Sunday, January 4, 2026

Surya Padmamu Nomu Katha - సూర్యపద్మము కథ

సూర్యపద్మము కథ

ఒకానొక గ్రామమున నొక బ్రాహ్మణుండు, నొక రాజు, నొక కోమటి, 
నొకకాపు, నొక గొల్లవాడు నుండిరి. వీరయిదుగురు అయిదు కుంచములను కొనుక్కొనిరి. ఈ అయిదు కుంచములు రోజు నా గ్రామముననున్న దేవాలయమునకు బోయి తమలోతాము “నాతో నిన్న వరహాలు కొల్చినారు. నాతో
నిన్న వడ్లుకొలిచినారు” అని చెప్పుకొనుచుండిరి. వాటిలో బ్రాహ్మణకుంచము తన యజమానియగు బ్రాహ్మణునికి దరిద్రమగుటచే తనలో యేమేమి కొల్చినారో చెప్పక యూరక కూర్చుండినది.

ఒకనాడు తక్కిన నాలుగు కుంచములు యధాప్రకారముగ దేవాలయమునకు వెళ్ళెనుగాని బ్రాహ్మణకుంచ మారోజున రాలేదు. "ఎందుచేత బ్రాహ్మణకుంచమురాలేదు!" అని తమల్లో తాము కొంతసేపు తర్కించుకొని కొంతసేపు కూర్చుని తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయెను. 

మరుసటి రోజున కుంచము లన్నియు నా దేవాలయమునజేరి "నాతో నిన్న వరహాలు కొలుచుకున్నారు నాతో నిన్న వడ్లుకొలుచుకున్నారు" అని చెప్పుకొనుచున్నవి. అప్పుడు బ్రాహ్మణ కుంచము జూచి తక్కిన కుంచములు- "నిన్న నెందుకు వచ్చినావు కావు” అని అడిగినవి. "సోలెడు నూకలుండగా మాయమ్మగారు నాలో పోసి మూతవేసినందున నిన్నటి రోజున నేను వచ్చుటకు వీలులేక పోయినదిని చెప్పెను. అందు మీద తక్కినవన్నియు -"నెప్పుడు చెప్పినా నూకలు, ఆళ్ళు కొలిచారని చెప్పు చుండెదవు" యని నీరసించి పలికెను. అంత బ్రాహ్మకుంచము- "యేమి చేయమన్నారు? యెల్ల కాలము మీలాగుయుంటారా యేమిటి? కొన్నాళ్ళకు మా అమ్మకు కుమార్తె పుట్టును ఆ పిల్ల బొడ్డున మాణిక్యం పెట్టుకొనిమరి పుడుతుంది. ఆ సంగతి యొక బ్రాహ్మణుడు గ్రహించి యా బాలికను తనకిండని యడుగును. అప్పుడు మా కెంతైన భాగ్యము
కలుగును. అప్పుడు మేముకూడ వరహాలు కొలుచుకొనెదము" అని చెప్పెను. "ఎప్పుడో 
కొలుచుకుంటారట!" అని నవ్వి తక్కినకుంచములు వెళ్లిపోయెను. 

బ్రాహ్మణకుంచము తనదారిన యింటికేగెను. ఈ జరిగిన సంభాషణంతయు నొక బ్రాహ్మణుడు విని సమయముకొరకు వెచి యుండెను. అందులో బ్రాహ్మణకుంచముగల బ్రాహ్మణునికి బొద్దునుండి ప్రతిరోజున నొక మాణిక్యము పడుచుండెడి కుమార్తెను కన్నారు. దానివలన వారు కావలసినంత భాగ్యవంతులై, ఇదివరలో కుంచముల సంభాషణ విని సమయమున కెదురుచూచుచున్న బ్రాహ్మణుడు బ్రాహ్మణు కుంచముగల ఇంటికివచ్చి యజమాని గారిని " నీకూతురు నాకు యిచ్చి వివాహం చేయవలసినద" ని యడిగెను. ఆ ప్రకారము తమకూతురునిచ్చి ఆ బ్రాహ్మణునికి వివాహము గావించిరి.

తరువాత పెండ్లికుమారుడగు నా బ్రాహ్మణుడు వివాహానంతరము యింటికి వెళ్లెను. కొంతకాలమైన తరువాత తిరిగివచ్చి తన భార్యయగు ఆ పిల్లను తీసికొని పోయెను. ఈ చిన్నది వెళ్ళిన తరువాత వారు కూడా మంచి భాగ్యవంతులయిరి. ధనాశచే నా బ్రాహ్మణుడు తన భార్యను పుట్టంటికి పంపుట మానినాడు. 

ఒకనాడు చిన్నది తల్లిని చూడవలెనని తలంపుతో భర్తయెక్కడికో వెళ్లినప్పుడు తన పుట్టింటికి వెళ్లిచూచి తిరిగి వచ్చుచుండగా మార్గమధ్యమందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షులై యా చిన్నదానిని -“ఎక్కడకు బోవుచుంటివని యడిగిరి. అప్పుడాచిన్నది. “మాయమ్మను చూడవలసియుండి వెళ్లి తిరిగి వచ్చుచున్నాన”ని చెప్పెను. అప్పుడు పార్వతీపరమేశ్వరుయీమె తో “అయ్యో వెర్రిదానా అలాకాదు నీ తల్లిదండ్రులకు నీవు పుట్టుటచేత భాగ్యమువచ్చినది.
అందుచేతవారు నిన్ను వదలి? పెట్టలేదు. ఈకారణముచేతనే నీభర్తయు నిన్ను వదలి పెట్టలేక నిన్ను పుట్టంటికి పంపినాడుకాడు అంతేగాని మరేమీకాదు" అని చెప్పివారు. "ఇప్పుడేమి చేసినట్లయితే నాకు, మావారికి కలియునో చెప్పవలె" నని వారిని యా చిన్నది ప్రార్థించెను. " క్రిందటి జన్మమున సూర్యపద్మము నోము పట్టినావు గనుక నీవు బొడ్డున మాణిక్యము పెట్టుకొని పుట్టినావు. అప్పుడు ఉదయము చూచి యుద్యాపనముచేసినావు కావు. కాబట్టి మీరిద్దరికి యిష్టము తక్కువగా నున్నది. ఇప్పుడీ నోముపట్టి యుద్యాపనచేస్తే మీరిద్దరు యిష్టముగా నుండెదరు".

ఉద్యాపన: ప్రొద్దు పొడవకుండా దంతపతులిద్దరికి తలయంటి నీళ్ళుపోసి మట్టెలు మంగళసూత్రము యిచ్చి చీర జామారు నొసంగి ప్రొద్దు పొడవకుండా యుద్యాపన చేసికొమ్మని జెప్పి పార్వతీ పరమెశ్వరులంతర్జానము నొందిరి.

Maaga Aadi varamula Katha మాఘఆదివారముల కథ

మాఘఆదివారముల కథ

పూర్వము సోములారి సోమిదేవమ్మ మాఘాదివారముల నోము పట్టి ఐదేండ్లు నియమము పాటించి ఉద్యాపనము దీర్చికొను సమయంబున మాఘపూర్ణిమముందు రధసప్తమినాడు సోములారి సోమిదేవమ్మ పసుపు రాసుకొని స్నానముచేసి పచ్చని యక్షంతలు పట్టుకొని తన కుమారులను పిలిచి "కుమారులారా! నాపాలిట మాఘపాదివారము కథ వినవలయునని కొడుకులను యడిగెను. అంతట నొక కుమారుడు "మాకేమికథ మాకేమి కారుణ్యమమ్మా! రాజుగారు కచేరికివచ్చే వేళయైనది. అక్కడికి పోవలెనని" చెప్పి యట్లు కచ్చేరికి వెళ్ళెను. రాజుగారు అంతకు ముందుగానే కచ్చేరికి వచ్చి యాలస్యముగా వచ్చిన కారణమున యా బ్రాహ్మణుని హెచ్చరించెను. అప్పుడా కుమారుడు "సోములారి సోమిదేవమ్మ కథ వినని దోషము కట్టికుడిపినదని చింతించుచు తన గృహమునకు వెళ్ళెను.

సోమిదేవమ్మ మనుమలను బిలిచి "మనుమలారా! నాపాలిటి మాఘపాదివారముల కథవినెదరా? అని యడుగగా బడికిపోవలెను. పంతులు కొట్టిపోవును" అని చెప్పుచు మనుమలు బడికి వెళ్ళిరి. అంత ప్రొద్దుపోయి రావడమేమని పంతులా బాలురను కొట్టిరి. అప్పుడు చిన్న పిల్లలు సోములారి సోమిదేవమ్మకథ వినని దోషము కట్టికుడిపింది యని యనుకొనిరి.

సోములారి సోమిదేవమ్మ తన కోడలిని బిలిచి "కోడలా! నా పాలిటి మాఘపాదివారము కధ వినెదవా? యని యడుగగా- "నాకేమి కథ? నాకేమి కారుణ్యమమ్మా నాపిల్లలకు పాలు ఉగ్గు పోసికొనవలె"నని కోడలు చెప్పి ఉయ్యాలలో నున్న తన బిడ్డయొద్దకు వెళ్ళి చూచునపుడు ఉయ్యాలలోని బాల కొయ్య బారిపోయెను. అప్పుడా కోడలు "అయో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కళ్ళ కుడిపినద" ని విచారించెను.

తిరిగి సోములారి సోమిదేవమ్మ నీళ్లరేవుదగ్గరకు వెళ్ళి, "నీలాడెడుయక్కలారా! షాలాడెడు యక్కలారా! యని నీళ్లరెవున స్నానము చేయు కాంతలను పిలిచి నా పాలింటి మాఘపాదివారముల కథ వినెదరా?" యని యడిగెను. అప్పుడా స్త్రీలు "మేము నీళ్లుపాలు తెచ్చుకొనవలెనమ్మా!" అని చెప్పి నీళ్ల కడవలు భుజములపై నుంచుకొనబోగానవి విచ్చిపోయినవి. “అయ్యో! సోములారి సోమిదేవమ్మకథ విననిదోషము కట్టికుడిపినదనియు యా స్త్రీలందరు విచారించిరి.

పిమ్మట సోములారి సోమిదేవమ్మ వీధిలోకివచ్చి నిలుచుండగా నొక బ్రాహ్మణు డెదురు గుండా వచ్చెను. అప్పుడా సోములారి సోమిదేవమ్మ బ్రాహ్మణుని పిలిచి "బ్రాహ్మణుడా! నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" అని యడుగగా నా బ్రాహ్మణుడు పంచాంగము చెప్పుకొనవలెనని చెప్పి రాజుగారింటికి వెళ్లేసరికి తలుపులు మూయబడి వెళ్లుటకు వీలులేక పోయెను. అంతట బ్రాహ్మణుడు సోములారి సోమిదేవమ్మ కథ వినని దోషం కట్టి కుడిపిందని విచారించుచు పోయెను.

తరువాత సోములారి సోమిదేవమ్మకు మేదరివాడెదురుగా వచ్చేసరికి నా పాలింటి మాఘవాదివారముల కథ వినెదవా? యని వాని నడుగగా "మాకేమి కథ? మాకేమి కారుణ్యమమ్మా తట్టబుట్టలు నల్లుకోవలె" నని మేదరివాడు వెళ్ళి తట్టలల్లుకొనుచుండగా కత్తివిరిగి పోయినది. "అయ్యో! సోములారి సోమిదేవమ్మకథ వినిన దోషం కట్టికుడిపినదని మేదరివాడు చింతించెను.

పిమ్మట ఉప్పరివాడు కనబడి వానిని పిలిచి "ఉప్పరి నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" యని యడుగవాడు "మాకేమి కథ మాకేమి కారుణ్యమమ్మా! గట్టువుట్ట పెట్టుకొనవలె"నని చెప్పి గట్టువుట్ట పెట్టుకొనుచుండగా పార, గడ్డపార విరిగిపోయెను. "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కట్టికుడిపిన" దని ఉప్పరివాడనుకొనెను.

తరువాత చాకలివాడు యెదురుగా వచ్చుచుండ చాకలి వానిని పిలిచి "చాకలీ! నా పాలింటి మాఘపాదివారములకధ వినెదవా?" యని సోములారి సోమిదేవమ్మ అడిగెను. వాడందుకు "మాకేమికథ? మాకేమి కార్యణ్యమమ్మా! రాజుగారి బట్టలారవేయుటకు పోవలె" నని బదులుచెప్పి ఇంటికిపోగా గాలివానవచ్చి బట్టలెగరకొట్టుకొని వోయినవి. "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషంబు కట్టికుడిపింద" ని యనుకొనెను.

తరువాత కుమ్మరివాడెదురుగా వచ్చెను. అప్పుడు వానిని పిలిచి "కుమ్మరీ! నాపాలింటి మాఘపాదివారముకథ వినెదవా?" అని యడుగ- "నాకేమికథ నాకేమి కారుణ్యమమ్మా! రాజుగారికి వెండిబాన, పయిడిబాన చేయుటకు పోవలె" నని చెప్పి యింటికిపోయి వెండిబాన, పయిడిబాన చేయబోవునప్పుడు కుమ్మరిసాన విరిగిపోయెను. అపుడువాడు "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కట్టికుడిపింద" ని యనుకొనెను.

ఇంతలో నిండు గర్భము ధరించియున్న రమాదేవి ఎచటకో పోవుచు అటు రాగా సోమిదేవమ్మ ఆమెను గూడ పిలిచి "నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" యని ఆమె నడిగెను. అప్పుడామె ఇట్లు చెప్పెను "వినెదను, నిన్న శనివారం ఒంటిపూట భోజనము. ఈ రోజు ఆదివారము, మానెడు పాలలో చేరడు బియ్యముపోసి పెట్టిన కథ వినెద" నని చెప్పెను. మంచిదని సోములారి సోమిదేవమ్మ మానెడు పాలలో చేరడు బియ్యముపోసి పెట్టినది. తిని రమాదేవి గట్టుమీదపడుకొని నిదుర పోయినది. ఆమె కడుపులో నున్నపిల్ల సోములార సోమిదేవమ్మతో "మా అమ్మ బొడ్డు మీద నక్షతలువేసి కథ చెప్పుకోవమ్మా! వినెద" నని చెప్పెను. అట్లు బొడ్డుమీద నక్షతలు వేసి సోమిలారి సోమదేవమ్మ

పాడువూళ్లు పాట్నాలవును పట్టి జోజో - పాపా జోజో
ఎండిమ్రాను పండ్లు పండ్లు పట్టి జోజో - పాపా జోజో

పట్టావులు పాలనిచ్చు పట్టి జోజో - పాపా జోజో
గొడ్దువాండ్రూ బిడ్డలగందురు పట్టి జోజో - పాపా జోజో

వేచి వేసినా వేయివేలే పండ్లు పట్టి జోజో - పాపా జోజో
కోసివేసినా కోటివేల పువ్వులు పట్టి జోజో - పాపా జోజో

కోసివేసినా కోటివేల పండ్లు పట్టి జోజో - పాపా జోజో
ప్రత్తిగింజలు ముత్యాలౌను పట్టి జోజో - పాపా జోజో

చచ్చిన పురుషుడు లేచివచ్చును పట్టి జోజో - పాపా జోజో
ఏడువారలనగలూ నట్టేటలోపడినా నట్టింటికివచ్చును పట్టి జోజో-పాపాజోజో

అని పాడుచు కథ చెప్పుకొనెను.

నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ! నీవు నిద్రలో యుండగ నీ కడుపుననున్న బిడ్డ నా నోముకథ వినినది. నీకు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన గురియును. ఆడబిడ్డ పుట్టిన ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడవచ్చెదను. మి ఇంటి గుర్తులు చెప్పుమని తెలిసికొని యామెను తిరిగి పంపెను.

కొంతకాలమునకు ముత్యాలవాన కురియగ సోమిదేవమ్మ రమాదేవికి స్త్రీ శిశువు కలిగినట్లు తెలిసికొని ఊయల చీర, ఉగ్గుగిన్నె తీసుకొనిపోయి పురిటిబిడ్డకు నీళ్ళుపోసి ఉగ్గుపెట్టి, చీరని నశ్వత్థవృక్షము కుయ్యలవేసి, "పక్షులారా! పాడండి. వృక్షవరులారా! ఊపండి" అని జోలపాడి, దీవించి, పాడియావునిచ్చి యింటికి వచ్చెను. రమాదేవి గట్టుపుట్ట పెట్టుకొనుటకువోగా పెంచినతల్లి యింటికి వచ్చినది పక్షులు ఆనందముగ పాడుచుండెను. వృక్షములూగ్గుచున్నవి.

ఒక రాజు సవారీ యెక్కి యామార్గమున బోవుచు పక్షులపాటయు, బాలరోదనమువిని యది యేమియో కనుగొనమని తన పరిచారకునితో చెప్పెను. వాడు "వెరచి చెప్పుదునా? వెరువక చెప్పుదునా" అని అడుగ రాజు "వెరువక చెప్పు" మనెను, అప్పుడు వాడు మహారాజుగారి తో "మాకయినమాత దేవరకయిన దేవీ” అని చెప్పెను. అంతట మహారాజు తనవారి నా యశ్వత్ణ వృక్షసమీపమునకు పట్టించి యా బాలను తనపల్లకీలో నుంచుకొని పాడువూరిలోనికి తీసుకొనివచ్చినాడు. ఆపాడు గ్రామము గొప్ప పట్టణమై కడు అందముగా నొప్పుచుండెను. అంత "యిదేమి చోద్యముగంటిని అక్కా!" అనెను. తరువాత నాబాలను ప్రత్తిగింజలలో పరుండబెట్టి పైని ప్రత్తిగింజలే కప్పినారు. యా బాల శరీర స్పర్శకు ప్రత్తిగింజ లన్నియు ముత్యము లయినవి. "యిదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. వేయించి వేయగా వేపవేలుపండినవి. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. కోసివేయగా కోటివేలుండెను. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" యనెను. మాడ్చివేయగా నూరువేలు పండినది. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. వట్టయావును తీసుకొనివచ్చి కట్టి పెట్టినను. పాలు యిచ్చినది. "ఇదేమిచోద్యము గంటిని అక్కా!" అనెను. వట్టి మ్రాను తీసుకొనివచ్చి పాతిపెట్టగా పండ్లు పండెను. "ఇదేమి చోద్యముగంటిని అక్కా!" యనెను. రాజు పసిపాపను చూచి ఆమె మాహాలక్ష్మి అంశముగల చిన్నది. రాజాంతఃపురములలో నుండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవి వచ్చినదాక కాచుకొనియుండి. "అమ్మా! నీవింక మా రాజభవనమున నుండవచ్చునని తనవెంట గొనిపోయెను. రాజుగారి పెద్దభార్య యొద్దకు ఆ పిల్లను తీసుకొనిపోగా నామెకు కొడుకుపుట్టెను. "ఇదేమి చోద్యము అక్కా!" అనెను.

కొన్ని దినములకా పాప పెరిగి పెద్దదైనది. ఒక రాజకుమారుడామెను ప్రేమించి రెండవభార్యగ వివాహమాడి అనురాగముగా చూచుచుండెను. రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే రమాదేవి కుమార్తె ఉప్పరమాదేవి యొక్క ఏడు వారముల నగలు అపహరించి,యొక బరిణిలోనుంచి ఆ బరిణి సముద్రంలో బారవేయగా దానినొకచేప మ్రింగెను. పల్లెవాడొకడు వలవేయగా నాచేపవానికి దొరికెను. అపుడు పల్లెవాడా చేపను రాజుగారికి కానుకగా పంపించెను. తిన్నగా నా చేపను రాజుగారి పెద్దభార్య గృహమునకు పట్టుకొనిపోయి ఇచ్చిరి. 

రాజుగారు పెందలకడ వంటచేయవలసినదనియు భోజనమునకు వచ్చెదననియు తన పెద్దభార్యకు వర్తమానము చేసెను. అంతట "నగ నాణము దానికిని చేత బెల్ల నాకు" యని చేపను ఉప్పరమాదేవి కి పెద్దభార్య పంపివేసినది. ఉప్పరమాదేవి "మంచికూర వచ్చినదిని కత్తి పీట ముందరవేసుకొని తరగబోయే సరికి ఘల్లున చేప కడుపులో నుంచి నగల బరిణె పడినది. "నాపాలిటి మహాలక్ష్మీ నా యింటికి వచ్చిన"ది. పాలచేతకడిగి పళ్లెములో పెట్టుకొని ఉప్పరమాదేవి యెడువారాల నగలుధరించి పద్మాల పట్టుచీర కట్టుకొని “రాజుగారిని భోజనమునకు రమ్మని కబురుచేసినది. "నగులుపోతే నగలు తెచ్చుకొన్నది. నేపోయిన తిరిగి నన్నేలాగున తెచ్చుకొనునో చేతముగాక!" అని ఉప్పరమాదేవి యింట్లో భోజనముచేసి పెద్దభార్య యింట్లో విషముతిని చనిపోయెను. 

అప్పుడు చచ్చిన పురుషుని నట్టింట పరుండబెట్టి పెద్దభార్య తన సవతిని సహగమనమునకు రమ్మని పిలిచినది. సవతియగు ఉప్పరమాదేవి పసుపుకలిపి పళ్లెరములో పోసికొని కుంకుమ కొని కుదురు మీదపెట్టుకొని తలుపున తడకవెసి వెళ్ళుచున్నది. అప్పుడాదినారాయణ మూర్తి ఆమెకు ప్రత్యక్షమై "ఎమమ్మా! ఎక్కడకు వెళ్ళుచున్నావు?" అని అడిగెను. “చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు సవతి సహగమనము చేయుచున్నది, రమ్మని కబురు పంపించినారు. పసుపుకొని పళ్లెరములో పోసికొని, కుంకుమకొని కుదురుమీదపెట్టుకొని తలుపున తడకవేసి తొందరగా వెళ్లుచున్నాను అని ఉప్పరమాదేవి చెప్పెను" అప్పుడాయన "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు నాకు కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుయిచ్చి నీవుకూడా కాళ్లు కడుగుకోవమ్మా" అని పలికినాడు ఆమెయు నా బ్రాహ్మణవేషముతో వచ్చిన నారాయణ మూర్తికి కాళ్ళుకడుగుకొనుటకు నీళ్ళుయిచ్చి తానుకూడా కాళ్లు కడుగుకున్నది. 

తిరిగి యా బ్రాహ్మణుడు- "నాకు దాహమిచ్చి నీవుదాహముపుచ్చుకోవమ్మా!" యని చెప్పినాడు. "చచ్చిన పురుషుడు నట్టింటయున్నాడు. సవతిసహగమనము చేయుటకు వెళ్లుచున్నది. పసుపుకొని పళ్లెములో పోసినాను, కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపుతడక వేసినాను. కాళ్ళుకడుక్కొని కాళ్లుదాచినాను, దాహమెక్కడ దాచనయ్యా!" అని యుప్పరమాదేవి చెప్పెను. అప్పుడా బ్రాహ్మణుడు "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు దాహమిచ్చి నీవు దాహము పుచ్చుకోవమ్మా!" అని చెప్పెను. ఆ ప్రకార మా బ్రాహ్మణునికి దాహమిచ్చి తానుకూడా దాహము పుచ్చుకొన్నది. 

తరువాత నా బ్రాహ్మణుడు "నాకుతలయంటి నీవుకూడా తలయంటుకోవమ్మా!" అని చెప్పెను.
"చచ్చిన పురుషుడు నట్టింటయున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపు
పళ్లెములో పోసినాను. కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపున తడక వేసినాను. కాళ్లు కడుగుకొని కాళ్లుదాచినాను. దాహము త్రాగి దాహముదాచినాను. తలయంటుకొని తలయెక్కడ దాచనయ్యా!" అనెను. "సౌభాగ్యవతీభవ! అంతపనిపట్టరాదు. నాకు తలయంటి నీవు కూడా తలయంటుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు పల్కినాడు. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి తలయంటి తానుకూడా తలయంటుకొనినది.

తరువాత నా బ్రాహ్మణుడు నామెను అడిగిన దేమనగా, తనకు గంధమిచ్చి యామెను పసుపు పూసుకోమనెను. చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసువుకొని పళ్లెములోపోసినాను. కుంకుమకొని కుదురు మీద పెట్టినారు. తలుపున తడక వేసినారు. కాళ్లు కడుగుకొని కాళ్ళుదాచినాను. దాహముపుచ్చుకొని దాహము దాచినాను తలయంటుకొని తలదాచినాను. పసుపు రాసుకొని మొగమెక్కడ దాచనయ్యా? అని యామె జవాబు చెప్పెను.  "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు గంధమిచ్చి నీవు పసుపు రాసుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు తిరిగిచెప్పెను. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి గంధమిచ్చి తానుకూడా పసుపు రాసుకోనినది. 

తరువాత నా బ్రాహ్మణుడు-"నాకు బొట్టునిచ్చి నివు బొట్టుపెట్టు కోవమ్మా!" యని చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పళ్లెములో పోసినాను. కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపున తడక వేసినాను. కాళ్లు కడుగొని కాళ్లుదాచినాను దాహము పుచ్చుకొని దాహము దాచినాను. తలయంటుకొని తలదాచిననాను. పసుపురాసుకొని మొగము దాచినాను. బొట్టు పెట్టుకుని బొట్టెక్కడ దాచనయ్యా! అనెను. "సౌభాగ్యవతీ భవ! అంతపని పట్టరాదు. నాకు బొట్టిచ్చి నీవు బొట్టుపెట్టుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారము బ్రాహ్మణునికి బొట్టునిచ్చి తానుకూడా బొట్టు పెట్టుకొనెను. 

తిరిగి ఆ బ్రాహ్మణుడు - "నాకు భోజనముపెట్టి నీవు భోజనము చేయవమ్మా!" అని యామెతో చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పళ్ళెములోపోసినాను. కుంకమకొని కుదురుమీద పెట్టినాను. కాళ్ళుకడుకొని కాళ్లుదాచినాను. దాహము పుచ్చుకొని దాహము దాచినాను, తల యంటికొని తలదాచినాను, పసుపురాసుకొని పసుపుదాచినాను, బొట్టు పెట్టుకొని బొట్టు దాచినాను, అన్నము తిని కడుపెక్కడ దాచనయ్యా?" అని యామె చెప్పెను. "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు భోజనముపెట్టి నీవు భోజనము చేయవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారము బ్రాహ్మణునకు భోజనముపెట్టి తాను కూడా భోజనముచేసెను. 

అప్పుడా బ్రాహ్మణుడు "నాకు తాంబూలమిచ్చి నీవుకూడ తాంబూలమువేసి కోపమ్మా!" అని చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పల్లెములోపోసినాను కుంకుమ కొని కుదురుమీద పెట్టినాను. కాళ్ళుకడుగుకొని కాళ్లుదాచినాను, దాహము పుచ్చుకొని దాహము దాచినాను, తలయంటుకొని తలదాచినాను. పసుపురాసుకొని పసుపుదాచినాను, బొట్టు పెట్టుకొన బొట్టుదాచినాను. అన్నముతిని అన్నముదాచినాను, తాంబూలము వేసుకొని నోరెక్కడ దాచనయ్యా?" అని అమె చెప్పెను. "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు తాంబూలమిచ్చి నీవుకూడా తాంబూలము వేసుకొనవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి తాంబూలమిచ్చి తానుకూడా తాంబూలము వేసుకొనెను. 

అప్పుడా బ్రాహ్మణుడు దివ్యమంగళ విగ్రహుండై శంఖుచక్ర గదాధరుండై ఆదినారాయణమూర్తి ఆమెకు ప్రత్యక్షమయ్యెను. అమ్మా నీ భక్తికి మెచ్చితిని, నీవు తల్లిగర్భమున ఉన్నప్పుడు మాఘాదివారముల కథవిని పవిత్రురాలవై నావు. నీకు ఏమికావాలో కోరుకొనుము ఇచ్చెదననెను. ఆమె సంతోషించి తనకు పతిభిక్ష పెట్టమని కోరెను. అంత విష్ణుమూర్తి అట్లేయని అక్షింతలు యిచ్చి "నీవు వెళ్లేసరికి కటుకుమీద పురుషుని కాటిమీద పెట్టుచుందురు అప్పుడు నీవు మూడు ప్రదక్షిణములుచేసి యక్షంతలు మీద చల్లవలెను. చల్లిన వెంటనే పురుషుడు లేచి కూర్చుండును అని నారాయణమూర్తి చెప్పెను. ఆ ప్రకారమే అక్షంతలు పట్టుకొని వెళ్ళి మూడు ప్రదక్షిణములు చేసి ఆ యక్షంతలుమీద చల్లేసరికి "యెంత నిద్రపోయి లేచినాను" అని యామె భర్త లేచి కూర్చుండెను.  

అది చూచి అక్కడున్నవారంతా ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివమ్మాయని అడిగిరి. "ఏమినోము పట్టలేదు. ఏమి వ్రతము పట్టలేదు. మాఘపూర్ణిమ ముందర రధసప్తమినాడు మాఘపాదివారముల నోముపట్టి సోములారి సోమిదేవమ్మ కథ చెప్పుకొని యక్షంతలు వేసుకొన్నది. ఆ కధ నేను విన్నాను విన్నఫలమేకాని పట్టిన ఫలముకాదది" అని యామె చెప్పెను. “విన్నంత మాత్రాన ఇంతఫలము వచ్చినది. నోము పట్టిన యెంతఫలము వచ్చునో" యని రాజు తన యిద్దరి భార్యలచేతను నోముపట్టించినాడు.

వారు పట్టిన నోమే కలిగియుగ మందలి యందరూ పట్టినారు. నోముపట్టిన సంవత్సరము పాలు త్రాగరాదు. మరుసటి సంవత్సరము మజ్జిగ త్రాగరాదు. మూడవ సంవత్సరము పప్పుతినరాదు. నాలుగవయేడు తలంటుకోరాదు. అయిదవయేడు తాంబూలము వేసికొనరాదు. అయిదేండ్ల అనంతరము ఉద్యాపన చేయవలెను.

ఉద్యాపనము: తలయం
టుకొనని సంవత్సరము అయిదుగురు ముత్తయిదువులకు తలంటి,  పప్పుతినని యేడు బూరెలువండి, పాలు త్రాగనియేడు పరమాన్నమువండి, చల్లత్రాగనియేడు పెరుగువడ్డంచి, తాంబూలము వేసుకొనని యేడు తాంబూలమిచ్చి యీ ప్రకారము అయిదుగురు ముత్తయిదువులకు అయిదు రవికెల గుడ్డలనిచ్చి ఆదినారాయణమూర్తికి యిదుమూళ్ళ అంగవస్త్రమిచ్చి వుగ్గునకు గిన్నెయు, వుయ్యెలకు చిరయునిచ్చి యుద్యాపనము చేసికొనవలెను.

Sowbhagya Thadiyala Katha - సాభాగ్య తదియల కథ

సాభాగ్య తదియల కథ

ఒక బ్రాహ్మణుని కొక ఆడపిల్ల కలదు. ఆమెకు చిన్ననాటనే వైధవ్యము సంభవించెను. ఇందులకు ఆ తల్లితండ్రులు మిక్కిలి విచారించుచుండెడివారు. ఆ జననీ జనకులు కొంతకాలము వరకుండి దుఃఖశాంతి గానక పిల్లలతో కానలకు బోయి విచారించుచు తిరుగుచుండగా విహారానికి వచ్చిన పార్వతీపరమెశ్వరులు ఏమి మీరు యిలాగు విచారించుచు తిరుగుచున్నారని యడిగిరి. అప్పుడా తల్లిదండ్రులు లేక లేక మాకీపిల్ల యొకర్తియే పుట్టినది. దీనికి పెళ్ళిచేసినాము. పెండ్లికాగానే భర్తపరలోకగతుడాయెను. ఆ దుఃఖము భరించలేక ఈలాగున పిల్లలతో తిరుగుచున్నాము అని చెప్పినారు.

అప్పుడా పార్వతీపరమేశ్వరులు "అయ్యో! ఆ పిల్ల క్రిందటి జన్మమున సౌభాగ్యతదియ నోముపట్టి ఉల్లంఘనచేసినది. అందుచేత నిట్టియాపద చిన్నదానికి సంభవించినది. ఆ వ్యధ పోవుటకుగాను తిరిగి యపుడా నోముపట్టించి సంవత్సరము పొడుగున పౌర్ణమి వెళ్ళిన తదియనాడు ఉపవాసముండి ఎడచేర పెడచేద బ్యియంబోసి యెదుట మనిషితో మాట్లాడకుండ ఉప్పువేయని చప్పిడితిని యేడాది అయిన తరువాత ఉద్యాపన చేసుకోమనెను.

ఉద్యాపన: వీసెఏబులం పసుపు మనిషితో మాట్లాడకుండా కలియగొట్టి,13 వెదురు పెట్టెలలోపోసి పదమూడు కాసులు దక్షణ తాంబూలము, 13 లక్కజోళ్లు, 13 రవికెలగుడ్డలు, 13 నల్లపూసలుకోళ్లు పెట్టి పదముగ్గురు ముత్తైదువులకు వాయన మియ్యవలయును. 

కధలోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినను ఫలము తప్పదు.

Padaharu Phalala Nomu Katha - పదహారు ఫలముల నోము కథ

పదహారు ఫలముల నోము కథ

ఒక రాజుభార్యయు, మంత్రి భార్యయు పదుహారు ఫలముల నోముపట్టి మంత్రి భార్య మంచి ఫలముల నన్నిటిని యెంచి యధాశక్తి దక్షిణతో నొక ముత్తెయిదువ కిచ్చినది. రాజుభార్య నేను కదా గొప్పదానిని గర్వించి పదుహారు రకముల ఫలములను తెప్పించి ఒక గది లో వేయించి మంచి చెడ్డలు చూడకుండ దానము చేసినది. తరువాత మంత్రి భార్యకు మంచి సంతానము కలిగెను. రాజుభార్యకు గ్రుడ్డివాండ్రు, కుంటివాండ్రు పిల్లలు గలిగిరి, అపుడు రాజుభార్య మంత్రి భార్యను "యేమమ్మా! మనమిద్దరము కూడా నోముపట్టినాము. ఉద్యాపనము చేసినాము. నీకు మంచిపిల్లలు
పుట్టడమేమి? నాకిట్టి సంతానము కలగ
మేమి?" యని యడిగెను. అంతట మంత్రి భార్య "నీవు గర్వించి అన్ని ఫలములను ఒక్కసారి దానము చేసినావు. నేను ఏ ఫలము కాఫలమే చేసినాను. అందుచేత నీకు యిట్టి సంతానము కలిగినది, నాకట్టి సంతానము కలిగినది" అని చెప్పినది. అపుడు రాజుభార్య "యేమి చేయమనెదవమ్మా యిప్పుడు" అని మంత్రి భార్య నడిగెను. "తిరిగి పదుహారు ఫలములనోముపట్టి మంచి మంచి ఫలముల నెంచి తగిన దక్షణతో నుద్యాపన జేసికొంటి మంచి సంతానమగును" అని మంత్రి భార్య చెప్పెను. ఆ ప్రకారము రాజుభార్య నోముపట్టి పదహారు ఫలాలు యుద్యాపనము చేసికొనెను.

ఉద్యాపనము: పదహారు రకముల పండ్లను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క జాతిఫలమును ఏరి ముత్తయిదువులకు పంచిపెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలయును.

Dampatula Tambulamu Nomu Katha - దంపతుల తాంబూలము నోము కథ

దంపతుల తాంబూలము నోము కథ

ఒక రాజుభార్య దంపత తాంబూలము నోముపట్టి ఉల్లంఘన చేసెను. అందువల్ల భార్యాభర్తల కెడబాటు వచ్చెను. సిరిసంపదలు కూడ తక్కువయ్యెను. ఇట్లు కొన్నాళ్ళుండి సహించలేక యా చిన్నది అడవిలోకివెళ్ళి అచ్చట ఏడ్భుచూ కూర్చుందెను. భూమి పై విహారానికి వచ్చిన  పార్వతీపరమేశ్వరులు ఆమెను చూచి ఎందులకు ఎడ్చుచున్నా వని యడుగగా,  అందుకు ఆమె భర్త దేశాంతర మెళ్ళినాడు. సిరిసంపదలు తగ్గిపోయినవి. అందుచేత విచారించుచున్నానని చెప్పెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు నీవు క్రిందటి జన్మమున దంపత తాంబూలము నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. అందుచేత నీకీ విచారము కలిగినది. ఇప్పుడీ కథ చెప్పి అక్షింతలు వేసికొని, ఏడాది తాంబూలమిచ్చి ఎడాది అయిన తరువాత ఉద్యాపన చేసికొనవలసినదని చెప్పి యదృశ్యులైరి. 

ఆ ప్రకారం రాజు భార్య నోముపటగా దేశాంతరం వెళ్లిన భర్త తిరిగి ఆమె చెంతకు చేరెను. 
సిరిసంపదలతో సుఖముల ననుభవించెను.

ఉద్యాపనము: దంపతులకు తలంటి నీళ్ళుబోసి మున్నూట అరువది ఆకులు, మున్నూట అరువది పోకలు, తాంబూల సరంజాము ఒక పళ్లెమైనను, వొందానయైనను కొని దానిలో నుండి దంపతలకు భోజనము పెట్టి అందివయ్యవలెను. 

కధలోపమైనను వ్రతలోపముకాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

Kundeti Amavasya Nomu Katha - కుందేటి అమావాస్య నోము కథ

కుందేటి అమావాస్య నోము కథ

ఒక కుందేలు చాకలి బానలో పిల్లలను పెట్టి మెతకొరకు ఎక్కడికోపోయినది. చాకలిదివచ్చి పొయ్యిమీద నా చాకలిబాననుంచి మంట పెట్టుచున్నది. అంతట మేతకొరకు పోయిన కుందేలు తన పిల్లలయొద్దకు వచ్చిచూచేసరికి పొయ్యిమీద నా చాకలిబానలో పిల్లలు ఉడికిపోతూ ఉడికిపోవుచున్నామమ్మా! అని యరుచుచున్నవి. తల్లియు నా బానచుట్టు తిరుగుచు నుడకకండి బిడ్డలారా! ఉడకకుండా ఉండ్రాళ్ళవాయనము నిచ్చినాను, అని తల్లి చెప్పినది. పిమ్మట పిల్లలు చచ్చిపోయేమమ్మా అని అరచినవి. చావకండి బిడ్డలారా! చావకుండా! చలిమిడి వాయనమిచ్చితి
నని తల్లిపలికెను. అంత చిమిడితిమే యమ్మా! యని పిల్లలరచినవి. చిమడకండి బిడ్డలారా! చిమడకుండా చిమ్మిలి వాయనమిచ్చినానని తల్లి యనెను. తరువాత పిల్లలు వేగితిమేయమ్మా! అని యరచినవి. వేగకండి బిడ్డలారా! వేగకుండా వేపుడు బియ్యం వాయనమిచ్చినాని పలికెను. పేలిపోయితిమేయమ్మా యని పిల్లలరచినవి. పేలకండి బిడ్డలారా! పేలకుండా పేలాలు వాయనమిచ్చానని తల్లి చెప్పెను. అడుగంటి తిమేమ్మ అని అరచినవి అడుగంటకండి బిడ్డలారా! అడుగంటకుండా అట్లు వాయనమిచ్చినానని తల్లిపలికెను. కాలిపోతిమేయమ్మాయని పిల్లలరచినవి. కాలకండి బిడ్డలారా! కాలకుండా కర్రలు వాయనమిచ్చినానని తల్లిపలికెను.
పాకితిమేయమ్మా! యని పిల్లలరచినవి. పాకకండి బిడ్డలారా! పాకకుండా పరమాన్నము వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. పొంగితిమేయమ్మా! యని పిల్లలరచినవి. పొంగకండి బిడ్డలారా! పొంగకుండా పోలులు వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. నానితిమేయమ్మా! యని పిల్లలరచినవి, నానకండి బిడ్డలారా! నానకుండా నానబియ్యరి వాయనమిచ్చితినని తల్లి పలికెను. మాడిమితేయమ్మా! యని పిల్లలరచినవి. మాడకండి బిడ్డలారా! మాడకుండా మాడలు వాయనమిచ్చినానని తల్లిపలికెను. కందితిమేయమ్మా ! అని పిల్లలరచినవి. కందకండి బిడ్డలారా!
కందకుండ గారెలు వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. ఇట్లు చెప్పుచు తల్లి బానచుట్టు  తిరుగునప్పటికి పిల్లలన్నియు పైకివచ్చి తల్లిదగ్గరకు వెళ్ళిపోయినవి. ఇదియంతయు  చూచుచున్న చాకలిది ఆశ్చర్యమునొంది కుందేలుని ఎట్లు నీపిల్ల లన్నియు బ్రతికి వచ్చినవని యడిగెను. అప్పుడా కుందేలు చాకలిదానితో - నీవు నా పిల్లలున్న బాన పొయ్యిమీద పెట్టి ఉడికించుచున్నావు. నా పిల్లలన్నియు అరచు చున్నవి. ఆ యేడుపువిని సహించలేక శోకముతో బానచుట్టు తిరిగినాను. అంతకన్న నేనేమి యెరుగనని చెప్పెను. అప్పుడు చాకలిది, ఈ రోజున అమావాస్య, ఈరోజు మొదలుకొని కధచెప్పి అక్షింతలు వేసికొని దీనికి, కుందేటి అమావాస్య అని పేరు పెట్టుకొని నోము పట్టెదనని నోముపట్టి కథచెప్పుకొని అక్షింతలు వేసుకొనెను. ఈ ప్రకారం పదమూడు అమావాస్యములు నోచుకొని అమావాస్య కొక్కరకము చొప్పున చలిమిడి మొదలైనవి చేసికొని దక్షణ తాంబూలము పెట్టి ముత్తయిదువులకు వాయనమిచ్చెను.

ఉద్యాపనము: మూడు మానికెలబియ్యము చలిమిడిచేసి అది కుందేటి. తల్లిపిల్లలుగాచేసి, చాకలిబానలోని దానిలో పెట్టి చీర రవికెలగుడ్డ, నల్లపూసలు, లకృజోడు, దక్షణ తాంబూలములతో ముత్తయిదువునకు వాయనము యియ్యవలెను.

కథలోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినను ఫలముతప్పదు.

Muppadi Mudu Punnamula Nomu Katha - ముప్పదిమూడు పున్నముల నోము కథ

ముప్పదిమూడు పున్నముల నోము కథ

ఒక బ్రాహ్మణుడు తనకుమార్తెకు వివాహము చేయగా పెండ్లి అయిన మూడవనాడు ఆ బాలిక తన స్నేహితురాలింటికి పేరంటమునకు వెళ్లెను. అంతలో ఆమె భర్త మరణించెను. ఒక రాజు భార్య ముప్పదిమూడు. పున్నముల నోముపట్టి ముత్తెయిదువ నిమిత్తము వీధిగుమ్మము - వద్ద నిలుచుండి ఈ బ్రాహ్మణుని కూతురు ఆదారిని వచ్చుచుండగా చూచి నీవెవరి అమ్మాయవు? అని అడిగెను. ఆ చిన్నది నేను బ్రాహ్మణపిల్లను అని చెప్ప నేను ముప్పదిమూడు పున్నములనోము బట్టినాను వాయన మిచ్చెదను వచ్చెదవా? యని యడిగెను. ఆ చిన్నది ఆలాగే పట్టుకొని వెళ్లెదనియ్యమని యడిగెను. ముప్పదిమూడు ఆకులు, ముప్పది మూడు చెక్కలు, ముప్పది మూడు డబ్బులు, ముప్పదిమూడు నల్లపూసల కోళ్ళు, ముప్పదిమూడు లక్కజోళ్ళు, ముప్పదిమూడు అట్లు, ముప్పది మూడు కట్లజల్లిడ, ముప్పది మూడుజ్యోతులు, చీర రవికెలగుడ్డ క్రొత్త జల్లిడిలో పెట్టి పాతజల్లిడ బోర్లించి రాజుభార్య చిన్నదానికి వాయనమిచ్చెను. ఆ చిన్నది ఆ వాయనమందుకుని జ్యోతులు వెలుగుచుండగా యింటికి బట్టుకొని వెళ్ళెను. ఆ జ్యోతులు వెలుగుచూచి అంతకుముందే మరణించియున్నఆ పిల్ల భర్తలేచి కూర్చుండెను. అప్పుడు అందరు ఏమి నోము పట్టినావని యడిగిరి. ఏమినోము బట్టలేదు రాజుగారిభార్య ముప్పదిమూడు పున్నముల నోము నోచుకొని వాయనమిచ్చిన పట్టుకు వచ్చినానని ఆ చిన్నది చెప్పెను. అప్పుడా చిన్నవాని నిమిత్తము వచ్చిన యమభటులు యమధర్మరాజు వద్దకుపోయి మహారాజా! మీరు తీసుకొనిరమ్మని పంపిన బ్రాహ్మణ చిన్నవాని నిమిత్తము మేము వెళ్ళి తీసుకొని రాబోవు చుండగా అతనిభార్య ఎక్కడనుంచో నోము నోచుకొని వాయనము తెచ్చుకున్నందున వాని ప్రాణములు మాచేత నిలువక తిరిగిబొందిలో
ప్రవేశించినవి. మేమాతనిని రమ్మని బలవంతపెట్టినా వచ్చినాడుకాడని మనవి చేసుకొనిరి.
అప్పుడు యముడుగ్రుడై ఆ చిన్నవాని ప్రాణములు తీయుటకై వచ్చెను. వచ్చి యా బ్రాహ్మణ చిన్నవాని ప్రాణములు తీసికొని చక్కాబోవుచుండెను. అంత నా చిన్నది వాని వెంబడించెను. కొంతదూరము వెళ్ళి ఎమి అమ్మాయీ! వచ్చుచున్నావని యముడడుగగా నాపెనిమిటి ప్రాణముల నిమిత్తము వచ్చుచున్నానని యామె చెప్పెను. అంత నాతడు సీపెనిమిటి ప్రాణముకాక మరియొకటేదియెనా కోరుమని అనెను. నేను ముప్పదిమూడు అట్లు వాయనము తెచ్చుకొన్నాను. ఆ అట్లకు ఎన్ని బొళ్ళలుండునో అన్నివేల యేండ్లు అయిదవతనమియ్యమని యామె కోరెను. యముడు అలాగే యిచ్చినానని వెళ్ళుచుండెను.

ఆ బ్రాహ్మణ చిన్నదియు వాని వెనుకనే వెళ్ళుచుండెను. తిరుగ కొంతదూరమెళ్ళి తిరుగచూచి
అమ్మాయీ! ఇంకను ఏల వచ్చుచున్నావని యముడడుగగా యామె నాభర్త నిమిత్తము
వచ్చుచున్నానని చెప్పెను. అతని ప్రాణములు తప్ప మరేమియెన అడుగమని చెప్పగా- "నాకు యేమి అక్కరలేదు. ముప్పదిమూడు నల్లపూసలకోళ్ళు తెచ్చుకున్నాను. ఆ కోళ్లపూసల కెన్నీ బెజ్జములున్నవో అన్నివేల యేండ్లు నా కయోదోతనము నీయవలయునని యాచిన్నది యడిగెను. అప్పుడామె భక్తికి సంతసించి యట్లే యిచ్చినాను, పుచ్చుకొమ్మని యతని ప్రాణములు విడిచి చక్కాబోయెను. ఆ చిన్నది యింటికి వచ్చేసరికి. పెనిమిటిలేచి కూర్చుండెను. అందరు "ఇదియేమి మహాత్యమమ్మా!" యని యడిగిరి. ఏమీలేదు. నేను ముప్పదిమూడు పున్నముల నోము వాయనము తెచ్చుకున్నాను ఆ ఫలమే యిది. వాయనము తెచ్చుకున్న ఫలమని చెప్పెను. "వాయనమునకు యింత ఫలమున్నది నోము నోచుకొన్న నెంతఫలమో” యని అందరు ముప్పది మూడు పున్నములు ఉపవాసముండి క్రమముగా నుద్యాపనము చేసికొనిరి.

ఉద్యాపనము: ముప్పదిమూడు అట్లు ముప్పదిమూడు ఆకులు, ముప్పది మూడు పోకలు, ముప్పదిమూడు డబ్బులు, ముప్పదిమూడు నల్లపూసలకోళ్ళు, ముప్పదిమూడు లక్కజోళ్ళు, ముప్పదిమూడు జ్యోతులు, చీర రవికెలగుడ్డ, ముప్పది మూడు కన్నుల కొత్తజల్లెడలో పెట్టి పాతజల్లెడ మూతవేసి ముత్తయిదువునకు వాయన మియ్యవలెను.

స్త్రీల వ్రత కథలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...