Friday, March 20, 2026

Shiva Siva Converted as Kapali - శివుడు కపాలి అయిన కథనం

శివుడు కపాలి అయిన కథనం


ఒకనాడు పార్వతీదేవి ఏకాంతంలో పరమేశ్వరుడితో ప్రభూ! హిమవంతం, మందరం, గందమాదనం, కైలాసం, మేరు పర్వతం రమ్యమైన త్రికూటంలాంటి పర్వతాల మీద ఎన్నో దివ్యమైన సుందరమైన ప్రదేశాలుండగా వీటన్నిటినీ కాదని మీకు అవిముక్త క్షేత్రమైన వారణాసి అంటే ఎందుకు ఇష్టం? అని ప్రశ్నించింది.

శివుడు పార్వతితో "దేవీ! వారణాసి పుణ్యక్షేత్రం. ఇక్కడికి సిద్ధ గంధర్వుల చేత సేవించబడే గంగానది (త్రిపథ) ప్రవహిస్తోంది. అందుకే నాకు ఈ క్షేత్రం అంటే ప్రీతి. ఇది పరమపవిత్రమైన క్షేత్రం. ఇక్కడనేనెప్పుడూ నివసిస్తుంటాను. పాపులుగానీ, పాషండులుగానీ, వేదబాహ్యులుగానీ, అధర్మాల్ని ఆచరించేవారు కానీ అవిముక్త క్షేత్రాన్ని దర్శిస్తే వారి పాపాలనుంచి విముక్తి పొందుతారు. ప్రళయం సంభవించి సకల భూతాలూ నశించినప్పటికీ ఈ దివ్య క్షేత్రం నశించదు. నేను కూడా దీన్ని విడిచివుండను. దేవీ నీకు పరమ రహస్యం చెబుతావిను. వంద జన్మలు యోగం చేసినా సిద్ధిస్తుందో లేదో చెప్పలేము. అలాగే లక్ష జన్మలకైనా మోక్షం లభిస్తుందో లేదో సందేహమే అయితే అవిముక్తమైన ఈ వారణాసీ క్షేత్రంలో ప్రవేశించి అక్కడే నివసించువాడికి ఒక జన్మలోనే యోగం, మోక్షం రెండూ సిద్ధిస్తాయి. దీనితో సాటియైన క్షేత్రం మరొకటి లేదు. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. కనుకనే ఇది నాలుగు వర్ణాల వారికీ గమ్యస్థానం.

పరమేశ్వరుడి మాటలువిన్న పార్వతి స్వామీ! మీరీ అవిముక్త క్షేత్రం గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా ఈ దివ్యక్షేత్రం ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలనుంది అని అడిగింది. దేవీ! నీకు మరో విషయం చెబుతున్నాను. పూర్వం బ్రహ్మదేవుడికి అయిదు తలలుండేవి. ఆయన అయిదో తల ఎంతో అందంగా బంగారు రంగులో ప్రకాసిస్తూండేది. అది చాలా శ్రేష్టమైనది. ఒకనాడు తన అయిదో తలతో బ్రహ్మ నన్ను అవహేళనగా మాట్లాడాడు. దానితో నాకు కోపం వచ్చి రక్తనేత్రాలతో ఆగ్రహంగా నా ఎడమ చేతి బొటన వేలి గోరుతో ఆయన అయిదో తలని తుంచేసాను. నేనలా చేయటంలో బ్రహ్మ “నా తలని తుంచి అపరాధం చేసిన నీవు కపాలాన్ని ధరించి తిరిగెదవుగాక! బ్రహ్మహత్యా దోషం చేసిన కారణంగా ఆకపాలంతో భూమండలమంతా సంచరించు” అని శాపమిచ్చాడు.

బ్రహ్మ శాపం విని నేను చేసేదేమీలేక కపాలాన్ని ధరించి వెంటనే అక్కడ నుంచి హిమవత్పర్వతం మీదకి వెళ్ళాను. అక్కడనుంచొని నారాయణుణ్జి ధ్యానించాను. ఆయన వెంటనే నాకు ప్రత్యక్షమై తన పార్శ్వాన్ని చీల్చాడు దాని నుంచి అనంతమైన రక్తధార ప్రవహించటం ప్రారంభమైంది. ఆ మహాధారలో ముంచినా నాచేతి లోవున్న కపాలం విడిపోలేదు. ఘోరమైన ఆరక్తధార వేయి దివ్య సహస్రాలపాటు అలా ప్రవహిస్తూనే వుంది. అది చూసి శ్రీహరికి ఆశ్చర్యం కలిగి "శంకరా! నీ చేతిలో వున్నటువంటి కపాలాన్ని నేనింత వరకూ చూడలేదు. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది?” అని ప్రశ్నించాడు.

"శ్రీహరీ పూర్వం బ్రహ్మదేవుడు లక్ష దివ్య సంవత్సరాలు కఠోరమైన తపస్సుచేసి దివ్యమైన శరీరాన్ని పొందాడు. అప్పుడే ఆయనికి ఉన్న నాలుగు తలలకి అదనంగా అందమైన అయిదోతల ఆవిర్భవించింది. ఆవేశంలో నేనా తలని తుంచేశాను. ఈకపాలం ఆ తలదే అందుకే అది నన్ను విడవకుండా అంటిపెట్టుకొనే వస్తుంది". అని జరిగిన విషయాన్ని చెప్పాడు శంకరుడు. అది విని "శంకరా! ఇక నేనేమీ చేసేది లేదు ఇది బ్రహ్మ హత్యాదోషం వల్ల సంక్రమించింది. కాబట్టి నీవు బ్రహ్మకి ప్రీతి కలిగి పనిచేయాలి. నీ చేతికి అంటిన ఆయనకపాలం ఏస్థలంలో నీ చేతి నుంచి విడిపోతుందో ఆ దివ్యస్థలాన్నే నీ నిత్యనివాసంగా చేసుకో" అని సలహా చెప్పి అదృశ్యమయ్యాడు.

తరువాత నేను ఆ కపాలాన్ని ధరించి ఎన్నెన్నో దివ్యక్షేత్రాలు, తీర్థాలు, పర్వతాలు అన్ని తిరిగాను. ఎక్కడా ఆ కపాలం నన్ను వదల్లేదు. చివరికి ఈ వారణాసి క్షేత్రానికి వచ్చిన వెంటనే నా చేతికి అంటినకపాలం వేయిముక్కలుగా చీలి వడిపోయింది. అది చూసి ఈ దివ్యక్షేత్రం బ్రహ్మహత్యా నివారకమైనదిగా గ్రహించాను. దేవీ ఈ అవిముక్త క్షేత్రం దేవతా శ్మశానం. ఇక్కడ నేను కాలుడి రూపంలోవుండి ఈ జగత్తునంతా సంహరిస్తూవుంటాను. అందుకే ఇది నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. నా మీద, విష్ణుమూర్తి మీద, ఆదిత్యుడి మీద అచంచలమైన భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దివ్యక్షేత్రానికి వెళ్ళగలరు. ఇక్కడ శరీరత్యాగం చేసినవారు సరాసరి నన్ను
చేరుకుంటారు. ఈవిధంగా పరమేశ్వరుడు పార్వతికి అవిముక్త క్త క్షేత్రమహాత్మ్యాన్ని తాను కపాలిగా మారిన కథనాన్ని చక్కగా వివరించాడు.

నర్మదా మాహాత్మ్యం

మత్స్య పురాణము

No comments:

Post a Comment