Wednesday, March 4, 2026

bharatha gave a profound spiritual answer to King Rahugaṇa - భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

ఓ రాజా! నీవు చెప్పింది ముమ్మాటికి నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. మనిషి బలిసిపోవడం చిక్కిపోవడం, శరీరానికి మనసుకూ సంబంధించిన జబ్బులు, ఆకలిదప్పులూ, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధకం, మరణం, రోషం, నిద్ర మెలకువ, అహంకారమమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని, నాకు లేవు. జీవన్మృతుడను నేను మాత్రము కాదు. జననమరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్మృతులే. యజమానుడు సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగినది కనుక అది శరీరానికి గాని జీవునికి సంబంధించినది కాదు. "నేను రాజును కదా" అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్నమాట. అది నీ స్వభావం గాని మరేంకాదు. అందుకు నేనేం చేయగలను? పిచ్చివాడూ, మూగవాడూ, గుడ్దివాడూ, తెలివిలేనివాడూ ఎంతో నేనూ అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం ఏమీ లేదు. అంతేగాకుండా జడుడనూ, మత్తుడనూ అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం. ఇలా పలికి శాంతస్వభావుడయిన ఆ ముని శ్రేష్ఠుడయిన భరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక తప్పదనే భావంతో దండె వదలిపెట్టుకుండా ఎప్పటిలాగే పల్లకిని మోయసాగాడు. శాస్త్రసమ్మతాలైన బ్రాహ్మణుని వాక్యాలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్త్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజేంద్రుని హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింది. ఆ రాజు వెంటనే పల్లకి నుండి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వినయవినమ్రుడై చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు.

(దేహానికి ఆత్మకు తేడా ఉంది. దేహానికి సంబంధించిన సుఖదుఃఖాదులచే ఆత్మప్రభావితం కాదు. జడభరతుడు ఆత్మస్వరూపుడు. అతనికి లౌకిక సుఖదుఃఖ భావన లేదు. పరమప్రభువు దేవుడు ఒక్కడే. ఇతరులు కాదు. ప్రకృతి అధీనంలో భౌతిక జగత్తులో ఎవడూ ప్రభువు కాడు.

'దైవీహ్యేషాగుణమయీ మమమాయా దురత్యయా' 7-14 ప్రకృతిమాయచే ప్రభువులు, భృత్యులమనే భావన. ఇది మిథ్యాపూర్వక భావన భరతుడు ఒక్కడే 'ధర్మాధికారి'

'తత్తే
నుకమ్పాం సుసమీక్ష్యమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకమ్‌,
హృ ద్వాగ్వపుర్భిర్విద ధన్నమస్తే జీవేత యో ముక్తిపదే సదాయభాక్‌.' భాగ 10-148

'గతకర్మలు అనుభవిస్తూ ఏ నిర్హేతుక కరుణకై వేచియుండి హృదయకుహరమున సదా వందనములను కావించువాడు మోక్షపదమునకు నిశ్చయంగా అర్హుడగును. అది అతని ధర్మయుతమను అధికారమే యగును అని భావం.

1. వ్యాధులు, ఆధులు : 'ఆధి అంటే మనస్సుకు సంబంధించిన జబ్బు. 'వ్వాధి' అంటే శరీరానికి చెందిన జబ్బు.

2. సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి : స+అష్ట+అంగ+దండ ప్రణామం ఆచరించే పద్దతి.

శరీరంలోని ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లుగా చేసే నమస్కారం.)

నీవు సామాన్యబ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. అయితే ఎందుకు ఈ వేషంలో ఒంటరిగా తిరుగుతున్నావు? నన్ను ధన్యుణ్ణి చేయడంకోసం దయతోవచ్చిన కపిల మహామునీంద్రుడవు కావు గదా? నీ మహిమలు తెలుసుకోలేక నేను అపచారం చేశాను. నన్ను దయతో చూడు. నా తప్పును క్షమించు. నేను బ్రాహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు పాశానికి గానీ, శివుని శూలాయుధానికి గానీ, ఇంద్రుని వజ్రాయుధానికిగానీ, అగ్ని, చంద్ర, సూర్య, వరుణుల శస్తాస్రాలకుగానీ ఏ మాత్రం భయపడను సుమా!

నీవు కోరికలు లేనివాడవై కూడా పైకి జడునివలె కనిపిస్తున్నావు. నిగూఢమయిన విజ్ఞానరహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీ మాటలు యోగశాస్త్రాలలోని వాక్యాలకు దీటుగా ఉన్నాయి. నీ వాక్యాలు వాక్కుకు గాని మనసుకు గాని విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి.

నే నిపుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడూ, సాక్షాత్‌ విష్ణుస్వరూపుడూ అయిన కపిలమహాముని వల్ల బ్రహ్మవిద్యోపదేశం పొందాలని వెళుతున్నాను. నీవు లోకులను పరీక్షించడంకోసం, ఇతరులు గుర్తించడానికి వీలులేని ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్‌ కపిలమహామునీంద్రుడవే అని అనుకొంటున్నాను. మూర్ఖుడైన నావంటి గృహస్థుడు మీవంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఈ గృహస్థాశ్రమం బాదరబందీ నాకులాగా నీకు ఉన్నట్టుంది. కుండలేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానేరాదు. ప్రమాణాలను బట్టి 'లోకవ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుట లేదనిపిస్తున్నది అని సింధు దేశానికి అధిపతి అయిన రహూగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణకుమారుడైన భరతుడు 'లోకవ్యవహారంలోని నిత్యత్వం ఉపాధిపై ఆధారపడి ఉంటుందేగాని అది సత్యం కానేకాదు' అని ఉదాహరణలతో ఇలా విశదీకరించాడు.

(జడభరతుడు పరిపూర్ణ యోగి. మునులలో శ్రేష్ఠుడు. యోగేశ్వరుడు గీతలో -

'యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా 

శ్రద్ధావాన్‌ భజతే యో మాం స మే యుక్తతమో మతః' ॥ 6-47

అత్యంత శ్రద్ధతో నా భావనయందే నిలిచియుండేవాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుతమైన సేవను ఒనరించినవాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టివాడైయున్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు ఇక్కడరాజు రాజుకాడు. భరతుడు జడుడు కాడు. ఇవి ఉపాధులు. ఆత్మకు అచ్చాదనలు తొడుగులు మాత్రమే.

ఉపాధి : ఇక్కడ శరీరమే 'ఉపాధి.')

అగ్నిజ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యం బాగా ఉడికి పక్వమయి అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం ఇంద్రియాలున్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకూ సంక్రమిస్తాయి.

ప్రజల శిక్షణ, రక్షణలకోసం రాజున్నాడు. ఆ రాజు చెడుకర్మలు వదలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే, సంసార బంధాలనుండి విముక్తుడవుతాడు.

బ్రాహ్మణకుమారుడయిన భరతుడు ఇలా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు.

మహాత్మా! నేను రాజుననే దురహంకారంతో కన్నులు గానక మహాత్ముడవైన నిన్ను తిరస్కరించాను. అపరాధినైన నన్ను కరుణించు. నీవు నావంటి మోక్షచింతనచే ఆర్హులైన తత్త్వజిజ్ఞాసువులకు దగ్గరి చుట్టానివి. నీవు నాపై నీ కృపాకటాక్షవీక్షణం ప్రసరింపజేస్తే, మహాత్ములకు అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తుణ్ణి అవుతాను. నీవు లోకానికి ఆప్తమిత్రుడవు. అందువల్ల నీకు అసలు కోపమనేదే ఉండదు. మేము ఏమీ చేతగాని వాళ్ళం. గొప్పవారిని అవమానించడమనే పాపకర్మంవల్ల తొందరగా వినాశం కొని తెచ్చుకుంటాము. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును జూచి బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు.

నీవు విద్వాంసుడవు కావు. అయినా విద్వాంసునిలాగా మాట్లాడుతున్నావు. ఇది చాలా చిత్రంగా ఉంది. అయినా నిన్ను కొంత మెచ్చుకోవచ్చు.

రాజచంద్రా! పెద్దలెవరు గాని ఈ ప్రపంచం సత్యమని చెప్పరు. అయితే నీవు సత్యమంటున్నావు. వ్యవహారసత్యం అసలు సత్యం కాదు. అందువల్ల నీ ఆధిక్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు.

యజ్ఞాల్లో గాని, వేదాలలోగాని, పరమార్ధతత్త్వం చెప్పబడదు. కలలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. కలలో అవి సత్యాలే. అయితే మెలకువలో అవి అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలనేవి తత్త్వస్వరూపం అనుభవమయ్యేవరకూ సత్యాలుగా భాసిస్తాయి. కాని అవి నీత్యాలు కావు. జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోనూ, కర్మేంద్రియాలతోనూ సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఈ అలవాటువల్ల ధర్మాలో, అధర్మాలో మనసులో పుడుతుంటాయి.

మనసుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మాధర్మ రూపాలలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాలపట్ల అనురక్తి కలిగి ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్నిబట్టి జీవుడు దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాలలోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖదుఃఖఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూలసూక్ష్మరూపాలతో ఉంటుంది.

మనసు గుణరహితమైనప్పుడు కలిగే అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు ముంచి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది. నేయీ వత్తీ రెండూ లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకూ, కర్మలకూ తగిన జన్మలకు కారణమవుతుంది. గుణాలూ, కర్మలూ అనేవే లేకపోతే మనసు అనేది ఉండదు. కేవలం పరతత్త్వంగా మిగులుతుంది.

జ్ఞానేంద్రియాలు ఐదు. ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలైదు. అభిమానం అనే పదకొండున్నూ మనస్సుకు ఏర్పడే వృత్తులు. ఈ పదకొండు వృత్తులతో కూడిన మనస్సు. ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైని చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు అఖండపరంజ్యోతి అయిన నారాయణస్వరూపమే అవుతాడు. చరములూ, అచరములూ అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు, ఈశ్వరుడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా గోచరిస్తాడు. జీవుడు జ్ఞానోదయం కలిగి మాయను గెలువనంతవరకూ ఇంద్రియాలతో సాంగత్యం విడువలేడు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి పరతత్త్వాన్ని తెలుసుకొన్నట్లయితే అతడే ఈశ్వరుడవుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియ లోలుపమై సంచరిస్తుందో అంతకాలం సంసారచక్రంలో తిరగడం తప్పదు. అందుచేత మహావీరుడయిన వాడెవ్వడైననూ తనకు శత్రువయిన మనోవృత్తులపట్ల ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. మనస్సును తోచినట్లు తిరుగనీయరాదు. జీవుడు శ్రీహరి పాదధ్యానమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్త్వాన్ని అందుకుంటాడు అని బ్రాహ్మణుడయిన భరతుడు పలుకగానే, అతని మహిమకు ఆశ్చర్యపడి అతనికి నమస్కారంచేసి రాజయిన రహూగణుడు ఇలా అన్నాడు.

(16 తత్త్వాలంటే పంచమహాభూతాలు, దశేంద్రియాలు, మనస్సు. మనస్సు బద్ధ జీవనానికి కారణం. ప్రబలమయిన మనస్సు జీవుని కప్పివైచి సంసార సాగరమనే తరంగాలలో తోసివేస్తుంది.)

కారణజన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూతవేషం, ఈ బ్రాహ్మణత్వం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్చావిహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను.

జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలనే అమృతం ప్రాప్తించింది. ఇంతకంటె నాకు ఇంకో ఔషధ ఎందుకు?

బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నా సందేహాలన్నిటినీ నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మతత్త్వాన్ని సమగ్రంగా వివరించు.

ఈ విధంగా అడిగిన ఆ రాజుతో భరతుడు ఇలా అన్నాడు. "రాజా! పూర్వజన్మలలో చేసిన కర్మలనుబట్టి ఫలితాలు కలుగుతుంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన శక్తియుక్తులవల్ల కలిగాయని భావిస్తుంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్త్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు.

ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పై భాగంలో పిక్కలు, ఆ పైన మోకాళ్లు, ఆ పైన తొడలు, ఆ పైన నడుము, ఆ పైన వక్షం, ఆ పైన కంఠం, ఆ దాపున మూపు, ఆ మూపుపైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉన్నది. పల్లకిలో నీవున్నావు. నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది. కష్టపడేవారని చూచి వారిపట్ల దయ చూపడం మాని వారిని బెదరించి, పీడించి ప్రజాపాలనం చేస్తున్నావు. నేను పరిపాలిస్తున్నాను. ఇతరులందరు నాచేత పరిపాలింపబడుతున్నారనే అహంకారం నీకుండడంవల్ల మావంటి వారున్న సభలలో నీకు పూజ్యత లేదు.

ఈ సమస్త జీవరాసులకు భూమి నివాసస్థానం. అందువల్ల ప్రపంచదృష్టికి కారణమయిన తత్త్వం తెలియజేస్తున్నాను. ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడింది. అవిద్య మనస్సుల కలయికచే ఈ జగత్తు పుట్టింది. ఈ అవిద్య కారణంగా జగత్తు రెండవది అయింది. ఇట్లా ఒకటి రెండుగా కల్పింపబడడం మాయ. ఈ కల్పన అనేకవిధాలు. సన్నం, లావు, పెద్దది, చిన్నది, ఉన్నది, లేనిది. ఇట్లే జీవుడు, అజీవుడు, ద్రవ్యములను భేదాలూ, నామభేదాలూ, వేరు వేరు స్వభావాలూ, ఆశయాలూ ఈ మాయవల్లనే కాలభేదాలు కలిగాయి. తనంతట తాను ప్రకాశించేదీ, భగవంతుడనే మాటతో పిలువబడేదీ, పరిశుద్ధమయినదీ, జ్ఞానరూపమయినదీ బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు అసత్యం అని విశదీకరించి మరల భరతుడు ఈ లాగున అన్నాడు.

(ఈ వచనం చాలా గంభీరమైనది. ఇది అద్వైతతత్త్వాన్ని ప్రతిపాదించే పరిభాషలుగల వచనం.)

పరమ భాగవతుల పాదసేవవల్ల లాభించినంత సులభంగా బ్రహ్మ తపస్సువలనగానీ, దానంవల్లగానీ, గృహస్థాశ్రమ ధర్మంవల్లగానీ, స్నానాలవల్లగానీ, హోమాలవల్ల గానీ, సూర్యచంద్రోపాసనంవల్లగానీ, వేదాధ్యయనంవల్ల గానీ లభించదు. భగవద్భక్తుల చరణసేవయే పరమబ్రహ్మప్రాప్తికి సులభమార్గం అని ఆర్యులంటారు. బాహ్యసౌఖ్యాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోషమనుభవించే భాగవతులను అనుదినమూ ఆరాధించితే మన బుద్ది మోక్షమార్గంవైపు పయనిస్తుంది. నారాయణునిలో నెలకొని ఉంటుంది.

నరేంద్రా! నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. నేను సర్వసంగపరిత్యాగం చేశాను. తరువాత భగవంతుని భక్తితో భజించాను. చివరకు ఒకానొక జింకపిల్ల మీద మమత పెంచుకున్నాను. ఆ కారణంగా లేడిగా జన్మనెత్తాను. అయితే ఈ జన్మలో కూడా హరిభక్తి విడనాడలేదు. ఆ పుణ్యవిశేషంతో నాకు మరల మానవజన్మ లభించింది. నేను సర్వసంగ పరిత్యాగినై ఇపుడు ఒంటరిగా తిరుగుతున్నాను. నరుడయినవాడు పెద్దలను సేవించడంవల్ల క్రమంగా సంసారం మీది వ్యామోహాన్ని వదలిపెడతాడు. శ్రీహరిని సదా ధ్యానించడం వల్లనూ, శ్రీహరికథలు వినడం వల్లనూ అతడు జ్ఞానవంతుడవుతాడు. చివరకు శ్రీమన్నారాయణుని పూజిస్తూ పరమపదం చేరుకొంటాడు అని పలికి పరమభాగవతుడైన భరతుడు మరలా ఈ లాగున అన్నాడు.

(ఈ వచనంలో వర్ణితమయిన సన్నివేశం మహత్తరమైనది. 'వినా మహత్‌ పాదరజో
భిషేకమ్‌' మహాభాగవతుని పాదపద్మధూళిని శిరస్సుపై దాల్చనిదే మనుజుడు పూర్ణత్వం పొందజాలడు. భరతుడు నిష్టాపూర్వకమయిన భక్తియుత జీవనం గడిపేవాడయినా జింకపట్ల అమితాసక్తుడయినప్పుడు గురుదేవుని ఆశ్రయించలేదు. అందువల్లనే, జింకపట్ల గాఢానురక్తి ఏర్పడింది. ఆధ్యాత్మిక విధులను మరవడంవల్ల పతనం తప్పలేదు. దుష్టసాంగత్య భయంతో నేను ప్రచ్చన్నంగా జీవిస్తున్నానని చెప్పాడు. హరిసేవవల్లే పూర్వజన్మస్మృతి తనకు కలిగిందని భరతుడు చెప్పడం సరియైనదే. మహాభక్తుల సాంగత్యంవల్ల పూర్ణజ్ఞానం, ఆ జ్ఞానం కారణంగా మిథ్యాసాంగత్య ఖండనం. ఆపై భక్తుల సాంగత్యం ద్వారా శ్రవణ కీర్తనాదుల కారణంతో భగవత్సేవానురక్తి కలుగుతుంది.)

భూపాల! మాయవల్ల దృఢమైన సంసారబంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనం ఆశించి వర్తకునిలాగా లాభదృష్టితో కర్మలు ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారం ఒక పెద్ద అడవి వంటిది. ఆ అడవిలో కామం, లోభం మొదలయిన అంతఃశత్రువులు తిరుగుతుంటాయి. అవి ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటాయి. వాడు దాచుకొన్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోవటానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల సంసారంపట్ల కోరికలు పెంచుకోకూడదు.

(సుఖపడడంకోసం ధనసంపాదన. ఆ సంపాదనలో కష్టపరంపరలు. ఆ పరంపరలోనే చనిపోవడం. సుఖపడడానికి సమయంలేదే అని పరితాపం. సంసారమనే అడవిలో భ్రమణం. కామాదులు కోరికల్ని ప్రేరేపించి అల్పమైన శారీరక సుఖానికి దారి తీస్తాయి. ఇంద్రియాలు ప్రకోపిస్తాయి. ధర్మధనం కరిగిపోతుంది. అందువల్ల సంసారాపేక్ష తగదని సారాంశం.)

సంసారం అడవివంటిదని చెప్పాను. ఆ అడవిలో కొడుకులూ, స్నేహితులూ, భార్యలూ మొదలయిన వారందరునూ, తోడేళ్ళు మేకలను భక్షించే విధంగా పురుషుని పీక్కుతింటారు.

సంసారమనేది భయంకరమయిన అడవిలోని మందిరం వంటిది. ఆ మందిరం చుట్టూ తీగలూ, పొదలూ దట్టంగా అల్లుకుని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలుంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తుంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు.

గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటుపడతాడు. వాడికి విశ్వమంతా ఒక గంధర్వ నగరంగా కనిపిస్తుంది. ఆ సుఖాలన్నీ శాశ్వతం అనుకొంటూ సంతోషపడుతుంటాడు.

(ఆకాశంలో మబ్బులున్నప్పుడు తదేకదృష్టితో చూస్తుంటే అనేక ఆకారాలు కనబడతాయి. మిద్దెలు, గోపురాలు, ఆలయాలు, కోటలు కనబడతాయి. అవన్నీ మబ్బుల ఆకారాలే. నిజం కావు. భార్యలు, బిడ్డలు మబ్బుల ఆకారాలే. వీటిని చూచి సంతోషపడడం నైజం.)

అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి ఏదో నిప్పు అనే భ్రాంతితో దానికోసం దానివెంటబడి తిరిగినట్లు ధనంకోసం భాగ్యవంతుల ఇళ్లచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ నరుడు వ్యథలకు లోనవుతాడు.

(అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాలు తిరుగుతుంటాయి. కంటికి నిప్పురవ్వలవలె భ్రాంతి కలిగిస్తాయి. నిప్పుకోసం వాటి వెంబడి తిరిగితే దారి తప్పడం, శ్రమపడడం సంభవిస్తుంది. ఆపదలే మిగులుతాయి. ధనవంతుల దగ్గర గొడ్దుచాకిరి తప్ప ఇతర లాభములు లేవు. వారి ఎత్తుగడలు కాలాంతరంలో తెలుస్తాయి.)

కుటుంబాన్ని పెంచుకుని దానిని పోషించడంకోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మృగంలాగా నరుడు పరుగులు పెడుతూ తిరుగుతుంటాడు.

(ఎండమావులలో నీరుండదు. ఆ ఎండమావుల వెంట పరువెత్తడం వల్ల అలసట, దప్పిక అధికమగునే గాని దప్పిక తీరదు.)

సుడిగాలి ఊహించినది కాదు. పైగా అడవి, ధూళి కారణంగా దారులు తెలియవు. పైగా కళ్ళకు పొరలాగా అడ్డగిస్తుంది. అలాగే సంసారబద్దుడు పొగరుతో చెడ్డపనులు చేసి ఇతరులకు హాని తలపెడతాడు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తాడు. చిక్కుల్లో పడతాడు.

అయ్యో! నరుడు పడే నానావిధాలైన పాట్లు ఎన్నని చెప్పను? అడవిలో సంచారం చేసేటప్పుడు గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ల రొదలకూ మాదిరిగా విరోధుల తిరస్కారాలకు భయపడతాడు. బాధపడతాడు. అడవిలో ఏమీ దొరక్కపోతే చివరకు ఏ పిచ్చి చెట్లపళ్ళనో తినడానికి సిద్ధమయినట్లు పాపాత్ములైన ధనవంతులను ఆశ్రయిస్తూ జీవితం గడుపుతాడు. దప్పికకు ఏమాత్రం తట్టుకోలేక విసిగి వేసారి చివరకు ఎక్కడయినా కాసంత నీరు దొరుకుతుందేమోనని ఆశతో వట్టిపోయిన నది దగ్గరికి వెళ్ళినట్లు ఇహానికి పరానికి దూరులయిన పాషండులను సేవిస్తుంటాడు.

మంటలు చుట్టుకోగా తప్పించుకొందామని ప్రయత్నించి కారుచిచ్చులో చిక్కుకొన్నట్టు అన్నంకోసం దాయాదుల పంచజేరి వంచింపబడుతుంటాడు. ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలకు తట్టుకోలేక రాజ్యాభిలాషతో తండ్రినీ, కొడుకునూ, అన్ననూ చివరకు ప్రాణమిచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండ చేస్తాడు. చివరకు బలవంతులయిన వారిచేత చావుదెబ్బలు తిని, డబ్బు యావత్తూ పోగొట్టుకొని దిగులుతో కుంగిపోతాడు.

గగనంలోని గంధర్వ నగరంవంటి గాలిమేడలను ఊహించుకొని మురిసిపోయినట్లు సారంలేని సంసార సుఖాలు అనుభవిస్తూ అందులో ఏదో ఆనందాన్ని జుర్రుతూ జీవిస్తాడు. కొండలెక్కేవాడు ముళ్ళూ, రాళ్ళూ గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్టుగా గృహస్థాశమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలిమంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీదా అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ నోట్లోబడి మెలికలు తిరిగి స్పృహగోల్పోయినట్టుగా గృహం అనే అడవిలో రాత్రివేళ దిక్కుతోచక నిద్రలో మైమరచి పొరలుతుంటాడు.

అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్టు సంసారంలో దుర్దనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టను రేపి తేనెటీగల బారినిపడినట్లు సంసారసుఖాన్ని కోరి ఇతరుల భార్యలనూ, ఇతరుల వస్తువులనూ అభిలషించి ఇంటి యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తన్నులు తిని నరకయాతన అనుభవిస్తాడు. యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ, గాలికీ, వానకూ ఓర్చుకొని సంపాదించిన సొమ్ము ఇతరులు హరింపగా దిగులుతో కుంగిపోతాడు. అంతేగాకుండా, అడవిలో ప్రాప్తించిన అల్పజంతువుల మాంసానికి బోయలు కొట్లాడుకొన్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అల్పవిత్తాలకోసం తన్నులాడుకొంటారు.

ఈ విధంగా రహూగణుడనే రాజుకు పరమ భాగవతుడైన భరతుడు సంసారమనే అడవిలోని అగచాట్లను విశదపఱచి మళ్లీ ఇలా అన్నాడు.

(పాషండులు : ఏతు సామాన్య భావేన మన్యంతే పురుషోత్తమమ్‌ ।
                         తే పాషండినః జ్ఞేయాః సర్వకర్మ బహిష్కృతాః 


"ఎవరు పురుషోత్తముడైన విష్ణుమూర్తిని లోకసామాన్యుడైన మానవునిగా చూస్తారో వారిని పాషండులని పిలుస్తారు. అటువంటివారు వైదికమైన సకల కార్యకలాపాల నుండి వెలివేయబడుచున్నారు?" అనగా 'పాషండులు వేదబాహ్యులు' అని అర్థం.)

ఏదో కొంత ధనం సంపాదించుకున్నవాడు తాను సంపాదించుకొన్న ఇల్లు వాకిళ్ళలో సంతోషపడక ఇతరుల ఆస్తి కాజేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ దుశ్చర్యవల్ల వాడు చివరకు చీవాట్లు తిని అవమానం పొంది ఎంతో దుఃఖాన్ని కొని తెచ్చుకొంటాడు.

ఇంకా కొందరు వస్తువులనూ, డబ్బునూ, మార్పిడి చేసుకోవడంలో పట్టుదలలు పెంచుకొని వైరభావంతో ఆత్మచింత లేక అనుదినమూ కలహించుకొంటూ ఉంటారు.

మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసారపోషణకు అంతులేని ప్రయాసపడుతూ అందుకుగాను వస్తుసంభారాలను సమకూర్చుకొంటూ ఇహలోక సుఖాలకే అలవాటుపడతారు. అవే ఇంకా కావాలని కోరుతారు. అంతేకాని మోక్షమనేదొకటుందని ఆ ముక్తివల్ల కలిగే ఆనందం శాశ్వతమని తెలుసుకోలేరు. అందుకు అవసరమైన ఆధ్యాత్మయోగాన్ని అవలంబించక చెడిపోతుంటారు. అభిమానవంతులయినవారూ, సాటిలేని శార్యవంతులైనవారూ పరస్పరం వైరం పెంచుకొని సమరంలో ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని, ఆ మందబుద్ధులు మోక్షమార్గాన్ని అసలు దర్శించనే లేరు. ఈ విధంగా సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్ని భరతుడు తెలియజేసి మరలా సింధు రాజుతో ఇలా అన్నాడు.

కొందరు కాలచక్ర భ్రమణమునకులోనై ఆ చక్రాయుధుని కొలువక కాకుల్లాంటివారూ, గద్దల్లాంటివారూ, కొంగల్లాంటివారూ అయిన పాషండులతో స్నేహం పెంచుకొంటారు. వారి వలలోబడి వంచింపబడతారు. కొందరు బ్రాహ్మణకులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలయిన వైదికకర్మలు నియమనిష్టలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి ఉంటారు. చెట్టులాగా వయసు పెరుగుతుంది గాని నరుడు మనసా పెరుగడు. అంత్యకాలం సమీపించుతున్నా ఇహలోక సుఖాలమీద ఆశ పెంచుకుంటాడు. స్త్రీ సంగమాభిలాషకు లోనై భార్యాపుత్రులందు స్నేహం పెంచుకుంటాడు. ఏనుగులకు భయపడ్డ బాటసారి తెలియక ఏనుగులకోసం త్రవ్విన గోతులలో పడ్డట్టు సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండ గుహలాంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని సంసార కారణమయిన నీ రాజభావాన్ని వదలిపెట్టు. అన్ని ప్రాణులపట్ల మైత్రిని పెంచుకొని, ఇంద్రియాలను జయించు, జ్ఞానమనే కత్తి చేబట్టి జీవిత ప్రయాణ మార్గాన్ని ముగించడం తెలుసుకో! భయంకరమైన ఆ అడవినుండి బయటపడు అని బోధించగా రహూగణుడు భరతునితో ఇలా అన్నాడు.

భూలోకంలో అన్నిజన్మలలో మానవజన్మ శ్రేష్ఠమని అంటారు. ఇది నిజమని ఏలాగున నమ్మాలి. మీవంటి సర్వసములయిన మహనీయుల సందర్శనం కలిగినప్పుడే ఇది సత్యమవుతుంది.

(ఎనభై నాల్గు లక్షల జన్మల తరువాత సిద్ధించేది మానవజన్మ. అటువంటి మానవజన్మ పొందినవారు యోగులతో చేరిక గలిగినవారయితే అంతకంటె శ్రేష్ఠత్వం మరొకటి లేదు.)

భూసురశ్రేష్ఠా! నీ పాదపద్మపరాగాల సంస్పర్శనం నా పాపాలన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకూ నాలో హరిభక్తి అతిశయించింది.

యోగీశ్వరులు పరివ్రాజక వేషంతో బ్రాహ్మణరూపంలో తిరుగుతుంటారు. వారికి వయసుతో నిమిత్తం లేదు. అందుచేత చిన్నపెద్ద తేడాలు చూడకుండా బ్రాహ్మణులైన వారికందరికీ నా నమస్కారం అంటూ సింధు దేశాధిపతి భరతుణ్ణి స్తుతించాడు. కరుణాసముద్రుడైన ఆ యోగీశ్వరుడు సింధుపతి అయిన రహూగణునికి తత్త్వజ్ఞానం ఉపదేశించాడు. సింధుపతి మొక్కులు అందుకొని భరతుడు పొంగిపొరలే మహాసముద్రంలో దయారసపరిపూర్ణమైన హృదయంతో భూమిమీద సంచరిస్తున్నాడు. సింధు భూపతి కూడ సత్పురుష సాంగత్యం కారణంగా తత్త్వజ్ఞానం పొందాడు. అతనికి దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అని చెప్పిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఈ విధంగా అన్నాడు.

నరేంద్రా! ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోగలుగుతుందా? అలాగే రాజులందరూ కలసినా భరతుని సచ్చరిత్రను కొనియాడడం సాధ్యమా? మనస్సుతోకూడా ఊహించలేరు. అందువల్ల భరతుని పవిత్ర చరిత్రం ప్రస్తుతించడం నాకు సాధ్యంకాని పని.

నరేంద్రా! భరతుడు పూర్వమందే పుత్రులనూ, భార్యను, రాజ్యవైభవాన్ని వదలిపెట్టాడు. భగవంతునిపట్ల నిష్ఠ పెంచుకొన్నాడు. యజ్ఞమయుడూ, ధర్మస్వరూపుడూ, సాంఖ్య యోగీశ్వరుడూ, ప్రకృతిపురుషాత్మకుడూ అయిన నారాయణునికి నమస్కారమంటూ హరిణరూపాన్ని పరిత్యజించాడు. అటువంటి పుణ్యపురుషుడైన భరతుని చరిత్రాన్ని వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధీ, ధనధాన్య సమృద్ధీ సిద్ధిస్తుంది. ఆ తరువాత వారు స్వర్గ సౌఖ్యాలనుభవిస్తారు.

(ఒక కథకు ఫలశ్రుతి చెప్పడం పురాణసంప్రదాయం. ఈ దృష్టితో భరతుని కథకు ఫలం చెప్పబడింది. ఫలం రెండు రకాలు. ఇహం పరం. పరం చెప్పడమే కథాఫలం. కాని సామాన్యులకు ఆసక్తి కలగడానికోసం ఇహఫలాలు చెప్పడం పౌరాణిక సంప్రదాయం. అన్నింటికంటె 'పుండరీకాక్షుండు రక్షించున్‌' అనడం మేలుబంతిలాంటిది.)

శ్రేష్ఠుమయిన జన్మలుగల నరులు, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, మునీంద్రులు మున్నగువారి స్తోత్రమునకు గమ్యమైనవాడా! అప్రాకృతములయిన వస్త్రములచే, నగలచే అలంకరింపబడినవాడా! భక్తులయందు వాత్సల్యం గలవాడా! అపరిమితమైన దయగలవాడా! వైకుంఠమే నివాసముగా గలిగి, భూదేవి భార్యగా కలిగి, సజ్జన బృందములను రక్షించు వెలుగు గలిగి, సంపత్కరుడవై, పుణ్యములకు నివాసమై, గోవులను కాచుచు, మూడులోకములకు శుభముల నిచ్చుచు, వెలుగుల మార్గమున పొందదగిన మూర్తికల కృష్ణమూర్తి!

ఉత్తమమయిన వైకుంఠమే నివాసంగా కలవాడా! దయకు నిధియైనవాడా! మహాత్మా! రాక్షసులను చంపినవాడా! ప్రకాశించే గోపికల మనస్సులను హరించినవాడా! పద్మపత్రాలవంటి కన్నులు కలవాడా! భక్తజనులచే నుతింపబడే దివ్యదేహం కలవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం!

సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకల కలవాడా! శుభప్రదమయిన చరిత్ర కలవాడా! సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! సాటిలేని నీలమేఘచ్చాయ గల అవయవాలు గలవాడా! స్వచ్చమయిన జ్ఞానముచే ఒప్పువాడా! భారమైన సంసార బాధలను దూరం చేసేవాడా! గోపికల హృదయాలను అపహరించేవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

॥ శ్రీకృష్ణార్పణమస్తు 

No comments:

Post a Comment