Thursday, September 4, 2025

sri Shodashi Devi Vupasana Vidhanamu - శ్రీషోడశీ దేవి ఉపాసనా విధానము

శ్రీషోడశీ దేవి ఉపాసనా విధానము 

దశమహావిద్యలలో మూడవ మహా విద్య శ్రీషోడశీ దేవి. అరుణా రుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశి మాతకే, లలితాదేవి, మహా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, శ్రీవిద్య అని చాలా పేర్లున్నాయి. భండాసుర వధకోసం అమ్మ అవతారం ఎత్తింది. అమ్మవారు చాలా ప్రశాంతంగా, చిరు మందహాసంతో వీరాసనంలో కనిపిస్తుంది. చేత పుష్పబాణములు, చెఱుకు విల్లుతో రమాదేవి ఇంకా వాణీదేవి వింజా మరలు వీస్తుండగా శివ కామేశ్వరుడితో పాటుగా, తన సంతానమైన బాలాత్రిపురసుందరి మరియు గణపతి ఇరువైపులా ఉండగా, బ్రహ్మ, నారాయణుడు, రుద్రుడు, షణ్ముఖుడు ఇలా పరివార దేవతలతో అమ్మవారు దర్శనమిస్తారు. 

త్రిపురసుందరి అంటే సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం లేదా ఆకాశమండలం అనే మూడు పురాలలో అత్యంత సౌందర్యవతి అని అర్థం. భక్తులు త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఈమె ఆదిమహావిద్యగా పేరుగాంచినది. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాల నుంచి విముక్తి కలిగి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి అని విశ్వాసం.

శ్రీ బ్రహ్మాండ పురాణం ప్రకారం అమ్మవారు చితాగ్నికుండము నుండి ఉద్భవించింది. పూర్వం మన్మధుడి చితాభస్మం నుండి రుద్ర గణములు ఒక రాక్షషాకృతి తయారుచేసారు. కైలాసంలో అప్పుడు శివ దర్శనార్దం వచ్చిన బ్రహ్మదేవుడు బొమ్మని చూసి భండా భండా అని అంటాడు. బ్రహ్మ దేవుడి మాటలకి అర్ధం వికృతాకారం గల అసురుడు అని. అలా భండాసురుడు జన్మించాడు. అతడికి పాంచభౌతిక శరీరం లేదు కనుక చంపడం కూడా కష్టమే. ఈ విషయం తెలిసిన ఆ అసురుడు మునులని, దేవతలని పీడించ సాగాడు. అప్పుడు సకలదేవతలు చితాగ్ని కుండానికి తమతమ శక్తులు ధారపోయగా అమ్మవారు నాల్గుభుజాలతో సింధూరవర్ణ దేహఛాయతో
సకలాభరణాభూషిత అయి వెలుబడింది. అమ్మవారిలో చంద్రుడిలో ఉండే షోడశకలలు పరిపూర్ణంగా కనిపించడంతో అమ్మవారిని మునులు షోడళి అని స్తుతించారు. అలా ఆవిర్భవించిన అమ్మవారు నేరుగా మణిద్వీపానికి వెళ్లి కామేశ్వరుడి ఆజ్ఞతో కామేశ్వరుడి పాశాంకుశలు పుండరీక్షుచాపాన్ని పంచపుష్పబాణాలని ఇచ్చి తన దేవేరిగా శ్రీచక్రానికి అధిష్టాత్రిగా చేసి వశిన్యాది వాగ్దేవతలతో భండాసురుడి పై యుద్దానికి వెళుతుంది.

భండాసురుడు తన అసురసైన్యాలను వాగ్దేవతలపైకి పంపుతాడు అప్పుడు అమ్మవారు భండాసురుడికి పాంచ భౌతిక దేహాన్ని కూడా మాయావల్ల సృష్టిస్తుంది. భండాసురుడు విజ్ఞ యంత్రాన్ని సృష్టిస్తాడు. దాని ప్రభావం వల్ల వాగ్దేవతలలో ఒక్కరితో ఒకరు తల పడుతున్నారు. దానిని చూసి అమ్మవారు స్వామి వారివైపు చూడగా వారిచూపుల ల వల్ల గణపతి పుట్టి  విజ్ఞ యంత్రాని చిన్నాభిన్నం చేస్తారు. ఈ విషయాన్నే లలితాసహస్త్రనామ స్తోత్రంలో స్పష్టంగా చెబుతారు. కామేశ్వర ముఖాలోల కల్పిత శ్రీ గణేశ్వరణ అని. తర్వాత అమ్మవారు భండాసురుడిని చంపేస్తుంది. 

బ్రహండ పురాణంలోని అగస్య మహర్షి మరియు హయగ్రీవస్వామి సంవాదంలోని అమ్మ వారి వేయి నామాలే శ్రీ లలితా సహస్రనామ సోత్రం గా ప్రసిద్ది చెందాయి. శాక్తేయుల తాంత్రిక పరంపరలోని శ్రీ విద్యకు ఈమె అధిదేవత. శ్రీ పురము ఈమె నివాసం. వివిధ రకాల లోహాలతో చేయబడిన 25 పురములతో మహాద్భుతముగా ఉంటుంది శ్రీ పురము.

భోగ, మోక్షప్రదాయిని
పార్వతీదేవి యొక్క ముగ్ద మోహనమైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోడానికి సాధకులు షోడశాక్షరీ (16 అక్షరాలుకల) మంత్రాన్ని జపిస్తారు. ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి అని అంటారు.

షోడశీ గాయిత్రి 
ఓమ్‌ ఐం త్రిపురాదేవ్యై విద్మహే 
క్లీం కామేశ్వయై ధీమహి
సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్‌!


శ్రీ షోడశీ దేవి మూల మంత్రం

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః - ఓం హ్రీం శ్రీం - క ఏ ఈ ల 
హ్రీం

హ స క హ ల హ్రీం - స క ల హ్రీం - సౌః ఐం 
క్లీం
 హ్రీం శ్రీం

పరమశాంతి స్వరూపిణి
పరమశాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమా తిథి ప్రీతిపాత్రమైనది. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపా సిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి
మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. ఈమెను తాంత్రిక పార్వతి అని కూడా అంటారు. అమ్మ త్రిభువన సౌందర్య రాశి.

16 ఏళ్ళ అందమైన రూపం
పార్వతిదేవి కాళీ రూపం వదలి గౌరీదేవి రూపం దాల్చిన తరువాత కూడ శివుడు గౌరీదేవిని కాళీ అని ప్రస్థావించసాగాడు, ఆ పిలుపు విని గౌరీదేవి శివునిపై అలిగి “సుమేరు పర్వతం”కు వెళ్ళి ధ్యానం చేయసాగింది. శివుడు పార్వతి దేవి ఎటు వెళ్ళినదో తెలియని వాడై కలవర పడసాగాడు. అదే సమయంలో నారద మునీంద్రుడు శివుని వద్దకు వచ్చి జరిగినది తెలుసుకుని మిక్కిలి సంతోషించి వారి మధ్య దూరం పెంచుటకు పార్వతిదేవి వద్దకు పోయి శివుడు వేరే యువతిని మోహించెను అని చెప్పగా, పార్వతీదేవి ఎంతో ఆగ్రహంతో 16 ఏళ్ళ అందమైన యువతి రూపంలో శివుని వద్దకు వెళ్ళగ అక్కడ తన నీడను చూసి పరమ శివుడిపై మరింత ఆగ్రహించింది. శివుడు పార్వతిదేవిని గుర్తించి అది నీ నీడే అని చెప్పగా అది విని పార్వతిదేవి శాంతించింది. ఈ అవతారమే త్రిపురసుందరీ అవతారం.

కోరిన కోర్మెలకన్నా అధికంగా ఇచ్చే మాత
మొత్తం దశమహావిద్యలలో ఈమె మహాసౌందర్యవతి. ఈమె 16 కళలను కలిగి ఉంటుంది. ఈమె మంత్రంలో 16 బీజాక్షరాలు ఉంటాయి. ఈమె అవయవాలు ఉదయిస్తున్న సూర్యునిలా ప్రకాశిస్తుంటాయి, ఈమెకు 8 నేత్రాలు, 4 హస్తములు ఉంటాయి. ఈమె హస్తాలలో ధనుర్భాణాలు
ఉంటాయి. ప్రశాంతంగా వెల్లికలా పడుకుని ఉన్న శివుని శరీరంపై ఉన్న ఒక కలువ పువ్వులో ఆమె కూర్చుని ఉంటుంది. ఈమె మిక్కిలి కరుణామయి, తన భక్తులు కోరినవాటి కంటే ఎక్కువగా ఇస్తుంది. ఈమె యొక్క మహత్యము వివరించుటకు వేదాలకు కూడా శక్తి చాలదు అంటారు.

అమ్మవారు స్వామి వారు కూర్చునే పంచప్రేతా మంచం గురించి చెప్పుకోవాలి. ఇదే ఒక విశిష్టమైన మంచం. దీనికి కోళ్లుగా బ్రహ్మ, మధుసూదనుడు, రుద్రుడు, శంకరుడు ఉండగా, సదాశివుడు మంచం పలకగా ఉంటారు. దీనిపై స్వామి వారు పద్మాసనం వేసుకొని కూర్చుంటే అమ్మవారు స్వామి వామాంఖం పై కూర్చొని ఉంటుంది.

దక్షిణాచారంలోనే పూజలందుకొనే అమ్మ
ఈ అమ్మవారు దక్షిణాచారంలోనే పూజింపబడుతుంది. ఏ అమ్మవారికి లేని విధంగా ఈ అమ్మవారు నిత్యం మణిద్వీపంలో 64 ఉపచారాలు వశిన్యాది వాగ్దేవతలతో చేయించుకుంటుంది. ఈ అమ్మవారికి వాణి, లక్ష్మి దేవతలు నిత్యం చామరాలతో వీస్తూ ఉంటారు.

నిత్యం అమ్మవారిని కుంకుమార్చన లతో ఎవరైతే పూజిస్తారో వారికి సూర్యది నవ(గహాల దోషాలు పూర్తిగా తొలగి పోయి సువాసినీలకు నిత్య సౌభాగ్యం వరప్రసాదంగా ఇస్తుంది. కామేశ్వర, కామేశ్వరి అని తలిస్తే చాలు అమ్మవారు ఎంతో ప్రసన్నం అవుతుందంటే అమ్మ వారి మహిమ గురించి చెప్పనక్కర్లేదు.

పూర్వం భండాసురుడు (మన్మధుడి చితాభస్మం నుండి ఉద్భవించిన వాడు) సకల లోకాలలో అరాచకం మొదలు పెట్టాడు ఆ దానవుని చంపడానికి లలిత త్రిపుర సుందరి = చితాగ్నికుండం నుండి ఉద్భవించింది. వాడిని చంపడం జరిగింది. తన తండ్రిని చంపిన లలిత దేవి మీద భండాసురుడి పుత్రులు ఆయుధాలతో ముందుకు రావడం చూసి ముందుకు ఒక్క అడుగువేసి మరల తిరిగి వెన్నకి తగ్గింది ఎందుకంటే యుద్ధంలో చిన్నపిల్లలను చంపడం తగదు అను యుద్ధనీతి గుర్తించి వెనక్కి తగింది. కానీ లోక కంఠకులను వదిలేయడం కూడా మంచిది కాదు అని అమ్మవారు ఒక్క అద్భుత ఘట్టం ప్రారంభించింది. అమ్మవారి నుండి ఒక్క శక్తి పుంజం వెలుబడి సకల దేవతల సమక్షంలో అందరు నమస్మరించగా ఒక చిన్న పసిపాప సకలాభరణ భూషిత అయి నాలుగు చేతులు గలిగి పుస్తక, జపమాల, అభయ వరద హస్తాలతో తెల్లని పద్మం ఆసనంగా చేసుకోని హంసలు లాగుతున్న రథము ఎక్కి రణరంగానికి వచ్చి భండాసురుడి పుత్రులనూ వధిస్తుంది.

మణిద్వీప ప్రవేశానికి అమ్మవారే కారణం
అమ్మవారు బాల రూపాని ధరించి మనలను తరింప చేస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎవరు చేస్తారో వారికీ సకల దేవతలా అనుగ్రహంతో పాటు అంత్య కాలంలో మణిద్వీప ప్రవేశం కలుగుతుంది.

అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలీక. పిల్లలు చాలా తేలీకగా ప్రసన్నులవుతారు. అలాగే అమ్మ వారుకూడా నవరాత్రులలో కానీ నిత్యం కానీ కనీసం వారంలో శుక్రవారం కానీ బాలపూజ చేస్తే తప్పక అమ్మవారు ప్రీతి చెంది సకల ఐశ్వర్యసంపదలను కురిపిస్తుంది అంటారు. కనుకనే శుక్రవారం ఇంటికి ఆడపిల్ల వస్తే నోరు తీపిచేయ్యాలని అంటారు.

శ్రీ విద్యలో ప్రప్రధమంగా బాలమంత్రానే ఉపదేశిసిస్తారు. బాల ఉపాసన గురించి ఎన్ని చెప్పిన తక్కువే. అందరి దేవతల అష్టోత్తర శత నామావళికి 108 నామాలు ఉంటే బాల అష్టోత్తరంలో 111 నామాలు ఉండటం విశేషం.

సర్వం శ్రీ బాల త్రిపుర సుందరి చరణార విందార్చణమస్తు.
నిత్య కళ్యాణి కామేశ్వర కామేశ్వరి మనోగ్ని నమోస్తు.


షోడశి మంత్రము
అమ్మకు అనంత రూపాలు, ఉపాసించే విధానాలు వేర్వేరు. మన సంస్కృతి ఉపాసనతో కూడుకుని
ఉంది. “చరమే జన్మని శ్రీ విద్యయా” శ్రీవిద్య ఉపాసన చేసిన వారికి మరోజన్మ ఉండదు. ఈ జన్మే చివరి జన్మ కాగలదు. శ్రీవిద్యోపాసనతో బాల, పంచదశ, షోడశి, మహాషోడశి అను విశిష్టమైన మంత్ర
ములను ప్రతిరోజూ స్మరించడం ద్వారా మంత్ర సిద్ధి, కామ్య సిద్ధి, ఇహపర మోక్షం కలుగుతుందని పురాణాలు, శాస్త్రాలు, పండితులు, దేవి ఉపాసకులు చెబుతున్నారు. శ్రీవిద్య స్వరూపానికి యంత్ర రూపమే శ్రీచక్రం. శ్రీవిద్య ఉపాసకులకు శ్రీచక్ర పూజ, అర్చన ఎంతో ప్రాధాన్యమైంది. శ్రీచక్రం 
అనేక దేవతల స్వరూపం. శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. దాన్నే దేవీ స్వరూపం అంటారు. భూపురత్రయం, వృత్తిత్రయం, షోడశదళ కమలం, అష్టదళ కమలం, చతుర్ధశారం, అంతర్ద శారం, బహిర్దశారం, అష్టారం, త్రికోణం, బిందువ అను ఆవరణలు ఉంటాయి. ఇందులో 9వ ఆవరణం బిందువ శ్రీచక్రంలో మధ్యస్తంగా ఉంటుంది.

శివుని వైభవం చెప్తూ నర్వజ్ఞుడని, త్రినేత్రుడని అనాది జ్ఞాన స్వరూపుడిగా స్వతంత్రుడిగా అలుప్త, అనంత శక్తి అని సూర్యభగవానుని శక్తులను ప్రస్తావిస్తారు. సూర్యుడే ప్రళయకాలంలోని శివుడు
కావున ఈ పంచవక్త్ర  శివుని శక్తినే షోడశి అంటారు. సూర్యకళే సావిత్రి, గాయత్రి కావున త్రిపుర సుందరిగా చెప్పుకున్న 
భూః, భువః, సువః అను ఈ మూడు పురములే బ్రహ్మ పురములు మరియు 'మహాశక్తిపురములు”. ఈ మూడు పురములు మూడు శక్తులు, మూడు స్వరూపములతో ప్రకా శించే వారినే రాజరాజు అని అంటారు. రంజింప చేసేవాడు “రాజు”. నక్షత్రాలు, గ్రహాలు ప్రకాశించేవి కావున అవి రాజులు. దుఃఖంతో కర్మలను నశింపచేసి, పాపాల్ని పోగొట్టి సంతోషాల్ని కలిగించేవి గ్రహాలే. ఈ విధంగా గ్రహాలు, నక్షత్రాలు రాజులైతే సూర్యుడు రాజరాజు. సూర్యుడు ప్రళయ కాలంలో తమోరూప శివుడు కావున శివుడిని రాజ రాజు అని పేర్కొంటారు. శివుని అర్థాంగి పార్వతి కావున ఆమెనే అతని శక్తిగా 'రాజరాజేశ్వరీ'గా వ్యవహరిస్తారు. ఈమెను శివ- రాజరాజేశ్వరీ, త్రిపుర, సావిత్రీ, గాయత్రీ అను నామాలతో వ్యవహరిస్తూ ఈ విధంగా స్తుతి చేస్తారు.

బాలార్కమండలా భాసాం చతుర్భాహాం త్రిలోచనాం ।
పాశాంకుశ శరాన్‌ చాపం ధారయన్తీమ్‌ శివాం భజే ॥


రాజరాజేశ్వరీ దేవిని సేవిస్తే వాక్కు మనస్సు, ప్రాణము మూడు తేజోవంతమవుతాయి. 

త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగి పోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.

షోడశ విద్యకు అధిష్టాన దేవత
త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాలత్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్య వారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగ్భత్‌, స్వప్న, సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. మాత ఆత్మ స్వరూపురాలు ఈ మాతను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా  చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్చ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది. సాక్షాత్‌ ఆది పరాశక్తి, ముల్లోకాలకి సుందరి కావున 
త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావున  షోడసి అని వ్యవహరిస్తారు.

సకల ఐశ్వర్య ప్రదాయిని లలితా త్రిపుర సుందరి
పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకా తీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకు శాలను ధరించిన రూపంలో, కుడి వైపున సరస్వతి దేవి, ఎడమ వైపున లక్ష్మీదేవి సేవలు చేస్తు ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. 

అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుడిని వధించే కార్యంలో, అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు “కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి” అనే నామం ఏర్పడింది.

త్రిమూర్తులచేత పూజింపబడిన మాత
ప్రాచీనకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజింపబడింది కనుక ఈ దేవి త్రిపురగా ప్రసిద్ధి చెందినది. త్రిపురారి అయిన పరమేశ్వరుని భార్య కనుక ఈమె త్రిపురసుందరిగా పూజింపబడుతుంది.

మోక్ష దాయకాలైన ఏడు క్షేత్ర ములలో కంచి క్షేత్రం ఒకటి. ఒక సారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి, కామాక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా, మహర్షి ఆయనకు నమస్కరించి “పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గము ఏదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా” లోక కల్యాణార్థం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు. దానికి హయగ్రీవుడు “మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే” అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్తుడికి వివరముగ తెలియచేస్తాడు.

షోడశి ఆరాధన
షోడశి సాధనను. ఆనందం కోసం, విముక్తి 
కోసం చేస్తారు. షోడశి రూపంలో ఉన్న త్రిపుర సుందరి సాధన శరీరం, మనస్సు మరియు భావోద్వేగాలను నియంత్రించడానికి బలాన్ని అందిస్తుంది. కుటుంబ ఆనందం, అనుకూలమైన జీవిత భాగస్వామి మరియు శక్తి కోసం షోడశి సాధన చేస్తారు.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. 

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం ఉన్నాయి. ఈ దేవతకి ఉన్న మూడు రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్దాంతము కలదు. భాస్మరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో దర్శనమిస్తుంది.

స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.

సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.

శ్రీ చక్రంలో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

ఇఛ్చా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి.

జ్ఞాన శక్తి: జ్యేష్టాదేవి, విష్ణువు యొక్క దేవేరి.

క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి.

ఇవన్నీ సాక్ష్యాత్‌ అంబికా దేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్ధము. సృష్టి, స్థితి లయలు దేవి యొక్కఆటలుగా చెప్పబడతాయి. 

ఈ మాత శ్రీ విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార స్వరూపిణి ! కుంకుమతో నిత్య పూజ చేసె సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమ అర్చన, లలితా అష్టోత్తరములతో అమ్మని అమ్మని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసినులకు పూజచెయ్యాలి.

ఈ దేవి నివాసస్థానం నవావరణ పరివేష్టితమైన శ్రీచక్రం. చతుర్దశ భువనాల్లోని దేవత లందరూ నిత్యం ఈ దేవినే ఉపాసిస్తూ ఉంటారు. షోడశ కళలతో (16 కళలు) పరిపూర్ణంగా వికసించి ఉండటం వల్ల ఈమెని షోడశీ అని కూడా అంటారు. శ్రీ త్రిపురసుందరీదేవి తన భక్తులకి భోగం, మోక్షం రెండింటినీ ప్రసాదిస్తుంది.

శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం, త్రిపుర
త్రిపురలోగల శ్రీ త్రిపుర సుందరీ దేవి ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. అష్టాదశ శక్తి పీఠం ఆలయాలకి ఈ ఆలయం ఉప ఆలయం. త్రిపుర లోని అగర్తాలా నుండి 55 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ అమ్మవారు ... చెరుక గడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి, సేవలు చేస్తూ ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. త్రిపుర సుందరి అనగా షోడశి, లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఉన్న దశ మహా విద్యలలో ఒక స్వరూపమే ఈ ఇచ్చటి అమ్మవారు. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు.

ఈ దేవి స్తోత్రపఠనం వల్ల సకల రోగాలను నిరోధించి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అత్యంత మహిమోపేతమైన ఈ త్రిపురసుందరీ స్తోత్రాల పఠనం వల్ల అనంత భోగాలే కాదు ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది.

శ్రీ లలితా త్రిపుర సుందరి మహా విద్యా


No comments:

Post a Comment