Monday, February 23, 2026

Vishnu took birth as Kapila (Kapilacharya), the son of Devahuti and the sage Kardama Prajapati - దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

అని కర్దముడు చెప్పగా వినిన దేవహూతి మనస్సులో సంతోషపడింది. ఆ మునివరుని మాటల ప్రకారం పరుడు, అనంతుడు, పద్మలోచనుడు, హరి, విష్ణువు అయిన భగవంతుని పూజిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. తరువాత దానవాంతకుడైన శ్రీహరి క
ర్దముని తేజస్సును ధరించి దనుజారి అయిన శ్రీహరి జమ్మిచెట్టు తొర్రనుండి అగ్ని పుట్టిన విధంగా దేవహూతి గర్భంనుండి ఆవిర్భవించాడు.

(శమీవృక్షం వృక్షాలలో పవిత్రమైంది. 'శమయతి దోషాన్‌ శమీ' అని వ్యుత్పత్తి. దోషాలను పోగొట్టి శాంతిని కలుగజేసేది శమీవృక్షం. దోషాలను పోగొట్టడంవల్ల శమీవృక్షం శుభస్వరూపమైనదిగా భావిస్తారు. శమీవృక్షం అనగా జమ్మిచెట్టు ఎంత పవిత్రమైనదో దేవహూతి గర్భంకూడా అంత పవిత్రమైనది. శమీవృక్షం నుండి ఉదయించిన అగ్ని ఊర్ధ్వముఖంగా ప్రసరించి అశుభాలను దగ్ధంచేసినట్లు దేవహూతి గర్భంనుండి పుట్టిన శ్రీహరి ఆమె శంకాగ్రంథులను విచ్చేదించి ఆమెకు తత్త్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అరణియందు అగ్నివలె ఆమె గర్భం నుండి జన్మించెను అని మూలం. అరణి అంటే అగ్నిని పుట్టించడానికి మరొక కర్రతో మథింప యోగ్యమైన దారువు. ఇక్కడ అరణి శమీతరువు. అరణిలో అగ్ని ఎప్పుడూ ఉంటుంది. మధించినపుడు బయటకు వస్తుంది. అలాగే భగవంతుడు క
ర్దమ తేజస్సులో ప్రవేశించెనని చెప్పడంవల్ల అంతకుముందు లేడని సందేహపడకూడదు. భగవంతుడు సర్వవస్తువులలో సర్వకాలాలలో నిండి ఉంటాడు. అయితే నిర్వికారుడుగా ఉంటాడు. భక్తులను అనుగ్రహించడానికి కరుణతో బాహ్యంగా ఒక స్వరూపం ధరించి అవతరిస్తాడు. తల్లి అయినా దేవహూతి స్వామికి భక్తురాలు. ఆమెను ఉద్ధరించడానికి ఆమెకే పుత్రుడుగా జన్మించడం ఆమె అదృష్టవిశేషం.)

భగవంతుడు కపిలాచార్యుడుగా జన్మించిన సమయంలో ఆకాశంలో దివ్యమంగళవాద్యాలు సందడిగా ధ్వనించాయి. ఆనందపడిన దేవతల సమూహాలు మందారపుష్పవర్షం కురిపించారు. గంధర్వులూ కిన్నరులూ పాటలుపాడారు. అప్సరసలు నృత్యంచేశారు. క్రమంగా దిక్కులన్నీ ప్రసన్నమైనాయి. సముద్రాలు ప్రశాంతమైనాయి. సజ్జనుల మనస్సులు సంతోషపడినాయి. హోమాగ్నులు తేజస్సుతో అతిశయంగా వెలిగాయి. చెట్లన్నీ పుష్పఫలభరితాలైనాయి. లోకంలో (పొలాలలో) అన్నిరకాల పైరులు అతిశయంగా పండాయి.

కపిలుడు ఆవిర్భవించిన ఆ మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో జన్మించిన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించడంకోసం మరీచి మొదలైన మునిగణాలతో కూడి బ్రహ్మదేవుడు వచ్చాడు. కపిలుని దర్శనంచేసి కర్దమదేవహూతులను చూచి ఇలా అన్నాడు.

స్తోత్రార్హమైన చరిత్రగల ఓ దంపతులారా! మీరిద్దరు కృతార్థులయ్యారు. నిజమైన భక్తితో మదిలో కపటం లేకుండా విష్ణుపూజ చేశారు. ఆ పూజకు తగిన ఫలం మీకు చేకూరింది.

ఆశ్రయించినవారి భయాన్ని పోగొట్టేవాడు, మునులచే స్తుతింపబడేవాడు, పరమాత్ముడు అయిన భగవంతుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చినాడు. మీ జన్మసార్థకమైంది.

నీతి పారంగతులైన దంపతులారా! వినండి. ఇచ్చతో, అద్వితీయమైన భక్తితో శ్రీహరిని పూజిస్తే ఆ పూజే మోక్షసంపాదనకు సరిపోతుంది. మీపుణ్యాన్ని ఏమని పొగడగలను?

అని చెప్పి మళ్లీ కర్దముని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు. “మునీంద్రా! నీ పుత్రికలను పేరొందిన ఉత్తమ స్వభావులూ, సదాచారసంపన్నులూ అయిన మునిశ్రేష్ఠులకు ఇచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల బిడ్డలను సృజించడం అనేక విధాలుగా అభివృద్ధి పొందుతుంది”. అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు.

ఓ పుణ్యాత్ముడవైన కర్దమా! ఈ ఘనుడు సమస్త ప్రాణుల హృదయాలలోని కోరికలను నెరవేర్చేవాడు కావున ఘనుడైన ఈ నీ కుమారుడు మహాతేజోవిరాజితుడు. ఈ మహాత్ముని పరమేశ్వరుడుగా, ప్రభువుగా, జయింపరానివాడుగా, నలినాక్షుడైన పురుషోత్తముడుగా, పరిమితిలేనివాడుగా, చ్యుతి లేనివాడుగా, గొప్పవాడుగా, అంతంలేనివాడుగా, మొదటివాడుగా, షడ్విధ పరిణామములు లేనివాడుగా, శాశ్వతుడుగా తలంచు.

(శ్రీహరి దేవహూతీ క
ర్దములకు కపిలనామధేయంతో పుట్టిన విషయం కర్దమునికి తెలుసు. తాను పుడుతున్న విషయం శ్రీహరి కర్దమునికి స్వయంగానే చెప్పాడు. అయినా బ్రహ్మదేవుడు మరల ఈ విషయం కర్దమునికి చెప్పి ఆ పుట్టినది శ్రీహరి అంశతో ఉన్న కపిలుడని తెలిపాడు. ఆయనను ఆద్యంతాలులేని అచ్యుతుడైన మహాపురుషుడుగా భావించుమన్నాడు.

అజిత, అమేయ, అచ్యుత, అనంత, ఆద్య, అవికార, అక్షర మొదలైన పదాలన్నీ విష్ణువును తెలిపేవే. 'అచ్యుత' అనేమాట శ్రీకృష్ణునికి రూఢిగా వాడబడేమాట. 'నాస్తిచ్యుతం స్ఖలనం స్వపదా ద్యస్యసః' అని దీని వ్యుత్పత్తి. తన చోటునుండి భ్రంశము పొందనివాడని అర్థం.)

దేవహూతీ! మాననీయమైన జ్ఞానవిజ్ఞాన యోగాలనే ఉపాయాలచే కర్మజీవులను ఉద్ధరించడానికి శ్రీహరి నీ కడుపున పుడతాడు. బంగారురంగు తలవెండ్రుకలు కలవాడు, వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు, మనోజ్ఞమైన పద్మం, హలం, వజ్రాయుధం, అంకుశం రేఖలు గల అరికాళ్లతో కూడినవాడు, సత్త్వగుణసంపన్నుడు అయి ఇప్పుడు నీగర్భంలో ఉదయించిన అలాంటి మహాత్ముడు నీకు తత్త్వబోధచేస్తాడు. నీ మనస్సులోని సందేహాలన్నింటిని పోగొడతాడు.

(జ్ఞానమంటే తత్త్వజ్ఞానం. మోక్షవిషయకమైన బుద్ది. విజ్ఞానమంటే విశేషజ్ఞానం, శాస్త్రసంబంధమైన జ్ఞానం. 'తత్త్వం' అనే మాటకు అనేకార్థాలున్నాయి. ఈ మాట వేదాంత పరిభాషలో తరచుగా వినబడే మాట. బ్రహ్మం అనేది ఒక ప్రధానార్థం. ఈ మాటకు అద్వైతులు బ్రహ్మం అని అర్ధం చెపితే, ద్వైతులు స్వతంత్రమని అస్వతంత్రమని అర్ధం చెప్పారు. చిత్తు, అచిత్తు, ఈశ్వర రూపాలన్నారు విశిష్టాద్వైతులు. ఈ మూడింటి మధ్యగల సంబంధమే వీళ్ల దృష్టిలో తత్త్వజ్ఞానం. తత్త్వబోధ చేయడమంటే ఈ మూడింటిని గురించి వివరించడమే.)

మీరు కన్న ఇతడు పేరుపొందినవాడై, సిద్ధపురుషులచే సేవింపబడుతూ, మహనీయమైన సాంఖ్యయోగంతో విరాజిల్లే పరతత్త్వమందు సుస్థిరుడై, కపిలుడనే పేరుతో ప్రసిద్దుడై ఈ మూడులోకాలలోనూ సంచరిస్తాడు.

(అణిమాది సిద్ధిగలవారు సిద్దులు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఇవి ఎనిమిదీ అణిమాదులు. సాధారణవ్యక్తులకు లేని అతీంద్రియశక్తులు గలవారు సిద్దులు. ఈ సిద్దులు ఐదురకాలని పతంజలియోగశాస్త్రంలో చెప్పబడింది. పూర్వజన్మలో సాధనవల్ల కలిగేవి, దేవతలకు జన్మచేతనే కలిగేవి జన్మసిద్దులు. కొన్ని మంత్రాలవల్ల కలిగేవి మంత్రసిద్దులు. తపస్సులవల్ల కలిగే సిద్దులు నాలుగోరకం. సమాధిస్థితివల్ల కలిగేవి సమాధిసిద్దులు. మానవులలో కూడా ఇలాంటి సిద్దులు కలవారు కొందరు కనపడుతూ ఉంటారు. నవనాథసిద్ధులు ఇలాంటివాళ్లే. సిద్ధపురుషులచేత సేవింపబడడంవల్ల కపిలుడు దైవస్వరూపుడనే విషయం విదితమవుతూ ఉంది.

సాంఖ్యయోగం - సంఖ్యతో కూడినది సాంఖ్యయోగం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మవస్తువులను లెక్కించునపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కనుక అది సాంఖ్యమనబడింది. ప్రకృతి యందుగల 24 తత్త్వాలను, లేక 96 తత్త్వాలను లెస్సగా శోధించి, అవి అనాత్మరూపాలని త్యజించి వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను గ్రహించుటే సాంఖ్యవిద్య. ఆత్మానాత్మవివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యం. సాంఖ్యవేదాంత తత్త్వపద్ధతిని నెలకొల్పినవాడు కపిలుడు. ఇతడు విష్ణ్వంశతో జన్మించినవాడు.)

అలా కపిలుని గురించి చెప్పి, వివాహనిమిత్తం మరీచిమహర్షిని అక్కడే ఉండమని బ్రహ్మదేవుడు తన కుమారులైన నారదుడు సనకుడు మొదలైన వారితో కలసి తన నివాసస్థానానికి వెళ్లాడు.

బ్రహ్మదేవుడు వెళ్లినతరువాత కర్దముడు బ్రహ్మాదేవుని ఆజ్ఞానుసారం తన యోగ్యతకు తగినట్లుగా తన కుమార్తెలకు పెండ్లిండ్లు చేయాలని నిర్ణయించాడు. తన కుమార్తెలలో కళను మరీచిమహర్షికి, అనసూయను అత్రిమహర్షికి, శ్రద్ధను అంగిరసమహర్షికి, హవిర్భువును పులస్త్యమహర్షికి, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువు అనే మహర్షికి, ఖ్యాతిని భృగుమహర్షికి, అరుంధతిని వశిష్ఠమహర్షికి, శాంతిని అధర్వుడు అనే మహర్షికి ఇచ్చి తన కులాచారం ప్రకారం తన తొమ్మండుగురు కొమార్తెల పెండిండ్లు యథావిధిగా జరిపించాడు. ఆ తొమ్మండుగురు మహర్షులు భార్యలను గ్రహించి, క
ర్దముడు సమర్పించిన కానుకలను అందుకొని ఆయన అనుమతితో భార్యలతో కలసి తమతమ ఆశ్రమ ప్రాంతాలకు వెళ్లారు. తరువాత కర్దముడు దేవాధిదేవుడైన విష్ణువు తన గృహంలో పుట్టి పెరుగుతూ ఉన్న విషయం తెలుసుకొన్నాడు. ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ కపిలావతారంలో ఉన్న శ్రీహరికి నమస్కరించి ఇలా అన్నాడు.

ప్రజ్ఞగల ఓ మహాత్మా! వినండి. తాముచేసిన అశుభకరాలైన పనులు అనే కార్చిచ్చు మంటల్లో ఎక్కువగా దహింపబడుతున్నవారైన ప్రాణులందరూ పూర్తిగా బయటపడలేక ఎడతెగని సంసారబంధాలలో బంధింపబడినవారై ఉంటారు. ఎంతోకాలం ఇలా గడచిపోతూ ఉంది. సకలదేవతల అనుగ్రహంవల్ల, అనేక జన్మలలో ఏర్పడిన పరిచయంవల్ల ప్రాప్తించిన దీర్ఘమైన సమాధియోగముయొక్క తపోనిష్ఠతో ఒంటరి ప్రదేశాలలో యోగీశ్వరులు ధైర్యంతో ఏమరక ఏ మహానుభావుని దర్శిస్తారో అటువంటి దివ్యపురుషరత్నమైన దేవాధిదేవా! నీవునా గృహంలో జన్మించావు.

సంసారచక్రంలో నిలువనీక గిరగిర తిప్పబడుతూ పామరులుగా ఉన్న మాప్రవర్తనలను లెక్కించకుండా మొదట ప్రతిజ్ఞచేయబడినవైన నీ మాటలను తప్పకుండా మమ్ము అనుగ్రహించటానికి మా ఇంటిలో పుట్టావని చెప్పి కర్దముడు మళ్లీ ఇలా అన్నాడు.

(పై వచనంలోని విషయం క
ర్దముడు కపిలావతారంలో ఉన్న శ్రీహరికి చెప్పినది. 'ప్రతిశ్రుతంబులయిన భవదీయవాక్యంబులు' ముందెప్పుడో శ్రీహరి కర్దమునికి చెప్పినవి. తరువాత జరగబోయే విషయాన్ని శ్రీహరి ఆనాడు కర్దమునికి చెప్పాడు. ఆ విషయం తప్పకుండా జరిగి తీరాలి కనుక ఆ విషయాన్ని వ్యక్తం చేసిన మాటలు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పినవే. ఈ స్మంధంలోనే పూర్వం శ్రీహరి కర్దమునికి ఇలా చెప్పాడు. "స్వయంభువమనువు తన కూతురు దేవహూతిని తోడ్కొని నీ ఆశ్రమానికి వచ్చి ఆమెతో నీకు వివాహం జరిపిస్తాడు. ఆమె ద్వారా నీకు తొమ్మండుగురు పుత్రికలు పుడతారు. నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్తకార్యాలు నాకే సమర్పిస్తూ ఉండు. నాలోనే లోకాలన్నీ ఉన్నాయని, నీలో నేనున్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. చివర నీవు నా సన్నిధికి చేరగలవు. నీ తేజస్సువల్ల నేనునీ భార్య కడుపులో ప్రవేశించి నా కళాంశతో నీకు కుమారుడనై జన్న్మిస్తాను" అని చెప్పినమాట శ్రీహరి తప్పకుండా ఈనాడు నెరవేర్చాడు. ఈ విషయాన్ని కర్దముడు భక్తితో తలచుకొంటున్నాడు.)

ఓ పరమపురుషా! మహాత్మా! ప్రకృతికి సంబంధించని బలంతోకూడిన నాల్గుబాహువులు మొదలైనవిగల నీ అవతారాలు నీకు తగినవైనవిగా అలరాలుతూ ఉన్నాయి.

(చతుర్బుజుడంటే నాలుగు చేతులు గలవాడైన శ్రీమహావిష్ణువు. మూలమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు. నిత్యవిభూతికి చెందిన శ్రీవైకుంఠంలో నిత్యులకు, ముక్తులకు దర్శనం ప్రసాదిస్తూ ఉంటాడు. వివిధ ప్రయోజనాలకోసం మూలమూర్తి అనేక అవతారాలు ధరిస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఆయా కాలాలు కూడా వేరువేరు ధర్మాలతో కూడి ఉంటాయి. అవతారమూర్తులందరూ లీలా విభూతికి చెందినవారు. ఒక్కొక్క అవతారమూర్తి ఏయే లోకధర్మ రక్షణకోసం వచ్చాడో ఆయన ఆ ధర్మాన్ని రక్షించడంకోసం అనేక కార్యాలు చేపట్టవలసి వస్తుంది. అవతార ధర్మాన్ని కూడా మరుగు పరచవలసి వస్తుంది. అవతారకాలంలో అవసరం ఏర్పడినప్పుడు మూలమూర్తి స్వరూపాన్ని గ్రహించినపుడు చతుర్భుజాలు గోచరిస్తాయి. దీనికి శ్రీకృష్ణావతారం మంచి ఉదాహరణం. మూలమూర్తికున్న చతుర్భుజాలు ఆవతారమూర్తులకు కూడా అనురూపాలుగా ఒప్పారుతూ ఉంటాయి. శ్రీహరిని స్తుతించడంలో భాగంగా కర్దముడు చెప్పిన విషయమిది.)

ఓ శ్రీహరీ! అనవరతమూ నిన్ను ఆశ్రయించే ఆర్తజనరక్షణకోసం అంగీకారంతో నీవు ధరించే మానవరూపాలు నీ కెప్పుడూ అనుగుణమైన రూపాలే అవుతాయికదా!

గొప్ప తత్త్వాల నిజస్వరూపాన్ని గురించిన జ్ఞానంకోసం అనుభవజ్ఞానులు ప్రయత్నపూర్వకంగా నమస్కరించే పాదపీఠంగల నిన్ను స్తుతించడానికి, నిన్ను గురించి వివరించడానికి ఎవరికి శక్యం?

భక్తవరదా! అపారమైన షడ్గుణాలైన జ్ఞానబల ఐశ్వర్యవీర్య తేజశ్శక్తులకు నీవు కారణభూతుడవు. పరమేశ్వరుడవు. ప్రకృతి పురుషుడు, మహత్తత్త్వం, అహంకారత్త
త్త్వం, పంచతన్మాత్రలు నీవే. వీటిని క్షోభింప చేయడానికి కారణమైన కాలస్వరూపం కూడా నీవే. అంతేకాదు ఈ అన్నింటికీ నీవు ప్రసిద్ధమైన పట్టుగొమ్మవు. ప్రపంచమే నీ స్వరూపం. నీవే జ్ఞాన స్వరూపుడవు. పొట్టలో సర్వప్రపంచాన్ని ఉంచుకొన్న సర్వజ్ఞుడవు. స్వతంత్రమైన శక్తితో కూడినవాడవు. సర్వసాక్షివి. అటువంటి నీవు 'కపిలుడు' అనే పేరుతో ప్రకాశిస్తున్నావు. ఓ మహానుభావా! నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు కొడుకుగా పుట్టడంవల్ల నేను దేవ, ఋషి, పితృ ఋణాల నుండి విముక్తి పొందాను.

(జ్ఞానబలైశ్వర్యాదులు భగవంతుని షడ్గుణాలు. ఈ గుణాలే భగవంతుని ఐశ్వర్యాలుకూడా. ఈ గుణాలన్నీ ప్రకృతిలో ఉన్నవే. అయితే ఇవి ముందు శ్రీహరివి. ఆయన నుండి లోకానికి ప్రసరించినవి. ప్రకృతిలోని సమస్త ఐశ్వర్యం భగవంతునిదే. 'భగం' అంటే ఐశ్వర్యం. అది కలవాడు భగవంతుడు. ఇవి షడ్గుణాలు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నా ఏ ప్రాణిలోనూ సమగ్రంగా ఉండవు. కొన్నిగుణాలు లోపించే ఉంటాయి. ఇవి సమగ్రంగా ఉండేది భగవంతునిలోనే. అందుకే ఆయన 'సమధిక షడ్గుణైశ్వర్యవంతుడు'. ఐశ్వర్యం, వైరాగ్యం, యశస్సు, పరిపూర్ణజ్ఞానం, వీర్యం, తేజస్సులు 
షడ్గుణైశ్వర్యాలని కొందరు చెపుతారు. ఇవన్నీ కలిస్తే భగవత్‌ స్వరూపం ఏర్పడుతుంది. ప్రకృతికి ప్రధానమని మరొకపేరు. ప్రధానమే భగవంతుని శరీరం. ప్రకృతిని నియమించే పురుషుడు కూడా పరమాత్మయే. అహంకారం ఈశ్వరరూపం. ప్రధానమైన ప్రకృతిని అహంకారం క్షోభింపజేస్తుంది. జ్డాన స్వరూపుడు కాబట్టి భగవంతుడు సమస్త ప్రపంచాన్ని తనలో ఉంచుకొని ప్రకృతి క్షోభలను నియమిస్తూ ఉంటాడు. 

ఋణత్రయం - మనిషికి పుట్టుకతోనే మూడు ఋణాలు ఉంటాయని శాస్త్రవచనం. ఇవి మూడు.

1. ఋషిబుణం - మానవాళి శ్రేయస్సుకోసం శాస్త్రాది గ్రంథాలను ప్రసాదించిన ఋషులఋణం అధ్యయనంవల్ల అధ్యాపనంవల్ల తర్పణాదులవల్ల తీరుతుంది.

2. దేవఋణం - దేవతలు మనకు చేసే అనేక ఉపకారాలవల్ల ఏర్పడే ఋణమిది. ఇది యజ్ఞయాగాదుల నిర్వహణవల్ల తీరుతుంది.

3. పితృ (మానవ) ఋణం - జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు సేవ చేయడంవల్ల, సంతానాన్ని కని వంశం కొనసాగడానికి దోహదపడినందువల్ల ఈ ఋణం తీరుతుంది.)

ఉత్తమమైన వ్రతాలు, యోగాలు - వీటితో ఏర్పడిన సమాధిస్థితిలో నిలుకడ కలవాడినై, నీ పాదాలను మనస్సులో నిలుపుకొని శోకాలను దూరం చేసుకొని ప్రసిద్ద తీర్థాలలో సంచరిస్తాను.

ప్రసిద్ధ తీర్థాలలో సంచరిస్తానని మనవి చేశాడు కర్దముడు. ఆయన మాటలు విని భగవంతుడు, మహాత్ముడు అయిన కపిలుడు ప్రీతితో ఇలా చెప్పాడు.

కర్టమ మునిశ్రేష్ఠా! నేను నీకు ముందు చెప్పిన ప్రతిజ్ఞాపూర్వకమైన మాటలను అతిక్రమించకుండా కారణం లేకుండానే గొప్ప దయతో నీ గృహంలో జన్మించాను. అవాప్త కాముడనైన నాకు కోరికలంటూ ఏవీ లేవు. నేనీ మునివేషం ధరించడం నాకోసం కాదు. చెపుతాను విను. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైన గొప్ప పరమవివేకాన్ని వివరణాత్మకంగా తెలియజేసే తత్త్వబోధ చేయడంకోసం పవిత్రమైన వ్యక్తమార్గంగా ధరించిన శరీరమిది అని తెలుసుకో. భక్తితో నాపాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నంచెయ్యి.

నీవు అధికమైన నిష్ఠకలవాడవై యోగమార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకే వదలిపెట్టు. మోహాన్ని విడిచిపెట్టు. ముక్తికోసం భక్తితో నన్ను సేవించు.

పరమేశ్వరుడు, పరంజ్యోతి, అనఘుడు, అనంతుడు, దేవదేవుడు సకలప్రాణుల హృదయాలలో ఉండేవాడు, ఆద్యుడు, అజుడు, ఆద్యంతశూన్యుడు, దురిత విదూరుడు అయిన నన్ను -

అనఘా! నీ మనస్సు అనే పద్మమధ్యంలో నన్ను(పరమాత్మను - కపిలుని) స్థిరంగా నిలిపి జితేంద్రియుడవై క్రమంగా మనోనేత్రంతో నన్ను దర్శించు.

జితేంద్రియుడవై క్రమంగా నన్ను నీ మనోనేత్రంతో దర్శిస్తూ ఉంటే ముక్తిని పొందగలవని కపిలుడు క
ర్దమునికి చెప్పాడు. కర్దముడు ఆ మునికుల తిలకుడైన కపిలునికి ప్రదక్షిణం చేసి మిక్కిలి భక్తితో నమస్కారాలు సమర్పించాడు. ఎంతో ఉత్సుకత కలవాడైనాడు.

కర్దముడు మునులు సేవిస్తున్న అరణ్యానికి వెళ్లాడు. అక్కడ మౌనంతో లోకసంబంధాలన్నీ త్యజించాడు. హోమాది అగ్నికార్యాలు విడిచి పెట్టాడు. ఒకచోట నిలువకుండా అంతటా తిరుగుతూ తనలోని పరమాత్మనే శరణుజొచ్చాడు.

కర్దముడు మునిజన నివాసయోగ్యమైన అరణ్యానికి వెళ్లాడు. అక్కడ పరబ్రహ్మమునే మనస్సులో నిలుపుకొని నేను నాది అనే భావాన్ని వదలి వేశాడు. దయామయ హృదయంతో సకల ప్రాణులను సమానంగా చూస్తూ ప్రశాంత స్వభావం కలవాడైనాడు. అలలు లేని సముద్రంవలె చాంచల్యరహితుడై సమస్త ప్రపంచాన్నీ వాసుదేవమయంగా భావిస్తూ భక్తియోగంతో విష్ణుభక్తులు పొందే పరమపదాన్ని అందుకొన్నాడు. ఈ విషయం చెప్పిన మైత్రేయమహర్షి విదురునితో ఇంకా ఇలా అన్నాడు “కర్దముడు అడవికి వెళ్లిన తరువాత మాతృవాత్సల్యం కల కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తత్త్వమార్గాన్ని దర్శింపజేయగలవాడైన కుమారుని చూచి ముందు బ్రహ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఇలా అన్నది”.

దేవహూతి పుత్త్రుండైన కపిలాచార్యుని వలన తత్పజ్ఞానంబు వడయుట

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

No comments:

Post a Comment