Tuesday, September 8, 2026

Panchamukhi Anjaneya Swamy Temple, Mantralayam, Andhra Pradesh - పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్

పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం, ఆంధ్రప్రదేశ్

పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఈ ఆలయాలు వున్నాయి. మంత్రాలయం సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం. ఇది కర్ణాటకలోని రాయచూర్ జిల్లా (గంధాల్ గ్రామం) పరిధిలోకి వస్తుంది. మంత్రాలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, తుంగభద్ర నది సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.

మంత్రాలయం అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామియే గుర్తుకు వస్తారు. మంత్రాలయము అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. రాఘవేంద్ర స్వామికి మరొక పేరు వేంకటనాథుడు. తిమ్మన్న భట్టు, గోపికాంబల రెండవ సంతానంగా వేంకట నాథుడు జన్మించాడు. మంత్రాలయం అసలు పేరు 'మాంచాల'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి దైవసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి.రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.

ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు. ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. 1671 లో మంత్రాలయంలో స్వామి జీవ సమాధి చెందారు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంతో పాటు రాఘవేంద్ర స్వామి బృందావనం, సార్వభౌమ విద్యా పీఠం, మాంచాలమ్మ దేవాలయం, శివలింగం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి.

రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు.

పంచముఖి ప్రాశస్త్యం :
పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్సనమిస్తుంది. పంచముఖి ఆంజనేయస్వామిగా కొలిచే ఆ అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు వున్నారు. హనుమంతుడు రావణుని సంహార సమయంలో ఈ పంచ ముఖి అవతారాన్ని ఎత్తాడు.

పవన తనయుడు, ఆకాశ మర్గాన నీరు సముద్రాన్నిదాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని అగ్నితో లంకా దహనం కావించాడు. సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. అలాగే పంచముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ్వముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి.

శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్దాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి తుంగభద్రా నదీ తీరాన వున్న మంచాలలో వున్నపుడు తుంగభద్రా నదికి ఆవల వున్న గాణదాళ, బిక్షాలయ అనే గ్రామాలను దర్శించే వారు. గాణదాళలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరములు తపస్సు చేసారు.

స్వామివారి తపస్సుకు మెచ్చి పంచముఖ ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, కొల్హాపూర్ మహాలక్ష్మి, వరాహ రూపంలో భగవంతుడు ఇక్కడ సాక్షాత్కరించాడని నమ్ముతారు.

ఇక్కడ పెద్ద బండరాయిపై ఆంజనేయ స్వామి స్వయంభువుగా (స్వయంగా వెలిసిన) రూపుదాల్చి ఉన్నారు. అలాగే రాతితో తయారైన మంచం, తలగడ పోలికలు ఉండే అద్భుతమైన శిలా నిర్మాణం ఇక్కడ కనిపిస్తుంది.

స్వయంభూగా రాతిపై వెలసిన అంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. కొండ గుహలో రాముని, ఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవేంద్రులు శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ మహా లక్ష్మి విగ్రహాలను చేక్కినట్లుగా చెబుతారు.

ఇక్కడి గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా కనిపిస్తాడు. అన్ని చోట్లా కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించడు.

మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కి చెందినది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందినది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్రా నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈ ప్రదేశంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ది చెందినది.

ఐదు రకాలైన భక్తి భావాలు:ఐదు రకాలైన భక్తి భావాలు నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. రాముడిని హనుమంతుడు ఐదు రకాల 
భక్తి భావాలతో కొలుస్తాడు. ఎప్పుడూ శ్రీరామ నామం స్మరిస్తూర, కీర్తిస్తూ, రాముని కరుణ ప్రేమకై పరితపిస్తూ(యాచన)తనని తాను అర్పించుకున్నాడు. ఇంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ శ్రీ పంచముఖి ఆలయాన్ని తప్పక దర్శించవలసిన ప్రదేశం.

పంచముఖ ఆలయ ప్రాంగణంలో సహజంగా రాళ్ళతో ఏర్పడిన కొన్నిఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మంచం తలగడ, దేవతల విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్శనమిస్తాయి. 

పంచముఖ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యేకత. 

సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. ఈ ఆలయంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగ దేవుని విగ్రహాలు ప్రతిష్టించారు.

మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు మంత్రాలయానికి రాయచూరుకు మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. మంత్రాలయం నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సాధారణంగా మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.

రోడ్డు మార్గం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం చక్కగా అనుసంధానమై ఉంది. మంత్రాలయం నుండి కర్నూల్ మరియు హైదరాబాద్ లకు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి.

మంత్రాలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి ట్యాక్సీలు, ఆటోలు మరియు స్థానిక వాహనాలు సులభంగా లభిస్తాయి. 

మంత్రాలయం నుండి ప్రయాణానికి దాదాపు 30-40 నిమిషాల సమయం పడుతుంది.

రైలు మార్గం: మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరం లో నే ఉంది. చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

వాయు మార్గం: మంత్రాలయం నుండి 232.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీలు అందుబాటులో వున్నాయి.

దర్శన సమయాలు:
సోమవారం నుండి శనివారం వరకు: ఉదయం 6:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 3:00 PM నుండి రాత్రి 8:00 PM వరకు.

శనివారం: ఉదయం 6:00 AM నుండి రాత్రి 8:00 PM వరకు నిరంతరం తెరిచి ఉంటుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment