Monday, January 12, 2026

Moola Gowri Gouri Nomu Katha - మూలగౌరీ నోము కథ

మూలగౌరీ నోము కథ

భక్తి శ్రద్ధలతో మూలగాౌరీ నోముపట్టి, ఉద్యాపనము చసికో పార్వతీపరమేశ్వరులకు ప్రదక్షణము చేసికొని, భాగ్యవతియైన రాజు భార్య ఎవరికిలేని భాగ్య భోగ్యాలతోను ఎవరికిలేని సిరిసంపదలతోను ఎవ్వరికిలేని సుఖసంతోషాదులతో పరమేవ్వరునివంటి హృదయేశ్వరునితోను, కుమారస్వామి వంటి కొమాళ్ళతోను ముక్కోటి దేవతలవంటి మునిమునుమలతోను, మహాగర్వము గలిగి మహిని
పాలించుచున్నది. 

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు -"దీనిశక్తి యెంతగలదో దీని ధైర్యమెంతగలదో చూడమని మరియొక దేశపు రాజు హృదయములో ప్రవేశించి ఆ రాజు నీరాజుమీదికి యుద్దానికి పంపిరి. దైవబలముతో ఆ రాజు ఈ రాజచక్రవర్తిపై యుద్దానికివచ్చి మహాబల సంపన్నుడైన రాజును బిడ్డలతోను, మనుమలతోను, మునిమనుమలతోను, సకల సైన్యముతోను పడగొట్టి వేసెను. అప్పుడు తనవారి ప్రాణాలను తీసుకుని పోయేందుకు వచ్చిన యమకింకరులను మహాధైర్యముతో యుద్ధభూమికి వెళ్ళి తరుముచు, యమదూతలను ఉద్దేశించి ఇలా అన్నది.

"పడక గదిలో పగడాలు వాయనమిచ్చాను పండువంటి నా ఐదోతనము భంగము చేయలేరు, పారిపొండి యమదూతలారా! పారిపోండి. మత్తయిదువ కోసం మూలనుండి ముత్యాల వాయన మిచ్చాను. ముట్టలేరు.నాపెనిమిటి ముట్టకండి యమదూతలారా! పారిపొండి, భోగభాగ్యాల కోసం పడమటింటిలో పట్టుచీర వాయనమిచ్చా, నాభాగ్యాలు పాడుచేయలేరు పారిపొండి యమదూతలారా! పారిపొండి, తోటలు దొడ్లు కావాలని తోటలలో తోపుచీర వాయనమిచ్చాను తొలగి పొండి యమదూతలారా! తొలగిపొండి, ఇల్లూవాకిళ్ళ కావాలని యిల్లాలికి తెల్లచీర వాయన మిచ్చాను వెళ్ళిపొండి యమదూత లారా! వెళ్ళిపొండి, చెడకుండా కడుపుతీపి చెరకుగడలు వాయనమిచ్చాను. కొడుకుల దరికి చేరలేరు. పారిపొండి యమదూతలారా! పారిపొండి, మనుమలు, మునిమనుమలు గలగాలని మరొక మారు చెరుకు ముక్కలు వాయనమిచ్చాను పారిపొండి యమదూతలారా! పారిపొండి, ఎల్లవారు చల్లగా వుండాలని బెల్లపచ్చులు వాయన మిచ్చాను. నా ప్రజలదగ్గరకు రాకుండ పారిపొండి యమదూతలారా! పారిపొండి పేరు ప్రఖ్యాతులు పెంపెక్కాలని పెరట్లో పెరుగు ముంతలు వాయన మిచ్చాను పేరు చెరుపలేరు,పెంపూ చెరుపలేరు, పారిపొండి. బాలపాపలతో ఓలలాడాలని పాకలలో పాలకాయలు వాయనమిచ్చాను నా పాపల దరికి పోలేరు పారిపొండి యమదూతలారా! పారిపొండి, సిరిసంపదలు చెదరకుండాలని చీకట్లో చిమ్మిలుండలు వాయనమిచ్చాను, 
సిరి సంవదలు చెరుపలేరు. పారిపొండి యమదూతలారా! పారిపొండి,సుఖసంతోషాలు చూరగొనాలని సూర్యభగవానుని కెదురుగుండా సున్నుండలు వాయన మిచ్చాను. నా సుఖసంతోషాలజోలికి పోలేరు. పారిపొండి యమదూతలారా! పారిపొండి, అల్లుళ్ళతో కూతుళ్ళతో అందనాల దిగాలని అరుగుమీద అరిసెలు వాయనమిచ్చాను. అళ్ళుళ్ల కూతుళ్లజోలికి పోలేరు అవతలికిపొండి యమదూతలారా! అవతలకి పొండి. కలిగిన శుభాలు కలుగుతూనే ఉండాలని గాదెవద్ద గారెలు బూరెలు వాయనమిచ్చాను. కదలి పొండి యమదూతలారా! కదలిపొండి! వీసిన వింజామరల వీస్తూనే వుండాలని వేదికమీద విసినకర్రలు వాయనమిచ్చాను వెడలిపొండు యమదూతలారా! వెడలిపొండు, చల్లగా రోజులు జరిగిపోవాలని చాపమీద చలిమిడుండలు వాయనమిచ్చాను. చక్కాపొండి యమదూతలారా! చక్కాపొండి, చేసిన శుభాలు చేసూనే వుండాలని చేరువగా చేట వాయనమిచ్చాను. చేరకండి యమదూతలారా! చేరకండి, సర్వేశ్వరుని కరుణ సర్వకాలమూ ఉండాలని సందులో చక్కిలాలు వాయనమిచ్చాను. జంకిపొండి యమదూతలారా! జంకిపొండి, అందరి కంటె అధికముగా ఉండాలని హరుని యెదుట అరటిపండ్లు వాయన మిచ్చాను అవతలికిపొండి యమదూతలారా! అవతలికిపొండి, కొదవలు లేకుండా కోటివేలేండ్లు కాపురము చెయ్యాలని గొబ్బరిబొండాలు గోడ దగ్గర వాయనమిచ్చాను. గొబ్బున పొండి యమదూతలారా! గొబ్బున పొండి, ఏ గొడవలూ లేకుండా బతకాలని కాగుదగ్గర చేగోడీలు వాయనమిచ్చాను. సాగిపొండి యమదూతలారా! సాగిపొండి, నిండిన కుండలాగు తొణకకుండా కాపురముండాలని నీలాటిరేవున నిండుకుండలు వాయనమిచ్చాను. నిలవకుండా పొండి యమదూతలారా నిలవకుండా పొండి, అమలమైనా కీర్తి వ్యాపించడానికి అటుకక్రింద అద్దాలు వాయనమిచ్చాను. అవతలకి పొండు యమదూతలారా! ఆవలికి పొండి, ఎల్లవారు నాయాజ్ఞ శిరసావహించాలని మల్లెపువ్వు దండలు మధుర క్రింద వాయనమిచ్చాను. మాటాడకుండా పొండి యమదూతలారా మాటలాడకుండా పొండి, తనివి లేకుండా దానధార్మలు చెయ్యాలని తలుపుదగ్గర ధనము వాయనమిచ్చాను తరలిపొండి యమదూతలారా తరలిపొండి! అని యా యిల్లాలు మహాధైర్యంతో దేవీ దేవవర్లను నమ్మి యమదూతలను తరుమ జొచ్చింది.

"భక్తి పాతివ్రత్యంగల పడతుల పల్కులు యమదూతలు మాత్రము దాటగలరా బాబూ! అని యా యమదూతలు ప్రాణాలు చేతబట్టుకొని అందరిని వదలిపెట్టి పారిపోయారు. అప్పుడు యుద్ధంలో పడిపోయిన వారందరూ పార్వతీపరమేశ్వరుల కృపచేత నిద్రపోయి లేచినట్లు లేచివచ్చారు. ఆ ఇల్లాలు భక్తితో పార్వతీపరమేశ్వరులకు మొక్కుచూ, పట్టిన నోములు పట్టకుండా మున్నూటరవై రోజుల నోములతోనూ వ్రతాలతోనూ, పెనిమిటితోనూ, బిడ్డలతోను, భోగభాగ్యాలతోను కలకాలం గడిపి కైలాసం చూరగొన్నది.

ఈకధ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి.

ఉద్యాపనము: కధలో జెప్పిన యిరవైయైదు దినుసులు శక్తి గలిగినప్పుడు ముత్తయిదువున కిచ్చు కోవలెను. పట్టుచీర తోపుచీర తెల్లచీర మాత్రము ఒక్కొక్కటి చొప్పున ముత్తయిదువులకు ఇయ్యవలెను. సీళ్ళు కడవలు అయిదు మాత్రమే ఐదుగురు ముత్తయిదువులకు దక్షణ తాంబూలములతో పసుపుపూసి బొట్టుంచి వాయనమీయవలెను. తక్కిన దినుసులన్నీ యిరవైయైదు చొప్పున జతపరచుకొని అయిదుగురు ముత్తయిదువుల కైదేసి పంచి యిచ్చు చుండవలెను. వారిశక్తి కొలది అయిదుగురు ముత్తయిదువులకు దక్షిణ తాంబూలం యియ్యవలెను.

No comments:

Post a Comment