Sunday, April 12, 2026

Chapter 65 The reason why Aditi, Kashyap were born as Devaki Vasudeva - అధ్యాయము 65 అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 65

అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

వ్యాసడు నిట్లనియె: శ్రీహరి యొక్కయు సకల దేవతల యొక్కయు నవతారములకు కారణము లనేకములు గలవు. ఇపుడు దేవకీ రోహిణీ వసుదేవుల సంభవమునకు యధార్థ హేతువుల వచింతును, ఆలకింపుము. 

మున్నొకప్పుడు కశ్యపమహర్షి తన యాగము కొఱకు వరుణదేవుని ధేనువు నపహరించెను. వరుణు డెంతగ వేడిను కశ్యపుడు దాని నతనికి తిరిగి యీయలేదు. అంత వరుణుడు జగత్ర్పభువైన బ్రహ్మ సన్నిధి కేగి యతనికి సవినయముగ దీనముగ దోసిలియొగ్గి తన దుఃఖము నిట్లు వెల్లడించెను: 

మహానుభావా! కశ్యపుడు నా గోవు నపహరించి యున్మత్తుడై యీయకున్నాడు. ఇక నేనేమి సేయవలయును? మనుష్య లోకమున గోపాలుడవు గమ్మని నే నతని శపించితిని. అతని యిరువురు భార్యలు నతి దుఃఖితులై యతని చెంతనే యుండగలరు. తల్లిలేని ఆవుల దూడలు ఇచట బాధపడుచున్నవి. కావున ఆ తరుణమున నదితి దుఃఖితయై కారాగారమున వసించి మృతపుత్త్ర యగు గాక యని శపించితిని అనిన వరుణుని వచనము లాలించి కశ్యపుని పిలిచి

బ్రహ్మ యిట్లు పలికెను: మహానుభావా! నీ వా లోకపాలుని ధేనువులను గ్రహించి మరల నతని కేల యీయకున్నావు? ఇట్టి యన్యాయమున కేల యొడిగట్టితివి? నీవు సర్వజ్ఞుడవు. నీకు న్యాయము తెలియును. ఐనను పరుల సొత్తపహరించి నీ వవినీతి కేల పాల్పడితివి? ఆహా! లోభము మహిమ యేమని చెప్పవచ్చును? అది మహాత్ములను సైతము విడువదు. అది పాప నిలయము - నరకప్రదము - సుజనులకు సమ్మతము గానిది. కశ్యపుడంతటివాడే దానిని వదలజాలకుండెను. ఇక నేమి చేతును? సకల దైవములకన్న లోభము మిన్న యని నాకు దోచుచున్నది. 

ఈ లోకములందు వైఖానస మహర్షులే ధన్యజీవులు. ఏలన, వారు ప్రతిగ్రహ విముఖులు - ఆత్మ చింతనపరులు - శాంతులు - జిత లోభులు. ఈ ప్రపంచము నందు లోభము కడు చెడ్డది. మహా శత్రువు - అపవిత్ర వస్తువు. అది కశ్యపు నంతటి వానిని దన సాంగత్యమున దురాచారునిగను సామాన్యునిగను మోహవశునిగను జేసినది.

ఇట్లు పలికి బ్రహ్మ కూడ తన మనుమడును మునివరుడును మిక్కిలి యిష్టుడగు నగు కశ్యప మునిని ధర్మరక్షణ కొఱకిటుల శపించెను. నీవు నీ యంశముతో నిలపై యదువంశమున నీ భార్యలతో గూడి జన్మమందుము. అట గోపాలక వృత్తితో మనుము.'' ఇట్లు భూభార మడగుటకును కశ్యపుడు నిజాంశమున జన్మించుటకును వరుణ బ్రహ్మల శాపములు మూలకారణము. ఇట్లే దితియు. నీ యేడుగురు కుమారులును పుట్టగనే మరణింతు'రని యదితిని శపించెను. 

ఇది విని మునిసత్తమా! దితికి గలిగిన శోకమునకు నామె తన సోదరి యింద్రజనని యగు నదితికి శాప మొసంగుటకును గల హేతువేమో తెలుపుము. నాకీ విషయమై శంక కలుగుచున్నది అని జనమేజయుడు ప్రశ్నింపగా, సత్యవతీ సుతుడగు వ్యాసుడు సావధానముగ రాజున కిట్లు సమాధానమిచ్చెను: 

భూమిపతీ! దక్ష ప్రజాపతి కిరువురు పుత్రికలు - దితి - అదితి యనబడువారు. గొప్ప నడువడి కల ఆ ఇరువురును కశ్యపునకు ప్రియ భార్యలైరి. అదితికి మహావీర్యవంతుడైన ఇంద్రుడు జన్మించెను. తనకు నంతటి తేజోవంతుడైన సుతుడు గావలయునని దితి అభిలషించెను. 

'మానదా! ధర్మిష్ఠుడు - ఇంద్ర తుల్యుడు - వీర్యవంతుడు నైన పుత్రుని నాకు ప్రసాదింపుము' అని కశ్యపుని వేడెను. ప్రియుడగు కశ్యపు డామెతో 

'ఓ అదితీ! నీవు శాంతించుము నేను చెప్పు నియమవ్రతమనుష్ఠింపుము. అపుడు నీ కింద్రతుల్యుడు జన్మింపగలడు' అనెను. ఆమె దాని కొడంబడి యుత్తమవ్రత మాచరించెను. ముని దితికి మనోహరమగు గర్భము నిలిపెను. దాని నామె జాగ్రత్తగ భరించెను. ఆ వరవర్ణిని యేకాగ్రచిత్తమున పవిత్రభావములతో పాలు మాత్రము త్రాగుచు నేలపై పరుండుచు పయోవ్రతము సలిపెను. 

అంతలో వీర్యవంతమైన దితి గర్భము సంపూర్ణమయ్యెను. ఆమె యంగము లుజ్జ్వలములై తెల్లగనయ్యెను. అది గని యదితి యిట్లు చింతించెను. 'దితి కింద్రుని బోలు కొడుకు పుట్టినచో నా సుతుడు బలహీనుడగును.'

ఇట్లు చింతించి మానవతి యగు నదితి తన కుమారుడగు నింద్రుని బిలిచి ఇట్లనెను. 'దితి గర్బమున నీకొక వీర్యవంతుడైన శత్రువు పుట్టగలడు. కాన ముందుగ నిపుడే వైరి నాశమున కుపాయము పన్నుము. చక్కగ విచారింపుము. దితి గర్బము నుండి బాలుడు పుట్టుటకు ముందే యతనిని చంపుము. నా సవతిని జూచినప్పుడెల్ల నా మనస్సు కలత జెందును. నా సుఖ మర్మములు ఛేదించినట్లగును. నాకు చిత్తశాంతి కలుగుట లేదు. రాజ యక్ష్మరోగము పగిది శత్రువు పెచ్చుమీఱినచో నతడు నశించడు. కావున ధీశాలి తన పగతుని మొక్క దశలోనే త్రుంచవలయును. ఓ యింద్రా! దితి గర్భ మినుపములికివలె నా యెదలో పడినది. దాని నేయుపాయముననైన సరే తొలగించి వేయుము. నా వాత్సల్యము బడయుగోరుదువేని సామదాన బలములలో దేనితో నైనను నీవు దితి గర్బమును హింసింపవలయును.' అనగా, 

అమరపతి యగు నింద్రుడు తన తల్లి మాటలు విని యాలోచించి తన సవతి తల్లి కడ కరిగెను. అతడు పాప బుద్ధితో నతి వినయము నటించి దితి పాదములకు నమస్కరించి విషగర్భితమైన తీయని మాటలతో ఆమె కిట్లనెను. 'మాతా! వ్రత నియమముల వలన నీ దేహము కృశించినది. కాన నీ సేవకు వచ్చితిని. నా కర్తవ్యమేదియో తెలుపుము. ఓ పతివ్రతా! నీకు పాదము లొత్తుదును. గురుసేవ వలన నక్షయ పుణ్యగతులు లభించును గదా? తల్లీ! నీవు - నా తల్లి అదితి - మీ యిరువురి యందు నా కెట్టి భేదము లేదు' అని ప్రతిన చేసి ఇంద్రు డామెపాదము లొత్తసాగెను. 

పరమపతివ్రతయు కృశాంగియు సులోచనయునగు దితి యతని పలుకులు నమ్మెను. ఆమె యలసట జెందుట వలన సంవాహన సుఖమున వెంటనే నిదురించెను. ఆమె నిద్రాపరవశురాలగుట గని యింద్రుడు శస్త్రము చేతబూని పదిలముగ సూక్ష్మరూపమున నామె శరీరమున ప్రవేశించెను. అట్లు వ్రజపాణి తన యోగబలముతో నామె యుదరము లోనికి జొచ్చి గర్భము నేడు విధములుగ వజ్రముచే ఖండించెను. లోని బాలుడు వజ్రము దెబ్బతిని యేడ్చుచుండెను. ఇంద్రు డతనితో నేడువ వలదని మెల్లమెల్లగ బలికెను.

ఆ యేడు భాగముల నొక్కొక్క దానిని మరల నేడుగ ఖండించెను. అంత వారు నలువది తొమ్మిదిమంది మరుత్తులై జన్మించిరి. ఆ పిదప దితి మేలుకాంచి తన గర్భమట్లగు టెఱిగి దుఃఖించి యింద్రునిపై కుపితురాలయ్యెను. అంతయు స్వసోదరీకృతమని సత్యవ్రతపరాయణ యగు దితి యెఱింగి రోషముతో నింద్రుని నదితిని 'ఇంద్రుడు కపటముతో నా గర్భముచే ఛేదించెను. అటులే యతని త్రైలోక్యరాజ్యవైభవము నశించుగాక! పాపచారిణి యగు నదితి పాపమతితో నా గర్భపాత మొనరించెను. నా సుతుడు హతుడయ్యెను. అదేవిధముగ నామె కొడుకులును పుట్టుటే తడవుగ మాటిమాటికి నశింతురుగాత! ఆమె పుత్త్ర శోకార్తయై కారాగారమందు కాలము గడపుచుండుగాత! ఆమె జన్మాంతర మందుకూడ మృత సంతానవతి యగు గాత' మని శపించెను. 

దితి ఇచ్చిన శాపమును కశ్యపుడు వినెను. పిమ్మట కశ్యపుడు ప్రేమగదుర దితిని శాంతిల్ల జేయుచు నామె కిట్లనెను: కల్యాణీ! కోపింపకుము. నీకు బలశాలురగు తనయులు గలుగుదురు. నీ కొడుకు లింద్రసములగుదురు. వారు మరుత్తులనబడు దేవతలగుదురు. నీ విచ్చిన శాప మదితి కిరువది యెనిమిదవ మన్వంతరము నందలి ద్వాపరమున గలిగి తీరును. ఆనాడదితి మానవ జన్మమెత్తి నీ శాప మనుభవించును. వరుణుడును సంతప్తుడై యామెకు ముందే శాపమిచ్చెను. మీ యిరువురి శాపమున నీమె మానవ జన్మ మెత్తగలదు అని యిట్లు తన పతి తన్నూరడింపగ దితి సంతుష్టిజెందెను. 

నాటినుండి యా వరవర్ణిని యెట్టి యప్రియమును బలుకలేదు. రాజా! ఈ విధముగ నీకు దేవకీ వసుదేవుల పూర్వశాప కారణములు వివరించితిని. నృపసత్తమా! ఈ కారణముగ నదితి స్వాంశముతో దేవకిగ జన్మించెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

No comments:

Post a Comment