పూర్వము సోములారి సోమిదేవమ్మ మాఘాదివారముల నోము పట్టి ఐదేండ్లు నియమము పాటించి ఉద్యాపనము దీర్చికొను సమయంబున మాఘపూర్ణిమముందు రధసప్తమినాడు సోములారి సోమిదేవమ్మ పసుపు రాసుకొని స్నానముచేసి పచ్చని యక్షంతలు పట్టుకొని తన కుమారులను పిలిచి "కుమారులారా! నాపాలిట మాఘపాదివారము కథ వినవలయునని కొడుకులను యడిగెను. అంతట నొక కుమారుడు "మాకేమికథ మాకేమి కారుణ్యమమ్మా! రాజుగారు కచేరికివచ్చే వేళయైనది. అక్కడికి పోవలెనని" చెప్పి యట్లు కచ్చేరికి వెళ్ళెను. రాజుగారు అంతకు ముందుగానే కచ్చేరికి వచ్చి యాలస్యముగా వచ్చిన కారణమున యా బ్రాహ్మణుని హెచ్చరించెను. అప్పుడా కుమారుడు "సోములారి సోమిదేవమ్మ కథ వినని దోషము కట్టికుడిపినదని చింతించుచు తన గృహమునకు వెళ్ళెను.
సోమిదేవమ్మ మనుమలను బిలిచి "మనుమలారా! నాపాలిటి మాఘపాదివారముల కథవినెదరా? అని యడుగగా బడికిపోవలెను. పంతులు కొట్టిపోవును" అని చెప్పుచు మనుమలు బడికి వెళ్ళిరి. అంత ప్రొద్దుపోయి రావడమేమని పంతులా బాలురను కొట్టిరి. అప్పుడు చిన్న పిల్లలు సోములారి సోమిదేవమ్మకథ వినని దోషము కట్టికుడిపింది యని యనుకొనిరి.
సోములారి సోమిదేవమ్మ తన కోడలిని బిలిచి "కోడలా! నా పాలిటి మాఘపాదివారము కధ వినెదవా? యని యడుగగా- "నాకేమి కథ? నాకేమి కారుణ్యమమ్మా నాపిల్లలకు పాలు ఉగ్గు పోసికొనవలె"నని కోడలు చెప్పి ఉయ్యాలలో నున్న తన బిడ్డయొద్దకు వెళ్ళి చూచునపుడు ఉయ్యాలలోని బాల కొయ్య బారిపోయెను. అప్పుడా కోడలు "అయో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కళ్ళ కుడిపినద" ని విచారించెను.
తిరిగి సోములారి సోమిదేవమ్మ నీళ్లరేవుదగ్గరకు వెళ్ళి, "నీలాడెడుయక్కలారా! షాలాడెడు యక్కలారా! యని నీళ్లరెవున స్నానము చేయు కాంతలను పిలిచి నా పాలింటి మాఘపాదివారముల కథ వినెదరా?" యని యడిగెను. అప్పుడా స్త్రీలు "మేము నీళ్లుపాలు తెచ్చుకొనవలెనమ్మా!" అని చెప్పి నీళ్ల కడవలు భుజములపై నుంచుకొనబోగానవి విచ్చిపోయినవి. “అయ్యో! సోములారి సోమిదేవమ్మకథ విననిదోషము కట్టికుడిపినదనియు యా స్త్రీలందరు విచారించిరి.
పిమ్మట సోములారి సోమిదేవమ్మ వీధిలోకివచ్చి నిలుచుండగా నొక బ్రాహ్మణు డెదురు గుండా వచ్చెను. అప్పుడా సోములారి సోమిదేవమ్మ బ్రాహ్మణుని పిలిచి "బ్రాహ్మణుడా! నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" అని యడుగగా నా బ్రాహ్మణుడు పంచాంగము చెప్పుకొనవలెనని చెప్పి రాజుగారింటికి వెళ్లేసరికి తలుపులు మూయబడి వెళ్లుటకు వీలులేక పోయెను. అంతట బ్రాహ్మణుడు సోములారి సోమిదేవమ్మ కథ వినని దోషం కట్టి కుడిపిందని విచారించుచు పోయెను.
తరువాత సోములారి సోమిదేవమ్మకు మేదరివాడెదురుగా వచ్చేసరికి నా పాలింటి మాఘవాదివారముల కథ వినెదవా? యని వాని నడుగగా "మాకేమి కథ? మాకేమి కారుణ్యమమ్మా తట్టబుట్టలు నల్లుకోవలె" నని మేదరివాడు వెళ్ళి తట్టలల్లుకొనుచుండగా కత్తివిరిగి పోయినది. "అయ్యో! సోములారి సోమిదేవమ్మకథ వినిన దోషం కట్టికుడిపినదని మేదరివాడు చింతించెను.
పిమ్మట ఉప్పరివాడు కనబడి వానిని పిలిచి "ఉప్పరి నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" యని యడుగవాడు "మాకేమి కథ మాకేమి కారుణ్యమమ్మా! గట్టువుట్ట పెట్టుకొనవలె"నని చెప్పి గట్టువుట్ట పెట్టుకొనుచుండగా పార, గడ్డపార విరిగిపోయెను. "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కట్టికుడిపిన" దని ఉప్పరివాడనుకొనెను.
తరువాత చాకలివాడు యెదురుగా వచ్చుచుండ చాకలి వానిని పిలిచి "చాకలీ! నా పాలింటి మాఘపాదివారములకధ వినెదవా?" యని సోములారి సోమిదేవమ్మ అడిగెను. వాడందుకు "మాకేమికథ? మాకేమి కార్యణ్యమమ్మా! రాజుగారి బట్టలారవేయుటకు పోవలె" నని బదులుచెప్పి ఇంటికిపోగా గాలివానవచ్చి బట్టలెగరకొట్టుకొని వోయినవి. "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషంబు కట్టికుడిపింద" ని యనుకొనెను.
తరువాత కుమ్మరివాడెదురుగా వచ్చెను. అప్పుడు వానిని పిలిచి "కుమ్మరీ! నాపాలింటి మాఘపాదివారముకథ వినెదవా?" అని యడుగ- "నాకేమికథ నాకేమి కారుణ్యమమ్మా! రాజుగారికి వెండిబాన, పయిడిబాన చేయుటకు పోవలె" నని చెప్పి యింటికిపోయి వెండిబాన, పయిడిబాన చేయబోవునప్పుడు కుమ్మరిసాన విరిగిపోయెను. అపుడువాడు "అయ్యో! సోములారి సోమిదేవమ్మ కథ విననిదోషము కట్టికుడిపింద" ని యనుకొనెను.
ఇంతలో నిండు గర్భము ధరించియున్న రమాదేవి ఎచటకో పోవుచు అటు రాగా సోమిదేవమ్మ ఆమెను గూడ పిలిచి "నా పాలింటి మాఘపాదివారములకథ వినెదవా?" యని ఆమె నడిగెను. అప్పుడామె ఇట్లు చెప్పెను "వినెదను, నిన్న శనివారం ఒంటిపూట భోజనము. ఈ రోజు ఆదివారము, మానెడు పాలలో చేరడు బియ్యముపోసి పెట్టిన కథ వినెద" నని చెప్పెను. మంచిదని సోములారి సోమిదేవమ్మ మానెడు పాలలో చేరడు బియ్యముపోసి పెట్టినది. తిని రమాదేవి గట్టుమీదపడుకొని నిదుర పోయినది. ఆమె కడుపులో నున్నపిల్ల సోములార సోమిదేవమ్మతో "మా అమ్మ బొడ్డు మీద నక్షతలువేసి కథ చెప్పుకోవమ్మా! వినెద" నని చెప్పెను. అట్లు బొడ్డుమీద నక్షతలు వేసి సోమిలారి సోమదేవమ్మ
పాడువూళ్లు పాట్నాలవును పట్టి జోజో - పాపా జోజో
ఎండిమ్రాను పండ్లు పండ్లు పట్టి జోజో - పాపా జోజో
పట్టావులు పాలనిచ్చు పట్టి జోజో - పాపా జోజో
గొడ్దువాండ్రూ బిడ్డలగందురు పట్టి జోజో - పాపా జోజో
వేచి వేసినా వేయివేలే పండ్లు పట్టి జోజో - పాపా జోజో
కోసివేసినా కోటివేల పువ్వులు పట్టి జోజో - పాపా జోజో
కోసివేసినా కోటివేల పండ్లు పట్టి జోజో - పాపా జోజో
ప్రత్తిగింజలు ముత్యాలౌను పట్టి జోజో - పాపా జోజో
చచ్చిన పురుషుడు లేచివచ్చును పట్టి జోజో - పాపా జోజో
ఏడువారలనగలూ నట్టేటలోపడినా నట్టింటికివచ్చును పట్టి జోజో-పాపాజోజో
అని పాడుచు కథ చెప్పుకొనెను.
నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ! నీవు నిద్రలో యుండగ నీ కడుపుననున్న బిడ్డ నా నోముకథ వినినది. నీకు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన గురియును. ఆడబిడ్డ పుట్టిన ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడవచ్చెదను. మి ఇంటి గుర్తులు చెప్పుమని తెలిసికొని యామెను తిరిగి పంపెను.
కొంతకాలమునకు ముత్యాలవాన కురియగ సోమిదేవమ్మ రమాదేవికి స్త్రీ శిశువు కలిగినట్లు తెలిసికొని ఊయల చీర, ఉగ్గుగిన్నె తీసుకొనిపోయి పురిటిబిడ్డకు నీళ్ళుపోసి ఉగ్గుపెట్టి, చీరని నశ్వత్థవృక్షము కుయ్యలవేసి, "పక్షులారా! పాడండి. వృక్షవరులారా! ఊపండి" అని జోలపాడి, దీవించి, పాడియావునిచ్చి యింటికి వచ్చెను. రమాదేవి గట్టుపుట్ట పెట్టుకొనుటకువోగా పెంచినతల్లి యింటికి వచ్చినది పక్షులు ఆనందముగ పాడుచుండెను. వృక్షములూగ్గుచున్నవి.
ఒక రాజు సవారీ యెక్కి యామార్గమున బోవుచు పక్షులపాటయు, బాలరోదనమువిని యది యేమియో కనుగొనమని తన పరిచారకునితో చెప్పెను. వాడు "వెరచి చెప్పుదునా? వెరువక చెప్పుదునా" అని అడుగ రాజు "వెరువక చెప్పు" మనెను, అప్పుడు వాడు మహారాజుగారి తో "మాకయినమాత దేవరకయిన దేవీ” అని చెప్పెను. అంతట మహారాజు తనవారి నా యశ్వత్ణ వృక్షసమీపమునకు పట్టించి యా బాలను తనపల్లకీలో నుంచుకొని పాడువూరిలోనికి తీసుకొనివచ్చినాడు. ఆపాడు గ్రామము గొప్ప పట్టణమై కడు అందముగా నొప్పుచుండెను. అంత "యిదేమి చోద్యముగంటిని అక్కా!" అనెను. తరువాత నాబాలను ప్రత్తిగింజలలో పరుండబెట్టి పైని ప్రత్తిగింజలే కప్పినారు. యా బాల శరీర స్పర్శకు ప్రత్తిగింజ లన్నియు ముత్యము లయినవి. "యిదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. వేయించి వేయగా వేపవేలుపండినవి. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. కోసివేయగా కోటివేలుండెను. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" యనెను. మాడ్చివేయగా నూరువేలు పండినది. "ఇదేమి చోద్యము గంటిని అక్కా!" అనెను. వట్టయావును తీసుకొనివచ్చి కట్టి పెట్టినను. పాలు యిచ్చినది. "ఇదేమిచోద్యము గంటిని అక్కా!" అనెను. వట్టి మ్రాను తీసుకొనివచ్చి పాతిపెట్టగా పండ్లు పండెను. "ఇదేమి చోద్యముగంటిని అక్కా!" యనెను. రాజు పసిపాపను చూచి ఆమె మాహాలక్ష్మి అంశముగల చిన్నది. రాజాంతఃపురములలో నుండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవి వచ్చినదాక కాచుకొనియుండి. "అమ్మా! నీవింక మా రాజభవనమున నుండవచ్చునని తనవెంట గొనిపోయెను. రాజుగారి పెద్దభార్య యొద్దకు ఆ పిల్లను తీసుకొనిపోగా నామెకు కొడుకుపుట్టెను. "ఇదేమి చోద్యము అక్కా!" అనెను.
కొన్ని దినములకా పాప పెరిగి పెద్దదైనది. ఒక రాజకుమారుడామెను ప్రేమించి రెండవభార్యగ వివాహమాడి అనురాగముగా చూచుచుండెను. రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే రమాదేవి కుమార్తె ఉప్పరమాదేవి యొక్క ఏడు వారముల నగలు అపహరించి,యొక బరిణిలోనుంచి ఆ బరిణి సముద్రంలో బారవేయగా దానినొకచేప మ్రింగెను. పల్లెవాడొకడు వలవేయగా నాచేపవానికి దొరికెను. అపుడు పల్లెవాడా చేపను రాజుగారికి కానుకగా పంపించెను. తిన్నగా నా చేపను రాజుగారి పెద్దభార్య గృహమునకు పట్టుకొనిపోయి ఇచ్చిరి.
రాజుగారు పెందలకడ వంటచేయవలసినదనియు భోజనమునకు వచ్చెదననియు తన పెద్దభార్యకు వర్తమానము చేసెను. అంతట "నగ నాణము దానికిని చేత బెల్ల నాకు" యని చేపను ఉప్పరమాదేవి కి పెద్దభార్య పంపివేసినది. ఉప్పరమాదేవి "మంచికూర వచ్చినదిని కత్తి పీట ముందరవేసుకొని తరగబోయే సరికి ఘల్లున చేప కడుపులో నుంచి నగల బరిణె పడినది. "నాపాలిటి మహాలక్ష్మీ నా యింటికి వచ్చిన"ది. పాలచేతకడిగి పళ్లెములో పెట్టుకొని ఉప్పరమాదేవి యెడువారాల నగలుధరించి పద్మాల పట్టుచీర కట్టుకొని “రాజుగారిని భోజనమునకు రమ్మని కబురుచేసినది. "నగులుపోతే నగలు తెచ్చుకొన్నది. నేపోయిన తిరిగి నన్నేలాగున తెచ్చుకొనునో చేతముగాక!" అని ఉప్పరమాదేవి యింట్లో భోజనముచేసి పెద్దభార్య యింట్లో విషముతిని చనిపోయెను.
అప్పుడు చచ్చిన పురుషుని నట్టింట పరుండబెట్టి పెద్దభార్య తన సవతిని సహగమనమునకు రమ్మని పిలిచినది. సవతియగు ఉప్పరమాదేవి పసుపుకలిపి పళ్లెరములో పోసికొని కుంకుమ కొని కుదురు మీదపెట్టుకొని తలుపున తడకవెసి వెళ్ళుచున్నది. అప్పుడాదినారాయణ మూర్తి ఆమెకు ప్రత్యక్షమై "ఎమమ్మా! ఎక్కడకు వెళ్ళుచున్నావు?" అని అడిగెను. “చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు సవతి సహగమనము చేయుచున్నది, రమ్మని కబురు పంపించినారు. పసుపుకొని పళ్లెరములో పోసికొని, కుంకుమకొని కుదురుమీదపెట్టుకొని తలుపున తడకవేసి తొందరగా వెళ్లుచున్నాను అని ఉప్పరమాదేవి చెప్పెను" అప్పుడాయన "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు నాకు కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుయిచ్చి నీవుకూడా కాళ్లు కడుగుకోవమ్మా" అని పలికినాడు ఆమెయు నా బ్రాహ్మణవేషముతో వచ్చిన నారాయణ మూర్తికి కాళ్ళుకడుగుకొనుటకు నీళ్ళుయిచ్చి తానుకూడా కాళ్లు కడుగుకున్నది.
తిరిగి యా బ్రాహ్మణుడు- "నాకు దాహమిచ్చి నీవుదాహముపుచ్చుకోవమ్మా!" యని చెప్పినాడు. "చచ్చిన పురుషుడు నట్టింటయున్నాడు. సవతిసహగమనము చేయుటకు వెళ్లుచున్నది. పసుపుకొని పళ్లెములో పోసినాను, కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపుతడక వేసినాను. కాళ్ళుకడుక్కొని కాళ్లుదాచినాను, దాహమెక్కడ దాచనయ్యా!" అని యుప్పరమాదేవి చెప్పెను. అప్పుడా బ్రాహ్మణుడు "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు దాహమిచ్చి నీవు దాహము పుచ్చుకోవమ్మా!" అని చెప్పెను. ఆ ప్రకార మా బ్రాహ్మణునికి దాహమిచ్చి తానుకూడా దాహము పుచ్చుకొన్నది.
తరువాత నా బ్రాహ్మణుడు "నాకుతలయంటి నీవుకూడా తలయంటుకోవమ్మా!" అని చెప్పెను.
"చచ్చిన పురుషుడు నట్టింటయున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపు
పళ్లెములో పోసినాను. కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపున తడక వేసినాను. కాళ్లు కడుగుకొని కాళ్లుదాచినాను. దాహము త్రాగి దాహముదాచినాను. తలయంటుకొని తలయెక్కడ దాచనయ్యా!" అనెను. "సౌభాగ్యవతీభవ! అంతపనిపట్టరాదు. నాకు తలయంటి నీవు కూడా తలయంటుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు పల్కినాడు. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి తలయంటి తానుకూడా తలయంటుకొనినది.
"చచ్చిన పురుషుడు నట్టింటయున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపు
పళ్లెములో పోసినాను. కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపున తడక వేసినాను. కాళ్లు కడుగుకొని కాళ్లుదాచినాను. దాహము త్రాగి దాహముదాచినాను. తలయంటుకొని తలయెక్కడ దాచనయ్యా!" అనెను. "సౌభాగ్యవతీభవ! అంతపనిపట్టరాదు. నాకు తలయంటి నీవు కూడా తలయంటుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు పల్కినాడు. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి తలయంటి తానుకూడా తలయంటుకొనినది.
తరువాత నా బ్రాహ్మణుడు నామెను అడిగిన దేమనగా, తనకు గంధమిచ్చి యామెను పసుపు పూసుకోమనెను. చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసువుకొని పళ్లెములోపోసినాను. కుంకుమకొని కుదురు మీద పెట్టినారు. తలుపున తడక వేసినారు. కాళ్లు కడుగుకొని కాళ్ళుదాచినాను. దాహముపుచ్చుకొని దాహము దాచినాను తలయంటుకొని తలదాచినాను. పసుపు రాసుకొని మొగమెక్కడ దాచనయ్యా? అని యామె జవాబు చెప్పెను. "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు గంధమిచ్చి నీవు పసుపు రాసుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు తిరిగిచెప్పెను. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి గంధమిచ్చి తానుకూడా పసుపు రాసుకోనినది.
తరువాత నా బ్రాహ్మణుడు-"నాకు బొట్టునిచ్చి నివు బొట్టుపెట్టు కోవమ్మా!" యని చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పళ్లెములో పోసినాను. కుంకుమకొని కుదురుమీద పెట్టినాను. తలుపున తడక వేసినాను. కాళ్లు కడుగొని కాళ్లుదాచినాను దాహము పుచ్చుకొని దాహము దాచినాను. తలయంటుకొని తలదాచిననాను. పసుపురాసుకొని మొగము దాచినాను. బొట్టు పెట్టుకుని బొట్టెక్కడ దాచనయ్యా! అనెను. "సౌభాగ్యవతీ భవ! అంతపని పట్టరాదు. నాకు బొట్టిచ్చి నీవు బొట్టుపెట్టుకోవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారము బ్రాహ్మణునికి బొట్టునిచ్చి తానుకూడా బొట్టు పెట్టుకొనెను.
తిరిగి ఆ బ్రాహ్మణుడు - "నాకు భోజనముపెట్టి నీవు భోజనము చేయవమ్మా!" అని యామెతో చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పళ్ళెములోపోసినాను. కుంకమకొని కుదురుమీద పెట్టినాను. కాళ్ళుకడుకొని కాళ్లుదాచినాను. దాహము పుచ్చుకొని దాహము దాచినాను, తల యంటికొని తలదాచినాను, పసుపురాసుకొని పసుపుదాచినాను, బొట్టు పెట్టుకొని బొట్టు దాచినాను, అన్నము తిని కడుపెక్కడ దాచనయ్యా?" అని యామె చెప్పెను. "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు భోజనముపెట్టి నీవు భోజనము చేయవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారము బ్రాహ్మణునకు భోజనముపెట్టి తాను కూడా భోజనముచేసెను.
అప్పుడా బ్రాహ్మణుడు "నాకు తాంబూలమిచ్చి నీవుకూడ తాంబూలమువేసి కోపమ్మా!" అని చెప్పెను. "చచ్చిన పురుషుడు నట్టింటనున్నాడు. సవతి సహగమనము చేయుచున్నది. పసుపుకొని పల్లెములోపోసినాను కుంకుమ కొని కుదురుమీద పెట్టినాను. కాళ్ళుకడుగుకొని కాళ్లుదాచినాను, దాహము పుచ్చుకొని దాహము దాచినాను, తలయంటుకొని తలదాచినాను. పసుపురాసుకొని పసుపుదాచినాను, బొట్టు పెట్టుకొన బొట్టుదాచినాను. అన్నముతిని అన్నముదాచినాను, తాంబూలము వేసుకొని నోరెక్కడ దాచనయ్యా?" అని అమె చెప్పెను. "సౌభాగ్యవతీభవ! అంతపని పట్టరాదు. నాకు తాంబూలమిచ్చి నీవుకూడా తాంబూలము వేసుకొనవమ్మా!" అని బ్రాహ్మణుడు పలికెను. ఆ ప్రకారమా బ్రాహ్మణునికి తాంబూలమిచ్చి తానుకూడా తాంబూలము వేసుకొనెను.
అది చూచి అక్కడున్నవారంతా ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివమ్మాయని అడిగిరి. "ఏమినోము పట్టలేదు. ఏమి వ్రతము పట్టలేదు. మాఘపూర్ణిమ ముందర రధసప్తమినాడు మాఘపాదివారముల నోముపట్టి సోములారి సోమిదేవమ్మ కథ చెప్పుకొని యక్షంతలు వేసుకొన్నది. ఆ కధ నేను విన్నాను విన్నఫలమేకాని పట్టిన ఫలముకాదది" అని యామె చెప్పెను. “విన్నంత మాత్రాన ఇంతఫలము వచ్చినది. నోము పట్టిన యెంతఫలము వచ్చునో" యని రాజు తన యిద్దరి భార్యలచేతను నోముపట్టించినాడు.
ఉద్యాపనము: తలయంటుకొనని సంవత్సరము అయిదుగురు ముత్తయిదువులకు తలంటి, పప్పుతినని యేడు బూరెలువండి, పాలు త్రాగనియేడు పరమాన్నమువండి, చల్లత్రాగనియేడు పెరుగువడ్డంచి, తాంబూలము వేసుకొనని యేడు తాంబూలమిచ్చి యీ ప్రకారము అయిదుగురు ముత్తయిదువులకు అయిదు రవికెల గుడ్డలనిచ్చి ఆదినారాయణమూర్తికి యిదుమూళ్ళ అంగవస్త్రమిచ్చి వుగ్గునకు గిన్నెయు, వుయ్యెలకు చిరయునిచ్చి యుద్యాపనము చేసికొనవలెను.
వారు పట్టిన నోమే కలిగియుగ మందలి యందరూ పట్టినారు. నోముపట్టిన సంవత్సరము పాలు త్రాగరాదు. మరుసటి సంవత్సరము మజ్జిగ త్రాగరాదు. మూడవ సంవత్సరము పప్పుతినరాదు. నాలుగవయేడు తలంటుకోరాదు. అయిదవయేడు తాంబూలము వేసికొనరాదు. అయిదేండ్ల అనంతరము ఉద్యాపన చేయవలెను.
ఉద్యాపనము: తలయంటుకొనని సంవత్సరము అయిదుగురు ముత్తయిదువులకు తలంటి, పప్పుతినని యేడు బూరెలువండి, పాలు త్రాగనియేడు పరమాన్నమువండి, చల్లత్రాగనియేడు పెరుగువడ్డంచి, తాంబూలము వేసుకొనని యేడు తాంబూలమిచ్చి యీ ప్రకారము అయిదుగురు ముత్తయిదువులకు అయిదు రవికెల గుడ్డలనిచ్చి ఆదినారాయణమూర్తికి యిదుమూళ్ళ అంగవస్త్రమిచ్చి వుగ్గునకు గిన్నెయు, వుయ్యెలకు చిరయునిచ్చి యుద్యాపనము చేసికొనవలెను.
No comments:
Post a Comment