Friday, March 20, 2026

The Story of Chandra - చంద్రుడి వృత్తాంతం

 చంద్రుడి వృత్తాంతం

బ్రహ్మమానసపుత్రుడైన అత్రి ప్రజాపతి ఎంతో గొప్పవాడు. బ్రహ్మదేవుడు అత్రి మహర్షిని పిలిచి లోక సృష్టిని కొనసాగించమని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞను పాటించటంకోసం అత్రిమహర్షి కఠోరదీక్షతో తపస్సుచేయటం ప్రారంభించాడు.

లోకాలన్నిటి కష్టాల్నీ నశింపచేసేది, అందరికీ ఆనందాన్ని కలిగించేది, బ్రహ్మ, విష్ణు, రుద్రులకి అంతరంగ రూపంగా వుండేది, ఇంద్రియాలకి గోచరంకానిది, శాంతిని ప్రసాదించేది, అన్నిటికన్నా గొప్పది అయిన పరబ్రహ్మతత్త్వం అత్రి మహర్షికి గోచరించింది. ఆ పరబ్రహ్మతత్వం అత్రిముని
తపోశక్తి వల్ల ఆయన కళ్ళలో స్థిరంగా నిలిచిపోయింది.

అది చూసిన పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవితో కలిసి తనలోని ఎనిమిదో అంశతో అత్రినేత్రాల్ని ఆశ్రయించాడు. ఆ ప్రభావంతో ఆ ముని కళ్ళనుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ భాప్పజలం నుంచి శివుడి ఎనిమిదో అంశతో కూడిన “సోముడు” అనే శిశువు ఆవిర్భవించాడు. చల్లని వెన్నెలతో ప్రకాశిస్తున్న ఆ బాలుడు సమస్త విశ్వాన్నీ వెలుగులు చిందేలా చేసాడు.  దిక్కులన్నీ ఒక పుత్రుణ్ణి కనాలని భావించి ఒక స్త్రీ రూపాన్ని ధరించాయి. ఆ స్త్రీ సోముడి  దివ్యతేజస్సును తనలో నింపుకుంది. ఆవిధంగా సోముడి తేజస్సు దిక్కుల గర్భంలో ముప్ఫైవేల సంవత్సరాల పాటువుంది.

కొంతకాలానికి దిక్కులన్నీ గర్భాన్ని భరించలేక దాన్ని విడిచిపెట్టేశాయి. అదే సమయంలో చతుర్ముఖబ్రహ్మ ఆ గర్భం నుంచి జారిన పిండం అన్ని దిక్కుల్నీ ప్రకాశింపచేస్తుండటాన్ని చూసాడు. వెంటనే ఆయన ఆ తేజో రూప పిండాన్ని ఒక నవయువకుడిగా మార్చివేశాడు. తన దివ్యశక్తితో వెయ్యి అశ్వాలతో లాగబడే రథాన్ని సృష్టించి ఆయువకుణ్ణి అందులోకి ఎక్కించి
తనలోకానికి తీసుకుపోయాడు.

బ్రహ్మలోకానికి చేరిన ఆ నవయువకుణ్ణి అతడిలో వున్న చల్లని దివ్యతేజస్సును చూసి ఋషులు, బ్రహ్మర్షులు, దేవతలు, ఓషధులు, గంధర్వులు అందరూ ఈ యువకుడు మాకు ప్రభువుగా వుండాలి అని కోరుకున్నారు. బ్రహ్మతో సహా దేవతలందరూ సోమదేవతామంత్రాలతో అతన్ని ఘనంగా స్తుతించారు. వారి స్తోత్రపాఠాలతో అతడి తేజస్సు మరింతగా వెలిగిపోయింది. అతడిలోని దివ్యతేజస్సు భూలోకానికి వ్యాపించి దివ్యమైన ఓషధుల్ని ఉత్పన్నం చేసింది. దానివల్ల ఆ సోముడికి పగటికన్నా రాత్రిసమయంలో తేజస్సు మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది. అది ఆనాటి నుంచి నేటి వరకూ జరుగుతూనే వుంది. అందుకే సోము (చంద్రుణ్ణి) ఓషధులకు ప్రభువు అంటారు.

ఈ కనబడే చంద్రమండలం వేదాలకు స్థానంగా రసాత్మకంగా వుంటుంది. ఈ చంద్రుడు కృష్ణ పక్షంలో క్షీణిస్తూ, శుక్లపక్షంలో క్రమంగా వృద్ధిచెందుతూ వుంటాడు. తరువాత కొంతకాలానికి చంద్రుడి గుణ గణాలు అతడి చల్లని తేజస్సు, సౌందర్యం గురించి విని దక్షప్రజాపతి తన 27మంది కన్యల్ని అతడికిచ్చి వివాహం చేసాడు.

తరువాత చంద్రుడు విష్ణుభగవానుడి అనుగ్రహంకోసం పదివేల పద్మసహస్రవర్షాలు తపస్సు చేసాడు. నారాయణుడు చంద్రుడు చేసిన తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నాడు. “ప్రభూ! దేవాదిదేవా! శ్రీమన్నారాయణా! నేను ఇంద్రలోకాన్ని జయించగలగాలి. నేను చేసే రాజసూయయాగంలో, నేనిచ్చే హవిస్సుల్ని దేవతలందరూ ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించాలి. బ్రహ్మాది దేవతలు నేను చేసే యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కులుగా
వుండాలి. లోకాల్ని రక్షించే పరమేశ్వరుడు త్రిశూలాన్ని ధరించి నాయాగానికి రక్షకుడుగా వుండాలి.” అని కోరుకున్నాడు. శ్రీహరి తథాస్తు అని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు.
 
శ్రీహరి దివ్యానుగ్రహాన్ని పొందిన చంద్రుడు రాజసూయయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగంలో వరప్రభావం కారణంగా, బృహస్పతి హోతగా, భృగువు అధ్వర్యుడుగా, బ్రహ్మదేవుడు ఉద్దాతగా, శ్రీహరి యాగ బ్రహ్మగా, సనక సనందనాది మహర్షులు సదస్యులుగా, విశ్వాదేవతలు పదిమంది
చమస్వాధ్యాయులుగా ఉన్నారు. యాగం పరిసమాప్తికాగానే చంద్రుడు 
వారందరికీ ముల్లోకాల్లోని రాజ్యాన్ని దక్షిణగా ఇచ్చాడు. ఆవిధంగా యాగం దిగ్విజయంగా ముగిసింది. అవభృధ స్నానం పూర్తయ్యింది.

చంద్రుడియాగం పూర్తయిన సమయంలో కామబాణాలతో తమ శరీరం తపించిపోగా తట్టుకోలేక తొమ్మిదిమంది దేవతాస్రీలు చంద్రుణ్ణి చూడటానికి వచ్చారు. వారు ఎవరంటే నారాయణుడి భార్య లక్ష్మీదేవి, కర్దమ ప్రజాపతి భార్య సినీవాలి, విభావసుడనే సూర్యుడిభార్య ద్యుతి, ధాత అనే ఆయన భార్య తుష్టి, ప్రభాకరుడి భార్య ప్రభాదేవి, హవిష్మంతుడి భార్య కుహూ, జయంతుడి భార్య కీర్తి కశ్యపుడి భార్య వసువ, నంది భార్య దృతి. ఇలా వీరందరూ తమతమ భర్తల్ని విడిచిపెట్టి చంద్రుణ్ణి ఆశ్రయించారు. చంద్రుడు కూడా యుక్తాయుక్తాలు మరిచి నచ్చినవారందరినీ తన భార్యలగానే భావించి స్వీకరించాడు.

ఈ విషయం వచ్చిన వారి భర్తలకు తెలిసింది. వారంతా చంద్రుడు తమకుచేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వెంటనే అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడిచేసి ఎన్నో శస్త్రాస్త్రాలు ప్రయోగించారు. అలా వారెన్ని ప్రయత్నాలు చేసినా మహాశక్తి సంపన్నుడు, వరపుత్రుడు అయిన చంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయారు. ఆవిధంగా చంద్రుడు దిక్కులన్నిటినీ తన చల్లని వెలుగులతో ప్రకాశింపచేస్తూ అజేయుడుగా లోకప్రసిద్ధి పొందాడు.

చంద్రుడు - తార
చంద్రుడు మానవ రూపంలో సంచరిస్తుండగా ఒకనాడు ఉద్యానవనంలో బృహస్పతి భార్య అతడికి కనిపించింది. పుష్పాలతో, ఆభరణాలతో సర్వాలంకార సంశోభితగా అద్భుతమైన శరీర సౌందర్యంతో ఆమె ప్రకాశిస్తోంది. ఆమె సౌందర్యానికి ముగ్గుడైపోయిన చంద్రుడు ఏకాంతంగా కామవశుడై ఆమె జడను పట్టుకుని లాగాడు. అప్పటికే తార చంద్రుడి దివ్యకాంతిని సౌందర్యాన్ని
చూసి తన మనసులో కామభావాన్ని పొందింది. అందుకే అభ్యంతరం చెప్పకుండా చంద్రుడితో హాయిగా విహరించింది. తారతో ఎంత విహరించినా సంతృప్తి చెందని చంద్రుడు ఆమెని విడిచివుండలేనని భావించి తనతో పాటు తన గృహానికి తీసుకుపోయాడు. ఆనాటి నుంచి ప్రతిరోజూ ఆమెతో కామసుఖం అనుభవిస్తున్నప్పటికీ చంద్రుడికి తృప్తి కలగటంలేదు.

అక్కడ బృహస్పతి ఎంత కాలానికి తన భార్య తిరిగి రాకపోవటంతో ఆమె ఎడబాటుని సహించలేకపోయాడు. నిరంతరం ఆమెనే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఆయనకి తనభార్యని చంద్రుడు అపహరించాడని తెలిసింది. అయినా చంద్రుణ్ణి శాపాలతోకానీ, అభిచార హోమాలతో కానీ ఏవిధంగా శిక్షించలేకపోయాడు. చివరికి ఏమీ చేయలేక చంద్రుడి దగ్గరకి వచ్చి తనభార్యని తనతో పంపించమని ప్రాధేయపడ్డాడు. అయినా చంద్రుడు వినలేదు. చివరికి ఇంద్రుడూ, శివుడు, బ్రహ్మదేవుడు, మరుత్తులు, సిద్దులు, సాధ్యులు అందరూ వచ్చి నచ్చ చెప్పినా తారా మోహంలో వున్న చంద్రుడు ఆమెని వెనక్కి పంపటానికి ఏమాత్రం అంగీకరించలేదు.

చంద్రుడి దుశ్చర్యచూసి పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చింది. పరమేశ్వరుడు సామాన్యుడు కాదు కదా! త్రిపురారి, శత్రుభయంకరుడు పైగా బృహస్పతికి ఇష్టుడు. తన స్నేహితుడికి ఇలాంటి కష్టం కలిగినందుకు విచారించి అందుకు కారకుడైన చంద్రుడి దర్పాన్ని అణచాలనుకున్నాడు. వెంటనే సకల భూతగణాల్ని ఆయుధాల్నితీసుకుని చంద్రుడి మీదకి దండయాత్ర చేసాడు.  శివుడితో పాటు సకలదేవతాగణాలు, అసురగణాలు, సిద్ధగణాలు లక్షలసంఖ్యలో వచ్చాయి. దివ్యాస్త్రాలతో చంద్రుడికి శివుడికి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది.

అరివీర భయంకరంగా వివిధ రకాల శ
స్త్రాలతో వారిద్దరి మధ్యా జరుగుతున్న యుద్ధంలో ఎందరో నశించారు. అది క్రమంక్రమంగా తీవ్రమవుతుంది. వారు ప్రయోగించే దివ్యాస్త్రాల నుంచి వెలువడే భయంకర జ్వాలలు లోకాలన్నిటినీ దహించేస్తున్నాయి. చివరికి కోపం వచ్చిన రుద్రుడు చంద్రుడి మీద బ్రహ్మశీర్షాసనాన్ని ప్రయోగించాడు. దానికి ప్రతిగా సోముడు అజేయమైన సోమకాస్త్రాని వదిలాడు. ఆ రెండూ పరస్పరం ఢీకొనటంతో భయంకరమైన శబ్దం కలిగి లోకాలన్నీ ఒక్కసారిగా భయభ్రాంతులకి గురయ్యాయి.

సోమ - శంకరులయుద్ధం ఎప్పటికీ ఆగకుండా కొనసాగుతుండటంతో లోకాలన్నీ క్షయమై పోతున్నాయి. ఆ పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారిద్దరిచేతా యుద్దాన్ని విరమింపచేసాడు. ఆయన సోముడితో “నాయనా! నీవిలాగ అకారణంగా అన్ని లోకాలకీ నాశనం కలిగేలా యుద్దాన్ని చేస్తున్నావు. ఇది నీవు చేయకూడని పని, అదీగాక నీవు పరదారా పహరణం అనే ఘోరమైన తప్పిదాన్ని చేసావు. అందుకే నీవీ యుద్ధం చేయాల్సివచ్చింది. సహజంగా నీవు శాంతస్వభావుడివే, అయినా నీవు చేసిన ఈ దోషం కారణంగా లోకంలో ఎప్పటికీ పాపగ్రహంగానే చూడబడతావు. నీకు కలిగిన ఈ దుష్టమైన కోరికను విడిచి పెట్టు. తారని తిరిగి బృహస్పతికి అప్పగించు” అని హితబోధ చేసాడు.

బ్రహ్మదేవుడి హితబోధ విన్నాక చంద్రుడికి జ్ఞానోదయమయ్యింది. తను చేసిన తప్పుతెలిసింది. వెంటనేయుద్దాన్ని విరమించి తారని తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించి క్షమాపణ కోరాడు. బృహస్పతి చంద్రుణ్ణి క్షమించి తనభార్యతో కలిసి వెళ్ళిపోయాడు. రుద్రుడు కూడా శాంతించి తన గణాలతో కైలాసానికి ప్రయాణమయ్యాడు.

యదువంశం

No comments:

Post a Comment