చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో చాలా చెట్లు కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.
ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక, సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు.
ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే,ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం, లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం (నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం, తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం, వంటివి పండుగకే శోభనిస్తాయి.
ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి, చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు, బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.
పంచాంగ శ్రవణం: పంచాంగాన్ని పూజించి, తిథి, వార, నక్షత్ర, యోగం, కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి, విని, రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని, తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం, శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు, అవధానాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.
చైత్ర శుద్ధ పాడ్యమి–ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు అన్ని అంటారుసంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు.
No comments:
Post a Comment