి నీవు లజ్జలేనివాడవు. నీ లింగమిపుడే పతనమందుగాకని శపించెను. 

శివుడవు డానంద ప్రాప్తికై దానవులు నిర్మించిన యమృతపుడిగ్గియలోని నీరు గ్రోలెను. ఈ భూతలమందొకప్పుడింద్రుడు వృషభవాహనముగ పనిచేసెను. శ్రీ మహా విష్ణువు సర్వలోకాద్యుడు వివేకి సర్వజ్ఞుడును.

ఆ శ్రీవిష్ణువునకు బంగారు లేడిని గూర్చిన విజ్ఞానము లేకపోయెనుగదా! ఆతని ప్రభుశక్తి యేమయ్యెను? రాజా! యోగమాయా శక్తిని గనుము. అలనాడు సీతాపతి కామమోహమున విరహ సంతప్తుడై మిక్కుటముగ వగచెను. సుగుణాభి రాముడగు రాముడు మూఢత్వమున తన జానకి నెవరేని యపహరించిరో కాక భక్షించిరోయని యెలుగెత్తి విలవించుచు చెట్టు చెట్టు నడుగజొచ్చెను. 

సోదరా! లక్ష్మణా! నేనిపుడు కాంతా విరహమున మరణింతును. అపుడు నా శోకమున నీవును బ్రతుకవు. మన మరణవార్త విన్నంతనే నా తల్లి మృతిజెందును. శత్రుఘ్నుడును దుఃఖార్తితో బ్రతుకజాలడు. పుత్రమరణము విని సుమిత్రయు శోకించి యసువులు పాయును. ఇకకైక భరతుని వలన పూర్ణకామ కాగలదు. 

సీతా! నేను కామార్తుడనైతిని. నన్ను వీడి నీ వెటకేగితివి? వేవేగ రారమ్ము. నన్ను జీవింపజేయుము. జనకనందినీ! నీవెక్కడి కేగితివి? నా ప్రాణములు నీ యరచేత నున్నవి. ఇంక నేనేమి చేతును? నీవు వేవేగమే వచ్చి దీనుడైన నీ యీ ప్రియు నోదార్చుము. ఇట్లు ప్రతి వనమున గ్రుమ్మరుచు విలపించుచున్న సీతారామునకు జానకి యెచ్చోటను గనబడలేదు. 

ఇట్లు సర్వలోక శరణ్యుడు రాజీవ నయనుడు వానరుల కేడుగడ సుగుణాభిరాముడగు రాముడును మాయామోహితుడయ్యె. కోదండరాముడు వానరుల తోడ్పాటుతో జలధికి సేతువు గట్టెను. అతడు రణభీముడై మహోదర కుంభకర్ణులను రావణుని సంహరించెను. దురాత్ముడైన రావణుడు సీత నపహరించెను. 

రాముడు సర్వజ్ఞుడయ్యు సీత ననుమానించి దివ్యమున నామెను అగ్ని పూతగ నొనరించెను.

మహాయోగమాయ మహిమ నేమని వర్ణింతును? ఆ మహాశక్తి మూలమున సర్వజగములు పరిభ్రమించు చున్నవి. విష్ణువు శాప వశమున నానావతారము లెత్తును. అతడును దైవమునకు కట్టుబడి పలురీతుల చేష్టలొనర్చు చుండును. 

ఇపుడు నేను దైవకార్యార్థము మానవలోకమున ప్రభవించి మానవాతీతమైన కార్యములు చేసి చరితార్థుడైన కృష్ణుని చరితము వినిపింతు వినుము. 

పూర్వకాలము కాళిందీనదీ తీరమందు కనులపండువైన మధువన ముండెను. అచ్చోట మధుపుత్రుడగు లవణుడు దాన వీరుడై వసించు చుండెను. అతడు వీర్యబల గర్వితుడై విప్రులను సతతము బాధించుచుండెను. లక్ష్మణుని తమ్ముడగు శత్రుఘ్నుడు రణమున నతని నంతమొందించెను. 

శత్రుఘ్నుడా దానవుని చంపి యచట మధుర యనబడు సుందర నగరమును శోభాయమానముగ వెలయించెను. శత్రుఘ్నుడు శత్రుల పరిమార్చువాడు - మతిమంతుడు. ఆతడు మధురానగరమునకు కమలాక్షులగు తన యిరువు కుమారులను రాజ్యాథిపతులుగ జేసెను. 

కాలము సమీపించగనే శత్రుఘ్నుడు దివంగతుడయ్యెను. తుట్టతుదకు సూర్యవంశము క్షీణించెను. ముక్తి ప్రదమైన మధురకు యయాతి కులము వారైన యాదవులు రాజులైరి. శూరసేనుడను యాదవరాజు మహాశూరుడు. 

అతడు మధుర కధిపతియై సుఖసంపద లనుభవించెను. అతనికి కశ్యపాంశమున వరుణుని శాపమున కుమారుడుద్భవించి ప్రఖ్యాతి చెందెను. అతడే వసుదేవుడు. అతడు వైశ్యవృత్తియగు వ్యవసాయమందు నిరతుడయ్యెను. ఆ కాలమున నుగ్రసేనుడను నతడు శూరసేన దేశమునకు రాజయ్యెను. అతనికి కంసుడు పుట్టెను. 

అదితి కశ్యపుని భార్య. ఆమెయు వరుణ శాపమున దేవకుడను వానికి దేవకిగ నుద్భవించెను.

ఆ దేవకరాజు తన కూతురును వసుదేవున కిచ్చి వివాహ మొనరించెను అపుడాకాశవాణి యిట్లు పలికెను : 

'కంసా ! కంసా ! దేవకి కష్టమ గర్భమునందొక శ్రీమంతుడగు పురుషోత్తముడు గల్గును. అతడు నీపాలిటి మృత్యుదేవత. అది విని మహాబలుడగు కంసు డచ్చెరువంది దేవవాణి సత్యమగునుగదా యని చింతాక్రాంతుడయ్యెను. నేనిపుడేమి చేయవలయునని తలపోయుచు నతడిట్లు తనలో చింతించెను. 

ఇపుడీ దేవకినీ చంపినచో నా చావు తప్పును గద! నాకీ చావు భయములో నితరాలోచనలు దోచుటలేదు. ఈమె నా తండ్రికి తోబుట్టువు. పూజ్యురాలు, ఇంక నీమెను నేనెట్లు చంపగలనని కంసుడు చింతలో మునిగెను. అతడు మరల నిట్లు తలచెను: 

నాకీమె వలన చావు నిక్కము. పాపము చేసియైన శరీరమును రక్షించుకొనవలయునని పండితులందురు. పాతక మెంతటిదైనను ప్రాయశ్చిత్తముతో తప్పక తొలగును. కనుక పండితుడైనవాడు పాపము చేసియైన తన శరీరమును రక్షించుకొనవలయును. 

పాపిష్ఠుడగు కంసుడిట్లు దలచి కత్తి చేబూని వేగమే దేవకి కేశపాశములు పట్టిలాగెను. ఆ దుర్మార్గు డొఱ నుండి కత్తి పెఱికి ఝళిపించుచు జనము చూచుచుండగ ఆ నవ వధువును చంపదలచి యామెపై కురికెను. అట్లత డామెను చంప నుంకించుట గని జనులు హాహాకారములు చేసిరి. 

వసుదేవు ననుచరులైన వీరవరులు పోర విల్లమ్ములు చేబూనిరి. వా రద్భుత సాహసోపేతులై విడు విడుమని కేకలు వేయుచు దేవమాతయైన దేవకిని దయతో విడిపించిరి.

అట్టి దారుణ భీకర సమరము జరుగుటగని వృద్ధ యాదవోత్తములు వారించి కంసునితో నీ రితిగ బలికిరి: 

ఈమె నీ తండ్రికి తోడబుట్టువు. నీకు పూజనీయ. ఈ వివాహ మంగళోత్సవమున నీమెను చంపుట తగదు. ఈమె నీకు హంతవ్యగాదు. స్త్రీ హత్య కడుంగడు దుస్సహము - పాపకార్యము - కీర్తినాశకము. గగనవాణి పలికినంతమాత్రన పండితుడిట్టు లొనర్పడు. నీవాడో కాక వసుదేవుని వాడో యెవడో వైరి దాగియుండి నిన్నీయనర్థకర కర్మములకు పురికొల్పెను. 

కానిచో నిట్టి ఘోరమెట్లు జరుగును? ఎవడో మాయాజాల మెఱిగిన వైరి నీ యశో నాశమును వసుదేవుని గృహ నాశమును దలచి యిట్టు లాకాశవాణిగ పలికియుండ నోపును. 

నీవు మహావీరుడవే! ఒక భూతము పలుకులకు భయపడుదువా? ఇదంతయు నీ కీర్తి మూలమునకు హాని గల్గింపదలచి నీ వైరి పన్నిన పన్నుగడ సుమా! నీ మేనత్తను నీవు చంపరాదు. భవితవ్యము తప్పక జరిగితీరును. 

కాని వేరువిధముగ నెన్నడును జరుగదు అని పలికిన పెద్దల మాటను కంసుడు పెడచెవిని బెట్టెను. అంతట నీతికుశలుడైన వసుదేవుడు కంసునితో నిట్లుపలికెను. 

ఓ కంసా! ఈ ముజ్జగములును సత్యాధారములు. నా సత్యవాక్కును వినుము. దేవకికి గల్గిన వారి నందఱిని నీ చేతిలో బెట్టుదును. అట్లు నేను పుట్టిన ప్రతివానిని నీకీయనిచో నా పూర్వజులు కుంభీపాక నరకమున గూలుదురుగాక! అను వసుదేవుని సత్యవాణి వినిన ప్రజలు మేలు మేలని మెచ్చుకొని కంసునితో నీరీతిగ బలికిరి : 

'మహాత్ముడగు వసుదేవుడెన్నడును నసత్యమాడువాడు కాడు. ఇంక నామె కేశములు వదలుము. స్త్రీ హత్యా పాతకమున కొడిగట్టకుము. అట్లు యాదవ వృద్ధులైన మహాత్ములచే కంసుడు ప్రబోధితుడై వారి సత్యవాక్యములనుబట్టి కోపముడిగెను. దుందుభి ధ్వనులు వాద్యనిస్వనములు సెలంగెను. 

నిండు సభలో నెల్లరు జయజయకారము లొనరించిరి. అట్లు వసుదేవుడు కంసుని ప్రసన్నుని జేసి నవ వధువగు దేవకిని విడిపించుకొని యామెతో స్వజనముతో నిర్భయముగ నిజగృహమున కరిగెను.

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...