Friday, March 20, 2026

189 Matruka Shakthi - 189 మాతృకాశక్తులు

189 మాతృకాశక్తులు

మహేశ్వరీ, బ్రహ్మీ కౌమారీ, మాలినీ, సౌవర్ణీ, వాయవ్యా, శాక్రీ, వైనాయకీ, సౌరీ, సౌమ్యా, శివదూతీ, చాముండా, వారుణీ, వారాహీ, నారసింహీ, వైష్ణవీ, చలచ్చిఖీ, శతానందా, భగానందా, పిచ్చిలా, భగమాలినీ, బలా, అతిబలా, రక్తసురభీ, సుఖమండికా, మాతృనందా, సునందా, బిడాలీ, శకునీ, రైవతీ, శంకరీ, చంద్రా, లాంగలీ, కుదినీ, జయా, విజయా, జయంతీ, అపరాజితా, కాళీ, మహాకాళీ, దూతీ, సుభగా, దుర్భగా, కరాళీ, నందినీ అదితి, దితీ, మాలీ, మృత్యు, కర్ణమోటీ, యామ్యా, ఉలూఖీ, ఘటోదరీ, వజ్రహస్తా, పిశాచీ, కపాలీ, రాక్షసీ, భుశుండీ, శాంకరీ, లంబా, చంద్రా, కరభా, ఘోటా, ధూమ్రా, వరవాణీ, సులోచనా, కరాళికా, విశాల దంష్ట్రిణీ, శ్యామా, త్రిజటి, కుక్కుటా, వినాయకీ, వైతాళీ, ఉన్మనా,జడబా, సిద్ధీ, లేలిహానా, కేసరీ, గర్ధభీ, ఉత్కటా, బహుపుత్రీ, ప్రేతయానా, విటంకినీ, క్రౌంచీ, శైలముఖీ, వినతా, సరమా, దసు, ఉమా, రంభా, మేనకా, సలిలా, చిత్రరూపిణీ, స్వధా, స్వాహా, వషట్కారా, ధృతీ, జ్యేష్ఠా, కపర్థినీ, మాయా, విచిత్రరూపా, కామరూపా, సంగమా, మహానావా, మహాముఖీ, కుమారీ, రోచనా, భీమా, దామా, మదోద్ధతా, లంబాక్షీ, కాలజిహ్వీ, కుంభకర్ణా, మహామారీ, మహాసురీ, కేశినీ, కుసఖీ, పింగళాక్షీ, తామసీ, ఉల్కా ముఖీ, ధూమ్రశాఖా, కంపినీ, పరికంపినీ, మోహినీ, కుండలీ, చంద్రా, నిర్భయా, బాహుశాలినీ, కరకర్ణీ, ఏకాక్షీ, విశోకా, నందినీ, జ్యోత్స్నా ముఖీ, రభసా, నికుంభా, రక్త కంపనా, అధికారా, మహాచిత్రా, చంద్రసేనా, మనోరమా, ఆదర్శనా, హరత్పాపా, మాతంగీ, లంబమేఖలా, అబలా, వంచనా, కాళీ,  ప్రాణదాలాంగలావతీ, చిత్తా, చిత్తజలా, కోణా, శాంతికా, దృష్టిశాలినీ, లంబస్తనీ, లంబపటా, వినటా,
వాసచూర్ణినీ, స్థలంతీ, దీర్ఘకేశీ, సుచరీ, సుందరీ, శుభా, అయోముఖీ, కద్రుముఖీ, క్రోధనీ, అశనీ, కుటుంబికా, ముక్తికా, చంద్రికా, బాలమోహినీ, సామాన్యనహినీ, లంబాలకోవిదారీ, మానవీ, శంకుకర్ణీ, మహానాదా, మహాదేవీ, మహోదరీ, హంకారీ, రుద్ర సునటా, రుద్రేశీ, భూతడామరీ, పిండజిహ్వా, చలజ్జావలా, శివా, జ్వాలాముఖీ.

ఈ విధంగా మొత్తం 189 మంది మహాశక్తివంతమైన మాతృకలు శివుడిచేత సృష్టించబడి అంధకాసురుడి నుంచి కారుతున్న రక్తాన్ని త్రాగేసాయి. వాటికి అంధకుడి రక్తంతో ఎంతో తృప్తి కలిగింది. వారలా తృప్తి పడి కొంతసేపు ఆగారు. వెంటనే తిరిగి కొత్త అంధకాసురులు జన్మించి, శూలాలు, ముద్గరాలు ధరించి పరమేశ్వరుణ్ణి బాధించసాగారు. ఇక వాడి బాధ భరించలేక ఆయన వాసుదేవుణ్ణి శరణు వేడుకున్నాడు.

అప్పుడు విష్ణుమూర్తి వచ్చి “శుష్కరేవతి” అనే శక్తిని సృష్టించగా, అదివెళ్ళి అంధకుడి రక్తాన్ని త్రాగేసింది. ఆమె మహాశక్తి ఒక్కసారిగా అంధకుడి శరీరంలో వున్న రక్తాన్నంతా పీల్చేసింది. దానితో కొత్త అంధకాసురులు పుట్టటం ఆగిపోయింది. ఉన్న అంధకులందరినీ శివుడు సంహరించాడు. చివరికి అసలు అంధకుడిని తన త్రిశూలంతో పొడిచాడు.

అంధకుడు త్రిశూలంపోటుకి నేలమీదపడి మరణించబోతూ శివుణ్ణి ఎంతో భక్తిగా స్తుతించాడు. తనకి శివసాన్నిధ్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అంధకుడి ప్రార్థన విన్న శివుడు తథాస్తు అని అతన్ని అనుగ్రహించాడు. అంధకుడు సంతృప్తిగా కన్నుమూసాడు. శంకరుడు ఇచ్చిన మాట ప్రకారం, ఆ అంధకుడికి తన సాన్నిధ్యాన్ని, గణేశత్వాన్ని ప్రసాదించాడు.

మాతృకల గర్వాపహరణం: అంధకాసురుడు మరణించిన తరువాత రక్తంరుచి మరిగిన 189 మాతృకలు శంకరుడి దగ్గరకి వచ్చి “శంకరా! మాకు చాలా ఆకలిగా వుంది. మేము అందరం ప్రాణుల్ని భక్షిస్తాం మాకు అనుమతి నివ్వండి” అని కోరారు. ఘోరమైన వారి కోరిక విని శంకరుడికి మతిపోయింది. వారితో “మాతృకలారా! మీ ఆలోచన చాలా తప్పు. మీరంతా లోకాల్ని రక్షించాలి గానీ, ఇలా వారిని భక్షించాలని కోరుకోవటం దారుణం” అని అన్నాడు.

తామసగుణంతో నిండిన ఆ మాతృకాశక్తులు శంకరుడి మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా లోకాలన్నిటినీ భక్షించటం ప్రారంభించాయి. వారిని వారించలేక, తను సృష్టించిన మాతృకల్ని తానే సంహరించలేక శంకరుడు మనసులో - సకల సృష్టికి మూల భూతుడు, రక్తంతో పూయబడిన గోళ్ళు కలవాడు, పెద్దకోరలతో వున్నవాడు, మెరిసే జూలుకలవాడు, మహాసాగరంలా ధ్వని చేసేవాడు, చెవులదాకా నోరు తెరిచినవాడు, మేరు పర్వతంలా ప్రకాశించేవాడు, అగ్నిజ్వాలలాంటి వెంట్రుకలు కలవాడు అయిన నారసింహుణ్ణి స్మరించాడు. వెంటనే నరసింహుడు శంకరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్య తేజోరూపం దేవతలకి కూడా చూడ శక్యంగా వుంది. ఆయన్ని చూసి శంకరుడు భక్తిగా ఇలా స్తుతించాడు.

శివుడు చేసిన నృసింహ స్తుతి

నమస్తేస్తు జగన్నాథ నరసింహవపుర్హరే
 ।
దైత్యనాథా సృజాపూర్ణ నఖపంక్తి విరాజిత ॥

జగత్సకల సంలగ్న హేమపింగళవిగ్రహ ।
నతో
స్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో ॥

కల్పాంతాం భోధ నిర్ఘోష సూర్యకోటి సమప్రభ ।
సహస్ర పరమక్రోధ సహస్రేంద్ర పరాక్రమ ॥

సహస్రవదన స్ఫీత, సహస్రచరణాత్మక ।
సహస్రకాల రచిత సహస్ర నియతేంద్రి య ॥

సహస్రభూమి సద్ధైర్య సహస్రానంత మూర్తిమాన్‌ ।
సహస్ర చంద్ర ప్రతిమ సహస్ర గ్రహ విక్రమ ॥

సహస్రరుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్తుత ।
సహస్ర వాయు వేగోగ్ర సహస్రాక్ష నిరీక్షణ ।
సహస్ర యంత్ర మధన సహస్ర బంధమోచక ॥
(ఆధ్యా -.76 జ్లో-శ్లో-55,60)

జగన్నాథా! నరసింహ శరీరాన్ని ధరించినవాడా! రాక్షసనాథుడి రక్తంతో నిండిన గోళ్ళు అనే శక్త్యాయుధం కలిగినవాడా! నీకు నమస్మారం. 

సకలజగత్తు నిండా వ్యాపించిన బంగారం లాంటి శరీరం కలిగినవాడా! ప్రళయకాల మేఘం ధ్వనిలాంటి నాదం కలవాడా! పద్మనాభా! దేవతలకి, ఇంద్రుడికీ సకల జగత్తుకీ తండ్రి అయినవాడా! సహస్ర విధాలుగా మహాక్రోధం కలిగినవాడా! వెయ్యి ఇంద్రులంత పరాక్రమం కలవాడా! వేయి ముఖాలతో సమృద్ధి కలిగినవాడా! వేయి పాదాలు కలవాడా! వేయి కాలాలని రచించేవాడా! వేయి ఇంద్రియాలని నిగ్రహించేవాడా! వెయ్యి భూలోకాలకీ ధైర్యాన్ని ఇచ్చేవాడా! వేయి రకాలుగా అనంతమైన మూర్తులుకలవాడా! వేయిచంద్రులతో సమానమైన వాడా! వేయిగ్రహాలని అధిగమించినవాడా! వేయి రుద్రులతో సమానమైన తేజస్సు కలవాడా! వేయి బ్రహ్మలతో స్తుతించబడేవాడా! సహస్రవాయు వేగంతో భయంకరంగావున్నవాడా! వేయి నేత్రాలతో చూసేవాడా! వేలాదియంత్రాల్ని మధించేవాడా! వేయిబంధాలనించి విడిపించేవాడా! నీకు నమస్కరిస్తున్నాను.

ఈవిధంగా నరసింహుణ్ణి భక్తిగా స్తుతించిన శంకరుడు ఆయనతో “స్వామీ, నేను సృష్టించిన మాతృకలు నామాటని లక్ష్య పెట్టకుండా లోకాల్ని భక్షిస్తున్నాయి. నా చేతులతో సృష్టించిన వాటిని నేనే నాశనం చేయలేక పోతున్నాను. కనుక నీవే వాటిని అదుపుచేయాలి” అని ప్రార్థించాడు.

శివుడు విన్నపాన్ని విన్న నృసింహుడు తన నాలుక నుంచి 'వాగీశ్వరి' ని హృదయం నుంచి 'మాయ' ని గుహ్యాంగం నుంచి 'భగమాలినిని', తన కాలి ఎముక నించి 'కాళి' ని సృష్టించాడు. ఈ నలుగురు మహాశక్తులు. వారిని సృష్టించిన తరువాత వారికి సహాయకులుగా మరో ముప్పై రెండు మంది దేవతా శక్తుల్ని కూడా సృష్టించాడు.

32 శక్తులు: 
1.ఘంటాకర్ణీ 2. త్రైలోక్యమోహినీ 3.సర్వసత్త్వ వశంకరీ 4.చక్రహృదయా 5. కామచారిణీ 6.శంఖినీ 7. లేఖినీ 8. కాలసంఘర్షిణీ - ఈ ఎనిమిది మందీ వాగీశ్వరీ అనే మొదటి శక్తికి అనుచరులు.

1.సంకర్షిణీ 2. అశ్వద్దా 3.బీజభావా 4. అపరాజితా 5. కాల్యాణీ 6.మధుదంష్ట్రీ 7.కమలా  8
.ఉత్పలహస్తికా అనే ఈ ఎనిమది మందీ రెండో మహాశక్తి అయిన మాయాదేవికి అనుచరులు.

1.అజితా 2. సూక్ష్మహృదయా 3.వృద్దా 4. వేశాశ్మదంశనా 5.నృసింహభైరవా 6.బిల్వా 7.గరుత్మద్ధృదయా 8.జయా అనే ఈ ఎనిమిది మంది మూడో మహాశక్తి అయిన భగమాలిని కి అనుచరులు.

1.ఆకర్షిణీ 2.సంకటా 3. ఉత్తరమాలికా 4. జ్వాలాముఖీ 5. భీషణికా 6.కామధేనూ 7.జాలికీ 8.పద్మకరా అనే ఈ ఎనిమిది మందీ నాలుగో మహాశక్తి అయిన కాళికి అనుచరులు.

ఈ ముప్పై రెండు మంది శక్తులన్నీ నృసింహుడి శరీరం నుంచి ఉద్భవించాయి. వీరంతా ముల్లోకాల్ని సృష్టించి సంహరించే నైపుణ్యం కలిగినవారు. నృసింహుడి ఆజ్ఞతో మహాశక్తులు, ముప్ప్ఫైరెండు శక్తులూ కలిసి రుద్రుడు సృష్టించిన 189 మంది మాతృకల మీద భీకరంగా దాడి చేసాయి. నృసింహశక్తుల ధాటికి రుద్రుడి మాతృకలు తట్టుకోలేక పరుగెత్తి వచ్చి నృసింహుణ్జి శరణు వేడుకున్నాయి. వారిని కరుణించిన నృసింహుడు వారితో ఇలా అన్నాడు.

మాతృకలారా! దేవతలందరూ మానవుల్ని ఎంతో దయతో పాలించాలి గానీ! వారిని భక్షించకూడదు. కనుక మీరు ఈ నాటి నుంచి నామాట ప్రకారం లోకాలన్నిటినీ పాలిస్తూ అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. శివభక్తులకీ, నా భక్తులకీ, మీకు బలులు సమర్పించే వారిని రక్షించండి. వారికీ ఏ బాధలు కలుగకుండా, వారికోరికలన్నిటినీ తీర్చండి. మీరందరూ రాబోయే కాలంలో మానవుల చేత పూజించబడతారు అని చెప్పి నృసింహుడు తాను సృష్టించిన శక్తులతో సహా అక్కడ నుంచి అంతర్దానమయ్యాడు. 

నృసింహుడు అంతర్జానం అయిన చోట కృతశౌచం అనే దివ్య తీర్ధం ఏర్పడింది. సకల జగత్తులకన్నా ముందే వున్నవాడు, లోకాల ఆర్తిని పోగొట్టేవాడు అయిన శంకరుడు తను సృష్టించిన మాత్రుగణాలకి దివ్య మూర్తుల్ని ప్రసాదించి వాటిని అక్కడ స్థిరంగా ఉంచాడు. తాను కూడా కొంతకాలం ఆ మాతృకా గణాలతో పాటు ఆ సరోవర తీరంలోనే నివసించాడు. శంకరుడు ఆ మాతృ గణాలలోని ప్రధానమైన ఏడుగురు మాతృకల్ని పిలిచివారిని ఆరుద్రాస్థానంలో వుండేలా చేసి తాను మాతృకల మధ్యనుంచి అంతర్దానమయ్యాడు. ఆనాటి నుంచీ రుద్రమాతృకలు నృసింహుడు ఆజ్ఞాపించిన విధంగా శాంతంగా మారిపోయి లోకాల్ని రక్షించసాగాయి.

శివుడు కపాలి అయిన కథనం

No comments:

Post a Comment