దేవతలు శ్రీ జగదంబను సంస్తుతించుట
ఇట్లు పలికి విష్ణువు మరల బ్రహ్మతో నీ ప్రకారముగ వచింపసాగెను. ఈ సృష్టి యందలి ప్రతి వ్యక్తియు మాయా మోహితుడే. అందుచే దేవీతత్త్వ మెవ్వడు నెఱుగలేకున్నాడు. మనమును మాయాశక్తిచే నావరింపబడితిమి. కనుక మనమా జగద్గురువు - పరమ పురుషుడు - అవ్యయుడు - సచ్చిదానంద రూపుడు నైన జగద్గురుని స్వరూప మెఱుగ లేకున్నాము.
"ఓ విధీ! నేను బ్రహ్మను, నే విష్ణువును, నేను రుద్రుడనను గర్వమున మోహవశులమై సనాతన పరతత్త్వము నెఱుగజాలకున్నాము. ఎట్లు కట్టెబొమ్మ యింద్రజాలికునకు వశమై యతని యిచ్చమేరకు నర్తించునో యట్లు నేనును పరమాత్మకు వశుడనై మాయా మోహితుడనై వర్తింతును.
ఈ కల్పము మొదట నీవును నేనును రుద్రుడును సుధాసాగరమందొక మహాద్భుతమైన విభూతి విశేషమైన తేజః స్వరూపమును గంటిమి. నేను పూర్వమొక దివ్య మందార వృక్షము గంటిని. దాని క్రింద శోభాయమానమైన రాజక్రీడాస్థలము గలదు. అందు వివిధ మణులతో రాజిల్లు మణిద్వీపము గలదు. ఆ ద్వీపమం దనంతకోటి సూర్యుల కాంతు లీను లలితా మూర్తి గలదు. అంతవఱకు నేనట్టి సుందర స్వరూపమును విన-గనలేదు.
కనుక నో సురలారా! మీరలా పరాశక్తిని శివరూపను సర్వకామప్రద-మాయారూప యగు ఆద్యాశక్తిని నెమ్మనములందు చక్కగ సంస్మరింపుడు అను విష్ణుని హితవచనము లాలించి బ్రహ్మాది దేవత లాభువనేశ్వరీ దేవి యగు యోగమాయను మనసారగ సంస్మరించిరి.
వారు సంస్మరించినంతనే శ్రీ త్రిపుర సుందరీ దేవి జపాకుసుమముల వలె నరుణమగు తేజమున తేజరిల్లుచు పాశాంకుశములు వరదాభయ ముద్రలు దాల్చి ప్రత్యక్షముగ వారికి దివ్యదర్శన భాగ్యమొసగెను. వారా దేవదేవిని కులపండువుగ గాంచి యిట్లు నుతించిరి.
'సాలెపురుగు నుండి దారములు వెల్వడునట్లే అగ్నినుండి మిణుగురులు బయలు వెడలునట్లే యెవరి నుండి యీ సకల జగములు పుట్టుచున్నవో యా విశ్వమాతకు మా మనస్సులు. ఏ మహా మాయాశక్తిచే నీ చరాచర జగమంతయును రచింపబడెనో యట్టి యచింత్య లక్షణములుగల చిత్కారణా స్వరూపిణిని మేము స్మరింతుము. ఏ మాయాతత్త్వ మెఱుగినచో సంసారము ఉత్పన్నమై తోచునో యే దివ్య తత్త్వ మెఱిగినచో సంసారము నశించునో యట్టి చిద్రూపను స్మరింతుము. ఆ వరేణ్యమైన చైతన్య జ్యోతి మా బుద్ధులను తచ్చింతనకు ప్రేరించుగాక!
ఓ జగదేక జననీ! భువనార్తిహారిణీ! మహేశ్వరీ! వివిధ శక్తులతో భాసిల్లు చిద్రూపిణీ! భవానీ! నీకు మా నమస్కారములు. మా యెడల సుప్రసన్నవై మాకు శ్రేయములు గల్గించుచు మా కార్యములు నెరవేర్చుము. రాక్షస వర్గమును నశింపజేసి భూభార ముడిపి శిష్యులకు శ్రేయము కలిగింపుము.
ఓ జగదేక జననీ! భువనార్తిహారిణీ! మహేశ్వరీ! వివిధ శక్తులతో భాసిల్లు చిద్రూపిణీ! భవానీ! నీకు మా నమస్కారములు. మా యెడల సుప్రసన్నవై మాకు శ్రేయములు గల్గించుచు మా కార్యములు నెరవేర్చుము. రాక్షస వర్గమును నశింపజేసి భూభార ముడిపి శిష్యులకు శ్రేయము కలిగింపుము.
ఓ రాజీవలోచనా! నీవు దేవతలపై దయజూపనిచో సమరాంగణమున నస్త్ర శస్త్రములతో శత్రువుల నెదుర్కొనజాలు వాడెవడుండెను? తొల్లి నీవు యక్షరూపము దాల్చి యగ్నితో ఈ గడ్డిపోచ గాల్చుము చూతుము' అని పలికినట్లు చెప్పితిని. ఈ విశాల ధరణిపై కంసుడు - భౌముడు - కాలయవనకేశులు - బక జరాసంధులు - ఖరశాల్వపూతనాదులు - నితర క్రూరరాజులను గలరు. వారి నెల్లర నంతమొందించి ధరాభారము తొలగింపగదే తల్లీ! కమలాక్షీ!
ఇంద్ర శివ విష్ణువుల వలన రాక్షసులు కొందఱు చావకుండిరి. వారు మున్ను నీ సుఖకరమైన రూపము చూచుచుండగనే నీ బాణములతో నవలీలలగ మడిసిరి.
ఓ చంద్రకళావతంసా! నీ చైతన్యశక్తి తోడులేనిచో బ్రహ్మ విష్ణు దేవులు నడుగు దీసి యడుగిడ నేరరు. అనంతుడును ధారణాశక్తి లేనిచో భూమిని మోయజాలడు.
ఇంద్రుడిట్లనెను: వాగ్రూప క్రియాశక్తి యగు సరస్వతి తోడులేనిచో బ్రహ్మయును పద్మ లేనిచో పద్మనాభుడును గిరిజ లేక గిరీశుడును విశ్వమును పుట్టించి పెంచి తుదముట్టింప నోపరు.
త్రిశక్తులతో గూడినంతనే త్రిమూర్తులగు ప్రజాపతులును తమ తమ కార్యములందు నిపుణులగుదురు.
విష్ణు విట్లు నుడివెను : ఓ విమలజ్ఞానరూపా! నీ కళాశక్తి లేనిచో బ్రహ్మ విశ్వరచనము - నేను విశ్వపాలనము - శర్వుడు విశ్వసంహారము చేయ దక్షులముగాము. నీవొక్కతెవే యీ సమస్తమున కేలికవై విహరింపగలవు. నీవు సకల విభవముల కధీశ్వరివని నిక్కముగ మాకు దోచుచున్నావు.
ఈ విధముగ దేవత లెల్లరును స్తోత్రములు సేయగ దేవదేవి యమరపతుల కిట్లు బలికెను.
'మీరు నిశ్చింతగ నుండుడు. మీకు నావలన కాగల కార్యమేదియో తెలుపుడు. దానిని నేను తప్పక నెరవేర్తును.
సురోత్తములారా! మీరు కోరిన కార్యమెంతటి యసాధ్యమైనదైనను సాధించి తీరుదును. మీకు మేలగుత! భూదేవికి గలిగిన దుఃఖమేమో తెలుపుడు.
దేవత లిట్లనిరి: తల్లీ! ఈ భూదేవి దుష్టరాజుల బరువుచే పీడితురాలై గడగడలాడుచు వాపోవుచు దేవతల సన్నిధి కేతెంచినది.
ఓ భువనేశ్వరీ! శివాత్మికా! ఆమె భారమును తొలగించుట యొక్కటే మా యభీష్టము. ఇదే మా ఇప్పటి కార్యము.
ఓ భువనేశ్వరీ! శివాత్మికా! ఆమె భారమును తొలగించుట యొక్కటే మా యభీష్టము. ఇదే మా ఇప్పటి కార్యము.
మాతా! మునుపు బలశాలియైన మహిషాసురుని నీ వనంత బలముతో తుదముట్టించితివి. అటులే మహావీరులగు శుంభ నిశుంభులను చండముండులను ధూమ్రలోచనుని దుర్ముఖ దుస్సహులను తక్కిన క్రూర రాక్షసుల నెందఱనో నీవు యుద్ధమునందు తెగటార్చితివి. అటులే నీవు దుష్టభూపతులను సంహరింపుము. భూభార ముడుపుము.'
అది విని శివరూపయగు జగదంబిక పెద్దగ నవ్వి నల్ల కలువలవంటి కడగంటి చూపుల చూచుచు మేఘ గంభీర వాక్కులతో దేవతలతో నిట్లు పలికెను:
'దేవతలారా! నేను మునుపే దేవతల యంశావతరణ విషయము నాలోచించితిని. కాన దుష్ట దానవులతో నిండిన భూభారమిక తొలగింతును. దైత్యపతులగు భూపతు లెల్లరును నా చేతిలో చత్తురు. మగధపతి మున్నగు వారిని నా మహాశక్తితో హీనసత్త్వుల నొనరింతును.
మీరును భూతలమున మీ మీ యంశములతో నవతరింపుడు. మీకు నా యద్భుతశక్తి తోడుండును. మీరపుడు భూభారము తొలగింప జాలుదురు. దేవతలకు ప్రజాపతి యగు కశ్యపుడు తన భార్యతో జన్మింప గలడు. అతడు యదువంశమం దానకదుందుభి యగు వసుదేవుడుగ నవతరింపగలడు. అటులే భృగు శాపమున విష్ణువును తన యంశముతో వసుదేవునకు నందనుడుగ నవతరింపగలడు. అపుడు నేనును గోకులమున యశోదకు ప్రభవింప గలను.
సురసత్తములారా! నేనీ విధముగ దేవకార్య మొనరింపగలను. హరి కారాగారమందు ప్రభవించును. నేనతనిని గోకులమునకు చేర్తును.
నేను దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భమునకు శేషుని జేర్పగలను. వారు నా దివ్యశక్తివలన వర్ధిల్లుదురు. దుర్మార్గులను చెండాడుదురు. ద్వాపరయుగము చివర తప్పక దుష్టరాజుల యంతమగును.
నేను దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భమునకు శేషుని జేర్పగలను. వారు నా దివ్యశక్తివలన వర్ధిల్లుదురు. దుర్మార్గులను చెండాడుదురు. ద్వాపరయుగము చివర తప్పక దుష్టరాజుల యంతమగును.
ఇంద్రాంశజుడైన యర్జునుడు దుష్టుల బల మణగింప గలడు. ధర్మాంశముతో ధర్మరాజును మరుదంశమున భీముడును నశ్వినుల యంశములతో నకుల సహదేవులును ప్రభవించిరి. వసునంశమున గాంగేయు డుద్భవించి దుష్టుల బలమును నశింప జేయగలడు.
మీరిక వెళ్లవచ్చును. భూదేవి నిశ్చింతగ నుండుగాక! నేను భూభారము తప్పక తొలగింనపగలను. నేను వారి నెల్లరను నిమిత్త మాత్రులుగ జేయగలను. నేనే నిస్సంశయముగ కురుక్షేత్రమునందు దుష్టక్షత్రియులను సంక్షయ మొనర్పగలను. ఈర్ష్య-తృష్ణ-మమత-అభిమానము-కోర్కులు-జిగీష- మదమోహములుమున్నగు దొసగులచే యాదవ నాశము గాగలదు.
ఒక విప్రశాపముతో యాదవ వంశ మంతరించును. హరియును శాపవశమున మేను చాలించగలడు. మీరు మీమీ సొంతబలములతో శ్రీహరికి సాయమొనర్పుడు. మీరు మీమీ స్త్రీలతోడ కృష్ణునకు సాయముగ మథురలో గోకులమున జన్మలు దాల్చుడు అని యీ విధముగ బలికి పరాత్ముని యోగ మాయాశక్తి యంతర్ధాన మొందెను.
దేవత లెల్లరును నిజవాసముల కరిగిరి. భూదేవియు వెళ్ళెను. ఆ ధరాదేవి జగదంబ మాటలకు సంతసించి సుస్థిర యయ్యెను. భూదేవి పరమౌషధులతో గుల్మలతాదులతో నొప్పెసగెను. అంత నెల్లప్రజలును విప్రులును సుఖముతో మహోదయముతో వర్ధిల్లిరి. మునులు సైతము సంతుష్టులై ధర్మతత్పరులై వర్ధిల్లిరి.
No comments:
Post a Comment