Friday, March 20, 2026

The story of Sati Savitri - సతీసావిత్రి చరిత్ర

సతీసావిత్రి చరిత్ర

పూర్వం మద్ర దేశానికి అధిపతిగా శాకలవంశానికి చెందిన అశ్వపతి అనేరాజుండేవాడు. అతడికి పుత్ర సంతానం లేదు. అందుకోసం ఆ రాజు సర్వకామప్రదాయినిగా ద్విజుల్ని రక్షించే సావిత్రీ దేవిని ఆరాధించాడు. వందమంది ఋత్విక్కులతో పదినెలలపాటు తెల్లని ఆవాలతో ఆదేవిని ఉద్దేశించి హోమం చేయించాడు. అలా చేసిన తరువాత ఒకనాడు చతుర్ధితిథిరోజు సావిత్రీదేవి ఆరాజుకి సాక్షాత్మరించింది. అతడితో "రాజా నీ దీక్షకి నాకు సంతోషం కలిగింది. అయితే నీకు నేను పుత్రుణ్ణికాదు యోగ్యురాలైన పుత్రికని ప్రసాదిస్తున్నాను" అని వరాన్ని అనుగ్రహించి అదృశ్యమయ్యింది. తరువాత కొంతకాలానికి అశ్వపతికి అతని భార్యమాలతికి సుందరమైన కుమార్తె ఉదయించింది. సావిత్రీదేవి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆమెకి సావిత్రి అని నామకరణం చేసారు.


సావిత్రీ గుణరూప శీలాలలో ఎంతోగొప్పది. క్రమంగా ఆమె యుక్తవయసుకి వచ్చాక సత్యవంతుడనే యువకుడికిచ్చి వివాహం చేయాలని భావించాడు అశ్వపతి. అప్పుడు నారదమహర్షి అశ్వపతి దగ్గరకి వచ్చి "రాజా! ఈ సత్యవంతుడు ఒక సంవత్సరంలో మరణిస్తాడు. అతడికి ప్రాణగండం వుంది అని హెచ్చరించాడు. అయినా ఆ మాటల్ని పట్టించుకోకుండా తన కుమార్తెని సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తరువాత సావిత్రి భర్తని అనుసరించి వెళ్ళీ ఒక అడవిలో రాజ్యం కోల్పోయి తలదాచుకున్న తన అత్తమామలకి శుశ్రూషలు చేయసాగింది. సత్యవంతుడి తండ్రి ద్యుమత్సేనుడు రాజ్య భ్రష్టుడై కళ్ళని కోల్పోయాడు. తనకి కోడలు వచ్చినప్పటికీ ఆమెకీ తమలాగా కష్టాలు తప్పటంలేదని మనసులో ఎంతో బాధపడ్డాడు.

సావిత్రికి నారదమహర్షి చెప్పిన మాటలు గుర్తున్నాయి. తన భర్తకి అతిత్వరలో ప్రాణగండముందని తెలిసి మనసులో ఎంతో వేదన అనుభవించింది. నారదుడు చెప్పిన సంవత్సరకాలం గడువు ముగియబోతోంది. మరొక్క నాలుగు రోజులే సమయం వుంది. వెంటనే ధర్మజ్ఞురాలైన సావిత్రి వరసగా మూడు రోజులు అహోరాత్రాలు ఉపవాసం చేసింది. నాలుగోరోజున అందమైన పూలని అలంకారంగా ధరించి మంచిఫలాల్ని భుజించి తన భర్త సత్యవంతుణ్ణి తీసుకుని అడవిలోపలికి వెళ్ళింది. అక్కడ ఒక వృక్షం నీడలో ఇద్దరూ కూర్చున్నారు. 


సావిత్రి "స్వామీ! మీకు ఇప్పుడు ఒంట్లో ఎలా వుంది?" అని అడిగింది. “కొంచెం శ్రమగా వుంది". అన్నాడు సత్యవంతుడు. సరే కొద్దిసేపు విశ్రమించండి అని అతడికి పాద సేవ చేయసాగింది. కొద్ది సేపటి తరువాత తేరుకున్న సత్యవంతుడు పైకి లేచి "దేవీ! నీవు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. మనం పూలని, పళ్ళని సేకరించాంగానీ, కట్టెల్ని సేకరించలేదు. నేను ఇప్పుడే వెళ్ళీ కట్టెల్ని తీసుకువస్తా" అన్నాడు. అతడి మాటలు విని "సరే! స్వామీ మీరు వెళ్ళండి అయితే నాకు కనబడేంత దూరంలో వుండండి. ఎందుకంటే ఈ కారడవిలో నాకు భయమేస్తుంది". అని చెప్పిపంపింది. సత్యవంతుడు సావిత్రి కను చూపుమేరలో వున్న ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడున్న చెట్టునుంచి ఎండుకొమ్మల్ని సేకరించసాగాడు.

సత్యవంతుడి మరణం: కట్టెలు కొడుతున్న సత్యవంతుడికి ఉన్నట్టుండి ఒక్కసారిగా తలతిరిగింది. ఎంతో బాధపడుతూ భార్యని పిలిచి "సావిత్రీ నా తల గిర్రున తిరిగిపోతుంది. చీకటిలోకి వెళ్ళిపోతున్నట్టుగా వుంది. నాకేం జరుగుతుందో తెలియటంలేదు. నీ తొడమీద తలవాల్చి నిద్రపోవాలనిపిస్తోంది" అని అన్నాడు. వెంటనే సావిత్రి సత్యవంతుణ్జి తీసుకుని ఒక చెట్టుకింద కూర్చుని అతడి తలని తన తొడమీద ఉంచుకుని నెమ్మదిగా నిమరసాగింది.

మహాకాల స్వరూపుడైన యమ ధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోవటాన్ని అక్కడికి స్వయంగా వచ్చాడు. నల్లనికలువపూల రేకులా వున్నవాడు, పచ్చని వస్త్రాలు ధరించినవాడు, తన చుట్టూ మెరుపు తీగలు చుట్టుకున్న నీటితో నిండిన మేఘంలాగా వున్నవాడు అయిన యమధర్మరాజు సూర్యసమానమైన కాంతితో ప్రకాశించే దివ్య కిరీటాన్ని కుండలాల్ని ధరించి సావిత్రికి కనిపించాడు. యముడి వెంట కాలుడు-మృత్యుదేవత కూడా వున్నారు.

వచ్చిన యమధర్మరాజును సావిత్రి ఆశ్చర్యపోయి తనని చూస్తుండగానే సత్యవంతుడి శరీరం నుంచి బొటనవ్రేలంత పరిమాణంలో వున్న సూక్ష్మ పురుషుణ్ణి బైటికి తీసి, అతన్ని తన పాశంతో బంధించి వెంటనే దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు. ఉత్తమ ఇల్లాలైన సావిత్రి తన భర్త మరణించడాన్ని చూసింది. బాధని దిగమింగుకుని ఆలస్యంచేయకుండా వెంటనే యమధర్మరాజుని అనుసరించి వెళ్ళింది. అలా ఆయనతోనే వెళ్తున్న సావిత్రి దయనీయంగా, వినయంగా అంజలి ఘటించి యమధర్మరాజుతో ఇలా పలికింది.

సావిత్రీ యముల సంవాదం : “యమధర్మరాజా మాతృభక్తి ఉండటం వల్ల భూలోకంలో సుఖాలు, పితృభక్తి ఉండటం వల్ల అంతరిక్షలోకంలో సుఖాలు, గురుశుశ్రూషచేయటం వల్ల బ్రహ్మలోకంలో సుఖాలు మానవులు పొందుతారు. ఈ మూడు ధర్మాల్ని ఎవరైతే పాటిస్తారో వారు అన్ని ధర్మాల్నీ పాటించినట్టె. ఇవి పాటించనివారు ఏ ధర్మాన్నీ పాటించనట్టె. తల్లికి, తండ్రికి, గురువుకి సేవలు చేసే వాడు వేరే ఏ ధర్మాన్నీ ఆచరించాల్సిన అవసరంలేదు. కనుక పురుషుడు చేసే పనులన్నీ ఈ ముగ్గురి మీదే ఆధారపడి వున్నాయి” అన్నది.

సావిత్రి మాటలు విన్న యమధర్మరాజు “ఓ సావిత్రీ! నీవు చెప్పింది నిజమే. నీ కోరిక నెరవేరింది కదా! నీవు అన్నట్టే నీపుట్టింట్లో నీ తల్లి తండ్రుల్ని, భర్త ఇంట్లో అత్తమామల్ని అతని గురువుల్ని సేవించావు. ఇప్పుడు నీవు నా వెంట వచ్చి చేయాల్సిన సేవ పరలోకంలో ఏదీలేదు. ఇక నీవు నీ లోకంలోనే వుండి నీభర్తకి తగిన పరలోక క్రియల్ని ఆచరిస్తే మంచిది. కనుక నీవు బయలుదేరు. నాతో రావటం నీకు వృధాశ్రమ, నాకు ఆటంకం కూడా. అందుకే చెబుతున్నాను వెనక్కి వెళ్ళిపో. గురువులమీద పెద్దలమీద గౌరవం కలిగినదానివి. అదీగాక నీవు గొప్ప పతివ్రతవి. ధర్మం తెలిసినదానివి. నీవింకా ముందుకు వచ్చిన కొద్దీ శ్రమ అధికమౌతుంది వెళ్ళు”అని అన్నాడు.

“యమధర్మరాజా! ఉత్తమ స్త్రీలకి పతిని అనుసరించి వెళ్ళటమే ధర్మం. స్త్రీలకి పతే ప్రత్యక్షదైవం. స్త్రీలకి తండ్రి, సోదరుడు సుతుడు ఇచ్చేది కొంచెం మాత్రమే ఆమెకి అనంతమైన పుణ్యఫలాన్ని ఇవ్వగలిగేది కేవలం భర్త ఒక్కడే. స్త్రీ తను, మన, ప్రాణాలకి అధిపతి భర్తే. అలాంటి పుణ్యవంతుడైన భర్తని ఏ స్త్రీ విడిచి వుంటుంది. నా భర్త కూడా పుణ్యవంతుడే. నాభర్తని ఎక్కడికి తీసుకువెళుతున్నారో అక్కడి వరకూ నేను వెంట వెళ్ళవలసిందే. యథాశక్తి ఆయన్ని అనుసరించటమే భార్యగా నాధర్మం. స్వామీ! నాభర్త ప్రాణాల్ని తీసుకువెళ్తున్న మీతో నేను రావటం తగదని మీరు భావిస్తే ఇక నాకు మరణమే శరణ్యం. ఏ 
స్త్రీ అయిన మాంగల్యాది అలంకారాలకి దూరమై వైధవ్యాన్ని పొంది క్షణకాలమైనా జీవించగలదా!” అని బదులిచ్చింది సావిత్రి.

యముడి మొదటివరం : మహా పతివ్రతవైన ఓ సావిత్రీ! నీ మాటలు చాలా సంతృప్తికరంగా, వివేక వంతంగా వున్నాయి. నీపతి భక్తికి నేను ఎంతో సంతోషించాను నీ భర్త సత్యవంతుడి ప్రాణాలుతప్ప ఏదైనా వరం కోరుకో ప్రసాదిస్తానన్నాడు యమధర్మరాజు. వెంటనే సావిత్రి "యమధర్మరాజా! మహాత్ముడు, ధర్మప్రభువైన నా మామగారు కళ్ళుకోల్పోయి రాజ్య భ్రష్టుడై దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. వారికి రెండు కళ్ళు తిరిగి వచ్చేలా అనుగ్రహించు" అని వరం కోరింది. తథాస్తు నీవు కోరిన వరాన్ని ఇస్తున్నాను. ఇక వెనక్కి తిరిగివెళ్ళు. నామార్గానికి ఆటంకం కలిగించకు. నా మాటవిను అని నచ్చచెప్పాడు యముడు.

సావిత్రి వెనకకి మరలకుండా ఆయన్నే అనుసరిస్తూ "ప్రభూ! సత్పురుషులకి సజ్జనులతో మైత్రి కుదిరినప్పుడు వారికిక కష్టాలు, బాధలు ఎందుకుంటాయి. సత్పురుషులైనవారు ఎప్పుడూ సజ్జనులకీ, దుర్దనులకీ గతిగావుంటారు. కానీ దుర్దనులు మాత్రం ఎవరికీ మార్గదర్శకులుగా వుండరు. అందుకే లోకంలో అకారణంగా ఇతరులకి బాధలు కలిగించే దుష్టులు వల్ల ఎంతో భయపడాలికానీ, విషం వల్ల, అగ్నివల్ల, శత్రువుల వల్ల, ఆయుధాల వల్ల ఎలాంటి భయం మనకి వుండదు. సజ్జనులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టయినా సరే ఇతరులకి ఉపకారాలు చేస్తా
రు. అదే దుర్దనులు ప్రాణాలు తీసైనా తాము ఉపకారాన్ని ఇతరుల నుంచి పొందుతారు.

యమధర్మరాజా! లోకంలో వున్న ఆ సజ్జనుల్ని అనగా దుష్టుల్ని దుర్మార్గుల్ని దండించటం కోసమే బ్రహ్మ దేవుడు రాజరిక వ్యవస్థని సృష్టించాడు. ఎలాగైతే ధాన్యాన్ని పరీక్షించి మంచిచెడు విచారిస్తామో అదేవిధంగా రాజు ప్రజల్ని పరీక్షించి మంచి చెడు బాగా విచారించాలి. సజ్జనుల్ని రక్షిస్తూ దుర్దనుల్ని దండించాలి. స్వర్గాన్ని పొందాలనుకునే రాజు చేయవలసిన పని ఇదే. ఇంత కన్నా రాజు చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం వేరేదీ లేదు. యమధర్మరాజా ఆ విధంగా ఒక మహారాజు సజ్జనుల్ని రక్షిస్తూ తాను శాసించలేని దుర్దనుల్ని సైతం శాసించగలిగే ధర్మప్రభువు నీవు. అందుకే నీవు దేవుళ్ళందరి కన్నా గొప్పవాడివని నాకు అనిపిస్తోంది. లోకాలని సరిగ్గా నడిచేటట్టు చేస్తూ దాన్ని సరైన దారిలో నిలిపే వారే సజ్జనులు. అలాంటి సజ్జనుల్లో నీవు శ్రేష్టమైన
వాడివి. అందుకే నేను నీ వెంట ఎంతదూరం వస్తున్నా నాకు ఏ మాత్రం శ్రమ అనిపించటం లేదు” అన్నది సావిత్రి.

యముడిచ్చిన రెండోవరం : అమ్మా సావిత్రీ! ధర్మ బద్ధమైన నీమాటలు వింటుంటే నాకెంతో సంతోషంగా వుంది. నీకు నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో ఇస్తాను” అన్నాడు యమధర్మరాజు. అప్పడు సావిత్రి ప్రభూ! నాతండ్రికి పుత్ర సంతానం లేదు ఆయన ఎంతో బాధపడుతున్నాడు కనుక నా తండ్రికి వందమంది పుత్రుల్ని అనుగ్రహించి ఆయనకి ఆనందాన్ని కలుగచేయి” ఇదే నా కోరిక అన్నది సావిత్రి. తథాస్తు నీ తండ్రికి నూరుగురు పుత్రుల్ని అనుగ్రహిస్తున్నాను. ఇకనైనా తిరిగి వెళ్ళు. వెళ్ళి నీ భర్త శరీరానికి చేయవలసిన కార్యాలు చేయి. అంతేకానీ మరణించిన నీ భర్త వెంట నీవు సశరీరంగా ఇలా రావటం తగదు. నీవు తల్లి తండ్రులకి, గురువులకి, నీ భర్తకి ఎంతో శ్రద్ధగా సేవలు చేసి నందువల్ల ఎంతోపుణ్యాన్ని సముపార్ణించుకున్నావు. అందుకే నేను  నా దూతల్ని పంపకుండా స్వయంగా నీ  భర్త ప్రాణాల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను.

యమధర్మాలు : సావిత్రీ! నీ భర్త సత్యవంతుడు ధర్మాత్ముడు. వనంలోవుండి తల్లితండ్రుల్ని గురువుల్ని సేవించి వారిని సంతోషపరిచాడు. ఇలా నీ భర్త ఎంతో పుణ్యం చేసి చిరకాలం స్వర్గంలో వుండతగినంత అర్హతని సంపాదించాడు. తపస్సుచేతా, బ్రహ్మచర్యం చేతా, గురుసేవచేతా, అగ్నిసేవచేతా స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి. ఎవ్వరైనా సరే విప్రుణ్ణి, ఆచార్యుణ్ణి, తల్లి తండ్రుల్ని అన్నని అలక్ష్య పెట్టకూడదు. ఆచార్యుడు బ్రహ్మ స్వరూపుడు, తండ్రి ప్రజాపతి, తల్లి భూదేవి స్వరూపం, అన్న స్వయంగా తన రూపమే. మనిషి పుట్టటానికి ముందు తల్లితండ్రులు ముఖ్యంగా తల్లి ఎంతో కష్టాన్ని పడుతుంది. తరువాత పెంచటంలో ఇద్దరూ ఎన్నో బాధల్ని అనుభవిస్తారు. వీరి 
ణం తీర్చుకోవటం వందేళ్ళయినా సాధ్యం కాదు. కనుక వారికి ఎప్పుడూ సంతోషాన్ని కలిగించాలి.

తల్లి, తండ్రి, గురువు సంతోషిస్తే అన్ని తపస్సులా పూర్తి చేసినట్టే. అసలు ఈ ముగ్గురికీ సేవ చేయటమే గొప్ప తపస్సు. ఈ ముగ్గురే మూడు లోకాలలాంటివారు. వారి అనుమతి లేకుండా ఎవరూ ఏపనీ చేయకూడదు. ఋగ్యజస్సామవేదాలు మూడూ తల్లి, తండ్రి, గురువులే, అలాగే బ్రహ్మచర్యం, గార్హస్థ్వం, వానప్రస్థం అనే మూడు ఆశ్రమాలు, దక్షిణ గార్హపత్య అహవనీయ అనే మూడు రకాల అగ్నులు ఈ ముగ్గురి స్వరూపాలే, వీటిలో గురువు అహవనీయాగ్ని. సావిత్రీ! నీవు కోరిన వరాలన్నీ ఇచ్చాను. కనుక నీవు వెనక్కి వెళ్ళటం ధర్మం. నన్ను అనుసరించవద్దు. నేను నీకు చేసే దేమిలేదు. నాకు ఆటంకం కలిగించవద్దు" అన్నాడు యమధర్మరాజు.

సావిత్రి చేసిన ధర్మప్రసంగం : ధర్మాలు ఉపదేశించిన యముడి మాటలువిని సావిత్రి తిరిగి ఆయనతో "యమధర్మరాజా! ధర్మం సంపాదించేడప్పుడు శ్రమ ఎక్కడుంటుంది. అదీగాక నీపాద సేవ చేయటం ఎంతో గొప్ప ధర్మం. విజ్ఞానవంతుడైనవాడు ఎప్పుడూ ధర్మాన్నే ఆదరించాలి. ధర్మం ద్వారా పొందే లాభం అన్నిటికన్నా గొప్పది. ధర్మంతో అర్ధం దానితో కామం సాధ్యమవుతుంది. ధర్మాచరణ వల్ల ఇహపరాలు రెండూ సాధించుకోవచ్చు. జీవుడు ఏ స్థానానికి చేరుకోవాలో అక్కడికి తీసుకువెళ్ళేది ధర్మం ఒక్కటే. మిగిలినవన్నీ జీవుడి శరీరంతోనే నశిస్తాయి. జీవుడు తానొక్కడే పుట్టి ఒంటరిగానే మరణిస్తాడు. అతడితో పాటు, బంధుమిత్రపరివారం ఎవరూ వెంట వెళ్ళరు. కేవలం అతడు చేసిన ధర్మం మాత్రమే అతడి వెంట వెళుతుంది. ధర్మరాజా! జీవులకి సకల సుఖాల్నీ ప్రసాదించే బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్ర, శివ, చంద్ర, యమ, రవి, అగ్ని వాయు, వరుణ, కుబేరాది లోకాలన్నీ ధర్మాచరణ వల్లే వారికి లభిస్తాయి. కనుక జ్ఞానవంతుడైన పురుషుడుకానీ, స్త్రీ 
గానీ ధర్మాన్ని ఆచరించాలి. జీవితం అనిత్యం కనుక మృత్యువు ఆసన్నమయ్యేలోపే ధర్మాచరణ చేయటం ప్రారంభించాలి. 

యమధర్మరాజా! లోకంలో ఎంతోమందికి తమ కళ్ళఎదురుగా మృత్యువు కనిపిస్తున్నా తాము అమరులమని గర్విస్తూ తమకి మృత్యువు అప్పుడే రాదులే అనుకుంటారు. అదెంతో ఆశ్చర్యం. అందుకే వారంతా ధర్మాచరణ తరువాత చేద్దాంలే అప్పుడే వయసేమైందని భావిస్తుంటారు. అయితే ప్రతివాడూ మృత్యువుకి ఎంతో భయపడతాడు. తను ఎప్పటికీ చావకుండా చిరంజీవిలా వుండాలనుకుంటాడు. ఇలాంటి ప్రాణులకి ఏది గతి ప్రభూ? ఇలా ప్రాణులకి అభయస్థానం ఏదీలేదు. మరణమే అందిరకీ భయాన్ని కలిగించే కారణం. మృత్యువంటే అసలేమాత్రం భయంలేనివారు పుణ్యప్రదమైన ధర్మాన్ని ఆచరించినవారే” అని ధర్మం గొప్పదనాన్ని గురించి ప్రసంగించింది సావిత్రి. 

యముడిచ్చిన మూడోవరం : సావిత్రి ఎంతో నిర్దుష్టంగా, పలికిన ధర్మ ప్రసంగానికి యమధర్మరాజు ముగ్దుడైపోయాడు. ఆమెతో “సావిత్రీ! ధర్మం గొప్పతనం గురించి అది ఆచరించాల్సిన ఆవశ్యకత గురించి నీవు చేసిన ప్రసంగం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీకు మరోవరం ఇవ్వాలనుకుంటున్నాను. అదీ నీ భర్త ప్రాణాలుతప్ప కోరుకో" అన్నాడు. వెంటనే సావిత్రి “సమవర్తీ! అనపత్యుడైన (పురుషసంతానం) వారికి ఏలోకాల్లోకీ ప్రవేశంలేదని అంటారు కదా! కనుక నాకు వందమంది పుత్రుల్ని అనుగ్రహించండి” అని వేడుకుంది. సావిత్రి కోరికలోని మర్మాన్ని గ్రహించని యమధర్మరాజు కళ్యాణీ! తథాస్తు నీ కోరిక నెరవేరుతుంది. నీకు వందమంది పుత్రులు జన్మిస్తారు. ఇక నీవు వెళ్ళు. శ్రమపడకు ఇప్పటికే చాలాదూరం వచ్చావు” అని నచ్చచెప్పాడు.

యముడిమాటలు విన్న సావిత్రి "ప్రభూ! ధర్మాధర్మ విచక్షణ తమకు బాగా తెలుసు. అన్ని జగాలకీ నీవే నాయకుడివి. ప్రజలందర్నీ వారివారి కర్మానుసారం శిక్షించే సమవర్తివి. అందరినీ ఎలాంటి పక్షపాతం లేకుండా ధర్మబద్ధంగా చూస్తావు. కనుకనే నిన్ను ధర్మరాజు అంటారు. జనులంతా నిన్ను మృత్యుదేవత అంటారు. నీవు కాల స్వరూపుడివి కూడా. సర్వ భూతాలనీ అంతంచేసే వాడివి కాబట్టి నీవే అంతకుడివి. సూర్య భగవానుడికి మొదటి కుమారుడివి కాబట్టి నిన్ను వైవస్వతుడు అని సంబోధిస్తారు. జీవులందరి ఆయువు ముగియగానే వారిప్రాణాల్ని తీసుకుపోతావు. కాబట్టి నీవు సర్వప్రాణహరుడివి.

స్వామీ! నీ అనుగహంతోనే వేదత్రయ ధర్మం నశించకుండా వుంది. ప్రాణులందరూ ధర్మంమీద నిలిచివుంటున్నారు. అన్ని ధర్మాలు నీ వీక్షణ వల్ల పరస్పరం సంకీర్ణం కాకుండా వున్నాయి. సజ్జనులందరికీ నీవే గతి. కనుక ఓ దయామయా! నన్ను కరుణించి రక్షించు. నా భర్త సత్యవంతుడి తల్లితండ్రులు కూడా నాలాగానే ఎంతో దుఃఖిస్తున్నారు. దయచేసి నా భర్త ప్రాణాల్ని తిరిగి ప్రసాదించు” అని దీనంగా వేడుకుంది.

యముడిచ్చిన నాలుగోవరం : సావిత్రి ప్రార్థనవిని యమధర్మరాజు మనసు కరిగిపోయింది. ఆమెతో “ధర్మజ్ఞురాలవైన ఓ సావిత్రీ! నీవు ఎంతో భక్తితో చేసిన స్తుతులకి, నీవు చెప్పిన ధార్మిక ప్రసంగాలకి నేనెంతో ముగ్ధుణ్ణుయ్యాను. నీ కోరిక ప్రకారం నీ భర్త సత్యవంతుడి ప్రాణాల్ని విడిచిపెడుతున్నాను. ఇక నీ కోరిక నెరవేరింది కదా! నీకు సంతోషమేనా! నీతో కలిసి సత్యవంతుడు నూరుగురు కుమారుల్ని కంటాడు. నాలుగువందల సంవత్సరాలు రాజ్యం
పాలిస్తాడు. నీ కుమారులందరూ మహావీరులై కాలక్రమంలో సావిత్రులు అని ప్రసిద్ధి చెందుతారు. అలాగే నీ తల్లి తండ్రులకి కూడా నూరుగురు కుమారులు జన్మిస్తారు. నీ సోదరులైన వారు కూడా దివ్యతేజోసంపన్నులై ఎంతో కీర్తిప్రతిష్టలు పొందుతారు. నీవు చేసిన నా దివ్య స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి దీర్ఘాయుష్షు లభిస్తుంది" అని పలికి సత్యవంతుణ్ణి విడిచిపెట్టి సావిత్రిని ఆశీర్వదించి మృత్యువు, కాలుడితో సహా అంతర్దానమయ్యాడు యమధర్మరాజు.

ఆవిధంగా యమధర్మరాజు అనుగ్రహంతో సావిత్రి తన భర్త ప్రాణాల్ని తిరిగి పొందింది. ఆమె యమధర్మరాజు దగ్గర నుంచి సరాసరి అడవిలో చెట్టుక్రింద వున్న సత్యవంతుడి శరీరం దగ్గరకి వచ్చి తన భర్త తలని వడిలోకి తీసుకుంది. నెమ్మదిగా సత్యవంతుడు కళ్ళు తెరిచాడు. అతడికి జరిగింది లీలగా గుర్తుకు వచ్చింది. "సావిత్రీ! నన్ను ఎవరో నల్లనివ్యక్తి పట్టి బంధించి తీసుకువెళ్తున్నట్టుగా అనిపించింది. ఆ పురుషుడు ఎవరో నీకు తెలుసా? ఇదంతా ఏదో కలలావుంది సరే! పద తల్లితండ్రులు ఎదురుచూస్తుంటారు. అప్పుడే సాయంత్రమైంది. అని పైకి లేచాడు. సావిత్రి బదులేమి చెప్పకుండా అంతా ఆశ్రమానికి వెళ్ళాక చెబుతాను అని బయలుదేరింది. ఇద్దరూ కలిసి తమ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్చర్యం ద్యుమత్సేనుడికి అతడి భార్యకి కళ్ళు వచ్చాయి. వారికంటికి తమ కొడుకు, కోడలు కనబడక పోయేసరికి ఎంతో ఆందోళన పడ్డారు. అంతలోనే సావిత్రీ సత్యవంతులు వారి ముందుకి వచ్చారు. తమ కొడుకుని కోడల్ని చూసి ఆనందంగా వారిని దగ్గరకి తీసుకున్నారు. అందరూ ఎంతో సంతోషించారు.

సావిత్రి ఆరోజు రాత్రి సత్యవంతుడికి జరిగిన వృత్తాంతమంతా వివరించింది. ఆరోజే తన ఉపవాసదీక్షని కూడా విరమించింది. మర్నాడు సత్యవంతుడు తన తండ్రిని వెంటబెట్టుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. ద్యుమత్సేనమహారాజుని సత్యవంతుణ్ణి చూని రాజ్యవ్రజలు ఎంతో సంతోషించారు. ద్యుమత్సేనుడు సరాసరి కోటలోకి వెళ్ళి నన్ను పదవీచ్యుతుణ్ణి చేసిన దుష్టుడు ఎక్కడ? అని సైనికుల్ని అడిగాడు. “వారంతా వినయంగా ఆయనకి నమస్కరించి ప్రభూ! తమరిని పదవీచ్యుతుల్ని చేసి అధికారం చేజిక్కించుకున్న దుష్టుణ్ణి మన మంత్రులు చంపేశారు. ఇప్పుడు మీరే మా మహారాజు. మీ సింహాసనాన్ని మీరు తిరిగి అధిష్టించండి” అని కోరారు.

ఆవిధంగా యమధర్మరాజు వర ప్రభావంతో తిరిగి కళ్ళని పొందిన ద్యుమత్సేనుడు తన రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకున్నాడు. అలాగే సావిత్రి తల్లి తండ్రులకి వందమంది మగసంతానం కలిగారు. మహాపతివ్రత అయిన సావిత్రి తన పాతివ్రత్య మహిమతో అటు తండ్రి పక్షాన్ని ఇటు మామగారి పక్షం వారినీ ఎంతో సంతోషపరిచి విగతజీవుడైన తన భర్త ప్రాణాల్ని తిరిగి సంపాదించుకోగలిగింది. అందుకే మానవులు పతివ్రతల్ని దేవతల్లా భావించి పూజించాలి. వారి అనుగ్రహంతో, ధర్మాచరణతోనే లోకాలన్నీ నిలబడుతున్నాయి. లోకంలో వారేది అంటే అది జరిగి తీరుతుంది.

సావిత్రి చేసిన యమస్తుతి


ధర్మాధర్మవిధానజ్ఞ సర్వధర్మప్రవర్తక
 ।
త్వమేవ జగతోనాథః ప్రజాసంయమనో యమః ॥ 01 


కర్మణామనురూపేణ యస్మాద్యమయసే ప్రజాః ।
తస్మాద్వై ప్రోచ్యసే దేవ యమ ఇత్యేవ నామతః ॥ 02


ధర్మేణ మాఃప్రజాస్సర్వా యస్మాద్రంజయసే విభో ।
తస్మాచ్చ ధర్మరాజేతి నామవద్భిర్ని గద్యతే 
॥ 03 

సుకృతం దుష్కృతం చోభే పురోధాయ జనాయథా ।
త్వత్సంకాశం మృతాయాంతి తస్తాత్త్వం మృత్యురుచ్యతే 
 04 

కాలం కలార్థం కలయ స్సర్వేషాం త్వంహితష్ఠసి
 ।
తస్కాత్కాలేతి తేనామ ప్రోచ్యతే తత్త్వ దర్శిభిః ॥ 05 


సర్వేషామేవ భూతానాం యస్మాదంత కరో మహాన్‌ ।
తస్మాత్త్వమస్తకః ప్రోక్తః స్సర్వైర్ధేవై ర్మహాద్యుతే ॥ 06 


వివస్వతస్త్వం తనయః ప్రథమః ప్రకీర్తితః
 ।
తస్మాద్వైవస్వతో నామ్నా సర్వలోకేషు కథ్యసే ॥ 07 


ఆయుష్యేకర్మణి క్షీణే గృహ్ణాసి ప్రాణి జీవనమ్‌ ।
తథాత్వం కథ్యసే లోకే సర్వప్రాణ హరో
సివై ॥ 08 
(అధ్యా -212 శ్లో1-8)

విషాన్ని విరిచే వస్తువులు

No comments:

Post a Comment