ఉగాది పచ్చడి
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఉగాది విశిష్టత:
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం.
ఉగాదినాడే తెలుగువారి కొత్త సంవత్సరాది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా గా, కేరళలో విషు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ఉగ అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు.
ఉగాది చైత్ర శుక్ల పాడ్యమినాడే జరుపుకుంటారు. ఎందుకంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు.
ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు బ్రాహ్మలు బ్రహ్మ కల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదినాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు.
ఉగాది పండుగ వసంత ఋతువులో వచ్చే పండుగ. ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు. వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం ఇలా ఆరు రుచులు తెలిసేలా షడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడిని తయారుచేసి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్ళలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు.
No comments:
Post a Comment