దశమహా విద్యలు
విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటా పంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు.
మంత్ర శాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని మంత్రాలని, దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ పది దేవీ శక్తులని దశావతారలతో కొందరు పోల్చారు. వీటిని బ్రహ్మ విద్యలుగా గుర్తించి, దేవతా శక్తులుగా పూజించి సాధకులు అనుగ్రహాన్ని పొందారు, శక్తివంతులయ్యారు.
అజ్ఞానం పాపానికి కారణమౌతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్చనిస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు పది అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశమహా విద్యలన్నారు.
సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మ శ్రీఆదిశక్తి. మహామాత, మహాదేవి అయినటువంటి ఈ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి వుంది. జగన్మాత ధరించిన అవతారాలు ఎన్నో ఉన్నట్టుగా వివిధ పురాణాలు పెర్మొంటున్నాయి. లోకరక్షణకు, భక్తుల కోరిక మేర, రాక్షససంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది, ఎన్నో లీలలనూ ప్రదర్శించింది. వాటిల్లో ప్రముఖమైనవి శ్రీదేవి యొక్క “దశమహావిద్యలు”.
తంత్ర శాస్త్రంలో ప్రప్రథమంగా చెప్పుకోదగినవి దశమహావిద్యలు.
దశ మహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు.
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశ మహా విద్యలు అని చెబుతారు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు అని విశ్వాసము.
పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళుటకు నిర్ణయించుకుని పరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము తెలుసుకొనినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళ రాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజ రూపమైన ఆదిపరాశక్తి అవతారముదాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 వైపులా (ఎనిమిది దిక్కులు, పైన క్రింద (భూమి, ఆకాశము) మొత్తం పది దిక్కులు) శివుని అడ్డుకుంది. ఈ 10 అవతారాలే దశ మహావిద్యలుగా ప్రసిద్ధి పొందాయి.
ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము ఉన్నది. ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.
దశమహావిద్యల ఆవిర్భావం ఎంతో విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ది పొందాయి. పూర్వం దుర్గాదేవి లోకాలని దేవతల్ని ఉద్దరించాలని దుర్గముడితో యుద్దానికి ఉపక్రమించింది. దేవీ దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో దేవీ శరీరం నుంచి ఒక్కసారిగా ఈ దశమహావిద్యలు ఆవిర్భవించాయని చెబుతారు.
చింతామణి ద్వీప నివాసిని
శ్రీదేవి భాగవతంలోని 12వ స్కంధంలో ఆదిపరాశక్తి కొలువుండే మణిద్వీపంలోని నవరత్న ప్రాకారంలో ఈ దశమహావిద్యలన్నీ కొలువుదీరి ఉంటాయని చెప్పటం జరిగింది. దీనిని బట్టి చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశాక్తికి అత్యంత సమీపంలో నివసించే ఈ మహాశక్తులే దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత లోకంలో కలిగింది.
శాక్త తంత్రములో ముఖ్యమైన విద్యలు
శాక్తతంత్రములో ఎందరు దేవతలున్నా ముఖ్యముగా ఉపాసింపబడే వారు దశమహావిద్యలు. అచింత్యము, అవ్యక్తము అయిన చైతన్యమును ఈశ్వరుడు అంటుంది తంత్రము. అదే చైతన్యము కదలికను పొంది త్రిగుణాత్మికగా మారి సృష్టి స్థితిలయములను చేస్తున్నపుడు శక్తి అవుతుంది. ఆ శక్తి ప్రపంచమును నడిపించుటకు పది రూపాలుగా ఉంటుంది. ఆ పదిరకములైన శక్తులే దశమహా విద్యలు.
దశమహావిద్యా దేవతలు
కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్త, ధూమవతి, భగళా ముఖి, మాతంగి, కమలాత్మిక అనబడువారే దశ మహావిద్యలు. వీరు కేవలము బాహ్య ప్రపంచము నందే గాక అంతర్ ప్రంచమున కూడా అధివసించి ఉంటారు. కనబడే బాహ్య ప్రపంచముగాని, కనపడని ఆంతరిక ప్రపంచముగాని వీరి ఆధీనములోనే నడుస్తూ ఉంటాయి. వీరిని సాధనామార్గమున దర్శించవచ్చు. వీరి అనుగ్రహమును పొందవచ్చు. దానితో ప్రపంచమున అసాధ్యములైన కార్యములు సాధించవచ్చు. వీరు శక్తులు. అనగా శక్తి శరీరము కలిగిన చైతన్య పుంజములు.
ప్రతి అవతారమునకు ఒక ప్రత్యేకత
పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఞాన మూర్తులుగా తెలుపబడ్డారు. ప్రతి ఒక అవతారము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఆధ్యాత్మికతను సంతరించుకున్నవారికి ఈ దశమహావిద్యలు ఎంతో ప్రేమ, ధైర్యము, జ్ఞానముతో కనిపిస్తాయి. తాంత్రికులకు ఆరాధ్య దేవతలుగా ఈ పది మంది దేవతలు ప్రాముఖ్యం చెంది ఉన్నారు. వీరిలో మొదటి ఐదుగురు దేవతలు ఉగ్రదేవతలుగా గుర్తించబడ్డారు. కానీ వారు నిజానికి దయామయులుగా ఉంటారు. మిగిలిన ఐదుగురు దేవతలు శాంత స్వరూపులుగా కనిపిస్తారు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన పదిమంది ఆదిపరాశక్తి అంశల యొక్క కథలు, మంత్రాలు మరియు ఆ దేవతల యొక్క స్వరూపాల గురించి నియమ బద్ధంగ పఠించినపుడు ఆయా మంత్రాల యొక్క అధిష్టాన దేవతలయిన దశమహావిద్యలు అనుగ్రహిస్తాయి అని చెబుతారు.
జగన్మాత భుక్తిముక్తి ప్రదాయిని. అనగా ఐహిక లాభములను ఆముష్మిక లాభములను కూడా సమముగా ప్రసాదించగలదు. ఎక్కువగా మానవులు ఈ శక్తులను ఐహికలాభముల కోసమే ఉపాసించటం కనిపిస్తుంది.
జాతకములో బలం లేకపోవటం పూర్వజన్మల చెడుకర్మ వల్ల కలుగుతుంది. దానిని పోగొట్టుకొని సుఖశాంతులతో జీవితం గడపవలెనని ప్రతివానికీ ఉంటుంది. దానికి దైవబలం తప్పనిసరిగా కావాలి. దశమహావిద్యల ఉపాసనద్వారా జాతకములోని చెడును నిర్మూలించు కోవటం సాధ్యం అవుతుంది. శక్తి అనుగ్రహం వల్ల పూర్వకర్మల చెడు ప్రభావం భస్మీపటలం అవుతుంది. కనుక దోషాన్ని బట్టి ఏ దేవతా ఉపాసన అవసరమో చూచుకొని దానిని ఆచరించడం ద్వారా సుఖ శాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు అని దశమహావిద్యల ఉపాసకులు చెబుతారు.
సత్తు అసత్తు తానైన, అవ్యక్తమైన పరమేశి తత్త్వము పదివిధములైన నామరూపములుగా వ్యక్తపరచు లీలయే దశమహాశక్తులు. ఇవి సృష్టి రహస్యానికి ప్రతీకలు. నానాత్వ ఏకత్వరూపములు అమ్మ స్వేచ్చా లీలలు. పరమేశ్వరి సంకల్ప ప్రతీకలు. స్టూల-సూక్ష్మ అండ-పింద- బ్రహ్మాండ పరిపాలనలో అమ్మకు సహాయపడు అదృష్ట-అద్భుత శక్తులు. నవగ్రహాధి దేవతలుగా, నానా రూపధారులుగా, కఠినత కారుణ్యము రూప స్వభావములుగా కొన్ని శక్తులు, మనోహరత మాధుర్యము మూర్తీభవించిన మాతృస్వరూపములుగా మరికొన్ని శక్తులు, ఘోర-అఘోర రూపములను సమయ సందర్భములను అనుసరించి ధరించుచున్న దయార్ధశక్తులే దశ మహావిద్యలు. సత్వగుణసంపన్నమైన ఆధ్యాత్మిక భావనయే ఆదిపరాశక్తి. తల్లి ధర్మపరిరక్షణకై పరిసరాలను తానే సృష్టించుకొని, వానికి అనుగుణముగా ఉండే రూపములో అయిన ప్రకటనమే దశమహాశక్తుల ఆవిర్భావము.
నారాయణుని దశావతారములే దశమహావిద్యలుగా భావిస్తారు. స్త్రీ పురుష భేదము మన చర్మ చక్షువులకు మాత్రమే. మాయ తొలగిన కన్నులకు మాధవ తత్త్వము అర్థమవుతుంది. పంచ భూత, పంచేంద్రియ పరిరక్షణ బాధ్యతా నిర్వాహకమూర్తులు ఈ దశ మహావిద్యలు. సూ క్ష్మరూపములో పరిశీలిస్తే ఈ దశమహావిద్యలు మానవ దేహమున వివిధ చక్రములను కుండలినీ శక్తిద్వారా వ్యాపింపచేయుచూ, శక్తివంతము చేయుచున్నదన్న మాట యోగసాధకులు అంగీకరించినదే.
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభ అయిన తల్లిని చక్రములు, యంత్రములు, విగ్రహరూపములలో ఆరాధిస్తే బహిర్యాగము అంటారు. మన శరీర చక్రములుగా భావించి, నీవారసూక మాత్రమైన తల్లిని గుర్తించి చేసే ఆరాధనను అంతర్యాగము అంటారు.
దశ మహాశక్తులలో కొన్ని ఉగ్ర తత్త్వము కలవి. మరికొన్ని సౌమ్య తత్త్వము కలవి (ఘోర-అఘోర). ఉగ్రతత్త్వ శక్తులు కాళి కులమునకు సంబంధించినవి. సౌమ్య శక్తులు శ్రీకులమునకు సంబంధించినవి. సౌమ్యశక్తులను సంప్రదాయబద్ధమైన దక్షిణాచార మార్గములో ఆరా ధిస్తారు. ఉగ్రశక్తులను సంప్రదాయ విరుద్ధమైన వామాచార పద్ధతిలో ఆరాధిస్తారు. కొన్ని విద్యలు ఘోర, అఘోర రూపములలో సమయమును బట్టి ప్రకటితమైన వేళ వాటిని ఉభయ పద్ధతులలోను ఆరాధిస్తారు.
ఎవరు గొప్ప?
దశ మహావిద్యలలో ఎవరికీ వారే గొప్పవారు. ఎవరికి వారే పరమ శక్తి వంతులు. ప్రసాద గుణ సంపన్నులు. ఎవరిని ఉపాసించినను ముక్తి ప్రసాద కులే. వీరు ప్రత్యేక దేవతలు కారు. జగ న్మాతయగు ఆద్యాశక్తి యొక్క వివిధ రూపములు. కనుక ఎవరిని ఉపాసించినా భుక్తి ముక్తులను ఇవ్వగలరు. కాని వారివారి లక్షణములను బట్టి ఒక్కొక్క ప్రత్యేక వరమును అధికముగా ఇవ్వగలరు. కనుక జాతకమున గల ఒక్కొక్క దోషమునకు ఒక్కొక్క మహావిద్య ఉపాసన ఉత్తమము అని తెలియుచున్నది.
రవి కుజులు రాజసిక గ్రహములు. కనుక త్రిపుర భైరవి, బగళాముఖి రాజసిక దేవతలు. వీరు ఉగ్రరూపులు. వీరి ఉపాసన కష్టతరము. ఇక బుధ చంద్రులు మిశ్రమ గ్రహములు. అనగా వారి స్థితిని బట్టి మంచీ చెడూ రెండూచేయగలకు కనుక మాతంగి, భువనేశ్వరి అనువారు వీరికి అధిదేవతలు. వీరి ఉపాసన సాత్వికమునకు, రాజసమునకు మధ్యస్తంగా ఉంటుంది. ఇక మిగిలినది శనీశ్వరులు. వీరికి కాళి అధిదేవత. రాహుకేతువులకు ఛిన్నమస్త, ధూమావతులు అధిదేవతలు.వీరి ఉపాసన బహు కష్టతరము. వివిధ ఆటంకములు, భయమును గొలిపే పరీక్షలతో కూడి ఉంటుంది. అంత మాత్రాన వీరిని తామసిక దేవతలు అనుట తప్పు.
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము.
తార, మాతంగి - వాక్కు వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము.
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి,
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి.
దశ మహావిద్యలను నిరభ్యం తరంగా ఎవరైనా ఆరాధించవచ్చు. అమ్మను కొలవడానికి అందరూ అర్హులే. కానీ వామాచార పద్ధతులలో దశ మహా విద్యలను ఆరాధించదలచినవారు ముందుగా ఉపాసకులను, గురువులను దర్శించి విధి విధానాలను తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి.
ఈ దశ మహావిద్యల యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, అష్టోత్తరం, సహస్రనామము... మొదలగు వాటిని పారాయణ చేయుటకు గురూపదేశంతో పనిలేదు. స్త్రీ పురుష వయో భేదం లేకుండా అందరూ నిర్భయంగా ఏ సమయంలోనైనా పారాయణ చేసి ఆ ఆదిశక్తి అనుగ్రహాన్ని
No comments:
Post a Comment