Sunday, February 22, 2026

Yakshas were created by Brahma to protect the primordial waters - చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృష్టి దెలుపుట

మైత్రేయమహర్షి ఇలా చెప్పాడు. జగత్తునంతా తనలోనే ఉంచుకొన్నవాడైన భగవంతుడు జీవులకు అగోచరుడు. ఆ పురుషోత్తముడు యోగమాయా సమేతుడు. కాలస్వరూపుడు. ఎలాంటివికారాలకు లోనుకానివాడు. అలాంటి భగవంతుడు మొదట జీవులను ఎలా సృష్టించాలని కలతపడినాడు. జగత్తుకు ప్రభువైన ఆ భగవంతునినుండి సత్త్వం, రజస్సు, తపస్సు అనే మూడుగుణాలు పుట్టాయి. ఆ త్రిగుణాలనుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం రజోగుణసంబంధి కావడంచేత ముందుగా దానినుండి మూడుగుణాల అంశలు కలిగిన అహంకారం పుట్టింది. తరువాత అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. పంచతన్మాత్రలనుండి సమస్త సృష్టికి కారణమవుతున్న పంచభూతాలు పుట్టాయి.

సృష్టికి కారణమైన ఆ పంచభూతాలు కూడా విడివిడిగా ఏ ఒక్కదానికీ లోకాన్ని సృష్టించడం చేతకాలేదు. పంచభూతాలు అన్నీ సమష్టిగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గుడ్డును సృష్టించాయి. ఆ గుడ్డు నీటిలోపల ఉంటూ వృద్ధి పొందుతూ ఉండినది.

(పాంచభౌతికమంటే నేల, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే ఐదు ప్రకృతులకు సంబంధించినదని అర్థం. ఈ ఐదూ కలిసి ఏర్పడేదే సృష్టి. ఈ పంచప్రకృతులు బంగారు గుడ్డులో కలిసిపోయి ఉన్నాయి. ఆ బంగారు గు
డ్డునుండి సృష్టి ఏర్పడబోతున్నది కాబట్టి సృష్టి పాంచభౌతికం అవుతుంది.)

నారాయణుడు అనే పేరుతో గొప్పగా ప్రకాశించే పరబ్రహ్మ (భగవంతుడు) ఆ హిరణ్మయమైన అండాన్ని క్రమంగా వెయ్యి దివ్య సంవత్సరాలు అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని (శ్రీమన్నారాయణుని) బొ
డ్డునుండి వేయి సూర్యులకాంతితో ప్రకాశిస్తూ సమస్తప్రాణులతో కూడినదైన (సమస్త ప్రాణులకు ఆశ్రయమైన) ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో భగవంతుని ఆశ్రయంగా చేసుకొని స్వయంప్రకాశంగల బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడు నామం, రూపం, గుణం మొదలైన సంకేతాలు (గుర్తులు) కలవాడై సమస్తజగాలను సృష్టించాడు. ఇంకా తన నీడతో -
(పరమాత్మ బ్రహ్మాదేవునిద్వారా సృష్టినిర్మాణం జరిపే అంశాన్ని ఈ పద్యం వివరిస్తున్నది. 'భగవదధిష్ఠితుండై' అనడంవల్ల బ్రహ్మకు స్వయంగా సృష్టి చేయగల శక్తి లేదని, భగవదంశతో జన్మించినవాడు కావడంవల్ల భగవంతుని ఇచ్చానుసారం వర్తిస్తూ సమస్త సృష్టిని చేశాడని అర్థమవుతూ ఉంది.

దివ్యవర్షంబు - 360 మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం. సృష్టికి సంబంధించిన విషయం సత్త్వరజస్తమ స్వరూపమైన ప్రధానం లేదా ప్రకృతి నిర్వికారావస్థలో ఉండింది. ఊహింపనలవి కాని దైవం అంటే జీవుని అదృష్టం, ప్రకృతి కధిష్ఠాత అయిన మహాపురుషుడు, కాలం అనే వాటిచే ప్రకృతి క్షుభితం కాగా దాని నుండి మహత్తత్త్వం ఉత్పన్నమైంది. దైవప్రేరితం, రజోగుణప్రధానం అయిన ఈ మహత్తత్త్వంనుండి త్రిగుణాలు, అహంకారం ఉత్పన్నమైనాయి. రజోగుణ ప్రధానమైన ఈ మహత్తత్త్వంనుండి ఈశ్వరుని ప్రేరణవలన అహంకార తత్త్వ ముత్పన్నమైంది. మహత్తత్త్వం స్వయంగా సత్త్వగుణప్రధానమైనా అహంకారోత్పత్తి కాలంలో కార్యానురూపమగు రజః ప్రధానమవుతుంది. ఆ యహంకారం గుణత్రయ స్వరూపమవుతుంది. ఈ యహంకారం ఇంకా ఐదైదుగా జేసి ఆకాశాదులను సృష్టించింది. దానినుండి పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలయిదుగురు జన్మించారు. పంచతన్మాత్రాదులు ఒక్కొక్కటి స్వతంత్రంగా సృష్టిచేయ జాలక పోవుటవల్ల అవి ఈశ్వరుని శక్తితో కలసి భౌతికమగు ఒక సువర్ణాండమును సృష్టించాయి. ఆ యండకోశం సమష్టిజీవుని మేలుకొలుపలేక పోవుటచే అచేతనమై ఒక వెయ్యిసంవత్సరాలకాలం కారణార్ణవజలంలో ఉండింది. తరువాత భగవంతుడు ఆ యండకోశాన్ని గర్భోదశాయి రూపంతో అధిష్టించాడు. అప్పుడాయన నాభిప్రదేశం నుండి ఒక పద్మం ఉదయించింది. వేయిమంది సూర్యులవలె తీక్ష్ణమైన కిరణాలతో కూడిన ఆ పద్మమే సర్వజీవులకు అధిష్టానస్వరూపమై ఉండడంవల్ల దానినుండి బ్రహ్మ జన్మించాడు. సలిలంలో శయనించిన విష్ణువుచే అధిష్టితుడై ఆ బ్రహ్మ నామరూపాది క్రమంతో వెనుకటి కల్పంవలె లోకాలను సృష్టించాడు.

బ్రహ్మదేవుడు తన ఛాయ(నీడ)తో తామిస్రము, అంధతామిస్రము, తమము, మోహనము, మహామోహనము అనే ఐదు మోహరూపాలతో అవిద్యను పుట్టించాడు. ఆ సమయంలో తన కది తమోమయమైన శరీరమనే భావన కలిగింది. అందువల్ల బ్రహ్మ ఆ శరీరాన్ని వదలివేశాడు. అలా వదలి పెట్టిన శరీరం ఆకలిదప్పులకు స్థానం, రాత్రిమయం అయింది.

ఆ శరీరంనుండి యక్షులు పిశాచాలు పుట్టారు. వాళ్లకు ఆకలిదప్పులు అధికమైనాయి. ఆ యక్షపిశాచాలలో కొందరు బ్రహ్మను తిందామన్నారు. కొందరు బ్రహ్మను రక్షిద్దామన్నారు.
(అవిద్య అంటే అజ్ఞానం. విమనస్కుడు కావడం మోహం. చేతనత్వాన్ని మూఢత్వం కప్పివేయడం అజ్ఞానం. దీనినే మోహం అని కూడా అంటారు. విపరీత జ్ఞానం అవిద్య, తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహనం, మహామోహనం అనే ఈ పంచమోహాలు అవిద్యలో భాగాలు. మొట్టమొదటి పాంచభౌతికమైన సప్తధాతుమయశరీరం వ్యుత్పత్తి వివరింపబడింది. తన నుండి భౌతికదేహం ఉద్భవింపగా అది మోహరూపాన వ్యక్తమైంది. జీవకణాలు, అణువులు, పరమాణువులు, అందు పనిచేయు ప్రజ్ఞలైన దేవతలు చేరినచో భౌతికదేహమవుతుంది. వారందరి అస్తిత్వం కనిపించకుండా అది మొత్తం ఒక దేహంగా కనిపించుటయే మోహం. ఉన్నది కనిపించక లేనిది కనిపించటం మోహమనబడుతుంది. ఏ ద్రవ్యమైనా ఉన్నట్లు కనిపిస్తుందే కాని దానికి అస్తిత్వముండదు. అందలి అంతర్భాగాలకే అస్తిత్వముంటుంది. కనుక భౌతిక దేహదృష్టి మోహరూపంగా చెప్పబడింది. దానియందు తన ప్రజ్ఞ పనిచేయక అందు తానుండుటవలన జడపదార్థంవలె కనిపిస్తుంది. దానికి సంబంధించినవే తామిస్రము మొదలైన స్థితులు. ధరింపబడిన భౌతిక దేహమునకు విడవడం తప్పనిసరి అవుతుంది కాబట్టి బ్రహ్మ ఆ దేహాన్ని విడిచాడని చెప్పబడింది.)

ఇలా మాట్లాడుకొంటూ ఆ యక్షరక్షస్సులు బ్రహ్మ సమీపానికి వచ్చారు. బ్రహ్మ భయంతో వ్యాకులత చెంది. 'నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు' రక్షించండి అంటూ "మా మాజక్షత","రక్షత" అనే మాటలు అన్నాడు. ఆ కారణంగా వాళ్లకు యక్షులు, రాక్షసులు అనే పేర్లు ఏర్పడినాయి. తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక శరీరం ధరించాడు. సత్వగుణ శ్రేష్టులు, కాంతిమంతులు అయిన దేవతలను ముఖ్యమైనవారుగా సృష్టించాడు. అనంతరం బ్రహ్మ ఆ తేజోమయమైన శరీరాన్ని వదలిపెట్టాడు. అలా వదలిపెట్టబడిన శరీరం పగలుగా రూపొంది దేవతలకందరికీ ఆశ్రయమైంది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశంనుండి మిక్కిలి చంచల స్వభావులైన రాక్షసులను పుట్టించాడు. వాళ్లు ఎక్కువగా కామదృష్టి కలవారయ్యారు. తమను పుట్టించిన బ్రహ్మనే పిలిచి రతిక్రియను కోరారు. సిగ్గువిడిచిన రాక్షసులు తనవెంటపడగా బ్రహ్మ నవ్వుతూ పరుగెత్తాడు. అలా పరుగెత్తి శరణాగతుల బాధలను తీర్చేవాడూ, భక్తులకు ఇష్టమైన రూపంలో కనిపించేవాడూ అయిన శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు. 
(ఈ వచనంలో దేవతలను, రాక్షసులను సృష్టించిన విషయం ఉంది. దేవతల, రాక్షసుల స్వభావం వివరింపబడింది. అతికాముకత్వం రాక్షసలక్షణంగా చెప్పబడింది. ఆలుమగల ద్వంద్వానికి మిథునం అని పేరు. మిథునం అనేమాటకు సంగమం, రతి అని కూడా అర్థాలున్నాయి. మిథునానికి సంబంధించినది మైథునం. మైథునం అన్నా రతి అనే అర్ధం. అయితే ఈ రతి ఆలుమగల మధ్యగల సంగమంగా ఉండాలి. దేవతలకు పగలు ఆశ్రయమైతే రాక్షసులకు రాత్రి ఆశ్రయమనే చెప్పాలి. అందుకే రాక్షసులకు రాత్రించరులు అని పేరు వచ్చింది.)

దేవతలచేత స్తుతింపబడువాడా! లోకాన్ని రక్షించేవాడా! ఉపేక్ష చేయకుండా నన్ను రక్షించు. ఈ మాట విను. నీ ఆనతిని పాటించి సమర్థతతో నేను క్రమంగా ప్రజలను సృష్టించే ఏర్పాటును చేశాను. అలా సృష్టింపబడిన వారిలో పాపస్వభావులైన రాక్షసులు ఇప్పుడు నన్ను రమించాలనే దుష్టబుద్ధితో దగ్గరకు వస్తున్నారు. కలతచెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.

అంతేగాక లోకులకు కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవాళ్ల కష్టాలను దూరంచేయడానికి నీవు కాకుండా సమర్ధులైన ఇతరులున్నారా? అని స్తోత్రం చేయగా బ్రహ్మాదేవుని దైన్యాన్ని పూర్తిగా తెలుసుకొని అందరి హృదయాలను లోతుగా సందర్శింపగల శ్రీహరి 'ఓ బ్రహ్మదేవా! ఘోరమైన ఈ నీ శరీరాన్ని వదలిపెట్టు' అని ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు అలాగేనని తన శరీరాన్ని వదలి వేశాడు.

కొత్తబంగారంలో మణులు పొదిగిన అందెలు శబ్దిస్తున్న పాదపద్మాలు కలది, పట్టుచీరపై మొలనూలుకలది, ఇసుక తిన్నెలను పోలిన గొప్పపిరుదులుకలది; ఒకదానితో ఒకటి ఒరసికొంటూ ప్రకాశించే ఏనుగుకుంభస్థలములను పోలిన పెద్ద కుచముల భారంతో చలిస్తున్న నడుముకలది, మద్యపానం కలిగించిన మత్తుతో చలిస్తూ అప్పుడే వికసించిన అరవిందాలవంటి కనుదోయి కలది, కృష్ణపక్షం అష్టమినాటి చంద్రుని పోలిన ఫాలభాగం కలది, మదించిన తుమ్మెదలను పోలిన శిరోజాలు కలది, మృదువైన సంపెంగ పుష్పానికి సాటివచ్చే అందమైన ముక్కుకలది, చిరునవ్వులు చిందే చూపులుకలది, తామరలవంటి చేతులుకలది.

అలా అనదగిన సంధ్యారూపంతో ఒక విలాసవతి సాక్షాత్కరించింది. అప్పుడా రాక్షసులందరూ ఆమెను చూచి వెంటనే కౌగిలించుకొని తమలో తాము ఇలా మాట్లాడుకొన్నారు.
(రాత్రికి పగటికి మధ్యకాలం సంధ్య. సూర్యాస్తమయానికి పూర్వం మూడు గడియల కాలం, సూర్యోదయానికి ముందు ఐదు గడియలకాలం సంధ్యాకాలంగా చెప్పబడింది. మధ్యాహ్నసంధ్య కూడా ఉంది. త్రిసంధ్యలలో ధ్యానం చేయడం కనిపిస్తుంది. 'అహోరాత్రాభ్యామితి వా సంధ్యా' అనడంవల్ల అహోరాత్రాలచే సంధింపబడునది సంధ్య. పైన 'సంధ్యారూపంబు' అనే మాట సౌందర్యరూపం అనే అర్ధంలో వాడబడినట్లుంది.)

ఈ సుకుమారత్వం, ఈ యౌవనం, ఈ సౌందర్యవిధం, ఈ గాంభీర్యం, ఈ వైభవవిశేషం ఆలోచించి చూస్తే ఏ స్త్రీలకు ఉంటుంది? ఉండదు. ఇది చిత్రంగా ఉంది.

ఆమెను చూచి ఆ రాక్షసులందరూ ఇలా అనుకొన్నారు. "ఈ అందగత్తెను చూచినప్పటినుండి మనం కామభావంతో తన చుట్టూ తిరుగుతూ ఉండగా ఈమె మనస్సులో మన మీద ఇష్టం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?" అని అనేకవిధాలుగా అనుకొంటూ ఆ సంధ్యాసుందరితో 
ఇలా అన్నారు.

ఓ అరటిబోదెలవంటి ఊరువులు కలదానా! నీ కులమేది? ఊరేది? ఎవరి కొమార్తెవు? ఇక్కడ ఇలా ఏకాంతంగా ఎందుకు తిరుగుతున్నావు? మాకు తెలియజెప్పు.

అందమైన నీ రూపసంపదతో ఒప్పుచున్న పుణ్యభూమిలో నీ వలపులో బంధింపబడి భరించలేని వారమైనాము. అలాంటి మమ్మల్ని నీవు ఎందుకు దగ్గర తీసుకోవడంలేదు? మాకు మన్మథబాధ ఎక్కువయిందికదే!
(ప్రమదాకృతి ధరించిన ఆ సంధ్య (సంధ్యాసుందరి) సౌందర్య సంపదతో ఈ భూమి ఎంతో పుణ్యం చేసుకొన్నది. అంటే ఆమె ఈ భూమిపై ప్రభవించడంవల్ల భూమి ఎంతో పుణ్యవంతమైందని భావం.

పుష్పాస్త్రుడు= పువ్వులు బాణములుగా కలవాడు మన్మథుడు.

మన్మథుడికి పంచబాణుడని మరొకపేరుంది. అంటే ఐదురకాల పుష్పాలు బాణాలుగా కలవాడని అర్ధం. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం- అనేవి ఆ ఐదుపుష్పాలు.)

ఇంకా వాళ్లు ఆమె అందాన్ని వర్ణించడానికి అలవిగాక అంటే మాటలురాక ఆలోచిస్తూ,

పెద్దవైన కుచాలభారంవల్ల సంకోచించిన నడుము ఆకాశంకాగా; మృదువైన చిగురాకువంటి చేతిలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబంకాగా; మృదువై నల్లగా మెరుస్తున్న విరివియైన కొప్పుముడి చీకటిగుంపుకాగా, స్వచ్చమైన, ఇంపైన భావాలను స్ఫురింపజేసే చూపులు నక్షత్ర  సమూహంకాగా; శరీరంపై పూసుకొన్న అంగరాగం అనగా మంచిగంధం సంధ్యారాగం కాగా; స్త్రీరూపం ధరించిన ఆ సంధ్యా సుందరిని మనస్సులలో మోహావేశం ఎక్కువైన ఆ రాక్షసులందరూ చుట్టుముట్టి మళ్లీ ఇలా అన్నారు.

నూతనంగా వికసించిన తామరపువ్వువంటి ముఖం కల ఓ సంధ్యా సుందరీ! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది. అది ప్రసిద్ధంగా తెలిసినవిషయం. కానీ నీపాదాలనే పద్మాలు భూమిపై అనేకస్థలాలలో ప్రకాశిస్తున్నాయి కదా!
(ఆమె పాదపద్మాలు అనేక ప్రదేశాల్లో కనిపిస్తున్నాయి అంటే ఆమె అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నదని అర్థం. ఆమె పాదాలే పద్మాలుగా మారినట్లు చెప్పడంలో ఆమె అతిలోకసౌందర్యం ద్యోతకమవుతున్నది.)

అని అంటూ మనస్సులలో ప్రేమలు అధికంగా కలగగా ఆ రాక్షసులందరూ ఆ సంధ్యాసుందరిని పట్టుకొన్నారు. ఆ దృశ్యం చూచిన బ్రహ్మ మనస్సులో ఎంతో సంతోషపడినాడు.

అక్కడ బ్రహ్మ తన చేతిని వాసన చూశాడు. అప్పుడు గంధర్వులు, అప్సరసలు పుట్టారు. వెంటనే బ్రహ్మకూడా తన శరీరాన్ని వదలివేశాడు.
(గంధర్వులను, అప్సరస్త్రీలను దేవతాభేదాలుగా అమరకోశం పేర్కొన్నది.

విద్యాధరోప్సరో యక్షరక్షోగంధర్వకిన్నరాః
పిశాచో గుహ్యకస్సిద్దో భూతో
మీ దేవయోనయః

సువాసనను పొందినవారు గంధర్వులు (సౌరభం గంధం అర్వన్తి గంధర్వాః), నీటిలో పుట్టినారు అప్పరసలు (అద్బ్యఃసరన్తీతి అప్సరసః), రంభామేనకాదులు అప్సరసలు.

వెన్నెలరూపం పొందిన ఆ శరీరాన్ని విశ్వావసువు మొదలగు అగ్రేసరులైన గంధర్వులు, అప్సరసలు గ్రహించారు. మరలా బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం, ఆవులింత, నిద్రలతో కూడిన శరీరం ధరించి పిశాచ గుహ్యక సిద్ధభూత సమూహాలను పుట్టించాడు. వాళ్లు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని ఆ శరీరాన్ని వదలివేశాడు. అలా వదలివేయబడిన శరీరాన్ని పిశాచ గుహ్యకాదులు తీసుకొన్నారు. తరువాత బ్రహ్మ తనను అన్నవంతుడుగా భావించి అదృశ్యశరీరుడై పితృదేవతల సాధ్యుల సమూహాలను పుట్టించాడు. వాళ్లు తమను పుట్టించిన అదృశ్యశరీరానికి కార్యమైన దేవభావాన్ని గ్రహించారు. ఆ కారణం చేత పితృగణాలను, సాధ్యగణాలను ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు.
(బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించాడు అంటే జ్ఞానవంతునిగా అనుకొన్నాడని అర్థం. అంటే లోకజ్ఞానమంతా పొందినవాడని అర్ధం. బ్రహ్మ సృష్టిక్రమాన్ని ఏర్పరచే పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు లోకజ్ఞానం అవసరం. సృష్టిలో ఏయే ప్రాణులను ఎలా యెలా సృష్టించాలో తెలియడం లోకజ్ఞానం. 'అన్నం' అంటే దేనిని తిని ప్రాణిబ్రతుకుతుందో అది. ఆహారం అని సాధారణార్థం. అనాత్మ ప్రపంచమని విశేషార్ధం. దీనివల్లనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల జ్ఞేయప్రపంచమంతా 'అన్నం' అనే మాటద్వారా వ్యక్తమవుతుంది.

శ్రాద్ధం - శాస్త్రోక్తంగా నిర్వహించే పితృకర్మ శ్రాద్ధం. ఆబ్ధికం అని కూడా దీనికి పేరు. మృతులైన పితరులకు పిండప్రదానాలు చేయడం శ్రాద్ధక్రియ.

హవ్యం - దేవతలకు సమర్పించే అన్నం. అంటే దేవతలను ఉద్దేశించి అగ్నిలో సమర్పించే అన్నమని అర్థం.

కవ్యం - పితృదేవతలకు సమర్పించే అన్నం.

'హవ్యకవ్యే దైవపైత్రే అన్నే' - అని అమరకోశం చెపుతున్నది. దేవతలకు, పితృదేవతలకు సమర్పించే అన్నానికి హవ్యమని, కవ్యమని పేర్లు).

సజ్జనస్తుతుడవైన ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మ నేర్పుతో అదృశ్యశక్తివల్ల నరులను, సిద్ధులను, విబుధులను, కిన్నరులను పుట్టించాడు. వాళ్లకు తిరోధానము అనే పేరుగల శరీరాలను ఇచ్చాడు. తరువాత బ్రహ్మ తనకు ప్రతిబింబమైన శరీరంనుండి కిన్నరులను, కింపురుషులను పుట్టించాడు. వాళ్లు బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతగూడి బ్రహ్మాదేవునికి సంబంధించిన గీతాలను గానం చేస్తూ ఉన్నారు. తరువాత బ్రహ్మ ఆత్మలో-
(మాయమైపోవడం, అంతర్థానమైపోవడం అనేది ఒక శక్తి ఈ శక్తి దేవతలకు ఉంటుంది. ఇలా మాయంకాగలిగిన శక్తికి తిరోధానశక్తి అనిపేరు. బ్రహ్మతనకు ప్రతిబింబంగా ఉన్న శరీరం నుండి కిన్నరులను కింపురుషులను సృష్టించడంవల్ల దేవతలతోపాటు వీళ్లకూ తిరోధానశక్తి ఉంటుంది.

అశ్వముఖం కలిగినవారు కిన్నరులు. 'కించిత్పురుషః కింపురు
షః' అనే వ్యుత్పత్తిని బట్టి కొద్దిగా పురుషాకృతి కలిగినవారు కింపురుషులు. విశేషంగా తెలిసినవారు విబుధులు.)

బ్రహ్మ తాను చేసిన సృష్టి వృద్ధి చెందకపోవడంవల్ల కోపపడినాడు. ఎంతో బాధపడినాడు. తన కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. అలా విదిలించడంవల్ల రాలిన వెండ్రుకలన్నీ సర్పాలుగా మారినాయి.

బ్రహ్మ తన పని నెరవేరినట్లు భావించాడు. తన ఆత్మలో సంతోషపడి సమస్తలోకాలలో పవిత్రులైనవారు, త్రిలోకాలలో శ్రేష్టులైనవారు అయిన మనువులను సృష్టించాడు.
(మన్వంతరాలు ఎవరి పేరుమీద ఏర్పడ్డాయోవారు మనువులు, బ్రహ్మ లోకపాలనకోసం మనువులను సృష్టించాడు.)

అలా మనువులను పుట్టించి బ్రహ్మ వాళ్లకు పురుషరూపమైన తన శరీరాన్ని ఇచ్చాడు. ఆ మనువులు తమకంటె ముందుగా సృష్టింపబడిన వాళ్లతో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. 'ఓ బ్రహ్మదేవా! సకలలోకాలకూ సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విశాలమైన, మంగళకరమైన సృష్టి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. యజ్ఞాది క్రియలన్నీ మనువులను సృష్టించడంవల్ల ప్రశంసనీయమైనాయి. యజ్ఞక్రియలలో సమర్పింపబడే హోమద్రవ్య భాగాలను నాలుకలతో చవిచూచే అవకాశం మాకు కలిగింది' అంటూ అధికమైన సంతోషం పొందుతూ బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.
(మనువు మొదటి పాలకుడు. మనువుకు ప్రజాపతి అని కూడా పేరు. ఒక మనువు పాలనాకాలానికి మన్వంతరం అనిపేరు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. మనువులు 14 మంది ఉన్నారు. ప్రతి మనువు పేరుమీద మన్వంతరం ఏర్పడుతుంది. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, ఇంద్రసావర్ణి, భౌమ్యసావర్ణి - అని పదునలుగురు మనువులు. ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉంది. వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచిపోయాయి. ప్రస్తుతం కలియుగం ప్రథమపాదం నడుస్తున్నది. పదునాలుగు మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒకరోజుతో సమానమవుతుంది.)

మనువులను సృష్టించిన తరువాత బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధులతో కూడిన ఋషివేషం ధరించి, ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడై ఋషుల సముదాయాన్ని సృష్టించాడు. వాళ్లకు తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కఋషికి ప్రదానం చేశాడు అని మైత్రేయమహర్షి తెలియజేయగా ఆ విషయాలను పరమానందంతో అందుకొన్న విదురుడు గోవిందుని పాదారవిందాలను మనస్సులో స్మరించి మళ్లీ మైత్రేయుని చూచి ఇలా అన్నాడు.
(తపస్సు, యోగం, విద్య, సమాధి ఇత్యాదులన్నీ ఆర్ష లక్షణాలు. ఈ లక్షణాలున్నవాడే ఋషి. హృషీకాత్ముండు - ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడు. స్వకర్మ ఫలాన్ని అనుభవించేది ఆత్మ. ఇంద్రియాల మూలంగా శరీరం చేసే కర్మలద్వారా ఏర్పడే ఫలానికి భోక్త ఆత్మ. ఇంద్రియాలు మూడు విధాలు.

1. కర్మేంద్రియాలు - వాక్కు, పాణి, పాదం, పాయువు (మలద్వారం), ఉపస్థ అనేవి.

2. జ్ఞానేంద్రియాలు - త్వక్కు (చర్మం), చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనేవి.

3. అంతరింద్రియాలు - మనోబుద్ధి చిత్త అహంకారాలు.

యోగం - 'యోగశ్చిత్తవృత్తి నిరోధః' అనే పాతంజలసూత్రాన్ననుసరించి చిత్తవృత్తులను నిరోధించడం యోగం.

విద్య - ఆధ్యాత్మికవిద్యే విద్య. లౌకికంగా చతుర్దశవిద్యలు, అష్టాదశవిద్యలు ఉన్నాయి.

సమాధి - యమ నియమాది అష్టాంగాలలో చివరిది సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అప్టాంగాలు. ఇంద్రియాలను జయించడం, అదుపులో ఉంచడం, అహింసను పాటించడం మొదలైనవి అష్టాంగాలలో ముఖ్యమైనవి.

సమాధి అంటే చక్కగా నిలపడం అని అర్ధం. స్థిరమైన మనోగతి సమాధి. మనస్సును ఆత్మరూపంతో ఏకంచేసి అందులోనే నిలిపి ఉంచడం సమాధి.)

సుగుణ సంపదగల ఓ మైత్రేయమహర్షీ! భువిలో స్వాయంభువమనువంశం సంప్రదాయాన్నీ ధర్మాన్నీ తప్పకుండా నడచుకొనేదని, ఆ వంశంలో సాంసారికవ్యవస్థతో అనగా స్త్రీపురుషసంయోగంతో సంతానం వృద్ధి పొందిందని చెప్పావు. అంతేగాక స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. ఆ ఇరువురు ఏడుదీవులతో కూడిన భూమినంతటినీ ధర్మమార్గాలు ఏమాత్రం తప్పకుండా పుణ్యప్రవర్తకులై ఎలా పాలించారు? ఓ మునీంద్రచంద్రమా! వాళ్ల చరిత్రనంతటినీ దయార్ద్రబుద్ధితో నాకు అర్ధమయేటట్లు చెప్పు.
(మిథునక్రియ అంటే స్త్రీపురుష సంయోగం. స్త్రీ పుంసౌ మిథునం ద్వంద్వం' అని అమరకోశం చెపుతుంది. దీన్ని బట్టి 
స్త్రీ పురుషుల జంట మిథునం. మిథునానికి సంబంధించినది మైథునం. ఈ మాటకు స్త్రీసంగమని అర్ధం. మైథునమే మిథునక్రియ. మిథునమంటే స్త్రీ పురుషుల జంట అని చెప్పినపుడు ఆ స్త్రీ పురుషులు ఎవరో ఎవరో కాకూడదు. వాళ్లు భార్యాభర్తలుగానే ఉండాలి. భార్యాభర్తలనే మిథునమనాలి. భార్యాభర్తలైనవారి సంగమంవల్లనే వంశవృద్ధి జరగాలని శాస్త్రవిధి. భారతీయ వివాహవ్యవస్థ సత్సంతానం కోసమే ఏర్పాటైంది. దీనివల్ల వంశవృద్ధి, తద్ద్వారా ప్రపంచవృద్ధి జరుగుతుంది. సత్సంతానం ఉత్తమ పౌరులుగా వంశాభివృద్దికి కారణమవుతుంది. అందువల్ల మిథునక్రియ భారతీయ వివాహవ్యవస్థలో ఒక పవిత్రకార్యం. మిథునేతర సంయోగం అవాంఛనీయం, పాప పంకిలం.

సప్తద్వీపాలు - చుట్టూనీళ్లు ఉన్న భూమిని 'ద్వీపం' అంటారు. విశ్వంలో అలాంటి ద్వీపాలు ఏడు ఉన్నాయి. 1. జంబూద్వీపం, 2. ప్లక్షద్వీపం, 3. శాల్మలీద్వీపం, 4. కుశద్వీపం, 5. క్రౌంచద్వీపం, 6. శాకద్వీపం, 7. పుష్కరద్వీపం ఈ ఏడుద్వీపాలలో భారతదేశం జంబూద్వీపంలో ఉంది.)

అంతేకాకుండా ఆ స్వాయంభువ మనువు అదృష్టజాతక లక్షణాలతో కూడిన తన కొమార్తె దేవహూతి అనే కన్యారత్నాన్ని కర్థముడనే ప్రజాపతికి ఇచ్చి ఏ విధంగా వివాహం చేశాడు? ఆ దేవహుతివలన మహాయోగీశ్వరుడైన క
ర్థమప్రజాపతి ఎలా సంతానాన్ని పొందాడు? అదీగాక ఆ కర్థమప్రజాపతి తన పుత్రిక రుచి అనే కన్యను దక్షప్రజాపతికిచ్చి వివాహం చేశాడని చెప్పావు. ఆ రుచియందు దక్షప్రజాపతి ప్రజలను ఎలా సృష్టించాడు. ఈ విషయాలన్నీ అర్థమయ్యేటట్లు వివరంగా తెలియజేయుమని విదురుడు మైత్రేయుని అడిగాడు. అపుడు మైత్రేయుడు ఇలా అన్నాడు.
(స్రష్టా ప్రజాపతి ర్వేధా విధాతా విశ్వసృడ్విధిః అని అమరకోశంలో బ్రహ్మకు పలు పేర్లున్నాయి. ఈ పేర్లలో ప్రజాపతి ఒకటి. ప్రజలకు పతి అని ఆ మాటకర్థం (ప్రజానాం పతిః). బ్రహ్మ ముందు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, దక్షుడు, భృగువు, నారదుడు అనే పదిమందిని సృష్టించి వారిద్వారా ప్రజాసంతతిని వృద్ధిచేసినట్లు పురాణాలు చెపుతాయి. వీళ్లను బ్రహ్మ లేక ప్రజాపతి అని కూడా అనడం ఉంది. వీళ్లలో దక్షప్రజాపతి ఒకడు.

కర్థముండు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లియాడుట

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

No comments:

Post a Comment