Sunday, July 13, 2025

Kamakshi Devi Kanchipuram - కామాక్షీ దేవి కాంచీపురం

కామాక్షీ దేవి - కాంచీపురం

కాశీ, కాంచీపురాలు శివుడి రెండు కళ్ళని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. శివదేవుడి కన్నుల్లో ఒకటిగా, దేవాలయాల నగరంగా పేరుపొందిన కాంచీపురంలో జగన్మాత శ్రీ కామాక్షీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకుంటోంది. 

పూర్వం బధకాసురుడు అనే రాక్షసుడు అపరిమిత బలగర్వంతో దేవతలను అనేక కష్టనష్టాలకు గురిచేయగా, వారందరూ ఈ బాధలనుంచి తమకు విముక్తి కలిగించమని శివుని వేడుకున్నారు. అందుకు శివుడు కైలాస పర్వతంలోని ఒక గుహద్వారా కాంచీపురం చేరుకొని జగన్మాతను ప్రార్థించమని సూచించాడు. శివుని సూచన మేరకు దేవతలు కాంచీపురం చేరుకొని పూజలు జరిపారు. వారి పూజలను మెచ్చుకున్న దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపమును మార్చుకుని కామాక్షి దేవిగా మారినట్లు కథనం. 

ఒకనాడు కైలాసంలో లీలావిలాసంగా కొన్ని క్షణాలు శివుడి కళ్ళను పార్వతీదేవి తన చేతులతో మూసివేసింది. ఫలితంగా పార్వతీదేవి నల్లగా మారిపోయింది. దీనినుంచి తనను గట్టెంకించమని శివుని కోరగా - కత్యాయన మహర్షి వద్దకు చిన్న పిల్లగా మారి వెళ్ళమని, అక్కడ కొంతకాలం గడిపి అనంతరం కాశీనగరం మీదుగా కాంచీపురమునకు వెళ్ళి సైకతలింగమును పూజించమని సలహా యిచ్చాడు. పార్వతీదేవి అలాగే చేయసాగింది. కాంచీపురంలోని మామిడి చెట్టుక్రింద వున్న ఏకామ్రేశ్వరుడి సైకతలింగమును గుర్తించి తపస్సు చేయసాగింది. ఆ సమయంలో నారదమహర్షి పార్వతీదేవిని చూసి విషయం తెలుసుకొని పంచ బాణ మంత్రం ఉపదేశించాడు. మన్మధాంతకుడైన శివుడి మంత్రమైన పంచబాణ మంత్రమును పార్వతీదేవి పఠించసాగింది. దీనితో శివునిలో మోహాగ్ని కలిగింది. దీనిని తగ్గించేందుకు గంగాదేవి నీటి ప్రవాహాన్ని పెంచి శివుడికి కొంత ఉపశమనాన్ని కలిగించింది. పార్వతీదేవిని పరీక్షించదలచిన శివుడు గంగాప్రవాహాన్ని అధికం చేయగా పార్వతీ దేవి, విష్ణువు సూచనను అనుసరించి సైకతలింగమును గట్టిగా కౌగలించుకుంది. పార్వతీదేవి స్పర్శవల్ల శివుడు పులకిమ్చి ప్రత్యక్షం కాగా, దేవతలందరూ అదే సమయంలో వారి వివాహము జరిపించారు. వివాహం జరిగిన సంతోషంలో పార్వతీదేవి తన చూపులతో అందరిపైన అమృతంను కురిపించి, భక్తులందరి కోరికలను తీర్చింది. దీనిని గమనించిన శివుడు ఆమెకు ’కామాక్షీదేవి’ అని పేరు పెట్టాడు. వివాహానికి హాజరైన దేవతలందరి కోరికపై కామాక్షీదేవి, ఏకామ్రేశ్వరుడైన శివుడు కాంచీపురంలోనే ఉండిపోయినట్లు పురాణ కథనం.

దేవాలయాల నరమైన కాంచీపురంలోని శివకంచిలో అమ్మవారి ఆలయం వుంది. విశాలమైన ఆలయప్రాంగణం, వివిధ దేవతామూర్తులను కలిగివుండి కన్నులపండువగా కామాక్షి ఆలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీకామాక్షీదేవి పద్మాసనస్థితిలో చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పాశం, అంకుశం, చెరుకుగడ ధనుస్సు, పుష్పబాణములను తన చేతులలో ధరించి వుంది. కంటి చూపులతోనే భక్తుల కోర్కెలనీడేర్చే కామాక్షీ అమ్మ వారి ఎదురుగా ఉన్న పూలసజ్జరూపు నిర్మాణంలో ఉన్న శ్రీచక్రము ఆదిశంకరాచార్యులవారు ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతోంది. కాంచీపురంలోని ఏ ఆలయంలో ఉత్సవం జరిగినా ఊరేగింపు అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వెళ్ళేలా ఆలయ నిర్మాణం సాగడం విశేషం. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఆలయాభివృద్ధికి కృషి చేశారు. సతీదేవి వీపుభాగం ఈ క్షేత్రంలో పడినట్లు చెప్పబడుతోంది. 

కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరమునకు 76కిలోమీటర్ల దూరంలో వుంది. తిరుపతి నుంచి కాంచీపురమునకు 90కిలోమీటర్లు.

"కాంచీపురాశ్రితే దేవి కామాక్షీ సర్వమంగళా!
చింతనామాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా!!

No comments:

Post a Comment

Sri Veerabhadra Sata Namavali - శ్రీ వీరభద్రాష్టోత్తర శత నామావళిః

శ్రీ వీరభద్రాష్టోత్తర శత నామావళిః ఓం వీరభద్రాయ నమః । ఓం మహాశూరాయ నమః । ఓం రౌద్రాయ నమః । ఓం రుద్రావతారకాయ నమః । ఓం శ్యామాంగాయ నమః । ఓం ఉ...