ఒక బ్రాహ్మణునకొక కుమార్తెగలదు. ఆ కూతురుకి చిన్నతనములోనే విధవరికము వచ్చెను. ఆ పిల్ల యవస్త జూడలేక తల్లిదండ్రులు అడవిలోనికి తీసుకొని వెళ్లి తిరుగుచుండగా ఒక గట్టుమీద గూర్చుండి పుణ్యస్త్రీలంతా ఒక రేవునను విధవలంతా ఒక రేవునను అయిదేసి పద్మాలు పెట్టుకొని నోము నోచుకొనుచుండిరి. అదిజూచి ఆ తల్లిదండ్రులు పిల్లను తీసుకొనివెళ్లి- "అదేమినోమమ్మా!" అని వారని అడిగిరి. అప్పుడు పార్వతీదేవి గూడా ఆ ముత్తయిదువులలో నొక ముత్తయిదవుగా నుండి వాళ్లను జూచివారి మాటలువిని “అయ్యా! ఆ నోము నేను చెప్పెదను గాని మీ పిల్లను నీ నదిలో స్నానము చేయించుదురుగాని తీసుకురండ"ని చెప్పెను. "' అంతకంటేనా అమ్మా!" అని వారాపిల్లను తీసుకొనివెళ్లిరి. అప్పుడు పార్వతీదేవి పిల్లనుజూచి నీళ్లలోనున్న యిసుక దోసెడుతీసి గట్టునపోయచున్నదట. ఆ పిల్ల ఆ ప్రకారము పోసేసరికి అదంతయు పసుపు అయినదట. "మళ్లీ దోసెడు పోయుమమ్మా!" అన్నదట. ఆ ప్రకారము పోయగా అది కుంకుమాయెను. "మళ్ళీపోయ
మనగా" ఆ చిన్నది మళ్ళీ పోయుసరికి అది కొబ్బరి అయినదట. "మళ్లీ దోసెడు పోయుమమ్మా!" అని చెప్పగా బెల్లము అయ్యెను. "మళ్లీ దోసెడు పోయుమమ్మా!" అనగా ఆమె ఆ ప్రకారము పోయుసరికి అది జీలకర్ర అయ్యెను "ఇది పట్టినయేడు పసుపు, మరుచటియేడు కుంకుమ, మూడవయేడు కొబ్బరి, నాల్లవయేడు బెల్లము, అయిదవయేడు జీలకర్ర సేరుంబావు చొప్పున ముత్తయిదువునకు భోజనము పెట్టి వాయన ఇవ్వవలెను. తదుపరి గౌరమ్మను నీళ్లలో విడిచివేసిన వాళ్లకు నిత్వసౌభాగ్యము వచ్చునన" ని చెప్పెను. ఆ ప్రకారము ఆ పిల్లచేత తల్లితండ్రులు నోముపట్టించగా చచ్చిన మగడు మళ్లీవచ్చెను.
ఉద్యాపనము: ఈ నోము మాఘమాసములో అమావాస్య వెళ్లిన పాడ్యమి మొదలు నెల్లాళ్లు మళ్లీ పాడ్యమి వరకు నీలాటిరేవున పసుపు పెట్టుకొని పసుపుతోడ అయిదు పద్మాలు, పిండితోడ అయిదు పద్మాలు, కుంకుమతోడ అయిదు పద్మాలు, బెట్టుకొని పూజచేసుకొని ఈలా అయిదేండ్లు పూజచేసుకొని గౌరమ్మను నీళ్లలో విడిచివేసిన వాళ్లకు నిత్వసౌభాగ్యము. ముత్తయిదువునకు భోజనము పెట్టి వాయన ఇవ్వవలెను.
No comments:
Post a Comment