చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు
1. జన్మ లగ్నము నుండి నాల్గవ రాశియే చతుర్ధ భావము. దీనినే మాతృ భావము, విద్యా స్థానము, క్షేత్ర-సుఖ-వాహన స్థానములనియు దెలియ వలెను.
2. చతుర్ధ భావము ద్వారా - జాతకుని ప్రాపంచిక సుఖానుభవములు, విద్య, సుఖము, తల్లి, వాహనములు, భూములు, క్షేత్రములు, జయము, మాతృవర్గము, పితృధనము, గృహము, పశుసంపద, ఆయువు, నిధి నిక్షేపములు, కీర్త్, సముద్రయానము, శాస్త్ర పరిజ్ఞానము, బోధన, హృదయము, వక్షస్థలము, స్వభావం, స్నేహశీలత, జాతి, శయనము, జలొపద్రవములు, స్థాన చలనము, కృషి మొదలగు విషయములను గురించి తెలుసుకొనదగియున్నది.
3. చతుర్ధ భావమున రవి యున్న - తండ్రికి వ్యతిరేకత, తల్లి సౌఖ్యము లోపించుట, పిత్రార్జిత ఆస్తి హాని, అస్థిరమైన నివాసము, భూవ్యయము, స్వల్ప సుఖ - భోగములు, హృదయ రోగము కల్గును.
4. చంద్రుడు చతుర్ధమందున్న - బంధు మిత్రాధిక్యత, అధిక సంతానము, స్త్రీ-పుత్ర సుఖములు, బ్రాహ్మణ భక్తి, శిల్ప విద్యా ప్రవేశము, సేవకులు, వాహనము, విద్యా-గృహ సౌఖ్యములు కల్గును. క్షిణ చంద్రునిచే - దీనికి వ్యతిరేక ఫలితములు లుండగలవు.
5. చతుర్ధములందు కుజుడున్న - దౌర్భల్యము, మూర్ఖత, సుఖలోపము, రోగము, దుఃఖము, పరగృహ భోజనము, బంధుద్వేషము, విద్యా విహీనత, దోషయుక్త గృహ నివాసము కల్గును.
6. బుధుడు చతుర్ధ భావము నందున్న - పాండిత్యము, మాత్రుసుఖము, ధన-ధాన్య వృద్ధి, గీతా వాద్య ప్రయత్నములు కల్గును.
7. గురువు చతుర్ధము నందున్న - బంధువులు, స్త్రీలు వస్త్రాభరణములు, పశులాభము, గోసంపద, రాజానుగ్రహము, భూమి, విద్య, సుఖ-సౌఖ్యములు, వాహనయోగములు ప్రాప్తించగలవు .
8. చతుర్ధమునందు శుక్రుడుండిన - అధికారము, నిత్య ఐశ్వర్యము, అలంకార గృహము, సర్వజన ప్రియత్వము, అధిక కామాసక్తి, సంగీత-సాహిత్య ప్రకాశము, వాహన యోగములు కల్గును.
9. శని చతుర్ధము నందున్న - స్త్రీ, బంధు, సేవకులు లేకుండుట;నిలకడ లోపించుట, వసతి కొరకు ఇబ్బందులు, మాతృ సౌక్య హాని; స్వగృహము లేకుండుట, భునష్టము, సుఖలోపములు కల్గును.
10. రాహువు చతుర్ధము నందున్న - గ్రామవాసము నీచ స్నేహము, పురాతన - శిధిల గృహ వాసము, జీర్ణ వస్త్రధారణ, మతి భ్రమ, స్వల్ప భూవసతి, వాహన రాహిత్యము, బంధు ద్వేషము కల్గును.
11. చతుర్ధము నందు కేతువున్న - మాతృ సౌఖ్య హీనత, మిత్రాభిమాన దురత్వము, పిత్రార్జిత నష్టము, తొందరపాటు, దేశద్రిమ్మరితనము కల్గును.
విద్యాయోగములు
1. చతుర్ధ భావము, చతుర్ధాదిపతి, విద్యాకారక గ్రహముల బలాబలముల ద్వారా విద్యాయోగము ప్రాప్తించగలధు.
2. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతులైన గ్రహములు 6-8-12 స్థానపతుల నైసర్గిక పాప గ్రహముల సంబంధములు కలుగక; 1-4-5-7-9-10 స్థానముల యందున్న - విద్య యందు అసమాన ప్రతిభ కల్గును.
3. చంద్ర-శుక్రులు కలసి గాని, శుక్రుడోక్కడేగానీ 1-4-7-10 స్థానముల యందున్న - విద్యా యోగము కల్గును
4. లాభాదిపత్యముగల శుక్రుడు చతుర్ధము నందున్న - విద్యావంతులులగుదురు.
5. చతుర్దాధిపతి 6-8-12 స్థానముల యందుండి, పాప గ్రహ సంబంధము కల్గియున్న - స్వల్ప విద్య కల్గును.
6. చతుర్దాధిపతి 1-4-7-10 స్థానముల యందుండి, బుధుడు ఉచ్చనంది, చంద్ర లగ్నమునకు 1-4-7-10 స్థానములలో శుక్రుడుండిన - గొప్ప విద్యా వంతుడు కాగలడు .
7.సంపూర్ణ బలముగల గురువు ద్వితీయము నందున్న, భాగ్యాధిపతి బలీయ నవాంశయందున్నను - వేద విద్యావేత్తయగును. శాస్త్రాభిలాషి కాగలడు.
మాతృ సౌఖ్య యోగములు
1. క్షీణచంద్రుడు -6-8 స్థానముల యందుండుట; చంద్ర లగ్నము నుండి - 7 వ స్థానంలో కుజ - శనులుండుట; చతుర్ధ భావమునందు పాప గ్రహములుండి; శుభ సంబంధము లేకుండుట వలన - మాత్రుభావము నిర్వీర్యము కాగలదు.
2. చతుర్దాధిపతి 6-8-12 స్థానము లందున్న తల్లి నిందితురాలు కాగలదు.
3. షష్టాధిపతి శని కలసి చతుర్ధ భావము నందున్న జాతకుని తల్లి శిలశంకితురాలు కాగలదు
4. షష్టాధిపతి - నైసర్గిక పాపగ్రహమై, మరొక నైసర్గిక పాపగ్రహముతో గలసి చతుర్థము నందున్నను, రాహు దృష్టి నందినను తల్లి శీలము లోపించి యుండగలదు.
5. జన్మ లగ్నమును నుండిగానీ, పూర్ణచంద్ర లగ్నము నుండిగానీ 8 వ స్థానాధిపతీ, చతుర్ధ స్థానాధిపతీ ఇతర పాపగ్రహములతో గలసి యున్న జాతకుని తల్లి జారిణి యగును.
6. దశమాధిపతి బలయుక్తుడై, లగ్నము నందున్న - జాతకుని తల్లి పతివ్రత కాగలదు.
7. చతుర్ధాధిపతి - శుభగ్రహములతో గలసియుండి, రవి ద్రుష్టి నందిన - తల్లి పతివ్రత యగును.
8. చతుర్ధాధిపతి- చతుర్ధముందుండి, లగ్నాధిపతిచే చూడబడుచున్న లేక శుభగ్రహ యుక్తుడైయున్న - తల్లి ప్రేమకు పాత్రుడు కాగలడు.
9. చతుర్ధాధిపత్యము గల గురువు 1-9-10 స్థానములందు బలయుక్తుడై యుండి, చంద్రదృష్టి నందిన - మాతృసౌఖ్యము ప్రాప్తించగలదు.
10. చతుర్ధాధిపత్యము గల పూర్ణచంద్రుడు - చతుర్థము లేక మిత్ర క్షేత్రము లందున్న తల్లికి సుఖము కలిగించు వాడగును.
11. చతుర్ధాధిపతి- శుభగ్రహమై, గురునితో గలసి 1-4-5-7-9-10 స్థానములందున్న - తల్లికి విశేష సుఖము ప్రాప్తించగలదు.
12. లగ్న దశమాధిపతులు పరస్పర మిత్రులై యుండి, శుభగ్రహ సంబంధము కల్గిన - తల్లి జాతకునియందు బహు ప్రేమగలదయి యుండును.
13. చతుర్ధాధిపతితో కలిసియున్న లగ్నాధిపతికి - 6-11 స్థానాధిపతుల ద్రుష్టి కల్గిననూ లేక ఇతర పాపగ్రహముల దృష్టి కల్గిననూ - తల్లితో శత్రుత్వము కల్గును.
14. మాతృకారక గ్రహము (పగలు - శుక్రుడు, రాత్రి - చంద్రుడు) బలము కల్గి శుభగ్రహ దృష్టి నంది, శుభాంశయందున్ననూ లేక లగ్నాదిగా 7 వ స్థానము శుభగ్రహ రాశియై యున్ననూ - తల్లికి దీర్ఘాయువు కల్గును.
15. చతుర్ధ భావమునందు శనియుండి, శుభగ్రహములచే చూడబడుచుండిన - తల్లికి దీర్ఘాయువు కల్గును.
16. మాతృకారక గ్రహము - నైసర్గిక పాపగ్రహములతోగలసి స్థానము నందున్న - తల్లికి అల్పాయువు కలుగును.
17. చతుర్ధమునందున్న శనికి పాపగ్రహముల దృష్టియున్న యెడల - త్వరితముగా మాతృవియోగము కల్గును.
18. లగ్నమునందు - కుజుడూ, వ్యయము (12వ స్థానం)న గురువు యుండి, మిగిలిన శుభగ్రహములన్నియు 6వ స్థానము నందున్న - తల్లి జీవింపదు.
19. రవి, కుజ, శనులు 6-8 స్థానము లందున్న - తల్లికి అరిష్టము కల్గును.
20. వృశ్చికాంశయందు జన్మించిన జాతకుని తల్లికి - స్తన్యములు శుష్క్రించును.
21. చంద్రుడు - తృతీయాధిపతితో గలసి 6-8-12 స్థానములయందున్న - జాతకుడు అన్యస్త్రీ స్తన్యపానము వలన పెరుగును.
22. చతుర్ధమందున్న పాపగ్రహమునకు శుభగ్రహ ద్రుష్టి లేకున్న - ఆ పాపగ్రహ దశాంతర్దశల యందు మాతృమారకము సంభవించగలదు.
భూ - గ్రహ యోగములు
01. గ్రహమునకు - గురు-శుక్రులూ, భూములు, స్థలములు, వన క్షేత్రములకు - కుజుడూ కారక గ్రహములు కాగలరు.
02. చతుర్ధాధిపతి - 10 వ స్థానమందు, దశమాధిపతి - 4 వ స్థానమందూ యుండి, కుజుడు బలీయుడై యున్న - పంటలు పండు అనేక భూములు వుండగలవు.
03. చతుర్ధ - దశమాధిపతులకు - అధిమిత్రస్థితి కల్గిన గ్రహములు బలవంతులై యున్న - పెక్కు భూము లుండగలవు.
04. లగ్న - చతుర్ధాధిపతులు - పరస్పర భావములందు (ఏ ఒక్కరైనను)బలము కల్గియుండి, శుభగ్రహ ద్రుష్టి నందిన - స్వార్జిత భూము లేర్పడగలవు.
05. శుభ స్థానములందు - చతుర్ధ - తృతీయాధిపతు లిరువురు కలసి యుండిన - అనేక క్షేత్రములు ప్రాప్తించును.
06. చతుర్ధమునందు శుక్రుడుండి, చతుర్ధాధిపతి 7 వ స్థానమందుండి ఇరువురికి అదిమిత్ర స్థితి కల్గిన - భార్య ద్వారా క్షేత్ర లాభము లుండగలవు.
07. చతుర్ధ - సప్తమాధిపతులు - సప్తమ - చతుర్ధములందు పరివర్తన పొందియున్న భార్యద్వారా భూములు ప్రాప్తించగలవు.
08. చతుర్ధాధిపతికి 6-8-12 స్థానములు గాక మిగిలిన ఏ భావాధిపతుల సంబంధము బలవత్తరముగా నుండునో ఆ భావ సంబంధమగు భూ లాభముండగలదు.
09 చతుర్ధాధిపతి పాపగ్రహములతో గలసి ద్వితీయము నందున్నను లేకనీచ శత్రురాశుల యందున్నను, ఉచ్చయందుండి పాపగ్రహములతో గలసినను భూ వ్యయము కాగలదు.
10. దశమాధిపతి పాపగ్రహములతో గలసి చతుర్ధము నందున్న పూర్వార్జిత భూములన్నియు నష్టపడగలరు.
11. చతుర్దభావమునందు పాపగ్రహములున్నను పాపగ్రహ మాధ్యమందు భావస్థితియున్నను, భావమునకు అధిక పాపసంభంధము కల్గినను భావాధిపతికి కూడా యిటులనే పాప దృగ్యోగాది సంబంధములు కల్గినను కారకుడు పాపాధిక సంబంధముల నందినను సమస్త భూసంపదలు నష్టపడగలవు.
12. లగ్నాధిపతికి- ఉచ్చ స్వక్షేత్ర, మూల, త్రికోణ, మిత్ర, క్షేత్ర స్థితి యందు చతుర్ధాధిపతి కలయిక; శుభ గ్రహ సంబంధములు వున్న యెడల తన ప్రయత్నము లేకనే గృహ మేర్పడగలదు.
13. చతుర్ధాధిపతి - నవాంశ చక్రము నందే రాశిలో నుండునో రాశి చక్రమునందు లగ్నాదిగా 1-4-7-10 స్థానముల యందున్న గృహ మేర్పడగలదు.
14. చతుర్ధాధిపతి ఉచ్ఛయందుండి, భాగ్యాధిపతి 1-4-7-10 స్థానముల యందున్నచిత్రమైన గృహము ప్రాప్తించగలదు.
15. శనికి దశమాధిపత్యము కల్గి చతుర్ధాధిపతితో కలసి 1-4-7-10 స్థానముల యందున్న యెడల ప్రకారము గల మెడలు కలుగగలవు.
16. చతుర్ధాధిపతిగాని గృహకారక గ్రహముగాని ద్వితీయాధిపతి లేక లాభాధిపతితో కలసి శుభాగ్రహ దృష్టినందియున్న సంపదలతో గూడిన గృహము ప్రాప్తించగలదు.
17. చతుర్థ భావము చరరాశియై యుండి, చతుర్ధాధిపతియును చరరాశియందు శుభాగ్రహ దృష్టి కల్గియున్న- విదేశములందు గృహ యోగము కల్గును.
18. చతుర్థము చరరాశియై చతుర్ధాధిపతి గృహకారక గ్రహము చర రాశులలో నుండిన అనేక స్థలములందు గృహములు ఏర్పడగలవు.
19. 2-4-12 రాశుల అధిపతులు కలసి 1-4-6-7-9-10 స్థానములందున్న చక్కని గృహ యోగము కల్గును.
20. 1-7 రాశ్యాధిపతులు కలసి లగ్న- చతుర్థ స్థానములందున్నగృహ లాభముండును.
21. చతుర్థ- దశమాధిపతులు కలసి, 1-4-7-10 స్థానములందుడి శని కేంద్ర స్దాన స్థిరుడై యుండిన గొప్ప గృహము నిర్మించ గలరు
22. చతుర్ధాధిపతి 8వ స్థానమందుండి, పాప గ్రహ వీక్షితుడైన గృహ నాశనము సంభవించగలదు.
23. అంశ చక్రమునందు రవి-రాహువులకు కుజ దృష్టి కల్గిన గృహము దగ్ధము కాగలదు.
24. రవి 1-4-5-7-9-10 స్థానములందున్న- గృహము శిధిలమగును.
25. జన్మ లగ్న, అంశ లగ్నములలో బలయుక్తమగు లగ్నమునకు చతుర్ధ స్థానమందు చంద్ర - శుక్రులున్న - ఉన్నత గృహ యోగం కలదు, శని - రాహువులున్న పాషాణ గృహ యోగంగలదు, కుజ - కేతువులున్న ఇటుకలచే నిర్మించు గృహముండును, గురువున్న - కఱ్ఱల ఇల్లు, రవి యున్న - రెల్లుగడ్డి లేక గడ్డి ఇల్లు కల్గును.
26. లగ్న చతుర్ధాధిపతులుగలసి, చతుర్ధమందుండి వారిలో ఒకరికి ఆ రాశి ఉచ్చగాను, రెండవ వారికి మిత్ర క్షేత్రముగాను నుండిన అకస్మాత్ గృహ లాభయోగము కల్గును.
27. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతిలలో ఎంతమంది 1-4-5-7-9-10 స్థానములయందుందురో అన్ని గృహ యోగము లుండగలవు.
వాహన యోగములు
01. వాహన కారక గ్రహము - శుక్రుడు. ఈ గ్రహము దుష్ట లక్షణములు లేకుండా బలము కలిగియుండిన వాహన యోగములు కల్గు అవకాశములున్నవి.
02. చతుర్ధ స్థానాధిపతి బలము కల్గియుండి, చతుర్ధ స్థానమందు శుభ గ్రహములున్న యెడల వాహన సిద్ధి కలుగగలదు.
03. చతుర్ధాధిపతి 9వ స్థానమందుండి; సప్తమాధిపతి, శుక్రుడు కలసి 1-4-5-7-9-10 స్థానముల యందున్న వాహన యోగము ప్రాప్తించగలదు.
04. గురువు లగ్నమునుండి; చతుర్ధాధిపతి, శుక్రుడు కలసి, శుభ స్థానముల యందున్న వాహన యోగము కల్గును.
05. ద్వితీయాధిపతికి లగ్నస్థితీ, రాజ్యాధిపతికి ద్వితీయస్థితీ కల్గి; చతుర్థము నందొక ఉచ్చనందిన గ్రహమున్న - అనేక వాహనములకు అధిపతి కాగలడు.
06. లగ్నాధిపతికి - కేంద్రస్థానములందు చతుర్ధాధిపతియు, చతుర్ధాధిపతికి కేంద్రములందు
( 1-4-7-10 స్థానముల ) నవమాధిపతియు యుండి; లగ్నాధిపతి బలయుక్తుడైయున్న అనేక వాహనములకు అధిపతిగాగాని వాటి కధికారిగా గాని యుండగలరు.
07. చతుర్ధ భావమందు పూర్ణచంద్రుడుండి, శుక్రవీక్షితుడైన నౌక వ్యాపారము సంభవించగలదు.
08. చంద్ర శుక్రులు పరస్పర ద్రుష్టి గలవాడైనను, లేక చంద్రునికి తృతీయమందు శుక్రుడున్నను - నిరంతర వాహన సంచారి కాగలడు.
09. చంద్ర - చతుర్ధాధిపతులుగాని, లగ్నాదిపతులుగానీ కలసి; లగ్నమందున్న - వాహనయోగ ముండగలదు.
10. చతుర్ధాధిపతి - గురువుతోగాని, శుక్రుడితోగని కలసి లగ్నమందున్న - పల్లకీ యోగముండును.
11. లగ్న - దశమాధిపతులు, లగ్న - దశమములందు పరివర్తన కల్గియున్న - అనేక వాహనములుండగలవు.
12. చతుర్ధాధిపతి, గురు-చంద్ర-శుక్రులతో గలసి; కేంద్ర కోణంలందున్న - ఉన్నత వాహన యోగము కల్గును.
13. రాజ్యాధిపతి (10 వ స్థానం)- చతుర్ధమునందుండగా శుక్రుడు పరమోచ్చ భాగాలయందుండిన ఉన్నత పదవులు కల్గి, ఎచ్చటికి వెళ్లినను మంగళ వాద్యములతో సన్మానించ బడుచుండగలడు.
14. చతుర్ధాధిపతి, 6-8-12 స్థానములందుండి, పాపగ్రహ ద్రుష్టి కల్గిన - వాహనభంగము వాటిల్లును.
15. చతుర్ద భావమునందు - 6-8-12 స్థానాధిపతులుండి, శుక్రుడు పాపగ్రహ ద్రుష్టినందిన వాహనభంగము కల్గును.
16. శుక్రుడు 6 వ స్థానము, చతుర్ధాధిపతి 8 వ స్థానము, దశమాధిపతి 12 వ స్థానము లందుండి; చతుర్ధమందు పాపగ్రహములున్న - వాహన గండములు కల్గును.
17. చతుర్ధాంశాధిపతి - శుక్రునితో గలసి, 8 వ స్థానమందుండి; కుజ వీక్షితులైన యెడల లేక అష్టమాధిపతిదృష్టి కల్గియుండిన - వాహనముల ద్వారా మృత్యువు సంభవించును.
సుఖ యోగములు
01. చతుర్ధ భావమునకు చంద్ర & శుక్రుల సంభంధముచే సుఖము కల్గును.
02. చతుర్ధాధిపతి -వృషభ, మిధున, కర్కాటక, కన్య, తులా, ధనుర్ రాశుల యందున్న లేక ఆ నవాంశలు కల్గియున్న - జాతకునికి సుఖ జీవనమగును.
03. లగ్నాధిపతి - ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రము లందుండి; శుభ సంబంధము పొందియున్న - జాతకుడు జీవితాంతము సుఖియగును.
04. లగ్నాధిపతి - గురునితో కలసి 1-4-7-10 స్థానములందున్న - జాతకుని యౌవనకాలము సుఖమయము కాగలదు.
05. లగ్నమునందు శుక్రుడున్న - జీవితములోని మొదటి భాగం సుఖవంతమగును.
06. 9 వ స్థానమునుండి 12 వ స్థానము వరకు గల స్థానములలో - శుభ గ్రహములన్నియు నుండిన - జీవితాంతమునందు సుఖపడగలడు.
07. 5 గ్రహములు స్వక్షేత్రము లందున్న - గొప్ప సుఖము ప్రాప్తించగలదు.
08. లగ్నాధిపతి బలము కలిగియుండి, గురువు 1-4-7-10 వ స్థానము యందున్న - బాల్యదశలో సుఖము అనుభవించగలడు.
09. శుభగ్రహములు (గురు-శుక్రులు)- 1-11-12 స్థానములందున్న ప్రౌఢదశ వరకు సుఖ భోగములు ప్రాప్తించగలవు.
10. లగ్నమునందు - ఒక శుభగ్రహమూ, ద్వితీయమునందొక పాప ఉండి; 4-7-10 స్థానములలోను పాపగ్రహములుండి; లగ్నాధిపతి ఉత్తమాంశ మందున్న - ప్రారంభ జీవితమునందు కష్టములు, చివరి జీవితమునందు - సుఖములు ప్రాప్తించగలవు.
11. నవమాధిపతి 1-4-7-10 స్థానములందున్న - బాల్యములో సుఖముండును.
12. భాగ్యాధిపతి (9 వ అధిపతి)- 5-9 స్థానములలోగాని లేక స్వక్షేత్ర ఉచ్ఛరాశులయందు గానీ యున్న - మధ్య వయసులో సుఖము కల్గును.
13. లగ్నము నుండి 5 స్థానం వరకు బాల్య దశను, 6 నుండి 9 వరకు మధ్యమ వయసును,
10 -11-12 చివరి జీవితమును సూచించినదైయున్నది.
14. లగ్నాధిపతి ద్వితీయం మందున్నను లేక తన నవాంశంమందున్నను; అదే వవిధముగా లాభాధిపతి- ద్వితీయమందున్నను లేక లగ్నాధిపతి నవాంశమందున్నను- 20 సంవత్సరముల పిమ్మట సుఖయోగము కలుగును.
15. అంశ చక్రము నందు లగ్నాధిపతి యున్న రాజ్యాధిపతి- రాశి చక్రంలో ఉచ్చనందిననూ, కేంద్ర కోణములందున్ననూ 20 సంవత్సరములు తర్వాత సుఖ యోగము ప్రాప్తించును.
16. లగ్నాధిపతి శుభారాశి యదుండి, అధిక శుభ సంబంధములు కలిగియున్న 16 సంవత్సరముల తరువాత సుఖ యోగము కలుగును.
17. వ్యాయాధిపతికి- శుభ సంబంధము కలిగి; ఉచ్చయందు గానీ శుభ వర్గులయందుగాని యుండిన- హంస తూలికా తల్పమునందుశయన సుఖము ప్రాప్తించగలదు.
18. వ్యాయాధిపతికి- పాపవర్గులు, నీచ; లగ్నాధిపతికి షష్ఠాష్టమ వ్యయ స్థితి, పాప దృష్టి; చతుర్ధాధిపతికి- పాప సంబంధము, పాపక్షేత్ర స్థితి; శుక్రునికి దుష్టస్థానస్థితి వలన -సుఖ నాశనము కాగలదు.
చతుర్ధ భావము వల్ల కలుగు ఇతర యోగములు
01. లగ్నాధిపతి, చతుర్దాతుపతులూ - పరస్పర మిత్రులైన అనేకమంది స్నేహితులు ఉండగలరు.
02. చతుర్ధ భావమునకు- శుభగ్రహ సంబంధముండి, కారకుడు బల యుక్తుడైన బంధు పూజితుడు కాగలడు.
03. ఏ గ్రహముకైనను చతుర్ధము ఉచ్చస్థానమై ఆ గ్రహమందుండి- గురువును వీక్షిస్తూ ఉన్న- బంధువులచే పూజింపబడగలరు.
04. చతుర్దమున- గురుడుండి, చతుర్ధాధిపతి- గురు దృష్టి నందినను లేక శుభ గ్రహములతో కలిసియున్నను- బందు సమృద్ధి యుండగలదు.
05. చతుర్ధాధిపతి- పాపదృష్టి నందక, కేంద్ర కోణముల యందున్న- బంధువుల కుపకారియగును.
06. చతుర్ధమునందు- పాప గ్రహములున్నను, చతుర్ధాధిపతి- నీచ అస్తంగతములను జెందిననూ బంధుద్వేషి కాగలడు.
07. లగ్నాధిపతికి, చతుర్ధాధిపతికి, నవమాధిపతికి- నీచ-అస్తంగత శత్రు క్షేత్ర దోషములు లేకయుండి; దశమస్థాన మందుండగా దశమాధిపతి లగ్నస్థితుడై యున్న ఎడల- సింహాసన యోగము కలుగును లేదా గొప్ప పదవి అలంకరించగలడు.
08. చతుర్ధాధిపతికి- 5- 9 రాశ్యాధిపతుల కలయిక, వారి దృష్టి -రాజ్య ప్రాప్తి ఇవ్వగలదు.
09. చతుర్ధము నందు -రవి గాని, క్షీణచంద్రుడు గాని యుండిన- క్షణిక కపటికాగలడు.
10. నవాంశ చక్రమునందు చతుర్ధాధిపతియున్న రాశ్యాధిపతి సప్తమాధిపతి యొక్క దృష్టి నందియున్న -జలగండములు ప్రాప్తించగలవు.
11. చతుర్దమున నీచనందిన గ్రహముండి, చతుర్ధాధిపతి 6 స్థానంలోనూ, కుజుడు 12వ స్థానంలోనూ నుండిన -జాతకుడు మూగవాడగును.
12. పంచమున రవి-బుధ-రాహువు ఉన్నను, ద్వితీయమునందు రవి-బుధులున్నను జ్యోతిష్య- వైద్య విద్యలు తెలిసినవాడగును.
13. తుల యందు చంద్రుడునున్న- జ్యోతిష్యము, ద్వితీయమున శుక్రుడున్న -కవిత్వము వచ్చును.
14. చతుర్దబావమందు అనేక పాప గ్రహములున్నను, బహు పాప గ్రహములు చతుర్ధమును చూచుచున్నాను, అట్టి గ్రహ స్థితియందు గురు-శుక్ర-చంద్రులు బలరహితులై యున్న- జాతకుడు తల్లిని పొందువాడవును మరియు పాపకార్యాసక్తుడు, దుర్మార్గుడు కాగలడు.
15. లగ్నాధిపతి 6-8-12 స్థానములందు నీచయందున్న- శయన సుఖము లోపించగలదు.
16. వ్యాయాధిపతి పాపసంబంధము కలిగి, శుభ సంబంధము లేక యున్న శయన సుఖముండదు.
17. వ్యాయాధిపతి పాపియై శుభవర్గులయందున్నను; లగ్నాధిపతి మందీగుళికులతో కలిసి యున్నను శయన సుఖముండదు.
18. లగ్న వ్యయములందు పాప గ్రహములు 4 వ స్థానమున కుజుడు, 5 స్థానమున రవి-బుధ-రాహువులు, 8 స్థానమును శని యుండిన -గొప్ప దుఃఖములు ప్రార్థించగలవు.
19. వ్యాయమందు పాప గ్రహములుండి గురువు, బలహీనుడైన -దుఃఖములు కలుగును.
20. దశమాధిపతి పాపగ్రహములతో గలసినను, నీచ నందినను- ధనమెంత యున్నను దుఃఖములు తప్పవు.
No comments:
Post a Comment