Thursday, April 16, 2026

Chapter 112 Sri Kalika Devi Kills Dhumralochana - అధ్యాయము 112 శ్రీకాళికాదేవి ధూమ్రలోచనుని సంహరించుట

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 112

శ్రీకాళికాదేవి ధూమ్రలోచనుని సంహరించుట

ధూమ్రలోచనుడు ఇట్లు పలికి విరమించెను. అతని మాటలు విని కాళికాదేవి పకపక నవ్వి లలిత గంభీరవాక్కులతో నతనికిట్లనెను : 

"మూర్ఖుడా! నీవు వదరుబోతవు. విదూషకుడవు. నటునివలె పల్కుచున్నావు. తీయగ పల్కినంత మాత్రాన లోని కోర్కులు తీరునటరా? మందమతీ! నీవు బలశాలివి. బలవంతుడవు. ఆ దుర్మదాంధునిచే పంపబడితివి. కనుక వట్టిమాటలు కట్టిపెట్టి నాతో బోరరమ్ము. శ్రీదేవి శత్రుమారిణి. దనుజలోక భయంకరి. ఈమె మహారౌద్రముతో వాడి బాణములతో నిన్నును నీ శుంభ నిశంభులను తక్కిన వీరులను హతమార్చికాని తన నిలయమున కేగదు. 

ఈ లసన్మరకత స్వచ్ఛ విగ్రహ విశ్వమోహిని యెక్కడ! ఆ మందమతియగు శుంభుడెక్కడ! వీరిర్వురికీ ప్రపంచములో వివాహము కడు దుర్లభము. ఈ జగన్మోహిని గుణసుందరియగు దేవి నీ పతిని తన పతిగ వరించునటరా! ఏ యందాల రాశియైన యొక్క నక్కను భర్తగ గోరుకొనునటరా? ఆడుయేనుగు గాడిదను కామించునటరా? కామధేనువు కుందేలును వలచునటరా? ఇక నీవు శుంభ నిశంభుల చెంతకేగవచ్చును. 

'నాతో బోరుము లేదా పాతాళమునకు వెళ్ళిపొమ్ము' ని వారితో నేను నిజముగ బలికితి ననుము'' అను కాళికాదేవి వాక్కులు విని ధూమ్రలోచనుడు కన్నులెఱ్ఱజేసి యామె కిట్లనెను : 

'కుత్సితాంగీ! నేనిపుడు నిన్ను నీ మదగర్విత సింహమును చంపి దేవిని మా రాజు చెంతకు గొనిపోదును. కలహప్రియా! నిన్నుచంపినచో రసభంగమగునని యెంచి యింతసేపూరకుంటిని. కానిచో నా వాడి బాణములతో నిన్నెప్పుడో దునిమాడి యుండునా? అన కాళి యిట్లనియెను: 

మూఢమతీ! ఊరక నిన్ను నీవేల పొగడుకొందువు? ఇది ధనుర్ధరుల ధర్మముగాదు. నీ శక్తి కొలది బాణములు వదలుము. యమాలయమునకు నడువుము అను కాళిక వాక్కులు విని యతడు విల్లందుకొని కాళిపై వాడితూపులు వాన కురిసెను. అపుడింద్ర ప్రముఖులు విమానముల నుండి చూచుచు శ్రీదేవిని సంస్తుతించుచు జయఘోషలు పెట్టసాగిరి. అంత వారిర్వురికిని బాణ-ఖడ్గ-గదా-శక్తి-ముసలములతో భయంకర యుద్ధము ఘటిల్లెను.

శ్రీకాళి మొదటిసారిగ వాని రథమును మోయు గాడిదలను రథమును దునిమాడి వికటాట్టహాస మొనరించెను. అంత నతడు మఱియొక రథమెక్కి కోపముతో మండిపడుచు కాళీదేవిపై తీవ్ర బాణవర్షము గురిసెను. కాళియును వానిబాణములెల్ల నడుమనే తుత్తునియలొనర్చి వానిపై తీవ్ర వేగముగల బాణములు ప్రయోగించెను. 

ఆ కాళి బాణప్రయోగమున వాని వేలాది యంగరక్షకులు మడిసిరి. రథము తునుకలయ్యెను. గాడిదలు నేలగూలెను. కాళిక వెంటనే నాగబాణమలుతో వాని వింటిని రెండుగ దునిమెను. సురలకు ప్రమోదము గూర్చి విజయ శంఖము పూరించెను. విరథుడైన ధూమ్రలోచనుడు కోపముతో లోహమయమగు పరిఘనుకొని రథమును సమీపించెను. 

కాలభయంకరుడగు ఆ దానవుడు శ్రీ కాళికతో 'ఓ కురూపా! పింగళాక్షీ! నిన్నిపుడే చంపుదున' ని చావుకేకలు పెట్టి పరిఘను వేసిన వెంటనే హ్రీంకారనిలయ యగు దేవి తన హుంకార మాత్రమున వానిని భస్మము చేసెను. ధూమ్రలోచనుని బూదిప్రోవుగని తక్కిన దానవులు భయాకులురై పరుగులు దీసిరి. ధూమ్రలోచనుడు చచ్చుట గని వారాపథమందలి దేవతలు పూలజల్లు కురిసిరి. 

అట్లు దానవులు గజాశ్వఖరములు చావగ రణరంగము భీకరదారుణమై బీభత్సముగ నుండెను. ఆ యుద్ధ భూమిలో పడిన పీనుగుల పెంటగని నక్కలు-గ్రద్దలు-డేగలు-కాకులు-పిశాచములు నర్తించుచు కోలాహలమొనరించెను. అత్తఱి జగదంబిక రణభూమి వదలి వేరొకచోటికేగి శత్రుల గుండెలవియగ శంఖనాద మొనరించెను. 

ఆ భీకర శంఖధ్వని తన యింటనున్న శంభుని చెవిలోబడెను. అంతలో కొందఱు నెత్తురులు కారుచుండగ రొప్పుచు రోదించుచు పరుగెత్తి వచ్చిరి. కాలుసేతులు-కన్నులు-నడుములు-వీపులు-మెడలు తెగిన దానవులు కొందఱు మంచములపై గిలగిల తన్నుకొనుచుండగ వారిని శుంభుడు చూచెను.

అది గని శుంభ నిశుంభులిట్లనిరి: ఆ ధూమ్రలోచను డెక్కడ? మీరేల వెన్ను చూపి పారివచ్చితిరి? ఆమె నేల తేలేదు మూఢులారా! తక్కిన సేన యెక్కడ? ఈ భయంకర శంఖధ్వని యెవరిదో సాకల్యముగ తెలుపుడు అన సైనికు లిట్లనిరి: 

ధూమ్రలోచను డీల్గెను. సైన్య మంతయును పడిపోయెను. ఈ లోకాతీత కార్యక్రమమంతయు రణమందొక్క కాళికవలననే జరిగెను. ఈ నింగి మారుమ్రోగు విజయశంఖధ్వని జగదంబది. ఈ మహాధ్వని నిఃఖిల సురులకు విజయానందమును దానవులకు శోకమును గల్గించునది. కాళికా ఘోరబాణముల మూలమున ధూమ్రలోచనుడు-అతని రథము-గుఱ్ఱములువినాశిత మయ్యెను. తక్కిన సేన శ్రీదేవి సింహము వాతబడి మడిసెను. 

ధూమ్రలోచనుడు నేలగూలిన వెంటనే యతని సైన్యము చెల్లాచెదరయ్యెను. అపుడమరులు నింగినుండి విరిజల్లులు కురిపించిరి. రాజా ! ఇక మనకు జయము గల్గదని మా దృఢనిశ్చయము. కనుక నేర్పు తీర్పుగల మంత్రులతో చక్కగ నాలోచింపుము. ఆ దుష్టవిద్రావిణియగు జగన్మాతయే బలము-తోడులే కొంటరిగ మీతో బోర సిద్దమగుట యెంతయో వింతగ నున్నది. ఆ బాల సింహాధిరూఢయై మదగర్వితయై జంకుకొంకులు లేకొంటిగ విశిష్టముగ ప్రకాశించుట యెంతే నద్భుతముగ చిత్రవిచిత్రముగ నున్నది. 

రాజా! ఇపుడు సంధి-విగ్రహము-పలాయనము-ఔదాసీన్యమునను వానిలో దేనినైన చక్కగ నాలోచించి తోచినట్లు చేయుము. పరంతపా! ఆమెకు తోడుగ బలము లేకున్నను సురలామెకు పార్శ్వరక్షకులుగ నుందురు. హరిహరులు తఱియెఱింగి యామెకు సహకార మొనర్తురు. తారాపథ మాశ్రయించిన దేవతలు సైత మా దేవి సన్నిధినే యుండగలరు. శత్రుతాపనా! నరకిన్నర-గంధర్వులెల్లరును సమయ మేతెంచినప్పుడామె కండదండలుగ నిలువగలరు. ఆ యంబిక కొకని సహాయ సంపత్తులు గావలయుననికాని యొక డెవడో యామె పని చేయవలయుననికాని యామెకు లేనేలేదని మే మెఱింగితిమి.

ఆ దేవి యొకతెయే యీ చరాచరజగములను నశింపజేయ శక్తురాలు. ఇక నీ సకల దానవు లామె కొక లెక్కయా? మహాభాగా! ఇది అంతయు నెఱిగి నీకు దోచినట్లు చేయుము. భృతుడెల్లప్పుడును మిత-హిత-సత్యవాక్యములు, పలుకవలయును అను సేనల మాటలు విని వైరిభీకరుడగు శుంభుడు తన తమ్ముని బిలిచి రహస్యముగ నతని కిట్లనెను : 

తమ్ముడా! కాళిక ధూమ్రలోచను నంతమొందించెను. మన సేనయు నంతమందెను. చెదరిన సేనలు పారివచ్చెను. ఇప్పుడంబిక మదగర్వముతో విజయశంఖము పూరించుచున్నది. కనుక జ్ఞానులకు సైతము కాలగతి తెలియరాదు. కాల వైపరీత్యమున వజ్రము గడ్డిపోచగ గడ్డిపోచ వజ్రముగ బలశాలి దుర్బలుడుగ మారును. దైవగతి యిట్టిదిగ నుండును. 

మహాభాగా! ఇపుడు మన కర్తవ్యమేమో తెలుపుము. ఆ యంబిక భోగింపరానిదని తెలియుచున్నది. మనకిపుడు పారిపోవుటుచితమా? నీవు చిన్నవాడవైనను నిట్టి సంకట సమయమున పెద్దవాడవనియే నిన్ను నేను దలతును. అన నిశుంభు డిట్లనెను : 

ఇపుడు మనకు పరుగెత్తుటకాని దూరమున దాగుటకాని తగదు. మన మామెతో బోరుట ఎల్లభంగుల మంచిది. నే నిపుడు వీర సైనికులతో వెళ్ళి యా యబలను చంపి తిరిగి రాగలను. ఒకవేళ దైవము మన కనుకూలింపక నేను మరణించినచో నీవు పల్మారు విచారించి పనిచేయుము అను మాటలు విని శుంభుడు తన తమ్మునితో మరల నిట్లనెను : 

నీవుండుము. చండ ముండు లిర్వురును సేనలతో పోరనేగగలరు. కుందేటిని పట్టుటకు గజమును పంపుట యుక్తముగాదు. చండ ముండ మహా వీరు లామెను దునుముటకు చాలుదురు అని శుంభుడు తన తమ్మునితోనని తన ముందున్న చండ ముండుల కిట్లనెను : 

ఓ చండ ముండులారా! మీరు శీఘ్రముగ సేనలతో మదగర్వమున సిగ్గులేని యా యబలను చంపుట కేగుడు. పింగళాక్షియగు కాళిని చంపి యంబికను గొనితెండు. ఈ బృహత్తర కార్యమును మీరు నెఱవేర్చుడు. ఆ యంబిక పట్టువడియును గరువము కొలది రానిచో రణాలంకార యగు నామెను వాడి బాణములతో చంపుడు.

అధ్యాయము 113 శ్రీకాళికాదేవి చండ ముండులను హతమార్చుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...